సముద్రంలో కూలిన విమానం!
239 మంది మృతి!
ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయులు కూడా
కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళుతున్న విమానం అదృశ్యం
బీజింగ్/కౌలాలంపూర్: మరో ఘోర విమాన ప్రమాదం... 239 మంది ప్రాణాలు సముద్రగర్భంలో కలసిపోయాయి. మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ వెళుతున్న బోయింగ్ విమానం మార్గమధ్యంలో అదృశ్యమైంది. ఇందులో ఐదుగురు భారతీయులు, ఇద్దరు శిశువులు సహా 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఇది సముద్రంలో కూలిపోయి ఉంటుందని, 239 మందీ మరణించి ఉంటారని భావిస్తున్నారు. వియత్నాం తీర ప్రాంతంలోని సముద్రంలో భారీగా చమురు తెట్టు కనిపించడాన్ని బట్టి అక్కడే విమానం కూలిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు.
- విమానం శుక్రవారం కౌలాలంపూర్ నుంచి బయల్దేరిన తర్వాత రాత్రి 11:10 గంటల సమయంలో రాడార్ నుంచి అదృశ్యమైంది. అది ఉదయం 6.30 గంటలకు బీజింగ్ చేరాల్సి ఉంది.
- మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ బోయింగ్ ఎంహెచ్370 విమానంలో 14 దేశాలకు చెందినవారున్నారు. వీరిలో అత్యధికంగా 154 మంది చైనా దేశీయులు కాగా 38 మంది మలేసియా వాసులు, ఏడుగురు ఇండోనేసియా వారు, ఆరుగురు ఆస్ట్రేలియన్లు, నలుగురు అమెరికన్లు, ఇద్దరు ఫ్రాన్స్ దేశస్థులు, ఇద్దరు న్యూజిలాండ్ వాసులు, ఇద్దరు ఉక్రేనియన్లు, ఇద్దరు కెనడా వాసులు, రష్యా, డచ్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.
- దక్షిణ చైనా సముద్రంలోని కోటా బారూ ప్రాంతానికి 120 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు చివరి సారిగా ఆ విమానం నుంచి కేంద్రానికి సిగ్నళ్లు అందాయి.
- వియత్నాం దక్షిణ తీర ప్రాంతం దగ్గరలోని సముద్రంలో రెండు చోట్ల భారీ స్థాయిలో చమురు తెట్టు కనిపించినట్లు వియత్నాం ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇవి కూలిపోయిన విమానానికి సంబంధించినవిగా కనిపిస్తున్నాయని, అయితే విమాన శకలాలేవీ కనిపించలేదని తెలిపింది.
- చివరిసారి విమానం సిగ్నళ్లు అందిన ప్రాంతం నుంచి చుట్టుపక్కలంతా గాలించాల్సిందిగా ఆదేశించినట్లు మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ చెప్పారు. 15 సాయుధ దళాలు, వైమానిక, నౌకా దళాలతోపాటు మలేసియా తీర రక్షణ ఏజెన్సీలు నౌకలు తీవ్రంగా గాలిస్తున్నాయని వెల్లడించారు. వియత్నాం, చైనా, సింగపూర్, అమెరికాలు తమకు ఈ గాలింపులో సహకరిస్తున్నాయన్నారు.
- మృతుల్లో ఇటలీకి చెందిన ఒకరు, ఆస్ట్రియాకు చెందిన మరొకరు ఉన్నట్లు మొదట్లో వార్తలు రాగా.. ఆ ప్రయాణికులిద్దరూ క్షేమంగా ఉన్నారని తర్వాత తేలింది. వేర్వేరు సంఘటనల్లో తమ పాస్‌పోర్టులు పోగొట్టుకున్నామని, అందువల్లే తాము ఆ విమానంలో ప్రయాణించలేదని వారు మీడియాకు తెలిపారు. ఆ దేశాల ప్రభుత్వాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. అయితే తమ పేర్ల మీద వేరెవరో విమానం ఎక్కి ఉంటారని, వారు ఉగ్రవాదులు కూడా అయి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు.
ముగ్గురు ఒకే కుటుంబ సభ్యులు
బీజింగ్/కౌలాలంపూర్: కూలిపోయినట్లు భావిస్తున్న మలేసియా విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు భారతీయుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రయాణికులు ఐదుగురిని చేత్న కోలేకర్(55), స్వనంద్ కోలేకర్(23), వినోద్ కోలేకర్(59), చంద్రికా శర్మ(51), క్రాంతి శీర్షాత్(44)గా గుర్తించినట్లు బీజింగ్‌లోని భారతీయ దౌత్య కార్యాలయం తెలిపింది. వీరిలో చంద్రిక.. చెన్నైలోని ఒక ఎన్‌జీవో సభ్యురాలు. మంగోలియాలో జరిగే ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) సదస్సులో పాల్గొనడానికి వెళుతూ ఆ విమానం ఎక్కారు. విమానంలో భారతీయ సంతతికి చెందిన కెనడావాసి ముక్తేష్ ముఖర్జీ(42) కూడా ఉన్నారు.