Malaysia Airlines
-
చెన్నై తిరుచ్చి విమానాశ్రయంలో కొండచిలువల కలకలం
చెన్నై: మలేషియా ఎయిర్ లైన్స్ విమానంలో తిరుచ్చి విమానశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడి సూట్‌కేసులో ప్రమాదకరమైన కొండచిలువలు, పాములు, బల్లులు ఉండటాన్ని చూసి విస్తుపోయారు తిరుచ్చి కస్టమ్స్ సిబ్బంది. వాటిని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేశారు కస్టమ్స్ అధికారులు. సినిమాల ప్రభావమో ఏమోగానీ స్మగ్లింగ్ పేరిట ఏది పెడితే అది విమానాల్లో రవాణా చేసే స్థాయికి ఎదిగిపోయారు స్మగ్లర్లు. తాజాగా మొహమ్మద్ మొయిద్దీన్ అనే ఓ ప్రయాణికుడు కౌలాలంపూర్ నుండి వస్తూ తనతోపాటు సూట్‌కేసులో కొండచిలువ పిల్లలు, బంగారు బల్లుల్ని వెంట తీసుకొచ్చాడు. ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు ఆతడి సూట్‌కేసును తనిఖీ చేయగా అందులో 47 కొండచిలువ పిల్లలు, 2 బంగారు బల్లులను కనుగొన్నారు. అవి ప్రాణాలతో ఉండటాన్ని చూసి కంగారుపడ్డ కస్టమ్స్ అధికారులు వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించి అతడిని మాత్రం విచారణ నిమిత్తం కస్టడీకి తరలించారు. విమానంలో సజీవంగా ఉన్న కొండచిలువలను, బల్లులను ఎలా తీసుకువచ్చి ఉంటాడన్నదే కస్టమ్స్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతను మలేషియాలో సెక్యూరిటీ వాళ్ళ కళ్ళుగప్పి ఎలా రాగలిగాడు, అక్కడి ఎయిర్‌పోర్టు సిబ్బంది సరిగ్గా తనిఖీలు నిర్వహించలేదా ఏంటన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అతనెవరు? అసలెందుకు చెన్నై వచ్చాడు? ఈ స్మగ్లింగ్ ముఠాలో ఇంకా ఎవరెవరున్నారన్న వివరాలపై ఆరా తీస్తున్నారు కస్టమ్స్ అధికారులు. #TamilNadu- Customs officials caught a Malaysian passenger with 47 exotic pythons and two lizards at #Trichy airport on Sunday. pic.twitter.com/kVggJIP08C — Suresh (@isureshofficial) July 30, 2023 ఇది కూడా చదవండి: ఒకే వేదికపై ప్రధాని మోదీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్? -
విమానంలో వైద్యం చేసిన భారతీయ డాక్టర్
కైలాలంపూర్: గాల్లో విమానం ఉంది. అందులో అత్యవసరంగా వైద్య సదుపాయం కావాల్సి వచ్చింది. ఆసమయంలో ఓభారతీయ వైద్యురాలు స్పందించి ప్రాధమిక వైద్య సదుపాయం అందించారు. వివరాల్లోకి వెళ్తే మలేషియ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం న్యూజిలాండ్ ఎక్లాండ్ నుంచి మలేషియా కైలాలంపూర్ వెళ్తోంది. ఉన్నట్టుండి ఎయిర్ హోస్టస్ స్పృహ తప్పి పడిపోయింది. దీంతో తనకు అత్యవసర వైద్యసహాయం అందించాల్సి వచ్చింది. చికిత్స అనంతరం ఎయిర్‌హోస్టెస్ కళ్లు తెరిచింది. దీంతో ప్రయాణికులంతా చప్పట్లతో అంచితను అభినందించారు. ఎమర్జెన్సీ లాండింగ్‌కు పైలట్ సిద్దమయ్యారు. ఎమర్జెన్సీ లాండింగ్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్లడానికి రెండుగంటలు, ఆక్లాండ్ వెళ్లడానికి గంట సమయం పడుతుందని భావించిన సిబ్బంది విమానంలో ఎవరైనా డాక్టర్ ఉంటే సహాయం అందించాలని కోరారు. దీంతో భారత్‌కు చెందిన డాక్టర్ అంచిత స్పందించారు. ఎయిర్ హోస్టెస్ కు ప్రాధమిక వైద్యం అందించారు. ఈ సంఘటన గురించి అంచిత భర్త కుమార్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అత్యవసర సమయంలో వైద్యమందించిన వ్యక్తి తన భార్య కావడం తనకు ఎంతో గర్వంగా ఉందని పోస్ట్ చేశారు. -
ఎంహెచ్370 అన్వేషణ నిలిపివేత
చైనా, మలేసియా, ఆస్ట్రేలియా సంయుక్త ప్రకటన సిడ్నీ: మూడేళ్ల క్రితం హిందూ మహా సముద్రంలో కూలిపోయిన మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్370 కోసం జరుగుతున్న అన్వేషణను మంగళవారంతో నిలిపివేశారు. కూలిపోయినప్పుడు ఇందులో 239 మంది ప్రయాణికులు ఉన్నారు. తప్పిపోయిన వారి కుటుంబాల అన్వేషణను నిలిపివేయడాన్ని బాధ్యతారాహిత్య చర్య అంటూ దుమ్మెత్తి పోస్తున్నాయి. ఎంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, ఎంతోమంది నిపుణులు పనిచేస్తున్నప్పటికీ విమానాన్ని కనిపెట్టలేకపోయామని చైనా, మలేసియా, ఆస్ట్రేలియా అధికారులు సంయుక్త ప్రకటనలో తెలిపారు. కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తున్న ఈ విమానం 2014, మార్చి 8న హిందూ మహాసముద్రంలో మాయమైంది. కోట్ల కొద్దీ డబ్బు వెచ్చించి, లక్షల చదరపు మైళ్లలో జల్లెడ పట్టినా విమానం జాడ దొరకలేదు. గత జూలైలో 1.2 లక్షల చదరపు మైళ్లు వెతికినా విమానం జాడ దొరకలేదని, దీంతో తాము వెతుకులాటని నిలిపివేస్తున్నామని తెలిపారు. ఈ విమానంలో 14 దేశాలకు చెందిన 227 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 153 మంది చైనీయులు కాగా, ఐదుగురు భారతీయులు, ఒక భారతీయ సంతతికి చెందిన కెనడా వ్యక్తి ఉన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వాలు పొడిచిన వెన్నుపోటుగా బాధిత కుటుంబాల వారు అభివర్ణించారు. -
అదృశ్యమైన ఆ విమానం చివరిక్షణాల్లో..!
దాదాపు రెండేళ్ల కిందట హిందూ మహా సముద్రంలో అదృశ్యమైన మలేషియా విమానం ఎంహెచ్ 370 గురించి తాజాగా దర్యాప్తులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్ 370 విమానం కూలిపోతున్న చివరిక్షణాల్లో దానిని ఎవరూ నియంత్రించలేదని దర్యాప్తు అధికారులు తాజాగా నిర్ధారణకు వచ్చారు. 2014లో గల్లంతైన ఈ విమానానికి సంబంధించి ఇప్పటివరకు లేశమాత్రమైన అవశేషం దొరకలేదు. ఇది ఎక్కడ కూలిపోయిందనే జాడ కూడా లేదు. ఈ నేపథ్యంలో దీని ఆచూకీ గురించి వెతుకుతున్న దర్యాప్తు అధికారులు, నిపుణులు బుధవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సమావేశమయ్యారు. ఇంధనం అయిపోవడంతో ఈ విమానం (బోయింగ్ 777) ఒక్కసారిగా అతివేగంగా పల్టీలు కొడుతూ కూలిపోయిందని, ఈ చివరిక్షణాల్లో పైలట్లు దీనిని నియంత్రించే ప్రయత్నం చేయలేదని దర్యాప్తు అధికారులు చాలాకాలంగా చెప్తున్న సంగతి తెలిసిందే. తాజా సమావేశంలో నిపుణులు, దర్యాప్తు అధికారులు ఈ వాదనను సమర్థిస్తున్నట్టు సంకేతాలు ఇస్తూ ఒక ప్రటకన విడుదల చేశారు. అయితే, ఇటీవల మరికొందరు నిపుణులు మాత్రం ఈ వాదనతో విభేదిస్తున్నారు. చివరిక్షణాల్లో విమానాన్ని నియంత్రించడానికి ప్రయత్నాలు జరిగాయని, ఇవి ఫలించకపోవడంతో మరింత వేగంగా విమానం కూలిపోయి ఉంటుందని వీరు అభిప్రాయపడుతున్నారు. విమానం కూలిపోయిన ప్రదేశం జాడ తెలియకపోవడానికి కారణం.. చివరిక్షణాల్లో ఈ నియంత్రణ చర్యలే కారణం కావొచ్చునని, దీనివల్ల సముద్రం లోతులోకి విమానం కూరుకుపోయి ఉంటుందని వారు అంటున్నారు. అయితే, దర్యాప్తు అధికారులు, నిపుణులు మాత్రం విమానం చివరిక్షణాల్లో చాలావేగంగా కూలి పడిపోయిందని, దీనిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు జరిగినట్టు కనిపించడం లేదని శాటిలైట్ సమాచారం ఆధారంగా విశ్లేషించామని పేర్కొన్నారు. 2014 మార్చి 8న 239 మందితో బీజింగ్ నుంచి కౌలాలంపూర్ బయలుదేరిన ఎంహెచ్ 370 విమానం అకస్మాత్తుగా అదృశ్యమై.. ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయిన సంగతి తెలిసిందే. -
'ఆ శకలం... ఆ విమానానిదే'
-
'ఆ శకలం... ఆ విమానానిదే'
కౌలాలంపూర్ : బంగాళాఖాతంలోని మారిషస్ సముద్ర తీరంలో కనుగొన్న విమాన శకలం ఎమ్హెచ్ 370దే అని మలేషియా, ఆస్ట్రేలియా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మారిషస్ సముద్ర తీరంలో ఈ ఏడాది మేలో మారిషస్ సముద్ర తీరంలో ఓ విమాన శకలాన్ని గుర్తించారు. ఆ విమాన శకలాన్ని ఆస్ట్రేలియా రవాణ భద్రత సంస్థకు చెందిన నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించి... పరిశోధించారు. చిట్ట చివరకు ఆ విమాన శకలం 2014 మార్చి 4 వ తేదీన గల్లంతైన ఎమ్హెచ్ 370దే అని వారు నిర్ధారించారు. మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎమ్హెచ్ 370 విమానం 2014 మార్చి 8వ తేదీన 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో చైనా రాజధాని బీజింగ్‌కు బయలుదేరింది. ఆ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే... ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే రంగంలోని దిగిన మలేషియా, చైనా దేశాలు సైతం ఆ విమాన జాడకు కనిపెట్ట లేకపోయాయి. దీంతో ప్రపంచ దేశాలు సదరు విమానం కోసం జల్లెడ పట్టాయి. అయినా ఫలితం లేకుండా పోయింది. విమానం గల్లంతు కావడంతో ప్రయాణికుల బంధువులు తీవ్ర కలత చెందారు. ఎమ్హెచ్ 370 విమానం ప్రమాదానికి గురైందని మలేషియా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆ విమానం కూలిన ప్రదేశం కోసం..
సిడ్నీ: మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్ 370 జెట్ విమానం గల్లంతై రెండేళ్లు కావొస్తున్నది. ఇంతవరకూ ఈ విమానం జాడ దొరకలేదు. హిందూ మహా సముద్రంలో ఆస్ట్రేలియా పశ్చిమ తీరానికి దూరంగా ఈ విమానం కూలిపోయినట్టు భావిస్తున్నా.. ఇప్పటివరకు ఈ విమానానికి సంబంధించిన ఒక్క శకలం కూడా లభించలేదు. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 239మంది సముద్రంలో సమాధి అయినట్టు భావిస్తున్నారు. 2014 మార్చిలో గల్లంతైన ఈ విమానం ఆచూకీ కోసం గాలిస్తున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం.. తాజాగా విమానం కూలిన ప్రదేశాన్ని గుర్తించేందుకు సరికొత్త అధ్యయానాన్ని చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఎంహెచ్ 370 విమానం శకలాల మాదిరి నమూనా శకలాలను రూపొందించి.. వాటిని ప్రమాద జరిగిన ప్రాంతంలో సముద్రంలోకి జారవిడిచి.. అవి మునిగిపోయే క్రమాన్ని శాటిలైట్ ద్వారా అన్వేషించాలని నిర్ణయించింది. సముద్ర ప్రవాహగతికి అనుగుణంగా ఈ శకలాలు మునిగిపోయే తీరును బట్టి.. విమానం కూలిన స్థలాన్ని, దాని శకలాలను గుర్తించే అవకాశముంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన జాయింట్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ (జేఏసీసీ) ఈ అధ్యయానాన్ని నిర్వహించనుంది. గత 18 నెలలుగా జేఏసీసీ ఆధ్వర్యంలో విమానం గాలింపు చర్యలు సాగుతున్నాయి. తాజా అధ్యయనం నేపథ్యంలో మరింత ముమ్మరంగా హిందు మహాసముద్రంలో గాలింపు చర్యలను చేపట్టాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. -
ఇంజిన్ ఫెయిలై.. ఆ విమానం సముద్రంలో కూలింది!
అకస్మాత్తుగా అదృశ్యమైన మలేషియా విమానం ఎంహెచ్370 ప్రమాదానికి సంబంధించి తాజాగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కీలక వివరాలు వెల్లడించారు. 2014 మార్చ్ 8న అదృశ్యమైన ఈ విమానం సిగ్నల్స్‌ను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలోని హిందూ మహా సముద్రంలో అత్యంత వేగంగా కుప్పకూలిందని తెలిపారు. ఇంజిన్‌లో పవర్ వైఫల్యంతో విమానం కుప్పకూలి ఉంటుందని, పవర్ ఆగిపోవడం వల్ల ఒక్కసారిగా నిమిషానికి 20వేల అడుగుల వేగంతో ఆ విమానం ఆకాశం నుంచి సముద్రంలోకి రాలిపోయిందని శాస్త్రవేత్తలను ఉటంకిస్తూ ఆస్ట్రేలియా మీడియా తెలిపింది. కూలిన బోయింగ్ 777 విమానం తయారీ తీరుతెన్నులు, ఇతరత్రా సమాచారాన్ని బేరీజు వేసిన శాస్త్రవేత్తలు ఈమేరకు నిర్ధారణకు వచ్చారు. సాధారణంగా విమానం ల్యాండ్ అయ్యే సమయంలో కానీ, కూలిపోయే సమయంలో కానీ నిమిషానికి రెండువేల అడుగుల వేగంతో కిందకు దిగుతుంది. గతంలో సముద్రం లోపల ఈ విమానం ల్యాండ్ అయి ఉంటుందని, అది ఆకాశంలో కూలిపోలేదని పలు ఊహాగానాలు వచ్చాయి. ఈ ఊహాగానాలను శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు. విమానం కూలిపోయే ముందు పైలట్లు ఆరుసార్లు 'హ్యాండ్‌షేక్' సిగ్నల్స్‌ను శాటిలైట్‌కు పంపారని, పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ సమీపంలో ఈ సిగ్నల్స్ అనుసంధానం అయ్యాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. -
'ఆ విమానం' గాలింపు నిలిపివేస్తాం !
సిడ్నీ: 239 మంది ప్రయాణికులు... విమాన సిబ్బందితో మలేసియా నుంచి బయలుదేరిన ఎమ్హెచ్ 370 విమానం అదృశ్యం మిస్టరీ ఛేదించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి రావడం లేదు. దీంతో విమాన ఆచూకీ ప్రయత్నాలు విరమించే యోచనలో ఉన్నట్లు ఆస్ట్రేలియాలోని జాయింట్ ఏజెన్సీ కో ఆర్డినేషన్ సెంటర్ (జేఏసీసీ) గురువారం ప్రకటించింది. వచ్చే ఏడాది అంటే 2016 ఏడాది మొదట్లో గాలింపు చర్యలు నిలిపివేస్తామని వెల్లడించింది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామో కూడా జేఏసీసీ వివరించింది. గాలింపు చర్యలు కఠినతరంగా ఉందని అలాగే ఖర్చు మరింత పెరిగిందని పేర్కొంది. విమానం కోసం లక్షా ఇరవై వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టామని... అందుకు సంబంధించిన చిన్న సమాచారం ఇప్పటి వరకు లభించలేదని విశదీకరించింది. అలాగే మలేసియా, చైనా, ఆస్ట్రేలియా పరిధిలో నేటి వరకు చేపట్టిన గాలింపు చర్యలను సంగతి ఈ సందర్భంగా జేఏసీసీ గుర్తు చేసింది. అయితే 2016 ఏడాది మొదట్లో ఎమ్హెచ్ 370 విమానం ఆచూకీ తెలుసుకుంటామని జేఏసీసీ ఆశాభావం వ్యక్తం చేసింది. విమాన ఆచూకీ కోసం ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 80 మిలియన్ డాలర్లు... మలేసియా 45 మిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని తెలిపింది. సముద్రంలో చలికాలంలో గాలింపు చర్యలకు ఎదురవుతున్న అవరోధాలను ఈ సందర్భంగా సోదాహరణగా వివరించింది. అలాగే విమాన ఆచూకీ కోసం గాలింపు చర్యలు మరింత వేగవంతం చేస్తామని జేఏసీసీ స్పష్టం చేసింది. దాదాపు 50 వేల చదరపు కిలోమీటర్ల మేర సముద్రం అడుగుభాగంలో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేదని తెలిపింది. అయితే ఎమ్హెచ్ 370 విమానంలోని మొత్తం ప్రయాణికులు మరణించారని... వారి మృతదేహాలు... విమాన శిథిలాలు దొరికే అవకాశం లేదని మలేసియా ఉన్నతాధికారులు ఈ ఏడాది జనవరిలో వెల్లడించిన సంగతి తెలిసిందే. 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం గత ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టన ఫలితం మాత్రం కనిపించలేదు. ఈ విమానంలో మలేసియా వాసులు, 154 మంది చైనా జాతీయులతోపాటు ఐదుగురు భారతీయులు, నలుగురు ఫ్రెంచ్ జాతీయులు ఉన్న సంగతి తెలిసిందే. -
ఎంహెచ్ 370 విమానం:ఓ చిన్న క్లూ దొరికింది..
కాన్ బెర్రా: మలేషియా ఎయిర్‌లైన్స్ ఎంహెచ్ 370 అదృశ్యమైన సంవత్సరం గడిచిన తర్వాత ఒక చిన్న క్లూ దొరికింది. మంగళవారం ఆస్ట్రేలియా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఒక చిన్న కర్చీఫ్ లాంటి ప్యాకెట్ ఇప్పుడు కోటి ఆశలు రేపుతోంది. కింగ్ స్లే, విక్కీ మిల్లర్ అనే దంపతులకు సెర్ వాంటెస్ బీచ్ తీరంలో ఈ ప్యాకెట్ దొరకింది. దీని మీద మలేషియా ఎయిర్‌లైన్స్ లోగో స్పష్టంగా కనపడటంతో వెంటనే దీన్ని పోలీసులకు అప్పగించామని వారు చెబుతున్నారు. ఇన్ని వేల మైళ్లు ప్రయాణం చేసి..ఇన్ని రోజుల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉన్న ఆ ప్యాకెట్ మలేషియా ఎయిర్ లైన్స్‌కి సంబంధించిందే అయి వుంటుందని నిపుణులు అంటున్నారు. కాగా 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎంహెచ్ 370 విమానం సరిగ్గా గత ఏడాది మార్చిలో మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరిన 40 నిమిషాలకే విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోవడం.... దాని ఆచూకీ నేటికీ లభించకపోవడం తెలిసిన విషయమే. ప్రపంచ చరిత్రలోనే ఇంతమంది ప్రయాణికులతో వెళ్తూ గల్లంతైన విమానంగా ఎంహెచ్ 370 ఓ మిస్టరీగా మిగిలిపోయింది. ఈ విమానంలో మలేసియా వాసులు, 154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు, ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. తాజాగా దొరికిన ఈ క్లూతో అదృశ్యమైన వారి బంధువులు మాత్రమే కాదు...ప్రపంచం యావత్తు ఎంహెచ్ 370 ఆచూకీ ఎప్పటికైనా దొరుకుతుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. -
ఆ విమానం కోసం 'గుప్పెడు మనస్సు' ఆరాటం
ఇంటి నుంచి గడప దాటి బయటకు వెళ్లిన వారు... గమ్యస్థానానికి చేరినట్లు వారి నుంచి 'ఐ యామ్ సేఫ్' అంటూ ఒక్క ఫోన్ కాల్ లేదా చిన్న ఎస్ఎంఎస్ లేక ఈ మెయిల్ వస్తే చాలు మనిషి గుప్పెడు మనసు హమ్మయ్య అంటూ రిలాక్స్ అవుతుంది. ఎందుకు టెన్షన్ ... నాలుగైదు గంటలలో గమ్యస్థానం చేరుకుంటాం... క్షేమంగా వెళ్లి లాభంగా కాదు... క్షేమంగా వెళ్లి ఇంటి్కి క్షేమంగా తిరిగి వస్తాం... ఏ మాత్రం ఆందోళన వద్దంటూ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి... వారిలో కొండంత ధైర్యం నింపి... బై బై అంటూ విమానం ఎక్కారు. ఎయిర్ పోర్ట్‌లో వారికి సెండాఫ్ ఇచ్చి... వారి కుటుంబ సభ్యులు ఆనందంతో ఇంటి ముఖం పట్టారు. వాళ్లు విమానం ఎక్కి నాలుగు గంటలు దాటిందంటూ గడియారం వంక చూశారు. ఓ వైపు గంటల ముల్లు చక్రంలా తిరుగుతుంది. దాని వెంటనే నిముషాల ముల్లు నీ వెంటే నేను అంటూ పోటీ పడి మరీ పరుగులు పడుతోంది. అయితే వెళ్లిన వారు నుంచి చిన్నపాటి సందేశం కూడా రాలేదు... బిజీగా ఉండి ఉంటారని వారికివారు తమ మనసుకు సమాధానం చెప్పుకున్నారు. సెల్ ఫోన్‌కు ఫోన్ చేస్తే .. స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది.. మనసులో ఏదో మూల కీడు శంకిస్తుంది. టెన్షన్ తట్టుకోలే... టీవీ పెట్టారు. మలేసియా నుంచి బీజింగ్ బయలుదేరిన ఎమ్హెచ్ 370 విమానం అదృశ్యం అంటూ ప్లాష్ న్యూస్ టీవీ స్క్రీన్‌పై కనిపించడం బంధువులకు 'షాక్'. ఇంతకీ విమానం ఏమైంది... తమ వారి ఆచూకీ ఎక్కడ అంటూ కుటుంబీకులు మలేసియా ఎయిర్‌పోర్ట్‌కు పరుగులు పెట్టారు. ఆచూకీ తెలిసిందన్న వార్త కోసం ఒకటి రెండు కాదు దాదాపు నెల రోజులు విమానాశ్రయంలో పడిగాపులు కాశారు. కళ్లు కాయాలు కాసేలా ఎదురు చూశారు. అయినా ఫలితం రాలేదు. విమానం కూలిపోయింది. తీవ్రవాదులు హైజాక్ చేశారంటూ పూకార్లు షికార్లు చేశాయి. దీంతో వారి గుప్పెడంత గుండెలు అవిసిపోయేలా రోదించాయి. విమానం కోసం ప్రపంచదేశాలు ఏకమై గాలింపు చర్యలు చేపట్టాయి. అయినా ఫలితం శూన్యం. రేపైనా ఆ విమానం ఆచూకీ తెలుస్తుందని ఓ చిన్న ఆశ పెట్టుకుని కళ్లలో వత్తులు వేసుకుని ఏడాదిగా ఎదురు చూస్తునే ఉన్నారు....చూస్తున్నారు కూడా. కాగా 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం సరిగ్గా గత ఏడాది 08-03-2014 మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. కుటుంబసభ్యులు, బంధువులతోనే కాదు ఈ ప్రపంచంతోనే ఆ విమానంలోని ప్రయాణికులు డిస్కనెక్ట్ అయ్యారు. ప్రపంచ చరిత్రలోనే ఇంతమంది ప్రయాణికులతో వెళ్తూ గల్లంతైన విమానంగా ఎమ్హెచ్ 370 ఓ మిస్టరీగా మిగిలిపోయింది. ఈ విమానంలో మలేసియా వాసులు, 154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు, ఐదుగురు భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ విమానం కూలిపోయిందని ఎలా చెబుతారు?
కౌలాలంపూర్: గమ్యస్థానం చేరగానే ఫోన్ చేస్తామని... విమానం ఎక్కారు. బయలుదేరిన కొన్ని నిమిషాలకే ఆ విమానం అదృశ్యమైంది. ఆ వార్త వినగానే ప్రయాణికుల బంధువుల మనస్సుల్లో అలజడి మొదలైంది. అసలు విమానం ఏమైందో నేడు కాకుంటే రేపు అయినా తెలుస్తుందని చిగురంత ఆశతో ఉన్నారు. ఒకటి, రెండు కాదు... ఏకంగా 11 నెలలు అయింది. ఇంతవరకు విమానం కాని బంధువుల జాడ కాని తెలియలేదు. వారంతా ఏమయ్యారో అని సతమతమవుతున్న తరుణంలో విమానం కూలిపోయింది... అందులోని 239 మంది మరణించారని మలేసియా ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రకటించడంతో సదరు బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.... ఆగ్రహంతో ఊగిపోయారు. ఇలా కాదు మలేసియా ప్రభుత్వంతో తాడో పేడో తెల్చుకోవాలని భావించారు. అందులోభాగంగా విమాన ప్రమాదంలో ఆచూకీ తెలియకుండా పోయిన చైనాకు చెందిన 21 కుటుంబాలు ఆగమేఘాల మీద శుక్రవారం కౌలాలంపూర్ చేరుకున్నారు. విమానం కూలిపోయిందంటూ చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు మలేసియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విమాన శకలాలు, మృతదేహాలు ఆచూకీ తెలియకుండా ప్రమాదం జరిగిందని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. విమాన ప్రమాద వార్తతో తమ కుటుంబాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అనుభస్తున్న ఆవేదన మీకు అర్థం కావడం లేదంటూ మలేసియా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విమాన ఆచూకీ కోసం గట్టి ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు. విమానం అదృశ్యమైన ప్రాంతంలో గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేయాలని మలేసియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం గత ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం మాత్రం కనిపించలేదు. ఈ విమానంలో మలేసియా వాసులు, 154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు, ఐదుగురు భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే. -
ఆకాశంలో మరో విషాదం
మరో రెండు రోజుల్లో ముగియబోతున్న 2014 పోతూ పోతూ పెను విషాదాన్ని మిగిల్చింది. మలేసియాకు చెందిన ఎయిర్ ఆసియా విమానం ఇండొనేసియా నుంచి సింగపూర్ వెళ్తూ ఆదివారం హఠాత్తుగా అదృశ్యమైంది. ఆ సమయంలో అందులో ఏడుగురు సిబ్బందిసహా 162మంది ప్రయాణికులున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇది అంతర్థానం కావడం వెనక కారణాలు ఏమై ఉంటాయో అంతుచిక్కని స్థితి. యాదృచ్ఛికమే కావొచ్చుగానీ...ఈ ఏడాది చోటుచేసుకున్న విమాన ప్రమాదాలన్నీ ఆగ్నేయాసియావే కావడం, పెను దుర్ఘటనలు మూడూ మలేసియాకు సంబంధించినవే కావడం గమనార్హం. తొమ్మిదినెలల క్రితం...అంటే మార్చిలో మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్-777 విమానం 239మందితో కౌలాలంపూర్‌నుంచి చైనా వెళ్తూ మాయమైంది. ఆ విమానం ఎలాంటి ప్రమాదంలో పడిందో, ఏం జరిగిందో తెలియలేదు సరికదా... ఇంతవరకూ దానికి సంబంధించిన శకలాలే లభ్యంకాలేదు. పలు దేశాలు సమష్టిగా అత్యంతాధునాతన పరికరాల సాయంతో జల్లెడపట్టినా ఆ విమానానికి సంబంధించిన చిన్న శకలం కూడా దొరకలేదు. అటుతర్వాత మొన్నటి జూలైలో మలేసియాకు చెందిన మరో విమానం ఉక్రెయిన్ గగనతలం మీదుగా వెళ్తుండగా క్షిపణి దాడిలో కుప్పకూలింది. ఆ ఉదంతంలో 298మంది ప్రయాణికులు దుర్మరణంపాలయ్యారు. ఆ దుండగానికి పాల్పడిందెవరన్న విషయంలో ఇంతవరకూ నిర్ధారిత సమాచారం లేదు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రష్యానే దీనికి బాధ్యతవహించాలని అమెరికా, యూరోప్ దేశాలు అంటే... ఉక్రెయిన్ దళాలే ఈ పనిచేశాయని రష్యా ఆరోపించింది. వారి అసలు లక్ష్యం తమ అధ్యక్షుడు పుతిన్ అని కూడా ప్రకటించింది. ప్రమాదానికి ముందు ఎయిర్ ఆసియా విమానం పెలైట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో మాట్లాడాడు. ప్రతికూల వాతావరణమున్నందువల్ల విమాన ప్రయాణ మార్గాన్ని మార్చుకునేందుకు అనుమతించమని కోరాడు. ఆ వెంటనే విమానంనుంచి సంకేతాలు ఆగిపోయాయి. ప్రమాద సమయంలో విమానం ప్రయాణిస్తున్నచోట 50,000 అడుగుల ఎత్తు వరకూ దట్టమైన మేఘాలుండటంతో పాటు ఉరుములు, మెరుపులతో వాతావరణం బీభత్సంగా ఉన్నదని అంటున్నారు. ఉపగ్రహం విడుదల చేసిన ఛాయాచిత్రాలను పరిశీలిస్తే ఆ సంగతి స్పష్టమవుతున్నది. అయితే, విమానం ప్రయాణిస్తున్న మార్గంలో అలాంటి వాతావరణం ఉన్నదని ఎలాంటి ముందస్తు సమాచారమూ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాంకేతిక విజ్ఞానం ఇప్పుడు ఎంతగానో విస్తరించింది. ఉపగ్రహాలు భూమండలంలో అణువణువునూ గమనిస్తూ ఎప్పటికప్పుడు సచిత్ర సమాచారాన్ని అందజేస్తున్నాయి. దానికితోడు విమానంలో అత్యాధునిక నేవిగేషన్ వ్యవస్థలుంటాయి. ఇన్ని అవకాశాలున్నా ఆ మార్గం శ్రేయస్కరం కాదని ముందుగా చెప్పగల స్థితి లేకపోవడం దిగ్భ్రాంతిక రం. దీనికితోడు కల్లోల వాతావరణంలో విమానాన్ని ఒడుపుగా గమ్యానికి తీసుకెళ్లగల శిక్షణను పెలైట్లకు అన్ని దేశాలూ, అన్ని విమానయాన సంస్థలూ తప్పనిసరి చేస్తున్నాయా లేదా అనే ప్రశ్న ఉండనే ఉన్నది. ఎయిర్ఆసియా చవక ధరల్లో ప్రయాణికులను తీసుకెళ్తున్నది. మిగిలిన విమానయాన సంస్థలతో పోలిస్తే ఆ సంస్థ వసూలు చేసే మొత్తం తక్కువగా ఉంటుందని చాలామంది దానివైపు మొగ్గు చూపుతారు. చవకైన ధరలను అందించే విమానయాన సంస్థలు అందుకనుగుణంగా ఖర్చు తగ్గించుకోవడానికి చూస్తాయన్న అపప్రద ఉంది. అయితే, పదమూడేళ్లుగా ఈ రంగంలో ఉంటున్న ఎయిర్ఆసియా చరిత్రలో ఇలాంటి దుర్ఘటన చేసుకోవడం ఇదే ప్రథమం. వర్తమాన ప్రపంచంలో జీవన వేగం పెరిగింది. ప్రస్తుతం వ్యాపార, వాణిజ్య సంబంధాలు విస్తరించడం...ఉపాధికోసం, చదువు నిమిత్తం ప్రపంచంలో ఈమూలనుంచి ఆ మూలకు ప్రయాణించడంన లక్షలాదిమందికి నిత్యావరంగా మారింది. అందువల్ల విమాన ప్రయాణికుల సంఖ్యతోపాటే విమానాలూ పెరిగాయి. గగనతలంలో కూడా ఆమేరకు రద్దీ గణనీయంగానే పెరిగింది. అయితే విమానాల జీవిత కాలం, వాటికోసం వాడుతున్న విడిభాగాల నాణ్యత వగైరా విషయాలపై శ్రద్ధపెట్టవలసిన అవసరం పెరిగింది. అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం అందుబాటులోకి వచ్చిన మాట వాస్తవమే అయినా పైలట్లు దాన్ని అందిపుచ్చుకుని తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవలసిన అవసరం ఉన్నది. ప్రపంచంలో ఎన్ని సంస్థలు ఈ విషయంలో దృష్టిపెడుతున్నాయో అనుమానమే. ఉదాహరణకు కల్లోల వాతావరణంలో విమానాలను నడపడంపై మన పైలట్లకు శిక్షణ తప్పనిసరి చేయడమేకాక...ప్రతి వర్షాకాలానికి ముందూ ఆ అంశంలో పునర్మూల్యాంకనం చేసే విధానం కూడా అమల్లో ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో ఎన్ని సంస్థలు భద్రత విషయంలో రాజీలేని ధోరణితో వ్యవహరిస్తున్నాయో చెప్పడం కష్టం. ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానయాన సంస్థలు భద్రత విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అంతర్జాతీయ విమానయాన సంస్థ(ఐసీఏఓ) అనేక ప్రమాణాలను ఏర్పరిచింది. టేకాఫ్ మొదలుకొని ల్యాండింగ్ వరకూ అందులో ఎన్నో అంశాలుంటాయి. వాటికి సంబంధించిన నిబంధనలుంటాయి. ఆ ప్రమాణాలను ఎవరెలా పాటిస్తున్నారో ఎప్పటికప్పుడు గమనించి ఎత్తిచూపే విధానం అమల్లో ఉన్నది. ఇదిగాక ఉగ్రవాదం విస్తరించిన ప్రస్తుత దశలో తీసుకోవాల్సిన అదనపు భద్రతా చర్యలుంటాయి. వీటన్నిటినీ దాటుకుని మరో ప్రమాదం చోటుచేసుకోవడం, అందులో 162మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. ఇప్పుడు అదృశ్యమైన ఎయిర్ ఆసియా విమానం ఆచూకీ త్వరగా వెల్లడై బాధిత కుటుంబాలకు కాస్తయినా సాంత్వన లభించాలని, ఇలాంటి ప్రమాదాలకు తావులేని రీతిలో మరింత సురక్షితమైన భద్రతా ప్రమాణాలు అమల్లోకి రావాలని ఆశిద్దాం. -
మలేషియా ఎయిర్‌లైన్స్ క్రిస్మస్ ఆఫర్స్
హైదరాబాద్: క్రిస్మస్ సందర్భంగా మలేషియా ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రత్యేకమైన చార్జీలను ఆఫర్ చేస్తోంది. ఈ ప్రత్యేకమైన చార్జీలను పొందడానికి టికెట్ల బుకింగ్ రెండు రోజులకే (నేడు- శనివారం, రేపు-ఆదివారం) పరిమితమని మలేషియా ఎయిర్‌లైన్స్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలా బుక్ చేసుకున్న టికెట్లకు వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ప్రయాణించవచ్చని పేర్కొంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూర్, చెన్నై, కోచి నగరాల నుంచి మలేషియా నగరాలు-పుకెట్, పెనాంగ్, లంగ్కవి, క్రాబిలకు నేరుగా ప్రయాణించవచ్చని వివరించింది. తమ వెబ్సైట్(డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్మలేషియాఎయిర్లైన్స్డాట్కామ్) ద్వారా మరిన్ని వీకెండ్ డీల్స్ పొందవచ్చని పేర్కొంది. భారత్ నుంచి పుకెట్‌కు రూ.15,974, పెనాంగ్‌కు రూ.15,852, క్రాబికి రూ.14,390, లంగ్కవికురూ.14,274 (అన్నీ ఎకానమీ క్లాస్)చొప్పున ప్రత్యేకమైన చార్జీలను ఆఫర్ చేస్తున్నామని పేర్కొంది. ఈ ప్రత్యేక చార్జీల్లో విమానాశ్రయ పన్నులు, సర్‌చార్జీలు, 30 కేజీల చెక్-ఇన్ బ్యాగేజీ అలవెన్స్,,... ఇవన్నీ కలిసే ఉంటాయని మలేషియా ఎయిర్‌లైన్స్ వివరించింది. -
క్షిపణి ఢీకొనడం వల్ల కూలిన మలేషియా విమానం
హేగ్(నెథర్లాండ్స్): క్షిపణిలాంటి శక్తివంతమైన వస్తువు ఢీకొనడంవల్లనే మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 17 విమానం కూలిపోయిందని డచ్ సేఫ్టీ బోర్డు తొలి నివేదికలో తెలిపింది. నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డామ్ నుంచి మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు తెళుతున్న ఈ విమానం జూలై 17న కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 298 మంది మృతి చెందారు. ఈ మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఉక్రెయిన్ గగనతలంపై 10 కి.మీ ఎత్తులో ప్రయాణిస్తుండగా జరిగిన క్షిపణి దాడిలో కుప్పకూలింది. యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మలేసియా విమానం కూల్చివేత ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారుల ఘాతుకమేనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విమానాన్ని ఉక్రెయిన్ సైనిక రవాణా విమానంగా పొరబడిన తిరుగుబాటుదారులు దాన్ని కూల్చేందుకు క్షిపణి దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఈ దుర్ఘటన అనంతరం రష్యా మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు, ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారుల మధ్య జరిగిన సంభాషణల ఆడియో రికార్డుల రాతప్రతులను ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ బయటపెట్టింది. ప్రమాదం జరిగిన 20 నిమిషాల తరువాత ఈ సంభాషణలు చోటు చేసుకున్నాయి. ఈ సంభాషణల ప్రకారం ఇగోర్ బెజ్లర్ అనే మిలిటెంట్.. రష్యా నిఘా అధికారి వాలిసి జెరానిన్తో మాట్లాడుతూ ''మేం ఇప్పుడే ఒక విమానాన్ని పేల్చేశాం. అది గాల్లోనే ముక్కలైంది''అని పేర్కొన్నాడు. అలాగే మేజర్ అనే మిలిటెంట్ ఘటనాస్థలికి వెళ్లి విమాన శకలాలను పరిశీలించాక ''ఇది నూరు శాతం పౌర విమానమే. అన్నీ సాధారణ వస్తువులే కనిపిస్తున్నాయి'' అని గ్రెక్ అనే మరో మిలిటెంట్‌కు వివరించాడు. దీంతోపాటు తిరుగుబాటుదారుల నాయకుడిగా భావిస్తున్న మైకొలా కొజిత్సిన్తో మరో మిలిటెంట్ మాట్లాడుతూ ''ఇది ప్యాసింజర్ విమానంలా కనిపిస్తోంది. గ్రాబొవొ గ్రామ వెలుపల ఇది పడిపోయింది. మహిళలు, చిన్నపిల్లల మృతదేహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి''అని కొజిత్సిన్కు వివరించాడు.రష్యా అనుకూల ఉగ్రవాదులే ఈ విమానాన్ని కూల్చేశారని ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరోషెంకో ఆరోపించారు.అయితే ఉక్రెయిన్ వాదనను రష్యా తోసిపుచ్చింది. ఈ విమాన కూలిపోయిన ఘటనపై డచ్ సేఫ్టీ బోర్డు తొలి నివేదిక ఈరోజు సమర్పించింది. క్షిపణిలాంటి శక్తివంతమైన వస్తువు ఢీకొనడంవల్లనే ఈ విమానం కూలిపోయిందని బొర్డు ఆ నివేదికలో పేర్కొంది. ** -
తొందరపడి నిందలు వేయొద్దు: పుతిన్
ఎంహెచ్-17 విమానం కూల్చివేత విషయంలో దర్యాప్తు పూర్తి కాకుండా తొందరపడి తమ దేశంపై ఓ అంచనాకు వచ్చేయొద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టిగా చెప్పారు. ఈ విషయంలో రాజకీయ ప్రకటనలు ఇవ్వొద్దని ఘాటుగా అన్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ ప్రెస్ సర్వీస్ ఓ ప్రకటనలో తెలిపింది. ''ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) చేసే దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని, మేం సిద్ధంగా ఉన్నామని రష్యా ఎప్పుడో చెప్పింది'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం గురించి బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌తో పుతిన్ ఆదివారం రాత్రి చర్చించారు. అంతర్జాతీయ సమాజం సహకారంతో వీలైనంత త్వరగా శాంతియుత పరిష్కారం చూసుకోవాలని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లో కాల్పుల విరమణ తప్పనిసరిగా ఉండాలని, అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే దర్యాప్తు తప్పనిసరి అని కామెరాన్ అన్నారు. జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్‌తో కూడా పుతిన్ మాట్లాడారు. -
పెను విషాదం
యాదృచ్ఛికమే కావొచ్చుగానీ... నాలుగు నెలల వ్యవధిలో మలేసియాకు చెందిన రెండు విమానాలు ప్రపంచానికి పెను విషాదాన్ని మిగిల్చిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. గత మార్చిలో ఒక విమానం హిందూ మహాసముద్రంమీదుగా వెళ్తూ అదృశ్యమై ఇప్పటికీ ఆచూకీ లేదు. ఇప్పుడు ఉక్రెయిన్ గగనతలం మీదుగా వెళ్తుండగా మరో విమానం క్షిపణి దాడిలో కుప్పకూలి 298మంది దుర్మరణం పాల య్యారు. ఉక్రెయిన్ ఆరోపిస్తున్నట్టు, అమెరికా అధ్యక్షుడు ఒబామా సమర్ధిస్తున్నట్టు ఇది రష్యా అనుకూల మిలిటెంట్ల పనేనా... లేక రష్యా నిందిస్తున్నట్టు ఉక్రెయిన్ దళాలే విమానాన్ని కూల్చి దాన్ని తిరుగు బాటుదారులపైకి నెట్టేద్దామని ఎత్తువేశాయా అనేది లోతైన దర్యాప్తు తర్వాతే తెలుస్తుంది. ఇప్పటికైతే విమానం కూలిన వెంటనే మిలిటెం ట్లకూ, రష్యా ఇంటెలిజెన్స్ అధికారులకూ మధ్య జరిగాయంటున్న సంభాషణల ఆడియో రికార్డులకు సంబంధించిన రాతప్రతుల్ని ఉక్రెయిన్ బయటపెట్టింది. సరిగ్గా ఘటన జరిగిన రోజున ఉక్రెయిన్ క్షి పణి బక్-ఎం1కు చెందిన రాడార్ వ్యవస్థ పనిచేసినట్టు తాము గుర్తించామని రష్యా ప్రకటించింది. అంతేకాదు... ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో తమ అధ్యక్షుడు పుతిన్ ప్రయాణిస్తున్న విమా నం ఉన్నదని, క్షిపణిని ప్రయోగించినవారి అసలు లక్ష్యం అదేనని చెప్పింది. ఇందులోని నిజానిజాలు ఇంకా తెలియవలసే ఉన్నది. పరస్పరం సంప్రదింపులు జరుపుకొని పరిష్కారాన్ని అన్వేషించాల్సిన ఒక సమస్యను ప్రైవేటు గ్రూపుల చేతుల్లో పెట్టి, భావోద్వేగాలు రెచ్చ గొట్టి తమాషా చూద్దామనుకోవడంవల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. దేశాల మధ్య ఏదైనా సమస్య తలెత్తి ఘర్షణ వాతావరణం నెలకొన డం అసాధారణమేమీ కాదు. కానీ, అలాంటి ఘర్షణలను నివారించ డానికి అవసరమైన పరిపక్వతను ప్రదర్శించడంలో దేశాల అధినేతలు విఫలమవుతున్న తీరు అంతులేని హింసను ప్రేరేపిస్తున్నది. ఎంతటి హింస అయినా తమ భూభాగంపై కాకపోతే, తమ చేతులకు నెత్తురం టకపోతే, తమ ప్రమేయంపై సాక్ష్యాధా రాలు దొరక్కపోతే, అది ‘శత్రు దేశా’న్ని చావుదెబ్బ తీసేటట్టయితే... దానికి మద్ద తుగా నిలవడానికి, ఆ బాపతు ముఠాలకు మారణాయుధాలు సమ కూర్చడానికి చాలా దేశాలు సందేహించడంలేదు. 70 దశకంనాటి అఫ్ఘాన్‌నుంచి మొదలుపెడితే ఈనాటి ఇరాక్, సిరియా వరకూ ఇందు కు ఎన్నో ఉదాహరణలు. ఈ దేశాలన్నీ ఇప్పటికీ రావణకాష్టంలా నిత్యం మండుతూనే ఉన్నాయి. అంతర్యుద్ధాలతో అతలాకుతలమవు తున్నాయి. వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దురదృష్టవ శాత్తూ ఆ జాబితాలో ఉక్రెయిన్ చేరి ఆర్నెల్లు కావస్తోంది. రష్యా అనుకూల ఉక్రెయిన్ అధ్యక్షుడు యానుకోవిచ్‌ను గత ఫిబ్రవరిలో పాశ్చాత్య దేశాల ప్రాపకంతో సాగిన ‘ప్రజాస్వామిక ఉద్య మం’ పదవీచ్యుతుణ్ణి చేయగా, ఆ మరుసటి నెల ఉక్రెయిన్‌లో భాగం గా ఉన్న క్రిమియాను రిఫరెండం ద్వారా తనలో కలుపుకొని రష్యా తగిన జవాబిచ్చింది. అప్పటినుంచి ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాం తంలో రష్యా అనుకూల, వ్యతిరేక శక్తులమధ్య పోరు సాగుతూనే ఉన్నది. నిజానికిది ఆ ప్రాంతంలోని రెండు గ్రూపులు లేదా దేశాల మధ్య సాగుతున్న ఘర్షణ కాదు. రష్యా చుట్టూ ఉన్న దేశాలను చేర దీసి రష్యాను చుట్టుముట్టే పెను వ్యూహానికి అమెరికా, నాటోలు పదు నుబెడుతున్నాయి. ఇందుకు ప్రతిగా రష్యా తన ఎత్తుగడల్లో తానుం ది. ఇలా అగ్ర రాజ్యాల సంకుల సమరానికి వేదికై ఉక్రెయిన్ అస్థిర త్వంలో చిక్కుకుంది. ఆ దేశాలు పరస్పరం అంగీకారానికొస్తే తప్ప ఈ స్థితి చక్కబడేలా లేదు. ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల మిలిటెంట్లు గగనతలంలో వెళ్లే విమానాన్ని గురిచూసి కూల్చేంత స్తోమత తమకు లేదని చెబుతున్న మాటలు నమ్మదగ్గవేమీ కాదు. వారు అంతకు రెండురోజులముందే ఉక్రెయిన్ సైనిక విమానాన్ని కూల్చివేశారు. అయితే, సాధారణ క్షిపణి 33,000 అడుగుల ఎత్తున వెళ్లే విమానాన్ని కూల్చడం అసాధ్యం. రాడార్ సాయంతో విమాన పథాన్ని గుర్తించి గురిచూడగలిగే ఆధునాతన క్షిపణికి మాత్రమే అది వీలవుతుంది. బక్ క్షిపణికి 77,000 అడుగుల ఎత్తున ఎగిరే విమానాన్ని సైతం కూల్చగల సామర్థ్యం ఉంది. ఉక్రెయిన్‌లోని మిలిటెంట్లకు రష్యా సహాయసహకా రాలున్న సంగతి నిజమే అయినా ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన క్షిపణులను వారి చేతుల్లో పెట్టేంత స్థాయికి అవి చేరాయా అని ఆశ్చ ర్యం కలుగుతుంది. ఇన్నాళ్లూ నేరుగా రంగంలోకి దిగకుండా ఉక్రెయి న్లో పరస్పర ఘర్షణలతోనూ, మధ్యమధ్య చర్చలతోనూ, కాల్పుల విరమణ ఒప్పందాలతోనూ కాలం గడపడం ఉక్రెయిన్ వాసులకు ఎలా ఉన్నా రష్యాకు సౌకర్యవంతంగానే ఉంటున్నది. అమెరికా తమపై విధించిన ఆంక్షలకు సహకరించని పాశ్చాత్య దేశాల బలహీ నత కూడా ఆ దేశానికి బాగానే అందివచ్చింది. కానీ, మలేసియా విమానం కూల్చివేత ఘటన ఈ మొత్తం స్థితిని మార్చేసింది. ఒకపక్క ఉక్రెయిన్ ఇంతగా మండుతున్నా ఆ దేశం గగనతలం మీదుగా వెళ్లడం క్షేమదాయకం కాదన్న గ్రహింపునకు రావడంలో విఫలమైనందుకు మలేసియాను తప్పుబట్టాలి. మన ఎయిరిండియా, జెట్ ఎయిర్వేస్వంటివి మూడు నెలలక్రితమే విమానాలను అటు వైపుగా నడపరాదని నిర్ణయించాయి. మొత్తానికి ఈ సంక్షోభంతో ఏ మాత్రమూ సంబంధంలేని 298మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కారకులైనవారిని కఠినంగా శిక్షించడంతో పాటు... ఇలాంటి సంక్షోభాలను సృష్టించి, పెంచి పోషిస్తున్న దుష్ట శక్తులను కూడా దుంపనాశనం చేయాల్సి ఉంది. అది మాత్రమే ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి అర్పించే నిజమైన నివాళి అవుతుంది. -
విమాన ప్రమాదం మృతుల్లో ప్రధాని అమ్మమ్మ
ఎమ్హెచ్ 17 విమాన ప్రమాదంలో మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ అమ్మమ్మ శ్రీ సిటి అమీరహ్ మృతి చెందారు. ఆ విషయాన్ని మలేషియా దేశ రక్షణ మంత్రి, ప్రధాని నజీబ్ రజాక్ సోదరుడు హిషమ్ముద్దీన్ హుస్సేన్ వెల్లడించారు. తమ సవతి అమమ్మ విమాన ప్రమాదంలో మరణించారని వెల్లడిస్తూ ఆమె ఫొటోను హుస్సేన్ ట్విట్టర్ పెట్టారు. అమీరహ్ స్వస్థలం ఇండోనేషియా అని చెప్పారు. ఇండోనేషియాలోని జోగ్ జకార్తా నగరానికి వెళ్లేందుకు ఆమె ఒంటరిగా ఆమ్‌స్టర్‌డామ్‌లో విమానం ఎక్కారని తెలిపారు. రంజాన్ పండగ సమీపిస్తున్న నేపథ్యంలో... బంధు మిత్రులతో ఆనందంగా ఆ పండగ చేసుకునేందుకు వస్తున్న తరుణంలో ఆమె మృతి చెందారని పేర్కొన్నారు. శ్రీసిటి అమీరహ్ను తమ తాత మహ్మద్ నవోహ్ ఒమర్ రెండో వివాహం చేసుకున్నారని చెప్పారు. తాను తన సోదరుడు నజీబ్ రజాక్ కజిన్స్ అని ఈ సందర్బంగా హిషమ్ముద్దీన్ హుస్సేన్ వివరించారు. ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ బయలుదేరిన విమానం గురువారం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ సమీపంలో తిరుబాటుదారులు క్షిపణులతో పేల్చివేశారు. ఆ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 280, సిబ్బంది 15 మంది మొత్తం 295 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
ఎంహెచ్-17: నాడు అన్న.. నేడు కూతురు
రెండు ప్రమాదాలు.. రెండూ మలేషియన్ విమానాలే. రెండుసార్లూ ఆ కుటుంబంలో విషాదమే. ఓ ఆస్ట్రేలియన్ మహిళకు ఈ అనుభవం ఎదురైంది. నాలుగు నెలల క్రితం ఎంహెచ్ 370 విమాన దుర్ఘటనలో ఆమె తన అన్నయ్యను కోల్పోతే.. ఇప్పుడు ఎంహెచ్ 17 దుర్ఘటనలో తన కూతురిని కోల్పోయింది. కేలీన్ మన్ సోదరుడు రాడ్ బరోస్, ఆయన భార్య మేరీ బరోస్ ఇద్దరూ ఎంహెచ్ 370 విమానంలో వెళ్లి, విమానంతో పాటే గల్లంతయ్యారు. గురువారం రాత్రి నాటి ఘటనలో మన్ కుమార్తె మేరీ రిక్ ఎంహెచ్17 విమానంలో సహ ప్రయాణికులతో పాటే కాలి బూడిదైపోయింది. దీంతో మన్ గుండె బద్దలైపోయింది. కనీసం ఏం జరిగిందో చెప్పే పరిస్థితిలో కూడా ఆమె కనిపించడంలేదు. ఒకే విమానయాన సంస్థకు చెందిన రెండు విమానాల దుర్ఘటనలో తమ కుటుంబ సభ్యులు ఇలా ప్రాణాలు కోల్పోవడం ఆమెను తీవ్ర షాక్‌కు గురిచేసింది. రిక్‌తో పాటు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు చెందిన ఆమె భర్త ఆల్బర్ట్ నాలుగు వారాల పాటు యూరప్‌లో సెలవులు గడిపి, తిరిగి ఇంటికి వస్తున్నారు. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది. ఇలా తమ కుటుంబంలో రెండు విషాదాలు జరిగినా.. మలేసియా ఎయిర్‌లైన్స్ అంటే మాత్రం బరోస్ దంపతులకు ఎలాంటి కోపం లేదు. అలా జరుగుతుందని ఎవరూ ఊహించరని, అందులో వాళ్లు చేయగలిగింది కూడా ఏమీ లేదని అన్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
ఎంహెచ్-17కు 25 కిలోమీటర్ల దూరంలో మన విమానం
ఒకళ్లు కారు.. ఇద్దరు కారు.. దాదాపు 126 మంది ప్రయాణికులు. అంతా ఎయిరిండియా విమానం ఏఐ-113లో ఉన్నారు. విషయం తెలియగానే వాళ్లందరికీ గుండెలు ఒక్కసారిగా ఝల్లుమన్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే, బక్ క్షిపణి దాడిలో మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్-17 విమానం కూలిపోయినప్పుడు.. దానికి ఈ ఎయిర్ ఇండియా విమానం కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే, ఆ విమానం కొద్ది ఆలస్యమైనా.. ఇది కొంచెం ముందున్నా చాలా దారుణం జరిగేదన్నమాట. సరిగ్గా ఎంహెచ్-17 విమానం రాడార్ నుంచి అదృశ్యం అయిపోయినప్పుడు.. దానికి ఎయిరిండియా విమానం పాతిక కిలోమీటర్ల దూరంలో ఉందని ప్రపంచవ్యాప్తంగా విమానాల రాకపోకలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండే ఫ్లైట్రాడార్24.కామ్ అనే వెబ్సైట్ తెలిపింది. దుర్ఘటన జరిగిన తర్వాత.. ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణిస్తున్న విమానం సహా పలు విమానాలను ఎయిరిండియా మార్గం మార్చింది. యూరప్, ఆసియా ఖండాల మధ్య విమానాలు తిరిగేందుకు ఉక్రెయిన్ గగనతలమే అత్యంత అనుకూలం కావడంతో ఇది ఎప్పుడూ విమానాల రాకపోకలతో బిజీగా ఉంటుంది. అయితే.. ఈ సంఘటన తర్వాత దాదాపుగా ఈ మార్గంలో వెళ్లే విమానాలన్నీ దారిమళ్లించుకున్నాయి. విమానాలు వెళ్లడానికి ఉన్న మరో మార్గం కూడా ప్రమాదకరంగానే ఉంటుంది. అది సింఫెరోపోల్ ఎఫ్ఐఆర్ మార్గం. అయితే.. ఆ మార్గం అటు ఉక్రెయిన్, ఇటు రష్యా.. రెండూ తమదంటే తమదేనని ప్రకటించుకోవడంతో పాటు రెండు ఏటీసీలు ఉండటంతో భద్రతా కారణాల రీత్యా అటు విమానాలు వెళ్లడంలేదు. యూరప్, అమెరికాలకు మన దేశం నుంచి రెండే విమానయాన సంస్థలు విమానాలు నడుపుతున్నాయి. అవి ఎయిరిండియా, జెట్ ఎయిర్వేస్. ఎంహెచ్-17 దుర్ఘటన తర్వాత తూర్పు ఉక్రెయిన్ మార్గం మీదుగా వెళ్లొద్దని ఈ రెండు సంస్థలకు భారత విమానయాన నియంత్రణ సంస్థ తెలిపింది. -
ఎంహెచ్-17: గుర్తించాల్సిన 5 ప్రధానాంశాలు
మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గురువారం రాత్రి కుప్పకూలడంతో అందులో ఉన్న మొత్తం 295 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ విమానం గురించి గుర్తించాల్సిన 5 ప్రధానాంశాలివి.. మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్-17 విమానం నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ విమానాశ్రయం నుంచి గురువారం మధ్యాహ్నం 12.14 గంటలకు బయల్దేరింది. శుక్రవారం ఉదయం 6.10 గంటలకు ఇది కౌలాలంపూర్ చేరుకోవాల్సి ఉంది. అందులో 280 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. బోయింగ్ 777-200ఇఆర్ తరహా విమానాన్ని 1997 జూలై 30వ తేదీన మలేషియా ఎయిర్‌లైన్స్‌కు అందజేశారు. ఇప్పటివరకు అది 43వేల గంటల పాటు ప్రయాణించింది. ఉక్రెయిన్ గగనతలంలో ఉండగా దాంతో తమకు సంబంధాలు తెగిపోయినట్లు మలేషియా ఎయిర్‌లైన్స్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల ఎత్తులో అది ప్రయాణిస్తుండగా చిట్టచివరిసారిగా ఓ సైనిక నిఘా ఉపగ్రహం దీన్ని కనుగొంది. అయితే, సరిగ్గా అది ఏ ప్రాంతంలో ఉండగా క్షిపణి తాకిందో మాత్రం కనుగొనలేకపోయింది. అలాగే, క్షిపణి సరిగ్గా ఎక్కడినుంచి బయల్దేరి వచ్చి ఈ విమానాన్ని ఢీకొందనే విషయాన్ని తేల్చడానికి గణిత సూత్రాలు, హైస్పీడ్ కంప్యూటర్లు, ఇతర సెన్సర్లను విశ్లేషకులు ఉపయోగిస్తున్నారు. -
మలేషియా విమానాన్ని కూల్చేశారు!
-
మలేషియా ఎయిర్‌లైన్స్‌లో ప్రీమియం మీల్స్
న్యూఢిల్లీ: ఎకానమీ తరగతి ప్రయాణికుల కోసం మలేషియా ఎయిర్‌లైన్స్ ప్రత్యేక మీల్ ఆఫర్ ప్రకటించింది. ప్రయాణికులు కొంత మొత్తం అదనంగా చెల్లించడం ద్వారా కాంప్లిమెంటరీగా ఇచ్చే భోజనం బదులు ప్రీమియం ‘ఎంహెచ్ గోర్మెట్’ మీల్‌ను పొందవచ్చని తెలి పింది. ఇందులో ప్రాన్ పికాటా, చికెన్ కార్డన్ బ్లూ వంటి ఆరు రకాల వంటకాలు ఉంటాయని వివరించింది. ఈ మీల్స్ ధర 70 మలేషియన్ రింగిట్స్ (సుమారు రూ. 1,295) అయినప్పటికీ వచ్చే నెల 3 దాకా ప్రారంభ ఆఫర్ కింద 49 రింగిట్స్‌కే (సుమారు రూ. 906) అందిస్తున్నట్లు మలేషియన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. అలాగే, ఆన్ ఎయిర్ సెలబ్రేషన్ ఆఫర్ కింద విమానప్రయాణంలోనే పుట్టిన రోజు వంటి వేడుకలు జరుపుకోదల్చుకునే వారు కేక్‌లు లాంటివి ప్రీ-ఆర్డరు చేయవచ్చని సంస్థ పేర్కొంది. ఈ కేక్‌ల ధర 250 మలేషియన్ రింగిట్స్ (దాదాపు రూ. 4,625) ఉంటుందని వివరించింది. ఆస్ట్రేలియా, ఆసి యా, మధ్యప్రాచ్యం రూట్లలో ఈ ఆఫర్లు పొందవచ్చు. -
బెంగళూరు విమానం అత్యవసర ల్యాండింగ్
మలేసియాలో టేకాఫ్ సమయంలో పేలిన టైరు నాలుగు గంటల పాటు గాల్లోనే చక్కర్లు మొత్తం 159 మంది సురక్షితం కౌలాలంపూర్: బెంగళూరు రావాల్సిన మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్ 192 విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా దించేశాడు. దీంతో ఏడుగురు సిబ్బందితోపాటు మొత్తం 166 మంది సురక్షితంగా బయటపడ్డారు. కొద్దిరోజుల క్రితమే ఎంహెచ్ 370 విమానం గల్లంతైన నేపథ్యంలో ఈ ఘటనను మలేసియా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీని వెనుక ఏదైనా విద్రోహ చర్య ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. ఆదివారం రాత్రి పది గంటల సమయంలో మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-800 ఎంహెచ్ 192 విమానం 159 మంది ప్రయాణికులతో బెంగళూరు బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం ఈ విమానం ఆదివారం రాత్రి 11.35 నిమిషాలకు గమ్యస్థానం చేరుకోవాలి. అయితే టేకాఫ్ సమయంలో విమానం టైరు పేలిపోవడమే కాక ల్యాండింగ్ గేర్ కూడా పాడైపోయింది. సమస్యను గుర్తించిన పైలట్ కెప్టెన్ ఆడమ్ ఆజ్మీ వెంటనే సమాచారాన్ని కౌలాలంపూర్ ఎయిర్ పోర్ట్ అధికారులకు చేరవేశారు. మలేసియా ఎయిర్‌లైన్స్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ విమానాన్ని వెనక్కి తీసుకురావాల్సిందిగా పైలట్‌ను ఆదేశించింది. దీంతో సోమవారం తెల్లవారుజామున 1.56 గంటలకు పైలట్ విమానాన్ని కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా దించేశారు. అగ్నిమాపక సిబ్బంది విమానంలోని ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరమ్మతుల అనంతరం సోమవారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు బెంగళూరు బయలుదేరిన ఎంహెచ్ 192 విమానం సాయంత్రం 5 గంటలకు గమ్యస్థానానికి చేరింది. దీంతో సుమారు 17.30 గంటలు ఆలస్యంగా చేరినట్లయింది. కాగా, విమానం నాలుగు గంటల పాటు గాల్లోనే ఉండటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే పైలట్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. తమను సురక్షితంగా తీసుకొచ్చిన పైలట్ ఆడమ్ ఆజ్మీని హీరో అంటూ తెగ పొగిడేశారు. -
నిశ్చింతయానం
వివరం: మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఎం.హెచ్ 370 అదృశ్యమై పోయాక విమానయానం ఎంతవరకు సురక్షితమైనది అనే ప్రశ్న తలెత్తడం సహజమే. అయితే అన్ని ప్రయాణ సాధనాలకన్నా విమానమే అత్యంత భద్రమైనదని గతంలో జరిగిన భూ, జల, వాయు వాహనాల ప్రమాద కారణాలు, గణాంకాలు చెబుతున్నాయి! ఈ నేపథ్యంలో... విమాన యానం గాలిలో దీపం కాదనీ, విమాన ప్రమాదాలన్నీ విమానం వల్ల జరిగే ప్రమాదాలు కావని చెప్పడమే ఈవారం ‘వివరం’. మీరో బిజినెస్ మేగ్నెట్. లేదా సెలబ్రిటీ. లేదా క్షణం తీరికలేకుండా గ్లోబు చుట్టూ తిరుగుతుండే పెద్దమనిషి. విమానం ఎక్కందే మీకు పొద్దు గడవదు. ఇక్కడ ఎక్కి అక్కడ దిగి, అక్కడ ఎక్కి మరెక్కడో దిగి ఆ రోజు చేయవలసిన పనులన్నిటికీ మీ దగ్గర పకడ్బందీ ప్రణాళిక ఉంటుంది. అందులో మునిగిపోయి ఉంటారు. పనులన్నీ చక్కబెట్టుకుంటూ ఉంటారు. మధ్యలో ఎక్కడా మీకు మీరు ప్రయాణిస్తున్న లేదా ప్రయాణించబోతున్న విమానం గురించి చెడు ఆలోచన కలగనే కలగదు. ‘ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే?’ అనే అనుమానమే మీలో తలెత్తదు. ఎందుకు? ఎందుకంటే విమానయానం మిగతా అన్ని ప్రయాణాల కంటే నూటికి నూరుపాళ్లు సురక్షితం కనుక. అలాగా! అయితే అడపాదడపా జరుగుతున్న విమాన ప్రమాదాల మాటేమిటి? అవా? అలాంటివి ప్రమాదాలే కానీ, విమాన ప్రమాదాలు కాదు! అంటే?! విమానాలు తయారయ్యేటప్పుడే అత్యంత ప్రమాదరహితంగా తయారవుతాయని! మానవ తప్పిదం వల్లనే కానీ, విమాన లోపం వల్ల ప్రమాదం జరగడం అన్నది దాదాపు అసాధ్యం అని!! తరచు ప్రయాణాలు చేసేవారు ఒక విషయం గమనించి ఉంటారు. విమానం లాండ్ అయ్యేముందు పెలైట్ గొంతు సవరించుకుని, ‘ద సేఫెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ ట్రిప్ ఈజ్ నౌ ఓవర్’ అని చెప్తాడు. ‘మీ ప్రయాణంలో అత్యంత సురక్షితమైన భాగం ఇప్పుడు పూర్తయింది’ అని చెప్పడం అన్నమాట. ఆ మాట నిజమే. విమానం దిగగానే మీరు మీ గమ్యం చేరుకోడానికి టాక్సీ ఎక్కారనుకుందాం. అది ఎంత సురక్షితమో మీరు చెప్పలేరు. డ్రైవర్ చేతుల్లో ఉన్నది స్టీరింగ్ ఒక్కటే కాదు, మీ ప్రాణాలు కూడా. అతడు ఎలా డ్రైవ్ చేస్తాడో మీకు తెలీదు. టాక్సీ కండిషన్ ఏమిటో మీకు తెలీదు. విండో లోంచి బయటికి చూడండి. అక్కడ సిగ్నల్స్ అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తెలీదు. మీరు ప్రయాణిస్తున్న రోడ్డు మీద ఎక్కడ ఏ గతుకు ఉందో తెలీదు. మీ టాక్సీకి ఎదురొచ్చే వాహనాలు సక్రమంగా వస్తాయో లేదో తెలీదు. వాటిని నడుపుతున్నవారు కంటి నిండా నిద్రపోయినారో లేదో తెలీదు. మద్యం సేవించకుండా నడుపుతున్నవారో లేదో తెలీదు. ఏ దశలోనైనా సురక్షితం అనేది ప్రమాదంగా మారిపోవచ్చు. అలాంటిది భూమికి ఆరు మైళ్ల ఎత్తులో, గంటకు 500 మైళ్ల వేగంతో వెళ్లే విమానంలో మన ప్రాణాలు విమానంలో కాదు, అరచేతిలో ఉన్నట్లు. అయినా సురక్షితంగా ఎక్కుతున్నాం, దిగుతున్నాం, మళ్లీ మళ్లీ ప్రయాణిస్తున్నాం అంటే విమానం ఎన్ని ముందు జాగ్రత్తలతో, ఎంత సురక్షితంగా తయారవుతోందో చూడండి. ఏరోప్లేన్ డిజైన్ విమానం ఎక్కి, దిగితే మన ప్రయాణం పూర్తవుతుంది. కానీ ఎయిర్‌లైన్స్ సంస్థల ఇంజినీర్ల పని ఆ తర్వాతే మొదలవుతుంది. పూర్తయిన ప్రయాణకాలంలో ఆ విమానంలోని యంత్రపరికరాలు ఏయే పరిమితులకు లోబడి పనిచేశాయన్న వివరాలను, ఇతర అవసరమైన సమాచారాన్ని వారు జాగ్రత్తగా నమోదు చేసుకుంటారు. ఇలా ఇప్పటి వరకు గత యాభై ఏళ్లలోనూ జరిగిన ప్రయాణాలకు సంబంధించిన కోట్ల గంటల డేటా ఆయా సంస్థల దగ్గర ఉంది! ఆ డేటా ఆధారంగా ఎప్పటికప్పుడు విమానాల డిజైనింగ్‌ను మరింత సురక్షితంగా మారుస్తుంటారు కనుక ప్రమాదాలు జరిగే అవకాశం దాదాపు శూన్యం. ప్రమాదం జరిగితే అనూహ్యమైన బయటి అవాంతరాల వల్ల జరగాల్సిందే కానీ లోపలి యంత్రాల వల్ల జరిగే అవకాశమే ఉండదు. కాక్‌పిట్ టెక్నాలజీ కాక్‌పిట్‌లో సంప్రదాయ యంత్ర (మెకానికల్) నియంత్రణ పద్ధతులు పోయి, వాటిస్థానంలో విద్యుత్కణ (ఎలక్ట్రానిక్) నియంత్రణ విధానాలు వచ్చాక ప్రమాదాలు అరుదులో అరుదు అయిపోయాయి. జెట్ లైనర్స్ చాలావరకు ఇలా ఆధునికీకరణ చెందినవే. 777, 787 బోయింగులు, అలాగే ఎ330, ఎ340, ఎ380 అన్నీ ఇప్పుడు ‘ఫ్లయ్ బై వైర్’తో (కంప్యూటర్ పరిజ్ఞానంతో) నడుస్తున్నవే కాబట్టి ప్రమాదాలను ఊహించడం, వాటి నుంచి విమానాలను తప్పించడం తేలికయింది. సమాచారాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్నీ సమన్వయం చేసుకోగలిగితే చాలు పెలైట్ సక్సెస్ అయినట్లే. శాటిలైట్ గ్లోబల్ పొజిషనింగ్, అడ్వాన్స్డ్ డిస్ప్లే, టెలీకమ్యూనికేషన్ వంటి అత్యాధునిక పరిజ్ఞానాలు వచ్చాక విమానం కదలికల్లో కచ్చితత్వాన్ని పసిగట్టడడం పూర్వపు రోజులకన్న సులభం అయింది. 1950, 1960లలో 2లక్షల ప్రయాణాలకొకసారి ఘోర ప్రమాదం నమోదయ్యేది. ప్రపంచ వైమానిక రంగంలో సురక్షిత ప్రమాణాలు నాటితో పోలిస్తే నేడు 10 రెట్లు మెరుగవడంతో 20 లక్షల ప్రయాణాలకొక వైఫల్యం లేదా అంతకంటే తక్కువగా మాత్రమే దుర్ఘటనలు జరగడం కనిపిస్తోంది. ఈ గొప్పతనం అంతా కాక్‌పిట్ (పెలైట్ ఉండే చోటు)టెక్నాలజీదే. పైలట్ చేతుల్లో పిట్ట ప్రాణం ఎంత తిరుగులేని టెక్నాలజీ అయినా పైలట్ అనుభవం, నైపుణ్యం, నిర్ణయ శక్తి అనే అంశాలపైనే సురక్షిత ప్రయాణం అనేది ఆధారపడి ఉంటుందని చెస్లీ సలెన్బర్గర్ అంటారు. ఫస్ట్ ఆఫీసర్ జెఫ్ స్కిల్స్‌తో కలిసి అత్యంతాధునిక ఆటోమేటెడ్ ఎయిర్‌బస్ ఎ 320ను (యు.ఎస్. ఎయిర్ వేస్ ఫ్లయిట్ నెం.1549)ను న్యూయార్క్‌లోని హడ్సర్ నదిపై లోతు తక్కువ ప్రదేశంలో అత్యవసరంగా దింపి అందులోని 155 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన పైలట్ అతను. 2009లో జరిగిన ఈ ఘటనను విమాన ప్రయాణ చరిత్రలోనే ఒక మిరకిల్ అని, దాన్ని జాగ్రత్తగా నడిపి, కిందికి దించిన చెస్లీ సలెన్బర్గర్ గ్రేట్ పైలట్ అనీ ప్రపంచమంతా ప్రశంసించింది. విమానాన్ని నడుపుతున్నప్పుడు అన్ని వైపులనుండి వ చ్చిపడుతుండే సమాచారాన్ని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడం, ప్రయాణ మార్గాలను అనుసరించడం, సంబంధిత వ్యక్తులతో అనుసంధానమై ఉండడం వంటివాటిలో పైలట్లకు శిక్షణ ఉంటుంది. వీటన్నిటితో పాటు, పైలట్ వ్యక్తిత్వాన్ని కూడా నియామక సమయంలో పరిగణనలోకి తీసుకుంటారు. వారిలోనూ వ్యక్తిగత సమస్యలకు ప్రభావితంకాని మనస్తత్వం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. కాక్‌పిట్ సైజు సురక్షితమైన విమాన ప్రయాణానికి నిపుణుడైన పైలట్ తో పాటు విశాలమైన కాక్‌పిట్ కూడా అవసరం. ఈ అంశాన్ని జెట్‌లైనర్లు కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాయి. విమాన నియంత్రణకు సంబంధించిన ప్రతి పరికరం, ప్రతి పరిజ్ఞానం పైలట్ కళ్లముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. చిన్న మార్పు సైతం పైలట్ కళ్లు గప్పి తప్పించుకోలేదు. ‘‘కాక్‌పిట్ విస్తృతి, ఆకారం, ఉపస్థితి (అప్పియరెన్స్), కాక్‌పిట్‌లోని ప్రతి స్విచ్, ప్రతి లైటు పైలట్ కనుసన్నలలో ఉంటాయి కనుక కాక్‌పిట్ లోపాల కారణంగా ప్రమాదం జరిగే అవకాశమే ఉండదు’’ అని జూలియన్ ఫాక్స్ కమింగ్ అంటారు. ఆయనకు బోయింగ్ 787లో కాక్‌పిట్ ఇంజినీరుగా పనిచేసిన అనుభవం ఉంది. ప్యాసింజర్ క్యాబిన్ కాక్‌పిట్ సరే, ప్రయాణీకులు కూర్చునే ఏరోప్లేన్ బాడీ మాటేమిటి? అది కూడా కాక్‌పిట్ అంత పకడ్బందీగానే ఉంటుంది. కిక్కిరిసినట్లుండే ఎకానమీ సీట్లుగానీ, విశాలంగా ఉండే ఎగ్జిక్యూటివ్ సీట్లు గానీ ఎలాంటి తారతమ్యమూ లేకుండా విమానంలోని సీట్లన్నీ అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతోనే ఉంటాయి. ఎక్కువ డబ్బుకు ఎక్కువ భద్రత, తక్కువ డబ్బుకు తక్కువ భద్రత ఉండదు. ఒక్కో సీటు పదహారింతల గురుత్వాకర్షణ శక్తిని తట్టుకునేలా తయారై ఉంటుంది. దీనివల్ల విమానం లేచేటప్పుడు, అకస్మాత్తుగా ఆగినప్పుడు కుదుపులకు లోనైనా ఆ ఒత్తిడి కూర్చున్న వారిపై ఏమాత్రం ప్రభావం చూపదని విస్కాన్సిన్లోని ఎం.జి.ఎ. ఇంజినీరింగ్ విభాగం టెస్ట్ ఇంజినీరు డేవిడ్ ఎస్సే అంటారు. సీట్ల నిర్మాణంపై ఇంజినీర్లు తీసుకునే శ్రద్ధ ఇంతటితో అయిపోలేదు. సీట్లకు వాడే వస్త్రం, లోపలి కుషన్... మంటల్ని విస్తరించనివ్వని స్వభావాన్ని కలిగివుంటాయి. అంతేకాదు మంటల్ని ఆర్పే గుణం కూడా వాటికి ఉంటుంది. మంటలు అంటుకున్నప్పుడు కొద్దిస్థాయిలో మాత్రమే అవి పొగను విడుదల చేస్తాయి. ఆ పొగలో కూడా హానికరమైన రసాయనాలు ఉండవు. సీటు వెనుక భాగం (వీపును ఆన్చే భాగం) సున్నితంగా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా శరీరానికి నొక్కుకుపోని విధంగా ఉంటుంది. ప్రయాణికుల క్యాబిన్ గోడలు అగ్నిమాపక కవచాల్లా ఉంటాయి. ఏ కారణం చేతనైనా మంటలు రేగి, పొగ ఆవరించినప్పుడు బయటికి వెళ్లే మార్గం స్పష్టంగా కనిపించేలా లైట్స్ వాటంతట అవే వెలుగుతాయి. ఇంత సురక్షితమైన ఏర్పాట్లు ఉన్న కారణంగానే గత పదేళ్లలో 301 విమాన ప్రమాదాలు సంభవించినా వాటిల్లో ప్రాణాంతకమైనవి పావు వంతు కూడా లేవు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భూమి మీద ట్రాఫిక్ సిగ్నల్ స్పష్టంగా కనిపిస్తూ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు కళ్లముందు చక్కగా సూచనలు ఇస్తూ ఉన్నప్పటికీ రోజూ వందల యాక్సిడెంట్లు జరుగుతున్నాయే, మరి పైన ఆకాశంలో ఏమీ లేని చోట పైలట్ తన ప్రయాణికులను భద్రంగా గమ్యస్థానాలకు చేర్చడం ఎలా సాధ్యమౌతోంది? ఇందులో పైలట్ ప్రావీణ్యం ఎంత ఉందో అంతకు రెండింతలుగా జి.పి.ఎస్. కేంద్రం పనితీరు కూడా ఉంటుంది. జి.పి.ఎస్.అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. విమాన గమనాలను గమనిస్తూ, అవి దారి తప్పకుండా సూచనలు ఇస్తూ, ఎప్పటికప్పుడు పైలట్‌ను అప్రమత్తం చేస్తూ ఉంటుంది జి.పి.ఎస్. పూర్వం ఈ విధానం అందుబాటులో లేనప్పుడు మ్యాపులను దగ్గరపెట్టుకుని, బ్లాక్‌బోర్డ్ మీద చాక్‌పీస్‌తో లేదంటే పేపర్ మీద పెన్సిల్‌తో అంచనాలు వేసుకుంటూ పైన పైలట్‌కు కిందినుంచి సూచనలు ఇస్తుండేవారు. అప్పటికీ ఇప్పటికీ ప్రయాణికులు పెరిగారు, విమానాల సంఖ్య పెరిగింది. గగన వీధుల్లో ట్రాఫిక్ కూడా పెరిగింది. గత ఒక్క ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా నింగి నుంచి నేలకు 2 కోట్ల 80 లక్షల విమానాలు దిగాయి. ఇవన్నీ కూడా నింగిలోకి సురక్షితంగా టేకాఫ్ అయి, ప్రయాణాన్ని పూర్తిచేసినవే. పైన కాక్పిట్కీ, కింద కంట్రోల్ స్టేషన్‌కీ మధ్య కచ్చితమైన అనుసంధానం ఉండడం వల్ల విమానాలు ఒకదానిని ఒకటి ఢీకొనడం అనేది దాదాపు అసాధ్యం. పోటీ, ఆదాయం ఆదాయం కోసం పోటీ పడుతుండే విమానయాన సంస్థలు, తమకు వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని భద్రత కోసం కేటాయించడంలో కూడా పోటీపడుతున్నాయి. కనుక ఈసారి మీరు విమానం ఎక్కినప్పుడు, కెప్టెన్ ఆహ్వానం పలకగానే నిశ్చింతగా వెళ్లి కూర్చోండి. హాయిగా వెనక్కి వాలి, మీరు అత్యంత సురక్షితమైన వాహనంలో ఉన్నారన్న ధీమాతో ప్రయాణాన్ని ఎంజాయ్ చెయ్యండి. అణువణువున భద్రత.. A380 - కొన్ని విశేషాలు ఏ దేశపు ఎయిర్‌లైన్స్‌కైనా ప్రయాణీకుల భద్రతే తొలి ప్రాధాన్యం. విమానం సామర్థ్యానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఉదాహరణకు A380 ఎయిర్‌బస్. దీని తయారీలో అణువణువు ప్రయాణికులకు సదుపాయంగా ఉండే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. అలాగే బోయింగ్ విమానాల్లోనూ సురక్షితమైన, కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయి. - ప్రపంచంలో కె ల్ల అతి పెద్ద విమానం అ380 ఎయిర్ బస్. 2007లో సేవలను ప్రారంభించిన ఈ ఎయిర్‌బస్ ప్రయాణికుల క్యాబిన్ విశాలంగా, విలాసవంతంగా ఉంటుంది. - A380 ఎత్తు 24.1 మీటర్లు. వెడల్పు 80 మీటర్లు. పొడవు 72.7 మీటర్లు. అంటే రెండు నీలి తిమింగలాలను ఒకదాని వెనుక ఒకటి ఉంచితే ఎంత పొడవుంటాయో అంత పొడవు. - ఈ ఎయిర్ బస్ (అ380) రెక్కలు... బోయింగ్ 747 ఎయిర్‌క్రాఫ్ట్ రెక్కల కన్నా 54 శాతం పెద్దవిగా ఉంటాయి. - ఇందులో ఒకేసారి కనీసం 525 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. 3000 సూట్‌కేసులు పెట్టుకోవచ్చు. - A380 ఎయిర్ బస్ రెక్కలు ఇంగ్లండ్‌లో తయారవుతాయి. తోక, విమాన ప్రధాన భాగం స్పెయిన్ , జర్మనీలలో తయారవుతాయి. ఈ భాగాలన్నీ పెద్ద పెద్ద ఓడలలో బిగింపుల (అసెంబ్లింగ్) కోసం ఫ్రాన్సుకు చేరుకుంటాయి. - ఎయిర్ బస్ ఇంధన సామర్థ్యం 81900 గ్యాలన్లు. బరువు 560 టన్నులు. సాధారణ పెద్ద విమానాలు వినియోగించుకునే ఇంధనంలో 17 శాతం తక్కువగా ఎయిస్ బస్ వినియోగించుకుంటుంది. ఒక్కో ప్రయాణికునికి వంద కి.మీ.లకు 4 లీటర్ల ఇంధనం ఖర్చు అవుతుంది. - ఈ భారీ విమానం 43,000 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. గంటకు 640 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. - ఎయిర్ బస్‌లోని మూడు ప్రధాన భాగాలను 8000 బోల్టులు గట్టిగా కలిపి ఉంచుతాయి. మొత్తం మీద ఈ విమానంలో 40 లక్షల విడి భాగాలు ఉంటాయి. వీటిని 30 దేశాలలోని 1500 కంపెనీలు సరఫరా చేస్తాయి. - ఎయిర్బస్లోని పరికరాలన్నీ తేలికైనవీ, తక్కువ శబ్దం చేసేవీ, పర్యావరణహితమైనవీ. ఎయిర్ బస్ నుంచి వెలువడే కాలుష్యాలు, ధ్వని తరంగాలు, పొగలు కూడా మిగతా విమానాలతో పోల్చి చూస్తే చాలా తక్కువ. - ఒక్కో ఎయిర్‌బస్ ప్రయాణ సామర్థ్యం 1,40,000 గంటలు. ఎయిర్పోర్ట్ కంట్రోల్ విమానాశ్రయంలో ఉండే భద్రతా ఏర్పాట్లూ తక్కువేం కాదు. ముఖ్యంగా రన్‌వే మీదకు విమానం దిగుతున్నప్పుడు ‘మూవ్మెంట్ డిటెక్షన్ మానిటర్లు’ ప్రతి ఒక్క వాహనాన్ని, అంటే... రన్వేలు, ట్యాకీ వేలు, టెర్మినల్ గేట్ల దగ్గర ఉన్న వాహనాలను గమనించి హెచ్చరిక సంకేతాలను ఇస్తుంటాయి. విమానం టేక్ ఆఫ్ అయ్యే సమయంలోనూ మానిటర్లు మిగతా వాహనాల రాకపోకల్ని నియంత్రిస్తుంటాయి. దీని వల్ల రన్‌వేపై ప్రమాదాలు జరిగే మాటే ఉండదు. -
విమానం కోసం వెతుకులాట ఏడాదైనా పట్టొచ్చు
దక్షిణ హిందూ మహాసముద్రం లో ఆస్ట్రేలియాకి వెయ్యి కి.మీ దూరంలో సముద్రం అడుగున రెండు మైళ్ల లోతున....కనిపించని మలేషియన్ విమానం కోసం, కనుమరుగైన 239 మంది ప్రయాణికుల కోసం ప్రపంచం ఇప్పుడు వెతుకుతోంది. విమానం ఇక్కడే కూలిందా అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో సముద్రం పైన తేలాడుతున్న ఎన్నో వస్తువులను పడవలు సేకరించాయి. కానీ అవేవీ విమాన శకలాలు కావు. సముద్ర గర్భాన్ని వడకట్టి, జల్లెడపట్టే శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ఈ ప్రాంతం వైశాల్యం దాదాపు 319 వేల చకిమీ. అంటే పోలండ్ దేశంతో సమానం. అదృష్ట వశాత్తూ ఈ ప్రాంతంలో సముద్రం అట్టడుగుభాగం చదునుగా, పెద్దగా ఎగుడు దిగుళ్లు లేకుండా ఉంటుంది. మధ్యలో ఒక ప్రాంతం మాత్రం కాస్త పగులు ఉన్నట్టుగా ఉంటుంది. దీన్ని డయామాంటినా ట్రెంచ్ అంటారు. అయితే సముద్రం అట్టడుగున చనిపోయిన ప్లాంక్టన్ జాతి ప్రాణులు ఒక కిలో మీటర్ వరకూ ఒక తివాచీలాగా పరుచుకుని ఉంటాయి. ఈ ట్రెంచ్, ప్లాంక్టన్ల వల్ల శకలాలను గుర్తించే పరికరాలకు అట్టడుగు నుంచి సిగ్నల్స్ అందడంలో ఇబ్బందిగా ఉంది. ఇంత సువిశాల ప్రాంతంలో కూలిన విమానపు బ్లాక్ బాక్స్ కోసం వెతకడం అంటే గడ్డివాములో సూది వెతకడం లాంటిదేనంటున్నారు నిపుణులు. అందుకే శాస్త్రవేత్తలు ఈ విమానం కోసం అన్వేషణ ఏడాదిపాటు కొనసాగినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మొత్తం మీద ఎం హెచ్ 370 విమానం ఒక అద్భుత మిస్టరీగా మిగిలిపోయే అవకాశాలే ఎక్కువని వారంటున్నారు. -
మలేషియా విమానం: కొత్త ఆధారాలు లభ్యం
దక్షిణ హిందూ మహాసముద్రంలో కుప్పకూలిన మలేషియా విమానం ఎం హెచ్ 370 విషయంలో ఆస్ట్రేలియా అధికారులకు కొత్త ఆధారాలు లభించాయి. వీటి ఆధారంగా ఇప్పుడు అన్వేషణ కొనసాగిస్తున్న ప్రాంతం కన్నా 680 మైళ్ల దూరంలో విమాన శకలాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. దీంతో సెర్చ్ టీమ్ లు అక్కడికి తరలి వెళ్తున్నాయి. శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్ కి 1250 మైళ్ల దూరంలో 123.200 చ. మైళ్ల ప్రాంతంలో అన్వేషణ జరుగుతుంది. గురువారం భారీ వర్షాలు, మేఘాల వల్ల విమానాలు బయలుదేరలేకపోయాయి. ముందు ఏమి ఉందో తెలియనంత దట్టంగా వానపడటంతో పడవలకు కూడా ఇబ్బంది కలిగింది. అదృష్ట వశాత్తూ శుక్రవారం నుంచి వాతావరణం మెరుగుపడటంతో అన్వేషణ వేగం పుంజుకుంది. అయితే తాజాగా లభించిన వివరాల ప్రకారం మలేషియా విమానం ఊహించిన దానికన్నా వేగంగా ప్రయాణించింది. దీని వల్ల ఇంధనం అనుకున్న దాని కన్నా ముందే అయిపోయి ఉండవచ్చు.ఫలితంగా విమానం కుప్పకూలిందని ఇప్పటి వరకూ భావిస్తున్న ప్రదేశం కన్నా చాలా ముందే నీటిలో పడిపోయి ఉండవచ్చు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి బీజింగ్ కి 239 మంది ప్రయాణికులను తీసుకెళ్తున్న ఎం హెచ్ 370 మార్చి 8 న కుప్పకూలిపోయింది. ఈ విమానం హిందూ మహాసముద్ర జలాల్లో కుప్పకూలిందని భావిస్తున్నారు. గత 20 రోజులుగా దీని శకలాల కోసం అన్వేషణ సాగుతోంది. -
విషాదానికి వీసా ఫీజులుండవు!
ఒక్క విషాదం.... దేశాలను కలిపింది. కన్నీరు, కష్టాలు పంచుకునేలా చేసింది. ఒకరి భుజంపై మరొకరు చేయి వేసి ఊరడించేలా చేసింది. అవును .... మలేషియా ఎయిర్ లైన్స్ విమాన ప్రమాదం విషాదంలో అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా, పాకిస్తాన్ నుంచి భారత్ దాకా, కౌలాలంపూర్ నుంచి బీజింగ్ దాకా అందరినీ కలిసికట్టుగా విమాన శకలాల కోసం అన్వేషించేలా చేసింది. (ఆ విమానం సముద్రంలో కూలింది) ఆస్ట్రేలియాకు దగ్గర్లో సముద్రసమాధిలో ఎక్కడో ఎవరికీ తెలియకుండా నిద్రిస్తున్న మలేషియన్ విమానంలో అంతిమ యాత్ర చేసిన తమ వారి కోసం వచ్చే బంధువులందరికీ సానుభూతితో స్వాగతం పలుకుతున్నామని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబట్ ప్రకటించారు. (హిందూ మహా సముద్రంలో విమాన శకలాలు) ఈ విషాద సమయంలో మిమ్మల్ని గుండెలకు హత్తుకునేందుకు ఆస్ట్రేలియా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. వారి నుంచి ఎలాంటి వీసా ఫీజులు వసూలు చేయబోమని కూడా ఆయన ప్రకటించారు. ప్రధానికి విపక్ష నేత బిల్ షార్టెన్ కూడా పూర్తి మద్దతు పలికారు. (వీడిన మలేషియా విమానం మిస్టరీ) -
ఆరో రోజూ జాడలేని మలేసియా విమానం
కౌలాలంపూర్/న్యూఢిల్లీ: మలేసియా విమానం అదృశ్యంపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. గురువారం ఆరో రోజు కూడా దాని ఆచూకీ దొరకలేదు. భారత్‌తోపాటు పలు దేశాలకు చెందిన 43 నౌకలు, 40 విమానాలు గాలించినా ఫలితం లేకపోయింది. గాలింపులో భారత్‌కు చెందిన నాలుగు యుద్ధనౌకలు, ఆరు విమానాలు పాల్గొంటున్నాయి. మరోపక్క.. విమానం కూలిపోయినట్లు అనుమానిస్తున్న వియత్నాం, మలేసియా మధ్య గల సముద్ర జలాల్లో మూడుచోట్ల తేలా డే వస్తువులను చైనా ఉపగ్రహాలు గుర్తించాయి. అయితే అక్కడికెళ్లిన తమ విమానాలకు, నౌకలకు శకలాల్లాంటివేవీ కనిపించలేదని మలేసియా, వియత్నాం ప్రభుత్వాలు తెలిపాయి. విమానం కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాక కూడా నాలుగు గంటలు ప్రయాణించినట్లు రాడార్ సంకేతాల ద్వారా తెలుస్తోందని అమెరికా దర్యాప్తు అధికారులు చెప్పారు. అయితే మలేసియా దీన్ని తోసిపుచ్చింది. -
విమానం కోసం 6 లక్షల మంది గాలింపు
శనివారం అదృశ్యమైన మలేషియా విమానం ఆచూకీ కోసం శాటిలైట్ పంపిన చిత్రాలను మంగళవారం ఒక్కరోజు 6 లక్షల మంది స్కాన్ చేశారని కోలరాడో చెందిన డిజిటల్గ్లోబల్ వెల్లడించింది. గల్లంతైన విమాన ఆచూకీ కోసం శాటిలైన్ చిత్రాలను 6 లక్షల మంది స్కాన్ ద్వారా జల్లెడ పట్టారని ఆ కంపెనీ సీనియర్ డైరక్టర్ షె హర్ నాయ్ తెలిపారు. అయిన వీసమెత్తు ఆచూకీ కూడా లభించలేదని అన్నారు. శాటిలైట్ పంపిన చిత్రాలను ఎప్పటికప్పుడు http://www.tomnod.comలో పొందుపరుస్తున్నామని వివరించారు. అయితే వెబ్‌సైట్‌లోని ఆ ఫోటోలను నిన్న సాయంత్రానికి 10 మిలియన్ల మంది వీక్షించారని వెల్లడించారు. శనివారం కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు వెళ్తూ మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఆకస్మాత్తుగా అదృశ్యమైంది. 227 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది ఆ విమానంలో ఉన్నారు. నాటి నుంచి చైనా, మలేషియాతోపాటు పలు దేశాలు విమానాలు, ఓడలు రంగంలోకి దిగి ఆ విమాన ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయిన విమానానికి సంబంధించిన కనీసం విసమెత్తు ఆచూకీ కూడా లభ్యం కాలేదు. దాంతో కాలాలంపూర్, బీజింగ్ మార్గంలో శాటిలైట్ ద్వారా చిత్రాలను తీయాలని ఆయా దేశాల ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ శాటిలైట్ చిత్రాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పెడతున్నారు. సముద్రంలో ఎక్కడైన విమానశకలాలు, ప్రయాణికుల వస్తువులు, సముద్రంపై నూనె తెట్టు లాంటి పదార్థాలు గుర్తించాలని ఉన్నతాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తు ఆ చిత్రాలను వెబ్సైట్లో ఉంచారు. అయినా విమానానికి సంబంధించిన ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. -
ఆకాశంలో విషాదం!
సంపాదకీయం: ఏ ప్రమాదమైనా విషాదాన్ని మిగులుస్తుంది. ఆ ప్రమాదం చుట్టూ అంతుచిక్కని రహస్యం అల్లుకుంటే అది మరింతగా బాధిస్తుంది. ఏం జరిగివుంటుందో తెలియనంతకాలమూ అది వెన్నాడుతూనే ఉంటుంది. నాలుగురోజులనాడు 239మందితో కౌలాలంపూర్‌నుంచి చైనా వెళ్తూ హఠాత్తుగా మాయమైన మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్-777 విమానం ఇప్పుడలాంటి పెను విషాదాన్నే మిగిల్చింది. అది హైజాకర్ల బారినపడిందా...హఠాత్తుగా బాంబు పేలిందా... విమానంలోని అంతర్గత సాంకేతిక వ్యవస్థలో ఏర్పడిన లోపమేమైనా దాని ఉసురుతీసిందా...లేక ఆ ప్రాంతంలోని దేశమేదైనా శత్రు విమా నంగా భావించి దాన్ని కూల్చేసిందా....అన్నీ ప్రశ్నలే. సమాధానానికి అందని ప్రశ్నలవి. ఆధునాతన సాంకేతిక విజ్ఞానం సైతం ఛేదించలేక పోతున్న ప్రశ్నలవి. కనీసం పది దేశాలు సంయుక్తంగా, విడి విడిగా కళ్లల్లో వత్తులు వేసుకుని రాత్రింబగళ్లు గాలిస్తున్నా అంతుపట్టని ప్రశ్నలవి. సకల సౌకర్యాలూ, సాంకేతికతలూ ఉన్న మొబైల్ఫోన్లు అరచేతుల్లోకొచ్చాక... ఏమూలన ఏం జరిగినా క్షణంలో చేరుకునే టీవీ కెమెరాలు వచ్చాక ఏ ప్రమాదమూ ఇంతగా వేధించలేదు. ఏ ఘటనైనా... అదేదో మన కళ్లముందే జరిగిందని భ్రమపడేంతగా కొన్ని నిమిషాల్లోనే చానెళ్లలో ప్రత్యక్షమవుతున్నది. ఒకసారి కాదు...గంటల తరబడి పదే పదే కనిపిస్తున్నది. ఇలాంటి స్థితిలో విమానం ఎలా కూలిందో, ఏమైందో తెలుసుకోవడం మాట అటుంచి కనీసం దానికి సంబంధించిన చిన్న శకలం కూడా లభ్యంకాకపోవడం ఆ విషాద ఘటనలో చిక్కుకున్నవారి కుటుంబాలనే కాదు...హృదయమున్న ప్రతివారినీ కదిలిస్తుంది. గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. నాలుగేళ్లక్రితం అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిన ఎయిర్ ఫ్రాన్స్ విమానం 216మందిని పొట్టనబెట్టుకుంది. దాని శకలాలు దొరకడానికే కొన్ని నెలలు పట్టింది. ప్రమాదానికి గురైన బోయింగ్-777-200ఈఆర్ను విమానాలన్నిటిలోనూ అత్యంత సురక్షితమైనదిగా భావిస్తారు. ఆధునాతన నావిగేషన్ వ్యవస్థతో పెలైట్‌కు ఖచ్చితమైన సమాచారాన్నిచ్చి తోడ్పడగలగటం ఈ విమానం విశిష్టత. భద్రత , సేవలరీత్యా మలేసియా ఎయిర్‌లైన్స్ సంస్థ ఆసియా-పసిఫిక్ దేశాల్లోనే అగ్రస్థానంలో ఉంది. అలాంటపుడు బయలుదేరిన అరగంటలోనే దానికి రాడార్ వ్యవస్థతో సంబంధాలు ఎలా తెగిపోయాయి? అత్యవసర సమయాల్లో సందేశాలు పంపాల్సిన పెలైట్లనుంచి స్పందన ఎందుకు లేదు? వారికి అంత వ్యవధి లేదా? లేనట్టయితే అందుకు కారణమేమై ఉంటుంది? 35,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా హఠాత్తుగా ఇది వెనుదిరిగిందని, కొంత దూరం వచ్చాక మలక్కా జలసంధిలో పడిపోయిందని ప్రాథమిక సమాచారాన్నిబట్టి తెలుస్తున్నది. ప్రమాదం జరిగే సమయానికి అందులో మనదేశంతోసహా 15 దేశాలకు చెందిన ప్రయాణికులున్నారని మలేసియా ప్రకటించింది. అయితే, తమ పౌరులెవరూ ప్రయాణికుల్లో లేరని ఇటలీ, ఆస్ట్రియా వెల్లడించడంతో ఆ దేశాల పౌరులుగా చెప్పుకున్న ఇద్దరూ దొంగిలించిన పాస్‌పోర్టులతో విమానం ఎక్కారని నిర్ధారించారు. వీరిద్దరూ థాయ్‌లాండ్‌లో కొన్న టిక్కెట్లతో విమానం ఎక్కారు. దర్యాప్తుచేసిన మేరకు వారిద్దరూ ఉగ్రవాదులు కాదని, ఏదైనా దేశంలో ఆశ్రయం పొందడానికి వెళ్తుండవచ్చునని థాయ్‌లాండ్ పోలీసులు చెబుతున్నారు. మలేసియా విమానాశ్రయంనుంచి గతంలో రెండు, మూడు సందర్భాల్లో ఇలా దొంగ పాస్‌పోర్టులతో ప్రయాణించడానికి ప్రయత్నించినవారిని పట్టుకున్నట్టు ఇప్పుడు చెబుతున్నారు. దొంగిలించిన పాస్‌పోర్టులతో ప్రయాణించడం పెరిగిందని ఇంటర్‌పోల్ సంస్థ పదే పదే చెబుతోంది. ఇది వైమానికయానాన్ని ప్రమాదకరంగా మారుస్తున్నదని అంటున్నది. ఆచూకీ లేకుండాపోయిన పాస్‌పోర్టుల వివరాలకు సంబంధించిన డేటాబేస్ ఆ సంస్థ దగ్గర ఉంటుంది. దాని సాయంతో ప్రయాణికులను తనిఖీచేసే వ్యవస్థ ఉంటే ఇలాంటి స్థితి ఏర్పడదు. గత ఏడాది వందకోట్లకుపైగా విమాన ప్రయాణాలు జరిగితే ఇలాంటి తనిఖీలు దాదాపుగా లేవని ఇంటర్‌పోల్ పేర్కొంది. ఇంటర్‌పోల్ డేటాబేస్‌ను ఏవో కొన్ని దేశాలు తప్ప మిగిలినవి పట్టించుకోవడంలేదు. ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల పాస్‌పోర్టులు అపహరణకు గురయ్యాయని ఇంటర్‌పోల్ చెబుతోంది. అమెరికాలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత 2002లో ఇంటర్‌పోల్ ఇలాంటి సమాచారాన్ని సేకరిస్తోంది. దీని సాయంతో పాకిస్థాన్‌లో మూడేళ్లక్రితం విమానం ఎక్కబోతున్న ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అయినా చాలా దేశాల దాని ప్రాముఖ్యాన్ని గుర్తించడంలేదని ఇంటర్‌పోల్ ఆరోపణ. ఇప్పుడు జరిగిన ప్రమాదానికి ఉగ్రవాదం కారణమా, కాదా అన్న సంగతలా ఉంచి అసలు అలాంటి లొసుగులు ఎందుకుంటున్నాయని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పది దేశాలకు చెందిన బృందాలు 34 విమానాలు, 40 నౌకల సాయంతో దక్షిణ చైనా సముద్రాన్ని జల్లెడపడుతున్నాయి. ఇటు అండమాన్వైపు కూడా వెదుకుతున్నాయి. ఎక్కడో ఒకచోట చమురు తెట్టు కనిపించిందనో, మరోచోట లైఫ్ బోటు కనబడిందనో వార్తలొచ్చినా అవేమీ విమాన ప్రమాదంతో సంబంధం ఉన్నవి కాదని తేలింది. మరోపక్క చైనాకు చెందిన పది ఉపగ్రహాలు పంపిన ఛాయాచిత్రాలవల్ల కొంత ఆచూకీ దొరికిందని అంటున్నారు. అన్వేషణలన్నీ ఫలించి విమాన శకలాలు దొరకడంతోపాటు, ప్రమాదానికి దారితీసిన కారణాలు కూడా సాధ్యమై నంత త్వరగా వెల్లడైతే మృతుల కుటుంబాలకు కాస్తయినా సాంత్వన లభిస్తుంది. సురక్షిత విమానయానానికి మరెన్ని జాగ్రత్తలు తీసుకో వాల్సిన అవసరమున్నదో కూడా తెలుస్తుంది. అందువల్లే అదృశ్యమైన విమానం ఆచూకీ త్వరగా లభించాలని అందరూ కోరుకుంటారు. -
ఇంకా ఆచూకీ లేని మలేసియా విమానం
-
సముద్రంలో కూలిన విమానం!
239 మంది మృతి! ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయులు కూడా కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళుతున్న విమానం అదృశ్యం బీజింగ్/కౌలాలంపూర్: మరో ఘోర విమాన ప్రమాదం... 239 మంది ప్రాణాలు సముద్రగర్భంలో కలసిపోయాయి. మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ వెళుతున్న బోయింగ్ విమానం మార్గమధ్యంలో అదృశ్యమైంది. ఇందులో ఐదుగురు భారతీయులు, ఇద్దరు శిశువులు సహా 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఇది సముద్రంలో కూలిపోయి ఉంటుందని, 239 మందీ మరణించి ఉంటారని భావిస్తున్నారు. వియత్నాం తీర ప్రాంతంలోని సముద్రంలో భారీగా చమురు తెట్టు కనిపించడాన్ని బట్టి అక్కడే విమానం కూలిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. - విమానం శుక్రవారం కౌలాలంపూర్ నుంచి బయల్దేరిన తర్వాత రాత్రి 11:10 గంటల సమయంలో రాడార్ నుంచి అదృశ్యమైంది. అది ఉదయం 6.30 గంటలకు బీజింగ్ చేరాల్సి ఉంది. - మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ బోయింగ్ ఎంహెచ్370 విమానంలో 14 దేశాలకు చెందినవారున్నారు. వీరిలో అత్యధికంగా 154 మంది చైనా దేశీయులు కాగా 38 మంది మలేసియా వాసులు, ఏడుగురు ఇండోనేసియా వారు, ఆరుగురు ఆస్ట్రేలియన్లు, నలుగురు అమెరికన్లు, ఇద్దరు ఫ్రాన్స్ దేశస్థులు, ఇద్దరు న్యూజిలాండ్ వాసులు, ఇద్దరు ఉక్రేనియన్లు, ఇద్దరు కెనడా వాసులు, రష్యా, డచ్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. - దక్షిణ చైనా సముద్రంలోని కోటా బారూ ప్రాంతానికి 120 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు చివరి సారిగా ఆ విమానం నుంచి కేంద్రానికి సిగ్నళ్లు అందాయి. - వియత్నాం దక్షిణ తీర ప్రాంతం దగ్గరలోని సముద్రంలో రెండు చోట్ల భారీ స్థాయిలో చమురు తెట్టు కనిపించినట్లు వియత్నాం ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇవి కూలిపోయిన విమానానికి సంబంధించినవిగా కనిపిస్తున్నాయని, అయితే విమాన శకలాలేవీ కనిపించలేదని తెలిపింది. - చివరిసారి విమానం సిగ్నళ్లు అందిన ప్రాంతం నుంచి చుట్టుపక్కలంతా గాలించాల్సిందిగా ఆదేశించినట్లు మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ చెప్పారు. 15 సాయుధ దళాలు, వైమానిక, నౌకా దళాలతోపాటు మలేసియా తీర రక్షణ ఏజెన్సీలు నౌకలు తీవ్రంగా గాలిస్తున్నాయని వెల్లడించారు. వియత్నాం, చైనా, సింగపూర్, అమెరికాలు తమకు ఈ గాలింపులో సహకరిస్తున్నాయన్నారు. - మృతుల్లో ఇటలీకి చెందిన ఒకరు, ఆస్ట్రియాకు చెందిన మరొకరు ఉన్నట్లు మొదట్లో వార్తలు రాగా.. ఆ ప్రయాణికులిద్దరూ క్షేమంగా ఉన్నారని తర్వాత తేలింది. వేర్వేరు సంఘటనల్లో తమ పాస్‌పోర్టులు పోగొట్టుకున్నామని, అందువల్లే తాము ఆ విమానంలో ప్రయాణించలేదని వారు మీడియాకు తెలిపారు. ఆ దేశాల ప్రభుత్వాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. అయితే తమ పేర్ల మీద వేరెవరో విమానం ఎక్కి ఉంటారని, వారు ఉగ్రవాదులు కూడా అయి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. ముగ్గురు ఒకే కుటుంబ సభ్యులు బీజింగ్/కౌలాలంపూర్: కూలిపోయినట్లు భావిస్తున్న మలేసియా విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు భారతీయుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రయాణికులు ఐదుగురిని చేత్న కోలేకర్(55), స్వనంద్ కోలేకర్(23), వినోద్ కోలేకర్(59), చంద్రికా శర్మ(51), క్రాంతి శీర్షాత్(44)గా గుర్తించినట్లు బీజింగ్‌లోని భారతీయ దౌత్య కార్యాలయం తెలిపింది. వీరిలో చంద్రిక.. చెన్నైలోని ఒక ఎన్జీవో సభ్యురాలు. మంగోలియాలో జరిగే ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ) సదస్సులో పాల్గొనడానికి వెళుతూ ఆ విమానం ఎక్కారు. విమానంలో భారతీయ సంతతికి చెందిన కెనడావాసి ముక్తేష్ ముఖర్జీ(42) కూడా ఉన్నారు. -
సముద్రంలో కూలిపోయిన విమానం
-
'మావద్ద ఎలాంటి సమాచారం లేదు'
కౌలాలాంపూర్ : వియత్నాం వద్ద సముద్రంలో విమానం కూలిపోయిందనడానికి ఎలాంటి సమాచారం లేదని మలేషియన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. అటువంటి సంకేతాలు తమకు అందలేదని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఎదురు చూస్తున్నామని, వియత్నం ప్రభుత్వం కూడా సమాచారాన్ని అందించాల్సి ఉందని మలేషియన్ ప్రభుత్వం పేర్కొంది. కౌలాలంపూర్‌లోని బీజింగ్‌కు బయలుదేరిన విమానం అదృశ్యమైన విషయం తెలిసిందే. కాగా కూలిపోయిన మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానంలో అయిదుగురు భారతీయులు ఉన్నట్లు తాజాగా తెలియవచ్చింది. మొత్తం 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో కలిసి కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరిన ఈ విమానానాకి తెల్లవారుజామున ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి. కౌలాలంపూర్‌లోని గత అర్థరాత్రి 12.41 నిమిషాలకు బయలుదేరిన విమానం బీజింగ్ ఈ రోజు ఉదయం 6.30 నిముషాలకు చేరుకోవాల్సి ఉంది. తెల్లవారుజామున 2.40 ప్రాంతంలో ఆ విమానం అదృశ్యమైంది. ఆ విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు మలేషియా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. అదృశ్యమైన విమానంలో 150 మంది ప్రయాణికులు చైనీయులు ఉన్నారని చైనా పౌర విమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది. -
మలేషియా విమానంలో ఐదుగురు భారతీయులు!
వియత్నాం వద్ద సముద్రంలో కూలిపోయిన మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానంలో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు తాజాగా తెలియవచ్చింది. మొత్తం 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో కలిసి కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరిన ఈ విమానానాకి తెల్లవారుజామున ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి. కౌలాలంపూర్‌లోని గత అర్థరాత్రి 12.41 నిమిషాలకు బయలుదేరిన విమానం బీజింగ్ ఈ రోజు ఉదయం 6.30 నిముషాలకు చేరుకోవాల్సి ఉంది. తెల్లవారుజామున 2.40 ప్రాంతంలో ఆ విమానం అదృశ్యమైంది. ఆ విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు మలేషియా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. అదృశ్యమైన విమానంలో 150 మంది ప్రయాణికులు చైనీయులు ఉన్నారని చైనా పౌర విమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది. గల్లంతైన విమానంలో భారతీయులు ఎవరూ లేరని మన విదేశాంగ శాఖ తొలుత ప్రకటించింది. అయితే, ఆ తర్వాత మాత్రం ఇందులో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు తెలిసింది. వారి క్షేమసమాచారం తెలియక, అసలు ఎవరెవరు ఉన్నారో కూడా అర్థం కాక దేశంలో ఆందోళన వ్యక్తమవుతోంది. విమానంలో మొత్తం ఐదుగురు భారతీయులు, 152 మంది చైనీయులు, 38 మంది మలేసియన్లు, ఏడుగురు ఇండోనేసియన్లు ఆరుగురు ఆస్ట్రేలియన్లు, ఓ శిశువు సహా నలుగురు అమెరికన్లు, ముగ్గురు ఫ్రెంచివారు, న్యూజిలాండ్, ఉక్రెయిన్, కెనడాల నుంచి ఇద్దరేసి, రష్యా, ఇటలీ, తైవాన్, నెదర్లాండ్స్, ఆస్ట్రియాల నుంచి ఒక్కొక్కరు విమానంలో ప్రయాణించారు. -
మలేషియా ఎయిర్‌లైన్ విమానం అదృశ్యం