యాదృచ్ఛికమే కావొచ్చుగానీ... నాలుగు నెలల వ్యవధిలో మలేసియాకు చెందిన రెండు విమానాలు ప్రపంచానికి పెను విషాదాన్ని మిగిల్చిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. గత మార్చిలో ఒక విమానం హిందూ మహాసముద్రంమీదుగా వెళ్తూ అదృశ్యమై ఇప్పటికీ ఆచూకీ లేదు. ఇప్పుడు ఉక్రెయిన్ గగనతలం మీదుగా వెళ్తుండగా మరో విమానం క్షిపణి దాడిలో కుప్పకూలి 298మంది దుర్మరణం పాల య్యారు. ఉక్రెయిన్ ఆరోపిస్తున్నట్టు, అమెరికా అధ్యక్షుడు ఒబామా సమర్ధిస్తున్నట్టు ఇది రష్యా అనుకూల మిలిటెంట్ల పనేనా... లేక రష్యా నిందిస్తున్నట్టు ఉక్రెయిన్ దళాలే విమానాన్ని కూల్చి దాన్ని తిరుగు బాటుదారులపైకి నెట్టేద్దామని ఎత్తువేశాయా అనేది లోతైన దర్యాప్తు తర్వాతే తెలుస్తుంది. ఇప్పటికైతే విమానం కూలిన వెంటనే మిలిటెం ట్లకూ, రష్యా ఇంటెలిజెన్స్ అధికారులకూ మధ్య జరిగాయంటున్న సంభాషణల ఆడియో రికార్డులకు సంబంధించిన రాతప్రతుల్ని ఉక్రెయిన్ బయటపెట్టింది.
సరిగ్గా ఘటన జరిగిన రోజున ఉక్రెయిన్ క్షి పణి బక్-ఎం1కు చెందిన రాడార్ వ్యవస్థ పనిచేసినట్టు తాము గుర్తించామని రష్యా ప్రకటించింది. అంతేకాదు... ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో తమ అధ్యక్షుడు పుతిన్ ప్రయాణిస్తున్న విమా నం ఉన్నదని, క్షిపణిని ప్రయోగించినవారి అసలు లక్ష్యం అదేనని చెప్పింది. ఇందులోని నిజానిజాలు ఇంకా తెలియవలసే ఉన్నది. పరస్పరం సంప్రదింపులు జరుపుకొని పరిష్కారాన్ని అన్వేషించాల్సిన ఒక సమస్యను ప్రైవేటు గ్రూపుల చేతుల్లో పెట్టి, భావోద్వేగాలు రెచ్చ గొట్టి తమాషా చూద్దామనుకోవడంవల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. దేశాల మధ్య ఏదైనా సమస్య తలెత్తి ఘర్షణ వాతావరణం నెలకొన డం అసాధారణమేమీ కాదు. కానీ, అలాంటి ఘర్షణలను నివారించ డానికి అవసరమైన పరిపక్వతను ప్రదర్శించడంలో దేశాల అధినేతలు విఫలమవుతున్న తీరు అంతులేని హింసను ప్రేరేపిస్తున్నది. ఎంతటి హింస అయినా తమ భూభాగంపై కాకపోతే, తమ చేతులకు నెత్తురం టకపోతే, తమ ప్రమేయంపై సాక్ష్యాధా రాలు దొరక్కపోతే, అది ‘శత్రు దేశా’న్ని చావుదెబ్బ తీసేటట్టయితే... దానికి మద్ద తుగా నిలవడానికి, ఆ బాపతు ముఠాలకు మారణాయుధాలు సమ కూర్చడానికి చాలా దేశాలు సందేహించడంలేదు. 70 దశకంనాటి అఫ్ఘాన్‌నుంచి మొదలుపెడితే ఈనాటి ఇరాక్, సిరియా వరకూ ఇందు కు ఎన్నో ఉదాహరణలు. ఈ దేశాలన్నీ ఇప్పటికీ రావణకాష్టంలా నిత్యం మండుతూనే ఉన్నాయి. అంతర్యుద్ధాలతో అతలాకుతలమవు తున్నాయి. వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దురదృష్టవ శాత్తూ ఆ జాబితాలో ఉక్రెయిన్ చేరి ఆర్నెల్లు కావస్తోంది.
రష్యా అనుకూల ఉక్రెయిన్ అధ్యక్షుడు యానుకోవిచ్‌ను గత ఫిబ్రవరిలో పాశ్చాత్య దేశాల ప్రాపకంతో సాగిన ‘ప్రజాస్వామిక ఉద్య మం’ పదవీచ్యుతుణ్ణి చేయగా, ఆ మరుసటి నెల ఉక్రెయిన్‌లో భాగం గా ఉన్న క్రిమియాను రిఫరెండం ద్వారా తనలో కలుపుకొని రష్యా తగిన జవాబిచ్చింది. అప్పటినుంచి ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాం తంలో రష్యా అనుకూల, వ్యతిరేక శక్తులమధ్య పోరు సాగుతూనే ఉన్నది. నిజానికిది ఆ ప్రాంతంలోని రెండు గ్రూపులు లేదా దేశాల మధ్య సాగుతున్న ఘర్షణ కాదు. రష్యా చుట్టూ ఉన్న దేశాలను చేర దీసి రష్యాను చుట్టుముట్టే పెను వ్యూహానికి అమెరికా, నాటోలు పదు నుబెడుతున్నాయి. ఇందుకు ప్రతిగా రష్యా తన ఎత్తుగడల్లో తానుం ది. ఇలా అగ్ర రాజ్యాల సంకుల సమరానికి వేదికై ఉక్రెయిన్ అస్థిర త్వంలో చిక్కుకుంది. ఆ దేశాలు పరస్పరం అంగీకారానికొస్తే తప్ప ఈ స్థితి చక్కబడేలా లేదు. ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల మిలిటెంట్లు గగనతలంలో వెళ్లే విమానాన్ని గురిచూసి కూల్చేంత స్తోమత తమకు లేదని చెబుతున్న మాటలు నమ్మదగ్గవేమీ కాదు. వారు అంతకు రెండురోజులముందే ఉక్రెయిన్ సైనిక విమానాన్ని కూల్చివేశారు. అయితే, సాధారణ క్షిపణి 33,000 అడుగుల ఎత్తున వెళ్లే విమానాన్ని కూల్చడం అసాధ్యం. రాడార్ సాయంతో విమాన పథాన్ని గుర్తించి గురిచూడగలిగే ఆధునాతన క్షిపణికి మాత్రమే అది వీలవుతుంది. బక్ క్షిపణికి 77,000 అడుగుల ఎత్తున ఎగిరే విమానాన్ని సైతం కూల్చగల సామర్థ్యం ఉంది. ఉక్రెయిన్‌లోని మిలిటెంట్లకు రష్యా సహాయసహకా రాలున్న సంగతి నిజమే అయినా ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన క్షిపణులను వారి చేతుల్లో పెట్టేంత స్థాయికి అవి చేరాయా అని ఆశ్చ ర్యం కలుగుతుంది. ఇన్నాళ్లూ నేరుగా రంగంలోకి దిగకుండా ఉక్రెయి న్‌లో పరస్పర ఘర్షణలతోనూ, మధ్యమధ్య చర్చలతోనూ, కాల్పుల విరమణ ఒప్పందాలతోనూ కాలం గడపడం ఉక్రెయిన్ వాసులకు ఎలా ఉన్నా రష్యాకు సౌకర్యవంతంగానే ఉంటున్నది. అమెరికా తమపై విధించిన ఆంక్షలకు సహకరించని పాశ్చాత్య దేశాల బలహీ నత కూడా ఆ దేశానికి బాగానే అందివచ్చింది. కానీ, మలేసియా విమానం కూల్చివేత ఘటన ఈ మొత్తం స్థితిని మార్చేసింది.
ఒకపక్క ఉక్రెయిన్ ఇంతగా మండుతున్నా ఆ దేశం గగనతలం మీదుగా వెళ్లడం క్షేమదాయకం కాదన్న గ్రహింపునకు రావడంలో విఫలమైనందుకు మలేసియాను తప్పుబట్టాలి. మన ఎయిరిండియా, జెట్ ఎయిర్‌వేస్‌వంటివి మూడు నెలలక్రితమే విమానాలను అటు వైపుగా నడపరాదని నిర్ణయించాయి. మొత్తానికి ఈ సంక్షోభంతో ఏ మాత్రమూ సంబంధంలేని 298మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కారకులైనవారిని కఠినంగా శిక్షించడంతో పాటు... ఇలాంటి సంక్షోభాలను సృష్టించి, పెంచి పోషిస్తున్న దుష్ట శక్తులను కూడా దుంపనాశనం చేయాల్సి ఉంది. అది మాత్రమే ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి అర్పించే నిజమైన నివాళి అవుతుంది.
పెను విషాదం
Published Sun, Jul 20 2014 12:08 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement