కులభూషణ్ ఉరిపై మొదలైన వాదనలు
హేగ్ : అంతర్జాతీయ న్యాయస్థానం వేదికగా భారత్, పాకిస్తాన్‌లు నేడు మళ్లీ తలపడ్డాయి. కులభూషణ్ జాదవ్ వ్యవహారంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదనలు మొదలయ్యాయి. నెదర్లాండ్స్‌లోని ద హేగ్ నగరంలో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన న్యాయ విభాగం ఐసీజేలో కుల్‌భూషన్ జాధవ్(46) కేసులో ఇరు దేశాలు వాదనలు కొనసాగుతున్నాయి. గూఢచర్యం, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడంటూ గత నెలలో కులభూషన్ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.
అయితే జాదవ్ కేసులో వియన్నా దౌత్య సంబంధాల ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందని, జాదవ్‌ను కలిసేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసినా తిరస్కరించిందంటూ ఈ 8న మనదేశం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో స్పందించిన అంతర్జాతీయ న్యాయస్థానం కులభూషణ్ ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది. తాజాగా నేడు రెండు దేశాలు తమ వాదనలు వినిపిస్తున్నారు. న్యాయమూర్తి అబ్రహం ఇరు దేశాలకు తమ తమ వాదనలు వినిపించేందుకు చెరో 90 నిమిషాల సమయం కేటాయించారు.
జాదవ్ అమాయకుడని, అతడి ఉరిశిక్షపై మరోసారి మిలటరీ కోర్టులో విచారణ చేపట్టాలని భారత్ కోరింది. కాగా భారత్ తరఫున హరీశ్ సాల్వే, పాక్ తరఫున అస్తర్ అలీ వాదనలు వినిపిస్తున్నారు. అవసరం అయితే వాదనలు పొడిగించే అవకాశం ఉంది. కాగా చివరిసారిగా అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్, పాకిస్తాన్‌లు 18 ఏళ్ల క్రితం తలబడ్డాయి.