న్యూఢిల్లీ: ప్రయాణికుల విమానాలను కార్గో విమానాలుగా మార్చే కార్యకలాపాలకు సంబంధించి అంతర్జాతీయ విమానాల తయారీ సంస్థ బోయింగ్‌తో జీఎంఆర్ ఏరో టెక్నిక్ జట్టు కట్టింది. ఇందుకోసం హైదరాబాద్‌లో కన్వర్షన్ లైన్‌ను ఏర్పాటు చేయనుంది. దేశీ, విదేశీ విమానాలను పూర్తి స్థాయిలో మార్పిడి చేయగలిగే సామర్థ్యం దీనికి ఉంటుందని బోయింగ్ తెలిపింది. ఈ కన్వర్షన్ లైన్‌లో .. ఇప్పటికే ఒక మోస్తరుగా వినియోగించిన బోయింగ్ 737–800 ప్యాసింజర్ విమానాలను సరకు రవాణా విమానాలుగా మార్చనున్నారు.
వచ్చే 18 నెలల్లో లైన్‌కు సంబంధించి పనులు ప్రారంభం కాగలవని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తే తెలిపారు. బోయింగ్‌తో భాగస్వామ్యం.. అంతర్జాతీయ స్థాయి మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్‌వో) సర్వీసులను అందించడంలో తమ సామర్థ్యాలకు నిదర్శనమని జీఎంఆర్ ఏరో టెక్నిక్ సీఈవో అశోక్ గోపీనాథ్ తెలిపారు. దేశీయంగా తయారీ, ఈ–కామర్స్ కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత విమాన కార్గో ఏటా 6.3 శాతం వృద్ధి నమోదు చేయగలదని బోయింగ్ అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment