
హేగ్ : భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(48) కేసు విచారణ సందర్భంగా అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో పాకిస్తాన్ వాడిన భాషపై ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది. బుధవారం భారత్ తరఫున మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తూ..‘పాక్ న్యాయవాది ఖవార్ ఖురేషీ వాడిన భాష ఈ కోర్టులో ప్రతిధ్వనించింది. సిగ్గులేని, అర్థంలేని, అవమానకరమైన, పొగరుబోతు అనే పదాలను ఐసీజేకు సమర్పించిన పత్రాల్లో పాక్ వాడింది. పాకిస్తాన్ న్యాయవాది దుర్భాషను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఈ రకమైన భాషను వాడకుండా భారత సంస్కృతి మమ్మల్ని అడ్డుకుంటోంది. ఓ సార్వభౌమ దేశం మరో దేశంపై విమర్శలు చేసేటప్పుడు గౌరవప్రదమైన భాషను వాడాలి. చట్టంపై పట్టున్న వ్యక్తులు చట్టం ఆధారంగా వాదిస్తారు. బలమైన సాక్ష్యాధారాలు ఉన్నవారు వాటి ఆధారంగానే వాదనలు వినిపిస్తారు. ఇవేమీ లేనివారు కోర్టులో బల్లను మాత్రమే చరుస్తారు. భారత్ సాక్ష్యధారాలను ఐసీజే ముందు సమర్పిస్తే, పాకిస్తాన్ మాత్రం బల్లను బాదుతోంది’ అని విమర్శించారు. జాధవ్‌కు విధించిన మరణశిక్షను వెంటనే రద్దుచేసి విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. లేదంటే సాధారణ కోర్టులో విచారణ జరిపించడంతో పాటు దౌత్యాధికారుల్ని కలుసుకునే అనుమతి ఇవ్వాలన్నారు. నేడు పాకిస్తాన్ వాదనలు సమర్పించిన అనంతరం జాధవ్ కేసులో విచారణ ముగియనుంది. ఈ ఏడాది వేసవిలో ఐసీజే తీర్పు ఇవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment