కుల్‌భూషణ్ జాదవ్‌కు ఉరి నుంచి ఊరట
అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్ జాదవ్‌కు ఊరట లభించింది. తాము తుది తీర్పు వెల్లడించేవరకు అతడికి విధించిన ఉరిశిక్షను అమలుచేయొద్దని అంతర్జాతీయ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉరిశిక్షపై స్టే విధించింది. అంతేకాక, జాదవ్‌ను కలుసుకునేందుకు భారత రాయబారికి అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ఈ కేసు తమ పరిధిలోకే వస్తుందంటూ పాకిస్తాన్‌కు మొట్టికాయలు వేసింది. నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన న్యాయ విభాగం ఐసీజేలో కుల్‌భూషణ్ జాదవ్ (46) కేసులో ఇరు దేశాలు తమ తమ వాదనలను గట్టిగా వినిపించాయి. అనంతరం 11 మంది జడ్జీలతో కూడిన బెంచ్ జాదవ్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టాలంటూ తన నిర్ణయాన్ని వెల్లడించింది. జస్టిస్ రోనీ అబ్రహాం విషయం తెలిపారు.
గూఢచర్యం, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడంటూ గత నెలలో కులభూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తూ తమ దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని పాక్ ఆరోపించింది. అయితే, అతడిని ఇరాన్‌లో కిడ్నాప్ చేసి పాకిస్తాన్ తీసుకెళ్లి అక్రమంగా కేసులు పెట్టారని భారత్ వాదించింది. అంతే కాక, జాదవ్ కేసులో వియన్నా దౌత్య సంబంధాల ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందని, జాదవ్‌ను కలిసేందుకు అనుమతించాలని భారత రాయబారి విజ్ఞప్తి చేసినా తిరస్కరించిందంటూ ఈనెల 8న మనదేశం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో స్పందించిన అంతర్జాతీయ న్యాయస్థానం కులభూషణ్ ఉరిశిక్ష అమలుపై తొలుత స్టే విధించింది. ఈ కేసులో భారత్ తరఫున హరీశ్ సాల్వే, పాక్ తరఫున అస్తర్ అలీ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది అయిన హరీశ్ సాల్వే.. ఈ కేసులో వాదించేందుకు నామమాత్రంగా కేవలం ఒక్క రూపాయి ఫీజు మాత్రమే తీసుకున్నారు.
విదేశీ పౌరుడిని అరెస్టు చేసిన సమయంలో కాన్సల్ జనరల్‌కు అతడిని కలిసేందుకు అవకాశం కల్పించాలని వియన్నా ఒప్పందం చెబుతోంది. కానీ పాక్ మాత్రం ఈ కేసులో జాదవ్‌కు అసలు కాన్సులర్ యాక్సెస్ కల్పించలేదు. దాన్ని కూడా భారత్ ప్రస్తావించింది. వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని చెప్పింది. భారత్, పాక్ రెండు దేశాలూ వియన్నా ఒప్పందానికి కట్టుబడి ఉండాలని జడ్జి రోనీ అబ్రహాం చెప్పారు. ఈ కేసు తమ పరిధిలోకి రాదన్న పాక్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. జాదవ్ కేసు అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకే వస్తుందని స్పష్టం చేశారు.
పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ
అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో్ భారత్ పాక్షిక విజయం సాధించింది. 18 ఏళ్ల తర్వాత మరోసారి అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్ మీద భారత్ పైచేయి సాధించింది. జాదవ్‌ను కలుసుకునే హక్కు భారతీయ దౌత్యాధికారులకు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. దాంతో ఈ కేసులో హరీష్ సాల్వే వాదనలు ఫలించినట్లే అయ్యాయి.