Boeing aircraft
-
గాల్లో ఉండగానే కాక్‌పిట్ అద్దంలో పగుళ్లు!
అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానానికి ఇటీవలే పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగానే బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్ డోర్ ఒక్కసారిగా ఊడిపోయింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. దాంతో బోయింగ్ 737 మ్యాక్స్‌లను అన్ని దేశాలు పక్కన పెట్టేశాయి. కానీ, ఆ సంస్థకు చెందిన ఇతర విమానాల్లో లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా జపాన్‌లో అల్ నిప్పాన్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 737-800 కాక్‌పిట్ అద్దంలో పగుళ్లు గుర్తించిన పైలట్లు.. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు సంస్థ తెలిపింది. ‘సపోరో-న్యూ చిటోస్ నుంచి తొయామకు బయల్దేరిన ఫ్లైట్ 1182 గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే నాలుగు లేయర్లు కలిగిన కాక్‌పిట్ అద్దంలో పగుళ్లు వెలుగు చూశాయి. అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బందితోపాటు 59 మంది ప్రయాణికులు ఉన్నారు’ అని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో చెప్పింది. ఇదీ చదవండి: కీలక టారిఫ్‌లను తొలగించనున్న జియో, ఎయిర్టెల్? అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసింది. తాజాగా వీటిపై ఆంక్షలను మరింత కాలం పొడిగించింది. యునైటెడ్ స్టేట్స్ ఏవియేషన్ రెగ్యులేటర్ కొత్త భద్రతా తనిఖీల కోసం బోయింగ్ 737 మాక్స్ 9 విమానాల పర్యవేక్షణను కఠినతరం చేయబోతున్నట్లు తెలిపింది. మరిన్ని భద్రతా పరీక్షల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. భారత్‌లోనూ వైమానిక రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ దీనిపై దృష్టి పెట్టింది. అత్యవసర ద్వారాలను తక్షణమే తనిఖీ చేయాలని దేశీయ ఎయిర్‌లైన్స్ సంస్థలకు గతవారం మార్గదర్శకాలు జారీ చేసింది. -
ఆకాశ ఎయిర్ దూకుడు: 4 బోయింగ్ విమానాలకు సై
న్యూఢిల్లీ: ఆకాశ ఎయిర్.. మరో 4 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కొనుగోలు సన్నాహాల్లో ఉన్నట్లు పేర్కొంది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది(2023) చివరికల్లా మూడంకెలలో విమాన కొనుగోలుకి ఆర్డర్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఆర్డర్లు జారీ చేసిన 72 బోయింగ్ 737 మ్యాక్స్‌లకు జతగా మరో 4 విమానాలకు కాంట్రాక్టు ఇస్తున్నట్లు తెలియజేసింది.(క్వాంటమ్ ఎనర్జీ విస్తరణ:హైదరాబాద్‌లో మూడో షోరూం) ప్యారిస్‌లో జరుగుతున్న ఎయిర్ షో సందర్భంగా కంపెనీ ఈ అంశాలను వెల్లడించింది. 2023 చివరికల్లా అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించే లక్ష్యంతో సాగుతున్నట్లు తెలిపింది. తాజాగా కొనుగోలు చేయనున్న విమానాలతో విస్తరణ పటిష్టంకానున్నట్లు వివరించింది. అంతర్జాతీయ విస్తరణ కోసం నాలుగు 737-8 విమానాల కొనుగోలుకి తెరతీసినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో వినయ్ దూబే పేర్కొన్నారు. దీంతో రానున్న నాలుగేళ్లలో మొత్తం 76 ఎయిర్‌క్రాఫ్ట్‌లను డెలివరీ తీసుకోనున్నట్లు తెలియజేశారు. దేశీయంగా వేగవంత విస్తరణలో ఉన్న కంపెనీ అంతర్జాతీయ రూట్లలోనూ సరీ్వసుల ప్రారంభంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. (దేశీయంగా కీవే బైక్స్ తయారీ: లక్కీ కస్టమర్లకు భారీ ఆఫర్) -
బోయింగ్‌తో జీఎంఆర్ ఏరో టెక్నిక్ జట్టు
న్యూఢిల్లీ: ప్రయాణికుల విమానాలను కార్గో విమానాలుగా మార్చే కార్యకలాపాలకు సంబంధించి అంతర్జాతీయ విమానాల తయారీ సంస్థ బోయింగ్‌తో జీఎంఆర్ ఏరో టెక్నిక్ జట్టు కట్టింది. ఇందుకోసం హైదరాబాద్‌లో కన్వర్షన్ లైన్‌ను ఏర్పాటు చేయనుంది. దేశీ, విదేశీ విమానాలను పూర్తి స్థాయిలో మార్పిడి చేయగలిగే సామర్థ్యం దీనికి ఉంటుందని బోయింగ్ తెలిపింది. ఈ కన్వర్షన్ లైన్లో .. ఇప్పటికే ఒక మోస్తరుగా వినియోగించిన బోయింగ్ 737–800 ప్యాసింజర్ విమానాలను సరకు రవాణా విమానాలుగా మార్చనున్నారు. వచ్చే 18 నెలల్లో లైన్‌కు సంబంధించి పనులు ప్రారంభం కాగలవని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తే తెలిపారు. బోయింగ్‌తో భాగస్వామ్యం.. అంతర్జాతీయ స్థాయి మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్వో) సర్వీసులను అందించడంలో తమ సామర్థ్యాలకు నిదర్శనమని జీఎంఆర్ ఏరో టెక్నిక్ సీఈవో అశోక్ గోపీనాథ్ తెలిపారు. దేశీయంగా తయారీ, ఈ–కామర్స్ కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత విమాన కార్గో ఏటా 6.3 శాతం వృద్ధి నమోదు చేయగలదని బోయింగ్ అంచనా వేస్తోంది. -
రెండో రోజూ యూఎస్ మార్కెట్ల జోరు
వరుస నష్టాలకు చెక్ పెడుతూ వారాంతాన జోరందుకున్న యూఎస్ స్టాక్ మార్కెట్లు సోమవారం సైతం లాభపడ్డాయి. డోజోన్స్ 410 పాయింట్లు(1.5%) ఎగసి 27,584 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 53 పాయింట్ల(1.6%) బలపడి 3,352 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 204 పాయింట్లు(1.8%) జంప్‌చేసి 11,118 వద్ద స్థిరపడింది. శుక్రవారం సైతం ఇండెక్సులు ఇదే స్థాయిలో పురోగమించిన సంగతి తెలిసిందే. కోవిడ్-19తో సవాళ్లు ఎదుర్కొంటున్న నిరుద్యోగులు, కంపెనీలకు అండగా వాషింగ్టన్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్యాకేజీపై నేడు తిరిగి చర్చలు ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. దీంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఫాంగ్ స్టాక్స్ అప్ ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలో యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ 2.5-0.7 శాతం మధ్య లాభపడగా.. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ 3.4 శాతం జంప్‌చేసింది. ఇతర కౌంటర్లలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ 4 శాతం ఎగసింది. ప్రభుత్వం నుంచి 5.5 బిలియన్ డాలర్ల రుణాన్ని పొందడంతో ఈ కౌంటర్‌కు జోష్ వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. కొద్ది రోజులుగా నిలిచిపోయిన 737 మ్యాక్స్ విమానాలపై అంచనాలతో బోయింగ్ కంపెనీ 6.4 శాతం దూసుకెళ్లింది. కాగా.. ప్రత్యర్థి కంపెనీ డబ్ల్యూ పీఎక్స్ ఎనర్జీని 2.56 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు డెవాన్ ఎనర్జీ తాజాగా పేర్కొంది. దీంతో ఈ రెండు కౌంటర్లూ 16-11 శాతం చొప్పున జంప్‌చేశాయి. లండన్‌లో కార్యకలాపాలకు కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వార్తలతో ఉబర్ టెక్నాలజీస్ 3.2 శాతం పుంజుకుంది. -
మూడు గంటల్లో ప్రపంచ యాత్ర.!
చికాగో : పురాణాల్లో, పౌరాణిక చిత్రాల్లో ఒక చోట మాయమై, మరో చోట ప్రత్యక్షమవడం చూస్తూనే ఉంటాం. కానీ, నిజ జీవితంలో అది సాధ్యమా అంటే.. కాదని అందరికీ తెలుసు. కానీ, మూడు గంటల్లో ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. అదెలాగంటే.. హైపర్సోనిక్ విమానంతో..! అవును దిగ్గజ విమాన తయారీ సంస్థ బోయింగ్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ధ్వని కంటే అయిదు రెట్లు వేగంగా ప్రయాణించే హైపర్సోనిక్ విమానాన్ని తయారు చేసేందుకు ప్రణాళికలు రచించింది. గంటకు 3,800 మైళ్ల వేగంతో ప్రయాణించే విమానాన్ని తయారు చేసేందుకు పూనుకుంది. ఈ విమానంలో న్యూయార్క్ నుంచి లండన్‌కు 120 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. అంటే ప్రపంచాన్ని మూడు గంటల్లో చుట్టి రావచ్చన్నమాట..! విమానం తయారీకి సంబంధించిన ప్రణాళికలు ప్రాథమిక దశలో ఉన్నాయనీ, కొన్ని సాంకేతిక చిక్కు ముడులను అధిగమించాల్సి ఉందని సంస్థ ప్రతినిధి బియానా జాక్సన్ తెలిపారు. బోయింగ్ సంస్థ ప్రయోగాలు ఫలించి హైపర్సోనిక్ విమానం గనుక అందుబాటులోకి వస్తే.. ధ్వని కంటే రెండు రెట్లు వేగంగా ప్రయాణించే ఆంగ్లో-ఫ్రెంచ్ విమానం ‘కాంకోర్డ్’ను తలదన్నినదవుతుంది. అయితే, ఈ అద్భుత విమాన సేవలు అందుబాటులోకి రావాలంటే మరో ఇరవై ఏళ్లకు పైగా సమయం పడుతుందట..! -
స్పైస్‌జెట్‌కు 205 బోయింగ్ విమానాలు
రూ. 1.5 లక్షల కోట్ల డీల్ న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా విమానాల తయారీ దిగ్గజం బోయింగ్‌తో భారీ డీల్ కుదుర్చుకుంది. 205 విమానాల దాకా కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆర్డరు విలువ దాదాపు రూ. 1,50,000 కోట్లుగా ఉండనుంది. ఇప్పటికే ఆర్డరు చేసిన 55 విమానాలు, 100 కొత్త 737–8 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు మరో 50 బీ737–8 మ్యాక్స్, వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలు హక్కులు దక్కించుకోవడంతో .. మొత్తం 205 దాకా స్పైస్‌జెట్ కొనుగోలు చేస్తున్నట్లవుతుందని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. దేశీ విమానయాన రంగంలో కుదిరిన అతి పెద్ద డీల్స్‌లో ఇది కూడా ఒకటి కాగా.. తమకు సంబంధించి ఇది అత్యంత భారీదని వివరించారు. ప్రస్తుతం స్పైస్‌జెట్ వద్ద బీ737 విమానాలు 32, బంబార్డియర్ క్యూ400 విమానాలు 17 ఉన్నాయి. తాజా డీల్‌కు సంబంధించి నిధుల సమీకరణపై దృష్టి పెట్టినట్లు అజయ్ సింగ్ వివరించారు. ఇంధనం దాదాపు 20 శాతం దాకా ఆదా చేసే కొత్త విమానాలతో వ్యయాలు తగ్గగలవని బోయింగ్ కంపెనీ వైస్ చైర్మన్ రే కానర్ తెలిపారు. లాభదాయకతపైనే దృష్టి .. మార్కెట్ వాటా గురించి తీవ్రంగా పోటీపడటం కన్నా బాధ్యతాయుతమైన రీతిలో లాభదాయకంగా ఉండటమే తమ ప్రధాన లక్ష్యమని అజయ్ సింగ్ చెప్పారు. గతంలో రోజుకు రూ. 3 కోట్లు నష్టపోయిన స్పైస్‌జెట్ ప్రస్తుతం రోజుకు రూ.1 కోటి మేర లాభాలు చూస్తోందని ఆయన పేర్కొన్నారు. నవంబర్ గణాంకాల ప్రకారం.. 12.8 శాతం మార్కెట్ వాటాతో స్పైస్‌జెట్ నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు, చౌక చార్జీలతో దూరప్రయాణాల విమానాలు నడిపే అంశం పరిశీలిస్తున్నట్లు సింగ్ చెప్పారు. కొత్త విమానాల డెలివరీ 2018 మూడో త్రైమాసికంలో ప్రారంభమై 2024 నాటికి ముగుస్తుంది. డీల్ మేరకు పైలట్ల శిక్షణ కోసం బోయింగ్ తోడ్పాటుతో స్పైస్‌జెట్ ప్రత్యేకంగా సిమ్యులేటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇది 2018 నాటికి సిద్ధం కాగలదు. విమానయాన రంగ నియంత్రణ సంస్థ (డీజీసీఏ) నిబంధనల ప్రకారం 20 పైగా విమానాలున్న దేశీ ఎయిర్‌లైన్స్.. కనీసం ఒక్క సిమ్యులేటర్ కేంద్రాన్నైనా కలిగి ఉండాలి. -
ఉగ్రవాదులు కూల్చేశారా?
* మలేసియా విమాన అదృశ్యంపై వీడని మిస్టరీ * దొంగ పాస్‌పోర్టులతో ఎక్కిన ఇద్దరూ ఉగ్రవాదులని అనుమానం.. * ఆ దిశగా దర్యాప్తు కౌలాలంపూర్/బీజింగ్: మలేసియాలోని కౌలాలంపూర్ నుంచి చైనాలోని బీజింగ్ వెళుతూ శనివారం అదృశ్యమైన బోయింగ్ విమానం ఏమైందన్న మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ ఘటనలో ఉగ్రవాదుల పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేయాల్సిందిగా మలేసియా ప్రభుత్వం ఆదివారం అధికారులనుఆదేశించింది. 239 ప్రయాణికులు, సిబ్బందితో వెళుతున్న విమానంలో ఇద్దరు దొంగిలించిన (ఒకటి ఇటలీవాసిది, రెండోది ఆస్ట్రియావాసిది) పాస్‌పోర్టులతో ఎక్కారని తేలిన నేపథ్యంలో.. ఉగ్రవాద చర్యపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ ఇద్దరు వ్యక్తులను సీసీటీవీల ఆధారంగా గుర్తించి వారిపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా మలేసియా కోరిక మేరకు ఆ విమానం చివరి సిగ్నళ్లు అందిన ప్రాంతంలో వియత్నాం సహా ఆరు దేశాలు గాలిస్తున్నప్పటికీ రెండో రోజూ ఆచూకీ తెలియలేదు. కూలిపోయిన విమానానివిగా భావిస్తున్న శకలాలు తమ దేశానికి చెందిన థోచు ద్వీపం వద్ద సముద్రంలో కనిపించాయని వియత్నాం సహాయక బృంద అధికారులు చెప్పారు. అయితే దీన్ని మలేసియా పౌర విమానయాన సంస్థ ఖండించింది. అదృశ్యమైన విమానానికి, ఆ శకలాలకు ఏ మాత్రం పోలికలేదని పేర్కొంది. కాగా ఈ విమానంలో ఓ రెక్క 2012లో స్వల్పంగా విరిగిపోయింది. మరమ్మతుల తర్వాత అది చాలాసార్లు ప్రయాణించిందని చెబుతున్నారు. విమానం కనిపించకుండా పోవడానికి పలు అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవి ఏమిటంటే... వెనక్కు వస్తూ?: కౌలాలంపూర్ నుంచి బయల్దేరిన గంట తర్వాత విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది. అంతకుముందు ఆ విమానం ఏదో కారణం చేత వెనక్కు బయల్దేరిందని అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సాంకేతికలోపం తలెత్తడం వల్ల అది వెనక్కు వస్తూ కూలిపోయి ఉండొచ్చని ఒక అంచనా. బాంబు పేలిందా?: ఉగ్రవాదులు ఒకవేళ విమానంలో బాంబులు పెట్టి దాన్ని పేల్చేశారా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. సైనిక చర్యనా?: కొన్ని దేశాల సైన్యాలు అనుకోకుండా విమానాలను కూల్చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. 1988లో అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ విన్సినెస్ పొరబాటున ఇరాన్ విమానాన్ని కూల్చే యడంతో అందులోని 290 మంది మరణించారు. 1983లో కొరియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని రష్యా యుద్ధ విమానం కూడా ఇలాగే కూల్చేసింది. అలాగే ఈ విమానాన్ని కూడా ఏ దేశ సైన్యమైనా కూల్చేసి ఉండొచ్చా అనే అనుమానం వ్యక్తమవుతోంది. కాగా, విమానం గాల్లోకి లేచాక పైలట్ ‘ఆటో పైలట్’ ను యాక్టివేట్ చేసి మర్చిపోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానమూ ఉంది. -
సముద్రంలో కూలిన విమానం!
239 మంది మృతి! ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయులు కూడా కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళుతున్న విమానం అదృశ్యం బీజింగ్/కౌలాలంపూర్: మరో ఘోర విమాన ప్రమాదం... 239 మంది ప్రాణాలు సముద్రగర్భంలో కలసిపోయాయి. మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ వెళుతున్న బోయింగ్ విమానం మార్గమధ్యంలో అదృశ్యమైంది. ఇందులో ఐదుగురు భారతీయులు, ఇద్దరు శిశువులు సహా 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఇది సముద్రంలో కూలిపోయి ఉంటుందని, 239 మందీ మరణించి ఉంటారని భావిస్తున్నారు. వియత్నాం తీర ప్రాంతంలోని సముద్రంలో భారీగా చమురు తెట్టు కనిపించడాన్ని బట్టి అక్కడే విమానం కూలిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. - విమానం శుక్రవారం కౌలాలంపూర్ నుంచి బయల్దేరిన తర్వాత రాత్రి 11:10 గంటల సమయంలో రాడార్ నుంచి అదృశ్యమైంది. అది ఉదయం 6.30 గంటలకు బీజింగ్ చేరాల్సి ఉంది. - మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ బోయింగ్ ఎంహెచ్370 విమానంలో 14 దేశాలకు చెందినవారున్నారు. వీరిలో అత్యధికంగా 154 మంది చైనా దేశీయులు కాగా 38 మంది మలేసియా వాసులు, ఏడుగురు ఇండోనేసియా వారు, ఆరుగురు ఆస్ట్రేలియన్లు, నలుగురు అమెరికన్లు, ఇద్దరు ఫ్రాన్స్ దేశస్థులు, ఇద్దరు న్యూజిలాండ్ వాసులు, ఇద్దరు ఉక్రేనియన్లు, ఇద్దరు కెనడా వాసులు, రష్యా, డచ్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. - దక్షిణ చైనా సముద్రంలోని కోటా బారూ ప్రాంతానికి 120 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు చివరి సారిగా ఆ విమానం నుంచి కేంద్రానికి సిగ్నళ్లు అందాయి. - వియత్నాం దక్షిణ తీర ప్రాంతం దగ్గరలోని సముద్రంలో రెండు చోట్ల భారీ స్థాయిలో చమురు తెట్టు కనిపించినట్లు వియత్నాం ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇవి కూలిపోయిన విమానానికి సంబంధించినవిగా కనిపిస్తున్నాయని, అయితే విమాన శకలాలేవీ కనిపించలేదని తెలిపింది. - చివరిసారి విమానం సిగ్నళ్లు అందిన ప్రాంతం నుంచి చుట్టుపక్కలంతా గాలించాల్సిందిగా ఆదేశించినట్లు మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ చెప్పారు. 15 సాయుధ దళాలు, వైమానిక, నౌకా దళాలతోపాటు మలేసియా తీర రక్షణ ఏజెన్సీలు నౌకలు తీవ్రంగా గాలిస్తున్నాయని వెల్లడించారు. వియత్నాం, చైనా, సింగపూర్, అమెరికాలు తమకు ఈ గాలింపులో సహకరిస్తున్నాయన్నారు. - మృతుల్లో ఇటలీకి చెందిన ఒకరు, ఆస్ట్రియాకు చెందిన మరొకరు ఉన్నట్లు మొదట్లో వార్తలు రాగా.. ఆ ప్రయాణికులిద్దరూ క్షేమంగా ఉన్నారని తర్వాత తేలింది. వేర్వేరు సంఘటనల్లో తమ పాస్‌పోర్టులు పోగొట్టుకున్నామని, అందువల్లే తాము ఆ విమానంలో ప్రయాణించలేదని వారు మీడియాకు తెలిపారు. ఆ దేశాల ప్రభుత్వాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. అయితే తమ పేర్ల మీద వేరెవరో విమానం ఎక్కి ఉంటారని, వారు ఉగ్రవాదులు కూడా అయి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. ముగ్గురు ఒకే కుటుంబ సభ్యులు బీజింగ్/కౌలాలంపూర్: కూలిపోయినట్లు భావిస్తున్న మలేసియా విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు భారతీయుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రయాణికులు ఐదుగురిని చేత్న కోలేకర్(55), స్వనంద్ కోలేకర్(23), వినోద్ కోలేకర్(59), చంద్రికా శర్మ(51), క్రాంతి శీర్షాత్(44)గా గుర్తించినట్లు బీజింగ్‌లోని భారతీయ దౌత్య కార్యాలయం తెలిపింది. వీరిలో చంద్రిక.. చెన్నైలోని ఒక ఎన్జీవో సభ్యురాలు. మంగోలియాలో జరిగే ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ) సదస్సులో పాల్గొనడానికి వెళుతూ ఆ విమానం ఎక్కారు. విమానంలో భారతీయ సంతతికి చెందిన కెనడావాసి ముక్తేష్ ముఖర్జీ(42) కూడా ఉన్నారు.