జూలై 17న కూలిన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 17 విమాన శకలాలు
హేగ్(నెథర్లాండ్స్): క్షిపణిలాంటి శక్తివంతమైన వస్తువు ఢీకొనడంవల్లనే మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 17 విమానం కూలిపోయిందని డచ్ సేఫ్టీ బోర్డు తొలి నివేదికలో తెలిపింది. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్ నుంచి మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు తెళుతున్న ఈ విమానం జూలై 17న కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 298 మంది మృతి చెందారు. ఈ మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఉక్రెయిన్ గగనతలంపై 10 కి.మీ ఎత్తులో ప్రయాణిస్తుండగా జరిగిన క్షిపణి దాడిలో కుప్పకూలింది. యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మలేసియా విమానం కూల్చివేత ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారుల ఘాతుకమేనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విమానాన్ని ఉక్రెయిన్ సైనిక రవాణా విమానంగా పొరబడిన తిరుగుబాటుదారులు దాన్ని కూల్చేందుకు క్షిపణి దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఈ దుర్ఘటన అనంతరం రష్యా మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు, ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారుల మధ్య జరిగిన సంభాషణల ఆడియో రికార్డుల రాతప్రతులను ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ బయటపెట్టింది. ప్రమాదం జరిగిన 20 నిమిషాల తరువాత ఈ సంభాషణలు చోటు చేసుకున్నాయి.
ఈ సంభాషణల ప్రకారం ఇగోర్ బెజ్లర్ అనే మిలిటెంట్.. రష్యా నిఘా అధికారి వాలిసి జెరానిన్‌తో మాట్లాడుతూ ''మేం ఇప్పుడే ఒక విమానాన్ని పేల్చేశాం. అది గాల్లోనే ముక్కలైంది''అని పేర్కొన్నాడు. అలాగే మేజర్ అనే మిలిటెంట్ ఘటనాస్థలికి వెళ్లి విమాన శకలాలను పరిశీలించాక ''ఇది నూరు శాతం పౌర విమానమే. అన్నీ సాధారణ వస్తువులే కనిపిస్తున్నాయి'' అని గ్రెక్ అనే మరో మిలిటెంట్‌కు వివరించాడు. దీంతోపాటు తిరుగుబాటుదారుల నాయకుడిగా భావిస్తున్న మైకొలా కొజిత్సిన్‌తో మరో మిలిటెంట్ మాట్లాడుతూ ''ఇది ప్యాసింజర్ విమానంలా కనిపిస్తోంది. గ్రాబొవొ గ్రామ వెలుపల ఇది పడిపోయింది. మహిళలు, చిన్నపిల్లల మృతదేహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి''అని కొజిత్సిన్‌కు వివరించాడు.రష్యా అనుకూల ఉగ్రవాదులే ఈ విమానాన్ని కూల్చేశారని ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరోషెంకో ఆరోపించారు.అయితే ఉక్రెయిన్ వాదనను రష్యా తోసిపుచ్చింది.
ఈ విమాన కూలిపోయిన ఘటనపై డచ్ సేఫ్టీ బోర్డు తొలి నివేదిక ఈరోజు సమర్పించింది. క్షిపణిలాంటి శక్తివంతమైన వస్తువు ఢీకొనడంవల్లనే ఈ విమానం కూలిపోయిందని బొర్డు ఆ నివేదికలో పేర్కొంది.
**