hague
-
పాక్ భాషపై భారత్ తీవ్ర అభ్యంతరం
హేగ్ : భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(48) కేసు విచారణ సందర్భంగా అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో పాకిస్తాన్ వాడిన భాషపై ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది. బుధవారం భారత్ తరఫున మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తూ..‘పాక్ న్యాయవాది ఖవార్ ఖురేషీ వాడిన భాష ఈ కోర్టులో ప్రతిధ్వనించింది. సిగ్గులేని, అర్థంలేని, అవమానకరమైన, పొగరుబోతు అనే పదాలను ఐసీజేకు సమర్పించిన పత్రాల్లో పాక్ వాడింది. పాకిస్తాన్ న్యాయవాది దుర్భాషను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ రకమైన భాషను వాడకుండా భారత సంస్కృతి మమ్మల్ని అడ్డుకుంటోంది. ఓ సార్వభౌమ దేశం మరో దేశంపై విమర్శలు చేసేటప్పుడు గౌరవప్రదమైన భాషను వాడాలి. చట్టంపై పట్టున్న వ్యక్తులు చట్టం ఆధారంగా వాదిస్తారు. బలమైన సాక్ష్యాధారాలు ఉన్నవారు వాటి ఆధారంగానే వాదనలు వినిపిస్తారు. ఇవేమీ లేనివారు కోర్టులో బల్లను మాత్రమే చరుస్తారు. భారత్ సాక్ష్యధారాలను ఐసీజే ముందు సమర్పిస్తే, పాకిస్తాన్ మాత్రం బల్లను బాదుతోంది’ అని విమర్శించారు. జాధవ్‌కు విధించిన మరణశిక్షను వెంటనే రద్దుచేసి విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. లేదంటే సాధారణ కోర్టులో విచారణ జరిపించడంతో పాటు దౌత్యాధికారుల్ని కలుసుకునే అనుమతి ఇవ్వాలన్నారు. నేడు పాకిస్తాన్ వాదనలు సమర్పించిన అనంతరం జాధవ్ కేసులో విచారణ ముగియనుంది. ఈ ఏడాది వేసవిలో ఐసీజే తీర్పు ఇవ్వనుంది. -
కుల్‌భూషణ్ జాదవ్‌కు ఉరి నుంచి ఊరట
-
కుల్‌భూషణ్ జాదవ్‌కు ఉరి నుంచి ఊరట
అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్ జాదవ్‌కు ఊరట లభించింది. తాము తుది తీర్పు వెల్లడించేవరకు అతడికి విధించిన ఉరిశిక్షను అమలుచేయొద్దని అంతర్జాతీయ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉరిశిక్షపై స్టే విధించింది. అంతేకాక, జాదవ్‌ను కలుసుకునేందుకు భారత రాయబారికి అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ఈ కేసు తమ పరిధిలోకే వస్తుందంటూ పాకిస్తాన్‌కు మొట్టికాయలు వేసింది. నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన న్యాయ విభాగం ఐసీజేలో కుల్‌భూషణ్ జాదవ్ (46) కేసులో ఇరు దేశాలు తమ తమ వాదనలను గట్టిగా వినిపించాయి. అనంతరం 11 మంది జడ్జీలతో కూడిన బెంచ్ జాదవ్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టాలంటూ తన నిర్ణయాన్ని వెల్లడించింది. జస్టిస్ రోనీ అబ్రహాం విషయం తెలిపారు. గూఢచర్యం, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడంటూ గత నెలలో కులభూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తూ తమ దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని పాక్ ఆరోపించింది. అయితే, అతడిని ఇరాన్లో కిడ్నాప్ చేసి పాకిస్తాన్ తీసుకెళ్లి అక్రమంగా కేసులు పెట్టారని భారత్ వాదించింది. అంతే కాక, జాదవ్ కేసులో వియన్నా దౌత్య సంబంధాల ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందని, జాదవ్‌ను కలిసేందుకు అనుమతించాలని భారత రాయబారి విజ్ఞప్తి చేసినా తిరస్కరించిందంటూ ఈనెల 8న మనదేశం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో స్పందించిన అంతర్జాతీయ న్యాయస్థానం కులభూషణ్ ఉరిశిక్ష అమలుపై తొలుత స్టే విధించింది. ఈ కేసులో భారత్ తరఫున హరీశ్ సాల్వే, పాక్ తరఫున అస్తర్ అలీ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది అయిన హరీశ్ సాల్వే.. ఈ కేసులో వాదించేందుకు నామమాత్రంగా కేవలం ఒక్క రూపాయి ఫీజు మాత్రమే తీసుకున్నారు. విదేశీ పౌరుడిని అరెస్టు చేసిన సమయంలో కాన్సల్ జనరల్‌కు అతడిని కలిసేందుకు అవకాశం కల్పించాలని వియన్నా ఒప్పందం చెబుతోంది. కానీ పాక్ మాత్రం ఈ కేసులో జాదవ్‌కు అసలు కాన్సులర్ యాక్సెస్ కల్పించలేదు. దాన్ని కూడా భారత్ ప్రస్తావించింది. వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని చెప్పింది. భారత్, పాక్ రెండు దేశాలూ వియన్నా ఒప్పందానికి కట్టుబడి ఉండాలని జడ్జి రోనీ అబ్రహాం చెప్పారు. ఈ కేసు తమ పరిధిలోకి రాదన్న పాక్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. జాదవ్ కేసు అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకే వస్తుందని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో్ భారత్ పాక్షిక విజయం సాధించింది. 18 ఏళ్ల తర్వాత మరోసారి అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్ మీద భారత్ పైచేయి సాధించింది. జాదవ్‌ను కలుసుకునే హక్కు భారతీయ దౌత్యాధికారులకు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. దాంతో ఈ కేసులో హరీష్ సాల్వే వాదనలు ఫలించినట్లే అయ్యాయి. -
జాధవ్ మరణశిక్ష ఆపండి
-
జాధవ్ మరణశిక్ష ఆపండి
తాత్కాలికంగా నిలుపుదల చేయండి: ఐసీజేలో భారత్ - లేదంటే విచారణ పూర్తయ్యేలోగా ఉరితీసే ప్రమాదముంది - వియన్నా ఒప్పందాన్నీ పాక్ ఉల్లంఘించింది - ఆ ఒప్పందం వర్తించదంటూ వాదించిన పాక్ - హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదనలు ద హేగ్: భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు విధించిన మరణశిక్షను తాత్కాలికంగా నిలిపివేసేలా పాకిస్తాన్‌ను ఆదేశించాలని అంతర్జాతీయ న్యాయస్థానానికి(ఐసీజే) భారత్ విజ్ఞప్తిచేసింది. లేదంటే ఐసీజేలో విచారణ పూర్తి కాకముందే జాధవ్‌ను పాకిస్తాన్ ఉరితీసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. జాధవ్‌కు మరణశిక్షపై భారత్ అభ్యంతరాల నేపథ్యంలో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో సోమవారం విచా రణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారత్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ.. పరిస్థితి చాలా తీవ్రమైంది కావడంతో ఇంత తక్కువ సమయంలో ఐసీజేను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. అయితే పాక్‌కు వ్యతిరేకంగా గూఢచర్య విధులు నిర్వర్తించిన జాధవ్‌కు వియన్నా ఒప్పందం వర్తించదని, మరణశిక్షపై స్టే పొందడమే భారత్ అసలైన లక్ష్యమని పాకిస్తాన్ ఆరోపించింది. వీలైనంత త్వరగా తీర్పును వెలువరిస్తామని, తేదీని తగిన సమయంలో వెల్లడిస్తామని ఈ సందర్భంగా 16 మంది న్యాయమూర్తులతో కూడిన ఐసీజే ధర్మాసనం స్పష్టం చేసింది. సాల్వే ఫీజు ఒక్క రూపాయే! జాధవ్ మరణశిక్షకు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ తరఫున కేసు వాదించేందుకు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తన ట్వీటర్ ఖాతాలో వెల్లడించారు. ఐసీజేలో భారత్ తరఫున కేసు వాదిస్తున్న న్యాయవాదుల బృందానికి హరీష్ సాల్వే నేతృత్వం వహిస్తున్నారు. జాధవ్‌పై అభియోగాలన్నీ అవాస్తవం విచారణ ప్రారంభం కాగానే విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి దీపక్ మిట్టల్ మాట్లాడుతూ.. జాధవ్‌కు న్యాయ సాయం పొందే హక్కును తిరస్కరించారని, దౌత్య కార్యాలయాన్ని సంప్రదించే అవకాశం ఇవ్వలేదని కోర్టుకు వెల్లడించారు. దాదాపు 90 నిమిషాల పాటు భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ► జాధవ్‌ను కలిసేందుకు అనుమతించాలని భారత్ 16 సార్లు విజ్ఞప్తి చేసినా తిరస్కరించింది. ► కుల్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఆధారాల్ని అందించేందుకు పాకిస్తాన్ నిరాకరించింది. చార్జ్‌షీట్ కాపీని కూడా ఇవ్వలేదు. ► జాధవ్‌ను ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసి, మిలిటరీ నిర్బంధంలో బలవంతంగా నేరవాంగ్మూలం నమోదుచేశారు. జాధవ్ కుటుంబానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా న్యాయ నిర్బంధంలో ఉంచారు. ► మరణవిక్ష విధిస్తూ పాకిస్తాన్ సైనిక కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలి. ► జాదవ్‌పై మోపిన అభియోగాలన్నీ అవాస్తవం. ► జాధవ్‌కు దౌత్యసాయాన్ని నిరాకరించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మే 8న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని భారత్ ఆశ్రయించగా... మరణశిక్షపై స్టే విధించిన ఐసీజే అత్యవసర విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పీలుకు 150 రోజుల సమయమిచ్చాం అయితే భారత్ వాదనల్ని పాక్ తోసిపుచ్చింది. అంతర్జాతీయ కోర్టును భారత్ రాజ కీ య వేదికగా వాడుకుంటుందని ఆరోపించింది. ఉగ్ర కార్యకలాపాల్లో ప్రమేయమున్న గూఢచారి విషయంలో వియన్నా ఒప్పందంలోని నిబంధనలు వర్తించవని వాదించింది. ► జాధవ్ మరణశిక్షపై అప్పీలు చేసుకునేందుకు 150 రోజుల సమయం ఇచ్చాం. ► జాధవ్‌ను అరెస్టు చేసినప్పుడు అతని పాస్‌పోర్ట్ కాపీని భారత్‌కు అందచేశాం. అనంతరం నేరవాంగ్మూలం వీడియోను అందచేసినా ఎలాంటి ప్రతిస్పందనా రాలేదు. జాధవ్ పాస్‌పోర్టులో ముస్లిం పేరుపై ప్రశ్నించినా సమాధానం ఇవ్వలేదు. ► జాధవ్ దౌత్యపరమైన సంప్రదింపులకు అర్హుడుకాదు. భారత్ దరఖాస్తు విచారణ అత్యవసరం కాదని, దానిని తిరస్కరించాలి. ► ఇరాన్ నుంచి పాకిస్తాన్‌కు వచ్చిన కుల్‌భూషణ్‌ను బలూచిస్తాన్‌లో అదుపులోకి తీసుకున్నాం. హడావుడిగా విచారించి శిక్ష విధించారన్న భారత్ ఆరోపణలు నిజం కాదు. ► స్టే ఉత్తర్వులు పొందడమే భారత్ అసలైన, నిజమైన లక్ష్యం. పాకిస్తాన్‌పై తీవ్ర ఆరోపణలు చేసినా.. అందుకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. ► ఈ సందర్భంగా నేరాన్ని ఒప్పకుంటూ జాధవ్ ఇచ్చిన వాంగ్మూల వీడియోను చూపిస్తామని ఖురేషి కోర్టుకు తెలపగా ఐసీజే అందుకు నిరాకరించింది. -
కులభూషణ్ ఉరిపై మొదలైన వాదనలు
-
కులభూషణ్ ఉరిపై మొదలైన వాదనలు
హేగ్ : అంతర్జాతీయ న్యాయస్థానం వేదికగా భారత్, పాకిస్తాన్‌లు నేడు మళ్లీ తలపడ్డాయి. కులభూషణ్ జాదవ్ వ్యవహారంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదనలు మొదలయ్యాయి. నెదర్లాండ్స్‌లోని ద హేగ్ నగరంలో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన న్యాయ విభాగం ఐసీజేలో కుల్భూషన్ జాధవ్(46) కేసులో ఇరు దేశాలు వాదనలు కొనసాగుతున్నాయి. గూఢచర్యం, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడంటూ గత నెలలో కులభూషన్ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. అయితే జాదవ్ కేసులో వియన్నా దౌత్య సంబంధాల ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందని, జాదవ్‌ను కలిసేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసినా తిరస్కరించిందంటూ ఈ 8న మనదేశం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో స్పందించిన అంతర్జాతీయ న్యాయస్థానం కులభూషణ్ ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది. తాజాగా నేడు రెండు దేశాలు తమ వాదనలు వినిపిస్తున్నారు. న్యాయమూర్తి అబ్రహం ఇరు దేశాలకు తమ తమ వాదనలు వినిపించేందుకు చెరో 90 నిమిషాల సమయం కేటాయించారు. జాదవ్ అమాయకుడని, అతడి ఉరిశిక్షపై మరోసారి మిలటరీ కోర్టులో విచారణ చేపట్టాలని భారత్ కోరింది. కాగా భారత్ తరఫున హరీశ్ సాల్వే, పాక్ తరఫున అస్తర్ అలీ వాదనలు వినిపిస్తున్నారు. అవసరం అయితే వాదనలు పొడిగించే అవకాశం ఉంది. కాగా చివరిసారిగా అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్, పాకిస్తాన్‌లు 18 ఏళ్ల క్రితం తలబడ్డాయి. -
క్షిపణి ఢీకొనడం వల్ల కూలిన మలేషియా విమానం
హేగ్(నెథర్లాండ్స్): క్షిపణిలాంటి శక్తివంతమైన వస్తువు ఢీకొనడంవల్లనే మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 17 విమానం కూలిపోయిందని డచ్ సేఫ్టీ బోర్డు తొలి నివేదికలో తెలిపింది. నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డామ్ నుంచి మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు తెళుతున్న ఈ విమానం జూలై 17న కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 298 మంది మృతి చెందారు. ఈ మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఉక్రెయిన్ గగనతలంపై 10 కి.మీ ఎత్తులో ప్రయాణిస్తుండగా జరిగిన క్షిపణి దాడిలో కుప్పకూలింది. యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మలేసియా విమానం కూల్చివేత ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారుల ఘాతుకమేనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విమానాన్ని ఉక్రెయిన్ సైనిక రవాణా విమానంగా పొరబడిన తిరుగుబాటుదారులు దాన్ని కూల్చేందుకు క్షిపణి దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఈ దుర్ఘటన అనంతరం రష్యా మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు, ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారుల మధ్య జరిగిన సంభాషణల ఆడియో రికార్డుల రాతప్రతులను ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ బయటపెట్టింది. ప్రమాదం జరిగిన 20 నిమిషాల తరువాత ఈ సంభాషణలు చోటు చేసుకున్నాయి. ఈ సంభాషణల ప్రకారం ఇగోర్ బెజ్లర్ అనే మిలిటెంట్.. రష్యా నిఘా అధికారి వాలిసి జెరానిన్తో మాట్లాడుతూ ''మేం ఇప్పుడే ఒక విమానాన్ని పేల్చేశాం. అది గాల్లోనే ముక్కలైంది''అని పేర్కొన్నాడు. అలాగే మేజర్ అనే మిలిటెంట్ ఘటనాస్థలికి వెళ్లి విమాన శకలాలను పరిశీలించాక ''ఇది నూరు శాతం పౌర విమానమే. అన్నీ సాధారణ వస్తువులే కనిపిస్తున్నాయి'' అని గ్రెక్ అనే మరో మిలిటెంట్‌కు వివరించాడు. దీంతోపాటు తిరుగుబాటుదారుల నాయకుడిగా భావిస్తున్న మైకొలా కొజిత్సిన్తో మరో మిలిటెంట్ మాట్లాడుతూ ''ఇది ప్యాసింజర్ విమానంలా కనిపిస్తోంది. గ్రాబొవొ గ్రామ వెలుపల ఇది పడిపోయింది. మహిళలు, చిన్నపిల్లల మృతదేహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి''అని కొజిత్సిన్కు వివరించాడు.రష్యా అనుకూల ఉగ్రవాదులే ఈ విమానాన్ని కూల్చేశారని ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరోషెంకో ఆరోపించారు.అయితే ఉక్రెయిన్ వాదనను రష్యా తోసిపుచ్చింది. ఈ విమాన కూలిపోయిన ఘటనపై డచ్ సేఫ్టీ బోర్డు తొలి నివేదిక ఈరోజు సమర్పించింది. క్షిపణిలాంటి శక్తివంతమైన వస్తువు ఢీకొనడంవల్లనే ఈ విమానం కూలిపోయిందని బొర్డు ఆ నివేదికలో పేర్కొంది. **