GMR Aviation
-
ఇంజినీర్ల నైపుణ్యాలకు ప్రత్యేక అకాడమీ
ఇంజినీర్లకు నైపుణ్యాలు అందించేందుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ సంస్థ ప్రత్యేక అకాడమీ ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్, అకౌంటబుల్ మేనేజర్ అశోక్ గోపీనాథ్ తెలిపారు. జీఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలోని ఈ అకాడమీ కోసం రూ.50 కోట్లు వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. ‘దేశంలోని విమానయాన సంస్థలకు శిక్షణ పొందిన మానవ వనరుల కొరత ఎదురవుతోంది. ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణలో భాగంగా భవిష్యత్తులో ఇంజినీర్లకు గిరాకీ ఏర్పడుతుంది. వారికి నైపుణ్యాలు అందించేందుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఆధ్వర్యంలో జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్‌ను ఏర్పాటు చేస్తున్నాం. జులై నెలలో కోర్సులు ప్రారంభించాలని ఇన్స్టిట్యూట్ యోచిస్తోంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌తో 10+2 పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులు. కొత్త అకాడమీను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నాం. కోర్సులో భాగంగా రెండు సంవత్సరాలపాటు అకడమిక్ స్టడీ ఉంటుంది. మరో రెండేళ్లు ఉద్యోగ శిక్షణ అందిస్తాం. ఇండిగో, ఎయిరిండియా, ఆకాసా వంటి విమానయాన సంస్థలు ఇప్పటికే 1,200 కంటే ఎక్కువ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఆర్డర్ చేశాయి. పరిశ్రమల అంచనా ప్రకారం, వచ్చే ఐదేళ్లలో భారతదేశానికి దాదాపు 5,000 మంది ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్లు అవసరం’ అన్నారు. దిల్లీ, హైదరాబాద్, గోవా విమానాశ్రయాలను జీఎంఆర్ నిర్వహిస్తోంది.ఇదీ చదవండి: పైలట్ల కొరత తీర్చేందుకు ప్రత్యేక శిక్షణఇదిలాఉండగా, పైలట్లుగా స్థిరపడాలనుకునే వారికి ఎయిరిండియా ఇప్పటికే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. అందుకోసం మహారాష్ట్రలోని అమరావతిలో ఏడాదికి 180 మందికి శిక్షణ ఇచ్చేందుకు అకాడమీను ఏర్పాటు చేస్తోంది. అందులో ట్రెయినింగ్ పూర్తిచేసిన వారిని నిబంధనల ప్రకారం నేరుగా సంస్థలో పైలట్లుగా నియమించుకుంటామని ప్రకటించింది. -
బోయింగ్‌తో జీఎంఆర్ ఏరో టెక్నిక్ జట్టు
న్యూఢిల్లీ: ప్రయాణికుల విమానాలను కార్గో విమానాలుగా మార్చే కార్యకలాపాలకు సంబంధించి అంతర్జాతీయ విమానాల తయారీ సంస్థ బోయింగ్‌తో జీఎంఆర్ ఏరో టెక్నిక్ జట్టు కట్టింది. ఇందుకోసం హైదరాబాద్‌లో కన్వర్షన్ లైన్‌ను ఏర్పాటు చేయనుంది. దేశీ, విదేశీ విమానాలను పూర్తి స్థాయిలో మార్పిడి చేయగలిగే సామర్థ్యం దీనికి ఉంటుందని బోయింగ్ తెలిపింది. ఈ కన్వర్షన్ లైన్లో .. ఇప్పటికే ఒక మోస్తరుగా వినియోగించిన బోయింగ్ 737–800 ప్యాసింజర్ విమానాలను సరకు రవాణా విమానాలుగా మార్చనున్నారు. వచ్చే 18 నెలల్లో లైన్‌కు సంబంధించి పనులు ప్రారంభం కాగలవని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తే తెలిపారు. బోయింగ్‌తో భాగస్వామ్యం.. అంతర్జాతీయ స్థాయి మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్వో) సర్వీసులను అందించడంలో తమ సామర్థ్యాలకు నిదర్శనమని జీఎంఆర్ ఏరో టెక్నిక్ సీఈవో అశోక్ గోపీనాథ్ తెలిపారు. దేశీయంగా తయారీ, ఈ–కామర్స్ కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత విమాన కార్గో ఏటా 6.3 శాతం వృద్ధి నమోదు చేయగలదని బోయింగ్ అంచనా వేస్తోంది. -
ఆప్టెక్ ఏవియేషన్- జీఎంఆర్ డీల్, రానున్న పలు ఉద్యోగాలు
సాక్షి, ముంబై: విమానాశ్రయ నిర్వహణ, కస్టమర్ల సేవలకు సంబంధించి కోర్సును ఆఫర్ చేసేందుకు ఆప్టెక్ ఏవియేషన్ అకాడమీతో, జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ‘‘ఈ కోర్సులో చేరే అభ్యర్థులకు ఆప్టెక్ తన కేంద్రాల్లో పూర్తి స్థాయి శిక్షణ అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోర్సులో మిగిలిన భాగాన్ని ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీలో పూర్తి చేయాలి’’అని జీఎంఆర్ ప్రకటించింది. ఈ కోర్సు అనంతరం వారికి ఉపాధి లభించనుంది. ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, టికెటింగ్, ప్యాసింజర్ సర్వీస్, సెక్యూరిటీ, క్యాబిన్ క్రూ తదితర విభాగాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. -
జీఎంఆర్ ఏవియేషన్: డీజీసీఏ నిషేధంపై హైకోర్టు స్టే...
న్యూఢిల్లీ: ప్రైవేటు జెట్ సర్వీసు సేవలను అందించే జీఎంఆర్ ఏవియేషన్‌పై డీజీసీఏ విధించిన నిషేధంపై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక స్టేను మంజూరు చేసింది. ప్రస్తుత ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టేను ఇస్తున్నట్లు హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. పౌర విమానయాన నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను పదిమంది పెలైట్లు, ఆరుగురు క్యాబిన్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. పెలైట్లు శ్వాస సంబంధిత పరీక్షలు, ముందస్తు వైద్య పరీక్షలు చేసుకోనందుకు డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది.