ఆకాశంలో విషాదం! | US stocks dip after China, MAS Boeing disappearance | Sakshi
Sakshi News home page

ఆకాశంలో విషాదం!

Published Wed, Mar 12 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM

US stocks dip after China, MAS Boeing disappearance

సంపాదకీయం: ఏ ప్రమాదమైనా విషాదాన్ని మిగులుస్తుంది. ఆ ప్రమాదం చుట్టూ అంతుచిక్కని రహస్యం అల్లుకుంటే అది మరింతగా బాధిస్తుంది. ఏం జరిగివుంటుందో తెలియనంతకాలమూ అది వెన్నాడుతూనే ఉంటుంది. నాలుగురోజులనాడు 239మందితో కౌలాలంపూర్‌నుంచి చైనా వెళ్తూ హఠాత్తుగా మాయమైన మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్-777 విమానం ఇప్పుడలాంటి పెను విషాదాన్నే మిగిల్చింది. అది హైజాకర్ల బారినపడిందా...హఠాత్తుగా బాంబు పేలిందా... విమానంలోని అంతర్గత సాంకేతిక వ్యవస్థలో ఏర్పడిన లోపమేమైనా దాని ఉసురుతీసిందా...లేక ఆ ప్రాంతంలోని దేశమేదైనా శత్రు విమా నంగా భావించి దాన్ని కూల్చేసిందా....అన్నీ ప్రశ్నలే. సమాధానానికి అందని ప్రశ్నలవి. ఆధునాతన సాంకేతిక విజ్ఞానం సైతం ఛేదించలేక పోతున్న ప్రశ్నలవి. కనీసం పది దేశాలు సంయుక్తంగా, విడి విడిగా కళ్లల్లో వత్తులు వేసుకుని రాత్రింబగళ్లు గాలిస్తున్నా అంతుపట్టని ప్రశ్నలవి. సకల సౌకర్యాలూ, సాంకేతికతలూ ఉన్న మొబైల్‌ఫోన్లు అరచేతుల్లోకొచ్చాక... ఏమూలన ఏం జరిగినా క్షణంలో చేరుకునే టీవీ కెమెరాలు వచ్చాక  ఏ ప్రమాదమూ ఇంతగా వేధించలేదు. ఏ ఘటనైనా... అదేదో మన కళ్లముందే జరిగిందని భ్రమపడేంతగా కొన్ని నిమిషాల్లోనే చానెళ్లలో ప్రత్యక్షమవుతున్నది.
 
 ఒకసారి కాదు...గంటల తరబడి పదే పదే కనిపిస్తున్నది. ఇలాంటి స్థితిలో విమానం ఎలా కూలిందో, ఏమైందో తెలుసుకోవడం మాట అటుంచి కనీసం దానికి సంబంధించిన చిన్న శకలం కూడా లభ్యంకాకపోవడం ఆ విషాద ఘటనలో చిక్కుకున్నవారి కుటుంబాలనే కాదు...హృదయమున్న ప్రతివారినీ కదిలిస్తుంది. గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. నాలుగేళ్లక్రితం అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిన ఎయిర్ ఫ్రాన్స్ విమానం 216మందిని పొట్టనబెట్టుకుంది. దాని శకలాలు దొరకడానికే కొన్ని నెలలు పట్టింది.
 
 ప్రమాదానికి గురైన బోయింగ్-777-200ఈఆర్‌ను విమానాలన్నిటిలోనూ అత్యంత సురక్షితమైనదిగా భావిస్తారు. ఆధునాతన నావిగేషన్ వ్యవస్థతో పెలైట్‌కు ఖచ్చితమైన సమాచారాన్నిచ్చి తోడ్పడగలగటం ఈ విమానం విశిష్టత. భద్రత , సేవలరీత్యా మలేసియా ఎయిర్‌లైన్స్ సంస్థ ఆసియా-పసిఫిక్ దేశాల్లోనే అగ్రస్థానంలో ఉంది. అలాంటపుడు బయలుదేరిన అరగంటలోనే దానికి రాడార్ వ్యవస్థతో సంబంధాలు ఎలా తెగిపోయాయి? అత్యవసర సమయాల్లో సందేశాలు పంపాల్సిన పెలైట్‌లనుంచి స్పందన ఎందుకు లేదు? వారికి అంత వ్యవధి లేదా? లేనట్టయితే అందుకు కారణమేమై ఉంటుంది? 35,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా హఠాత్తుగా ఇది వెనుదిరిగిందని, కొంత దూరం వచ్చాక మలక్కా జలసంధిలో పడిపోయిందని ప్రాథమిక సమాచారాన్నిబట్టి తెలుస్తున్నది.
 
  ప్రమాదం జరిగే సమయానికి అందులో మనదేశంతోసహా 15 దేశాలకు చెందిన ప్రయాణికులున్నారని మలేసియా ప్రకటించింది. అయితే, తమ పౌరులెవరూ ప్రయాణికుల్లో లేరని ఇటలీ, ఆస్ట్రియా వెల్లడించడంతో ఆ దేశాల పౌరులుగా చెప్పుకున్న ఇద్దరూ దొంగిలించిన పాస్‌పోర్టులతో విమానం ఎక్కారని నిర్ధారించారు. వీరిద్దరూ థాయ్‌లాండ్‌లో కొన్న టిక్కెట్లతో విమానం ఎక్కారు. దర్యాప్తుచేసిన మేరకు వారిద్దరూ ఉగ్రవాదులు కాదని, ఏదైనా దేశంలో ఆశ్రయం పొందడానికి వెళ్తుండవచ్చునని థాయ్‌లాండ్ పోలీసులు చెబుతున్నారు. మలేసియా విమానాశ్రయంనుంచి గతంలో రెండు, మూడు సందర్భాల్లో ఇలా దొంగ పాస్‌పోర్టులతో ప్రయాణించడానికి ప్రయత్నించినవారిని పట్టుకున్నట్టు ఇప్పుడు చెబుతున్నారు.
 
 దొంగిలించిన పాస్‌పోర్టులతో ప్రయాణించడం పెరిగిందని ఇంటర్‌పోల్ సంస్థ పదే పదే చెబుతోంది. ఇది వైమానికయానాన్ని ప్రమాదకరంగా మారుస్తున్నదని అంటున్నది. ఆచూకీ లేకుండాపోయిన పాస్‌పోర్టుల వివరాలకు సంబంధించిన డేటాబేస్ ఆ సంస్థ దగ్గర ఉంటుంది. దాని సాయంతో ప్రయాణికులను తనిఖీచేసే వ్యవస్థ ఉంటే ఇలాంటి స్థితి ఏర్పడదు. గత ఏడాది వందకోట్లకుపైగా విమాన ప్రయాణాలు జరిగితే ఇలాంటి తనిఖీలు దాదాపుగా లేవని ఇంటర్‌పోల్ పేర్కొంది. ఇంటర్‌పోల్ డేటాబేస్‌ను ఏవో కొన్ని దేశాలు తప్ప మిగిలినవి పట్టించుకోవడంలేదు. ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల పాస్‌పోర్టులు అపహరణకు గురయ్యాయని ఇంటర్‌పోల్ చెబుతోంది. అమెరికాలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత 2002లో ఇంటర్‌పోల్ ఇలాంటి సమాచారాన్ని సేకరిస్తోంది. దీని సాయంతో పాకిస్థాన్‌లో మూడేళ్లక్రితం విమానం ఎక్కబోతున్న ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అయినా చాలా దేశాల దాని ప్రాముఖ్యాన్ని గుర్తించడంలేదని ఇంటర్‌పోల్ ఆరోపణ. ఇప్పుడు జరిగిన ప్రమాదానికి ఉగ్రవాదం కారణమా, కాదా అన్న సంగతలా ఉంచి అసలు అలాంటి లొసుగులు ఎందుకుంటున్నాయని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పది దేశాలకు చెందిన బృందాలు 34 విమానాలు, 40 నౌకల సాయంతో దక్షిణ చైనా సముద్రాన్ని జల్లెడపడుతున్నాయి. ఇటు అండమాన్‌వైపు కూడా వెదుకుతున్నాయి. ఎక్కడో ఒకచోట చమురు తెట్టు కనిపించిందనో, మరోచోట లైఫ్ బోటు కనబడిందనో వార్తలొచ్చినా అవేమీ విమాన ప్రమాదంతో సంబంధం ఉన్నవి కాదని తేలింది.
 
 మరోపక్క చైనాకు చెందిన పది ఉపగ్రహాలు పంపిన ఛాయాచిత్రాలవల్ల కొంత ఆచూకీ దొరికిందని అంటున్నారు. అన్వేషణలన్నీ ఫలించి విమాన శకలాలు దొరకడంతోపాటు, ప్రమాదానికి దారితీసిన కారణాలు కూడా సాధ్యమై నంత త్వరగా వెల్లడైతే మృతుల కుటుంబాలకు కాస్తయినా సాంత్వన లభిస్తుంది. సురక్షిత విమానయానానికి మరెన్ని జాగ్రత్తలు తీసుకో వాల్సిన అవసరమున్నదో కూడా తెలుస్తుంది. అందువల్లే అదృశ్యమైన విమానం ఆచూకీ త్వరగా లభించాలని అందరూ కోరుకుంటారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement