జాధవ్ మరణశిక్ష ఆపండి
తాత్కాలికంగా నిలుపుదల చేయండి: ఐసీజేలో భారత్
- లేదంటే విచారణ పూర్తయ్యేలోగా ఉరితీసే ప్రమాదముంది
- వియన్నా ఒప్పందాన్నీ పాక్ ఉల్లంఘించింది
- ఆ ఒప్పందం వర్తించదంటూ వాదించిన పాక్
- హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదనలు
ద హేగ్: భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు విధించిన మరణశిక్షను తాత్కాలికంగా నిలిపివేసేలా పాకిస్తాన్‌ను ఆదేశించాలని అంతర్జాతీయ న్యాయస్థానానికి(ఐసీజే) భారత్ విజ్ఞప్తిచేసింది. లేదంటే ఐసీజేలో విచారణ పూర్తి కాకముందే జాధవ్‌ను పాకిస్తాన్ ఉరితీసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. జాధవ్‌కు మరణశిక్షపై భారత్ అభ్యంతరాల నేపథ్యంలో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో సోమవారం విచా రణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారత్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ.. పరిస్థితి చాలా తీవ్రమైంది కావడంతో ఇంత తక్కువ సమయంలో ఐసీజేను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. అయితే పాక్‌కు వ్యతిరేకంగా గూఢచర్య విధులు నిర్వర్తించిన జాధవ్‌కు వియన్నా ఒప్పందం వర్తించదని, మరణశిక్షపై స్టే పొందడమే భారత్ అసలైన లక్ష్యమని పాకిస్తాన్ ఆరోపించింది. వీలైనంత త్వరగా తీర్పును వెలువరిస్తామని, తేదీని తగిన సమయంలో వెల్లడిస్తామని ఈ సందర్భంగా 16 మంది న్యాయమూర్తులతో కూడిన ఐసీజే ధర్మాసనం స్పష్టం చేసింది.
సాల్వే ఫీజు ఒక్క రూపాయే!
జాధవ్ మరణశిక్షకు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ తరఫున కేసు వాదించేందుకు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తన ట్వీటర్ ఖాతాలో వెల్లడించారు. ఐసీజేలో భారత్ తరఫున కేసు వాదిస్తున్న న్యాయవాదుల బృందానికి హరీష్ సాల్వే నేతృత్వం వహిస్తున్నారు.
జాధవ్‌పై అభియోగాలన్నీ అవాస్తవం
విచారణ ప్రారంభం కాగానే విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి దీపక్ మిట్టల్ మాట్లాడుతూ.. జాధవ్‌కు న్యాయ సాయం పొందే హక్కును తిరస్కరించారని, దౌత్య కార్యాలయాన్ని సంప్రదించే అవకాశం ఇవ్వలేదని కోర్టుకు వెల్లడించారు. దాదాపు 90 నిమిషాల పాటు భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు.
► జాధవ్‌ను కలిసేందుకు అనుమతించాలని భారత్ 16 సార్లు విజ్ఞప్తి చేసినా తిరస్కరించింది.
► కుల్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఆధారాల్ని అందించేందుకు పాకిస్తాన్ నిరాకరించింది. చార్జ్‌షీట్ కాపీని కూడా ఇవ్వలేదు.
► జాధవ్‌ను ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసి, మిలిటరీ నిర్బంధంలో బలవంతంగా నేరవాంగ్మూలం నమోదుచేశారు. జాధవ్ కుటుంబానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా న్యాయ నిర్బంధంలో ఉంచారు.
► మరణవిక్ష విధిస్తూ పాకిస్తాన్ సైనిక కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలి.
► జాదవ్‌పై మోపిన అభియోగాలన్నీ అవాస్తవం.
► జాధవ్‌కు దౌత్యసాయాన్ని నిరాకరించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మే 8న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని భారత్ ఆశ్రయించగా... మరణశిక్షపై స్టే విధించిన ఐసీజే అత్యవసర విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అప్పీలుకు 150 రోజుల సమయమిచ్చాం
అయితే భారత్ వాదనల్ని పాక్ తోసిపుచ్చింది. అంతర్జాతీయ కోర్టును భారత్ రాజ కీ య వేదికగా వాడుకుంటుందని ఆరోపించింది. ఉగ్ర కార్యకలాపాల్లో ప్రమేయమున్న గూఢచారి విషయంలో వియన్నా ఒప్పందంలోని నిబంధనలు వర్తించవని వాదించింది.
► జాధవ్ మరణశిక్షపై అప్పీలు చేసుకునేందుకు 150 రోజుల సమయం ఇచ్చాం.
► జాధవ్‌ను అరెస్టు చేసినప్పుడు అతని పాస్‌పోర్ట్ కాపీని భారత్‌కు అందచేశాం. అనంతరం నేరవాంగ్మూలం వీడియోను అందచేసినా ఎలాంటి ప్రతిస్పందనా రాలేదు. జాధవ్ పాస్‌పోర్టులో ముస్లిం పేరుపై ప్రశ్నించినా సమాధానం ఇవ్వలేదు.
► జాధవ్ దౌత్యపరమైన సంప్రదింపులకు అర్హుడుకాదు. భారత్ దరఖాస్తు విచారణ అత్యవసరం కాదని, దానిని తిరస్కరించాలి.
► ఇరాన్ నుంచి పాకిస్తాన్‌కు వచ్చిన కుల్‌భూషణ్‌ను బలూచిస్తాన్‌లో అదుపులోకి తీసుకున్నాం. హడావుడిగా విచారించి శిక్ష విధించారన్న భారత్ ఆరోపణలు నిజం కాదు.
► స్టే ఉత్తర్వులు పొందడమే భారత్ అసలైన, నిజమైన లక్ష్యం. పాకిస్తాన్‌పై తీవ్ర ఆరోపణలు చేసినా.. అందుకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు.
► ఈ సందర్భంగా నేరాన్ని ఒప్పకుంటూ జాధవ్ ఇచ్చిన వాంగ్మూల వీడియోను చూపిస్తామని ఖురేషి కోర్టుకు తెలపగా ఐసీజే అందుకు నిరాకరించింది.