
బెంగళూరు విమానం అత్యవసర ల్యాండింగ్
మలేసియాలో టేకాఫ్ సమయంలో పేలిన టైరు
నాలుగు గంటల పాటు గాల్లోనే చక్కర్లు
మొత్తం 159 మంది సురక్షితం
కౌలాలంపూర్: బెంగళూరు రావాల్సిన మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్ 192 విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా దించేశాడు. దీంతో ఏడుగురు సిబ్బందితోపాటు మొత్తం 166 మంది సురక్షితంగా బయటపడ్డారు. కొద్దిరోజుల క్రితమే ఎంహెచ్ 370 విమానం గల్లంతైన నేపథ్యంలో ఈ ఘటనను మలేసియా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీని వెనుక ఏదైనా విద్రోహ చర్య ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు.
ఆదివారం రాత్రి పది గంటల సమయంలో మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-800 ఎంహెచ్ 192 విమానం 159 మంది ప్రయాణికులతో బెంగళూరు బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం ఈ విమానం ఆదివారం రాత్రి 11.35 నిమిషాలకు గమ్యస్థానం చేరుకోవాలి. అయితే టేకాఫ్ సమయంలో విమానం టైరు పేలిపోవడమే కాక ల్యాండింగ్ గేర్ కూడా పాడైపోయింది. సమస్యను గుర్తించిన పైలట్ కెప్టెన్ ఆడమ్ ఆజ్మీ వెంటనే సమాచారాన్ని కౌలాలంపూర్ ఎయిర్ పోర్ట్ అధికారులకు చేరవేశారు. మలేసియా ఎయిర్‌లైన్స్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ విమానాన్ని వెనక్కి తీసుకురావాల్సిందిగా పైలట్‌ను ఆదేశించింది. దీంతో సోమవారం తెల్లవారుజామున 1.56 గంటలకు పైలట్ విమానాన్ని కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా దించేశారు.
అగ్నిమాపక సిబ్బంది విమానంలోని ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరమ్మతుల అనంతరం సోమవారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు బెంగళూరు బయలుదేరిన ఎంహెచ్ 192 విమానం సాయంత్రం 5 గంటలకు గమ్యస్థానానికి చేరింది. దీంతో సుమారు 17.30 గంటలు ఆలస్యంగా చేరినట్లయింది. కాగా, విమానం నాలుగు గంటల పాటు గాల్లోనే ఉండటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే పైలట్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. తమను సురక్షితంగా తీసుకొచ్చిన పైలట్ ఆడమ్ ఆజ్మీని హీరో అంటూ తెగ పొగిడేశారు.