international court of justice
-
పాలస్తీనాను అదీనంలో ఉంచుకోవడం చట్టవిరుద్ధం
ది హేగ్: పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలను ఇజ్రాయెల్ తమ అ«దీనంలో ఉంచుకోవడం చట్ట విరుద్ధమని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. ఆక్రమిత ప్రాంతాల నుంచి వైదొలగాలని, అక్కడ స్థిర నివాసానికి కాలనీల నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలని సూచించింది. 57 ఏళ్ల కిందట ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాలపై ఇజ్రాయెల్ అజమాయిషీని తప్పుపడుతూ అంతర్జాతీయ న్యాయం స్థానం తీర్పు ఇవ్వడం అసాధారణ విషయంగా పేర్కొంటున్నారు. వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలెంలలో ఇజ్రాయెల్ సెటిల్మెంట్లను నిర్మించడం, విస్తరించడం, ఆక్రమిత ప్రాంతాలను స్వా«దీనం చేసుకోవడం, వాటిపై నియంత్రణ, అక్కడి సహజ వనరులను వినియోగించుకోవడం, పాలస్తీనియన్లపై వివక్షతో కూడిన విధానాలను అమలు చేయడం.. ఇవన్నీ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని జడ్జీల ప్యానెల్ అభిప్రాయపడింది. ఆక్రమిత ప్రాంతాలపై ఇజ్రాయెల్‌కు సార్వ¿ౌమాధికారం లేదని, పాలస్తీనాలోని ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించడంఅంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని పేర్కొంది. అయితే అంతర్జాతీయ న్యాయ స్థానం ఇచి్చన ఈ తీర్పుకు కట్టుబడి ఉండాల్సిన, పాటించాల్సిన అవసరం ఇజ్రాయెల్‌కు లేదు. ఇదొక అభిప్రాయం మాత్రమే. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దీనిపై స్పందిస్తూ.. ఆ ప్రాంతాలు యూదు ప్రజల చారిత్రక మాతృభూమిలో భాగమన్నారు. -
International Court of Justice: రఫాలో సైనిక చర్య ఆపండి
ది హేగ్: దక్షిణ గాజాలోని రఫా నగరంలో సైనిక చర్యను తక్షణం ఆపాలని ఇజ్రాయెల్‌ను ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ శుక్రవారం ఆదేశించింది. అయితే ఇజ్రాయెల్ ఈ ఆదేశాలకు కట్టుబడి ఉండకపోవచ్చు. పాలస్తీనియన్లపై దాడుల విషయంలో అంతర్జాతీయంగా మద్దతు కోల్పోతున్న ఇజ్రాయెల్‌పై కోర్టు ఆదేశాలు మరింత ఒత్తిడిని పెంచుతాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో 10 లక్షల పైచిలుకు పాలస్తీనియన్లు రఫాకు వలస వచ్చారు. వీరిలో చాలామంది టెంట్లలో నివసిస్తున్నారు. రఫాపై ఇజ్రాయెల్ దృష్టి సారించడంతో మిత్రదేశం అమెరికాతో సహా పలుదేశాలు వారించాయి. ఈ వారమే మూడు యూరోప్ దేశాలు తాము పాలస్తీనాను స్వతంత్రదేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. హమాస్‌కు మిగిలిన చివరి సురక్షిత స్థావరంగా రఫా ఉందని, దానిపై దాడి చేస్తేనే వారిని తుడిచిపెట్టగలమని ఇజ్రాయెల్ అంటోంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే) అధ్యక్షుడు నవాఫ్ సలామ్ తీర్పు వెలువరిస్తూ ‘రఫాలో సైనిక చర్యపై తాము వెలిబుచ్చిన భయాలు నిజమయ్యాయని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ తక్షణం రఫాలో సైనిక చర్య నిలిపివేయకుంటే భారీగా ప్రాణనష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు వారాల కిందట రఫాను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీచేసింది. సైన్యాన్ని రఫా దిశగా నడిపించి కీలకమైన సరిహద్దు మార్గాన్ని తమ ఆ«దీనంలోకి తీసుకొంది. మానవతాసాయం అందడానికి రఫా క్రాసింగ్ అత్యంత కీలకం. అందుకే రఫా క్రాసింగ్‌ను తెరిచి ఉంచాలని ఐసీజే శుక్రవారం ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆదేశాలు అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌కు ఎదురుదెబ్బే అయినా .. రఫాపై దాడులు చేయకుండా ఇజ్రాయెల్‌ను నిలువరించలేవు. ఎందుకంటే ఐసీజే వద్ద తమ ఆదేశాలను అమలుచేయడానికి అవసరమైన పోలీసు, సైనిక బలగాలేమీ లేవు. -
Israel-Hamas war: ఇజ్రాయెల్ దాడుల్లో 174 మంది మృతి
గాజా: హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో ప్రజల మరణాలను, విధ్వంసాన్ని నివారించడంతోపాటు జన హనన చర్యలను మానుకోవాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించి రోజైనా గడవక మునుపే గాజాపై ఇజ్రాయెల్ మళ్లీ భీకర దాడులు ప్రారంభించింది. 24 గంటల వ్యవధిలో 174 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా మరో 310 మంది గాయపడినట్లు శనివారం గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. శనివారం ఉదయం రఫాలో ఓ నివాసంపై జరిగిన దాడిలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు చనిపోయారని స్థానిక అధికారులు తెలిపారు. -
Israel-Hamas war: గాజాలో పౌరుల మరణాలను నివారించాలి
ది హేగ్: ఇజ్రాయెల్ ఆర్మీ– హమాస్ మధ్య పోరు కారణంగా గాజాలో తీవ్ర ప్రాణనష్టం సంభవిస్తుండటం, ప్రజలు అంతులేని వేదనకు గురికావడంపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం కారణంగా అక్కడ అమాయక ప్రజల మరణాలను, నష్టాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరింది. అయితే, ఇజ్రాయెల్ ఆర్మీ గాజాలో యుద్ధం ద్వారా మారణహోమానికి పాల్పడుతోందన్న ఆరోపణలను కొట్టివేయరాదని ఐసీజే నిర్ణయించింది. గాజాలో వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలన్న ఉత్తర్వులను మాత్రం ఐసీజే ఇవ్వలేదు. తాజా ఉత్తర్వులు మధ్యంతర తీర్పు మాత్రమేనని చెబుతున్నారు. గాజాలో యుద్ధానికి విరామం ప్రకటించేలా, అక్కడి ప్రజలకు వెంటనే మానవతా సాయం అందేలా చూడాలని దక్షిణాఫ్రికా ఐసీజేలో కేసు వేసింది. దీని విచారణకు ఏళ్లు పట్టొచ్చని భావిస్తున్నారు. -
మారణ హోమానికి పాల్పడొద్దు.. ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం
ఇజ్రాయెల్ సైన్యం గాజాపై దాడులు చేస్తూ విరుచుకుపడుతూనే ఉంది. హమాస్ మిలిటెంట్లను అంతం చేయటమో తమ లక్ష్యంగా బాంబు దాడులకు తెగపడుతోంది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో ‘మారణ హోమం’ జరుగుతోందని ఆరోపిస్తూ సౌతాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానం(ICJ)లో కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దానిపై నెదర్లాండ్స్‌లోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ విచారణ జరిపింది. గాజాలో మారణ హోమానికి దారి తీసే ఎటువంటి చర్యలు చేపట్టరాదని ఐసీజే ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని మాత్రం ఆపేయమని కానీ, కాల్పుల విరమణకు సంబంధించి కానీ ఎలాంటి ప్రకటన చెయకపోవటం గమనార్హం. ‘గాజా ప్రాంతంలో జరుగుతున్న మానవీయ విషాదం తీవ్రత సంబంధించి మాకు తెలుసు. యుద్ధంలో పోతున్న ప్రాణాలు, ప్రజలు పడుతున్న కష్టాల పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేస్తోంది’ అని అంతర్జాతీయ కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దక్షిణాఫ్రికా కోరినట్లు కోర్టు కాల్పుల విరమణ సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కోర్టు ఉత్తర్వులను అనుసరించి తీసుకున్న చర్యలపై నెల రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. దక్షిణాఫ్రికా ఆరోపణలను ఇజ్రాయెల్ మరోసారి తీవ్రంగా ఖండించింది. దక్షిణాఫ్రికా దేశం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని.. మొత్తంగా వక్రీకరించబడిన మాటలని మండిపడింది. గాజాలోని హమాస్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటి వరకు 26000మంది పాలస్తీనా ప్రజలు మరణించారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన మెరుపు దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ ప్రజలు మృతి చెందారు. -
అంతర్జాతీయ కోర్టులో సీన్ రివర్స్ ... ఊహించని షాక్‌లో రష్యా
Indian Judge Votes Against Russia: ఉక్రెయిన్ పై దాడిని నిలిపివేయాలని బుధవారం అంతర్జాతీయ ఉన్నత న్యాయస్థానం(ఐసీజే) రష్యాని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు న్యాయస్థానం మాస్కో బలప్రయోగం పట్ల తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు రష్యన్ ఫెడరేషన్ ఉక్రెయిన్ భూభాగంలో ఫిబ్రవరి 24న ప్రారంభించిన సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేస్తుందని స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో తుది నిర్ణయం పెండింగ్‌లో ఉందని ప్రిసైడింగ్ జడ్జి జోన్ డోనోఘ్యూ అంతర్జాతీయ న్యాయస్థానానికి తెలిపారు. అయితే ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే కైవ్ అంతర్జాతీయ న్యాయంస్థానంలో ఫిర్యాదు చేసింది. అయితే మాస్కో ఐసీజేకి అధికార పరిధి లేదంటూ వాదిస్తూ ఉంది. కానీ ఐసీజే ఈ కేసులో అధికార పరిధిని కలిగి ఉందని తీర్పునివ్వడమే గాక ఉక్రెనియన్ భూభాగంలో మారణహోమం జరిగినట్లు రష్యన్ ఫెడరేషన్ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు కూడా తమ వద్ద లేవని గట్టి కౌంటరిచ్చింది. అంతేగాక ఉక్రెయిన్ నుంచి పారిపోతున్న శరణార్థుల సంఖ్య మూడు మిలియన్లకు చేరుకోవడం తోపాటు కైవ్‌లోని నివాస భవనాలపై రష్యా దళాలు దాడులను పెంచడంతో బుధవారం ఈ కేసు విచారణకు వచ్చింది. యూటర్న్ తీసుకున్న భారత న్యాయమూర్తి అయితే భారత్ అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎప్పుడు తటస్థ వైఖరిని అవలంభిస్తుంది. అలాగే అంతర్జాతీయ న్యాయస్థానానికి చేరిన ఉక్రెయిన్ రష్యా వ్యవహారంలో కూడా అలానే ఉండాలనుకుంది. అంతేకాదు తటస్థంగా ఉన్నమంటూ రష్యాకు సహకరిస్తున్న భారత్‌కు అంతర్జాతీయ న్యాయస్థానంలో తాము నామినేట్ చేసిన భారత జడ్జీ ఊహించని షాక్ ఇచ్చారు. అయినా ఇప్పటివరకూ జరిగిన ఐరాస భద్రతా మండలి, సాధారణ సమావేశాల్లో భారత్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఖండించమే కాక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చిందే తప్ప ఓటింగ్‌కి మాత్రం దూరంగానే ఉండిపోయింది. అయితే హేగేలోని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ దాడి పై జరిగిన ఓటింగ్‌లో భారత్ తన తటస్థ వైఖరికి భిన్నంగా ఓటు వేసింది. ఈ మేరకు ఐసీజేలో భారత న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. జస్టిస్ భండారీ పూర్తిగా ప్రభుత్వం, వివిధ మిషన్ల మద్దతుతో ఐసీజేకికి నామినేట్ అయ్యారు. జస్టిస్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడం, పైగా ఆయన ఇచ్చిన వివరణ ఆధారంగా ఇవన్నీ స్వతంత్ర చర్య అయినప్పటికీ, వివిధ అంతర్జాతీయ వేదికలపై భారతదేశం వైఖరికి భిన్నంగా ఉందని స్పష్టమైపోయింది. దీంతో ఇప్పటివరకు తటస్థ రాగం ఆలపించిన భారత్‌కు భారీ షాక్ తగిలింది. (చదవండి: రష్యా పైశాచికత్వం...చిన్నారులని కూడా చూడకుండా బాంబుల దాడి) -
దాడులు ఆపండి.. రష్యాకు అంతర్జాతీయ కోర్టు కీలక ఆదేశాలు
World Court Orders Russia To Stop War: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ కోర్టు సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆపాలంటూ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే మిలటరీ ఆపరేషన్‌ను నిలిపివేసి, భద్రతా బలగాలను వెనక్కు తీసుకోవాలని ఐసీజే ఆదేశించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఐసీజే ఆదేశాలను రష్యా తప్పక పాటించాల్సి ఉంటుంది. కాగా, అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానంలో తామే గెలిచామని పేర్కొన్నారు. చదవండి: మా కలలను కల్లోలం చేశారు: జెలెన్ స్కీ ఆవేదన -
Vladimir Putin: పుతిన్‌ను బోనెక్కిస్తారా?.. సాధ్యమేనా..?
హేగ్: ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై యుద్ధనేరం ఆరోపణల కింద దర్యాప్తు చేపడతామని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీసీ) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలు యుద్ధ నేరాలుగా పరిగణించేందుకు తగు ఆధారాలున్నాయని కూడా ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ అంటున్నారు. అయితే, అంతర్జాతీయ నేర చట్టాలకు కొన్ని పరిమితులు ఉన్నాయంటున్నారు నిపుణులు. రష్యా అధ్యక్షుడిని ఐసీసీ ముందుకు తీసుకురావడం అంత తేలికైన పని కాదని తేల్చేస్తున్నారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న వాటికి ఆయన్ను బాధ్యుడిగా చేయడానికి తగిన ఆధారాలు, సాక్ష్యాలు సేకరించడం ఐసీసీ ప్రాసిక్యూటర్‌కు సులువైన పనేమీ కాదని చెబుతున్నారు. రోమ్ ఒప్పందం ప్రకారం నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో 1998లో 123 సభ్య దేశాలతో అంతర్జాతీయ శాశ్వత నేర న్యాయస్థానం(ఐసీసీ) అవతరించింది. ఈ ఒప్పందంపై రష్యా, ఉక్రెయిన్లు సంతకాలు కూడా చేశాయి. కానీ, దీనిని ఆదేశాలు ధ్రువీకరించలేదు. ఈ కోర్టు పరిధిలోకి జనహననం, యుద్ధనేరాలు, దురాక్రమణ నేరాలు, మానవాళిపై దురాగతాలు వంటి నాలుగు అంశాలు వస్తాయి. చీఫ్ ప్రాసిక్యూటర్ ఏమంటున్నారు..? ఉక్రెయిన్‌లో జరిగే దురాగతాలపై ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీంఖాన్ 2014 నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ఉక్రెయిన్‌లో తాజాగా చోటుచేసుకుంటున్న అన్ని అనుమానిత నేరాలను కూడా ఈ దర్యాప్తులో కలుపుతామని ఇటీవల ఆయన ప్రకటించారు. ఉక్రెయిన్ మానవాళిపై జరిగే దురాగతాలు, యుద్ధ నేరాలు, జనహననం అనే మూడు రకాల నేరాలను పరిగణనలోకి తీసుకునేందుకు ఐసీసీకి అధికారం ఉంటుందని కొందరు నిపుణులు అంటున్నారు. రష్యా గానీ, ఉక్రెయిన్ గానీ రోమ్ ఒప్పందాన్ని ఆమోదించనందున ఐసీసీ అధికార వర్తింపుపై అనేక అనుమానాలున్నాయి. అయితే, ఐసీసీ దర్యాప్తునకు అనుమతిస్తూ ఉక్రెయిన్ ఇటీవల ఒక నోటిఫికేషన్ జారీ చేసినందున విచారణకు అడ్డంకులు ఉండవని కూడా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉండగా ఆయన్ను ఐసీసీ ముందుకు తీసుకురావడం కష్టమే అయినా, భవిష్యత్తులో ఆయన పదవి నుంచి వైదొలిగిన పరిస్థితుల్లో సాధ్యమయ్యేందుకు అవకాశం ఉందని మరో కోణంలో విశ్లేషిస్తున్నారు. గతంలో అధికారంలో ఉండగా కొందరు దేశాధ్యక్షులను అంతర్జాతీయ న్యాయస్థానం ముందు నిలబెట్టిన దుష్టాంతాలున్నాయంటూ యుగోస్లేవియా నేత స్లొబొడాన్ విలోసెవిక్, లైబీరియా నేత చార్లెస్ టేలర్ వంటి వారి పేర్లను గుర్తు చేస్తున్నారు. పుతిన్‌ను బాధ్యుడ్ని చేస్తారా? రష్యా అధ్యక్షుడు ఐసీసీ ముందుకు వచ్చే విషయంలో చట్టపరమైన పలు అంశాలు అడ్డుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఐసీసీ అభియోగాలుమోపి, ఆధారాలు సేకరించి అరెస్ట్ వారెంట్ జారీ చేసినా పుతిన్‌ను కోర్టుకు రప్పించడంలో మిగతా సభ్య దేశాలు కోర్టుకు సహకరించకపోవచ్చు. ‘ఇలాంటి సందర్భాల్లో నేర దర్యాప్తు పూర్తయ్యేందుకు చాలా సమయం తీసుకుంటుంది. ఇంతా చేసి పుతిన్‌ను కోర్టుకు తీసుకువస్తారా అంటే అదీ అనుమానమేనన్నది పరిశీలకుల మాట. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉక్రెయిన్ తమపై దురాక్రమణ నిలిపివేయాలని ఉక్రెయిన్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ఐసీజే) ఆశ్రయించింది. రష్యాను నిలువరించడంలో ఐసీజే కీలకమని ఉక్రెయిన్ ప్రతినిధి అంటోన్ కొరినివిచ్ చెప్పారు. వెంటనే మిలటరీ ఆపరేషన్లు నిలిపివేయాలని రష్యాను ఆదేశించాలని కోరారు. ఒకవేళ మిలటరీ చర్య ఆపాలని ఐసీజే ఆదేశించినా, రష్యా లెక్క చేయకపోవచ్చని యుద్ధ నిపుణుడు టెర్రీ గిల్ అభిప్రాయపడ్డారు. ఒక దేశం ఐసీజే ఆదేశాలను పాటించకపోతే సదరు దేశంపై చర్య తీసుకోవాలని ఐరాస భద్రతామండలిని ఐసీజే కోరుతుంది. మండలిలో రష్యాకు వీటో పవర్ ఉందని గిల్ చెప్పారు. ప్రస్తుత విచారణకు సైతం రష్యా ప్రతినిధులు హాజరవలేదు. 1948 ఒప్పందం ప్రకారం ఇరుదేశాలకు మధ్య వివాదం తలెత్తితే ఐసీజేను ఆశ్రయించవచ్చు. దీని ఆధారంగా ఉక్రెయిన్ పిటిషన్ వేసింది. -
Kulbhushan Jadhav Case : కీలక పరిణామం
ఇస్లామాబాద్: భారతీయ నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్(51) కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాక్ తాజా చర్యతో ఆయనకు భారీ ఊరట లభించింది. తన శిక్షపై అప్పీల్ చేసుకునే హక్కు ఆయనకు ఇప్పుడు లభించింది. అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తీర్పు మేరకు పాక్ జాతీయ అసెంబ్లీలోని దిగువ సభ, ఐసీజే (రివ్యూ అండ్ రీ కన్సిడరేషన్) బిల్లు–2020ను గురువారం ఆమోదించింది. జాదవ్‌ని గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై 2017 ఏప్రిల్‌లో పాక్ మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. జాదవ్‌కు ఎలాంటి దౌత్యసాయం కల్పించకుండా, న్యాయవాదులు కలవడానికి వీల్లేకుండాచేసి, ఆయన వాదనలు వినకుండా ఉరికంబం ఎక్కించాలని పాక్ కుట్ర పన్నింది. భారత్ పంపిన దౌత్యాధికారులను జాదవ్‌ను కలవనివ్వకుండా పాక్ ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో జాదవ్ మరణ శిక్షపై సవాల్ చేసింది. ఐసీజే చొరవతో.. వాదోపవాదాలు విన్న ఐసీజే జాదవ్ మరణశిక్షపై పాకిస్తాన్ పునఃపరిశీలన చేయాలని, ఏ మాత్రం జాప్యం లేకుండా ఆయనకు న్యాయవాదుల్ని నియమించుకునే అవకాశం ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చింది. దీంతో పాక్ ప్రభుత్వం ఇప్పుడు ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. దీనికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆర్డినెన్స్ 2020 అని పేరు పెట్టింది. సంవత్సరం సాగదీత తర్వాత గురువారం విపక్ష పార్టీల గందరగోళం, సభ నుంచి వాకౌట్ల నడుమ పాక్ ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. దీంతో తనకు విధించిన మరణ శిక్షపై జాదవ్ ఏ హైకోర్టులోనైనా అప్పీలు చేసుకోవచ్చు. ఈ చర్య ద్వారా తాము ఎంత బాధ్యతాయుతంగా ఉంటామో ప్రపంచ దేశాలకు తెలిసిందని పాక్ న్యాయశాఖ మంత్రి ఫరోగ్ నసీమ్ వ్యాఖ్యానించారు. ఇక ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన లాయర్లతో జాదవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకునే వీలు కల్పించింది. అయితే భారత్ మాత్రం ఇక్కడి లాయర్‌ను నియమించాలని ప్రయత్నిస్తోంది. కాగా, గూఢచర్యం ఆరోపణలతో జాదవ్‌ను బలూచిస్థాన్‌లో పాక్ అరెస్ట్ చేసిందని ప్రకటించుకోగా.. కాదు జాదవ్‌ను ఇరాన్‌లోని చబాహర్ పోర్టులో అరెస్ట్ చేశారని భారత్ పేర్కొంది. నిజానికి ఐసీజే ఈ ఆదేశాలిచ్చి ఏడాదికి పైనే గడుస్తున్నా.. పాక్ వక్రబుద్ధి ప్రదర్శిస్తూ ఆలస్యం చేస్తూ వచ్చింది. తన కొడుకు విషయంలో ఇది ఊరట కలిగించే విషయమని, పాక్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు జాదవ్ తండ్రి సుధీర్ పేర్కొన్నాడు. ఇది మన దౌత్య విభాగం సాధించిన విజయమని జాదవ్ స్నేహితుడు అరవింద్ మీడియాకు తెలిపాడు. చదవండి: పాక్ కొత్త కుట్ర -
చైనాకు భారీ షాక్.. ఐసీజేలో ఫిర్యాదు
బీజింగ్: పొరుగుదేశాలతో కయ్యానికి తయారుగా ఉండే చైనా.. తన దేశం లోపల కూడా పలు అరాచకాలకు పాల్పడుతుంది. అయితే ఆ దేశంలో ప్రభుత్వ ఆంక్షలు కఠినంగా ఉండటంతో అక్కడ జరిగే దారుణాల గురించి బయట ప్రపంచానికి వెంటనే తెలియదు. ముఖ్యంగా ఉయ్ఘర్ ముస్లింల పట్ల చైనా దారుణంగా ప్రవర్తిస్తోంది. వారిని కనీసం మనుషులుగా కూడా చూడదు. మానవహక్కులు అనే మాట ఉయ్ఘర్ల విషయంలో పూర్తిగా నిషేధం. అయితే చైనా ఇన్ని అకృత్యాలకు పాల్పడుతుంటే అంతర్జాతీయ సంస్థలైన ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానం ఏం చేస్తున్నాయనే అనుమానం తలెత్తవచ్చు. చైనా వీటి ఆదేశాలను అస్సలు పట్టించుకోదు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే చైనా అంతర్జాతీయ న్యాయస్థానంలో సభ్య దేశం కాదు. ఫలితంగా చైనా చేసే దుశ్చర్యలు ఐసీజే పరిధిలోకి రాకపోవడంతో అది ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లు తయారయ్యింది పరిస్థితి. ఈ క్రమంలో చైనాను ఎదుర్కొనేందుకు రెండు బహిష్క్రిత ఉయ్ఘర్ల గ్రూపులు ఐసీజే తలుపు తట్టాయి. డ్రాగన్ కబంద హస్తాల నుంచి తమను కాపాడాల్సిందిగా కోరుతున్నాయి. ఆ వివరాలు.. (‘రోహింగ్యాలపై హత్యాకాండ ఆపండి’) 1. చైనా నుంచి బహిష్కరించబడిన రెండు ఉయ్ఘర్ గ్రూపులు ప్రస్తుతం చైనా, దాని అధ్యక్షుడు జిన్‌పింగ్ తమ పట్ల పాల్పడుతున్న నేరాల గురించి.. సృష్టిస్తోన్న మారణహోమం గురించి అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాయి. 2. ప్రభుత్వం బహిష్కరణ ఎదుర్కొంటున్న తూర్పు తుర్కిస్తాన్, తూర్పు తుర్కిస్తాన్ నేషనల్ అవేకెనింగ్ ఉద్యమకారులు చైనా దాని నాయకులు కంబోడియా, తజికిస్తాన్లలో ఉయ్ఘర్లను దారుణంగా హింసిస్తున్నారని ఆరోపించారు. 3. అయితే చైనా ఐసీజేలో సభ్య దేశం కాదు. అలాంటప్పుడు వీరు ఎలా ఫిర్యాదు చేస్తారనే ఓ అనుమానం. దానికి వారు 2018-19లో వెలువడిన ఓ తీర్పు ఆధారంగా ఫిర్యాదు చేశామంటున్నారు. ఆ తీర్పు ఏంటంటే.. ఐసీజేలోని సభ్య దేశం పట్ల.. సభ్యత్వం లేని దేశం నేరాలకు పాల్పడితే.. అంతర్జాతీయ న్యాయస్థానం తన అధికార పరిధిని విస్తరిపంచేసి.. సభ్యత్వం లేని దేశాన్ని కూడా విచారించవచ్చని ఐసీజే తెలిపింది. 4. దీని ప్రకారమే బంగ్లాదేశ్‌లో రోహింగ్యాలపై జరుగుతున్న నేరాల గురించి మయన్మార్ ఐసీజేలో ఫిర్యాదు చేసింది. ఇక్కడ బంగ్లాదేశ్‌కు ఐసీజే సభ్యత్వం ఉండగా.. మయన్మార్‌కు సభ్యత్వం లేదు. 5. ప్రస్తుత కేసులో పిటిషనర్లు చైనా.. తజకిస్తాన్, కంబోడియా నుంచి ఉయ్ఘర్లను అక్రమంగా జిన్జియాంగ్ ప్రావిన్స్‌కు తరలించడమే కాక అక్కడ వారిని ఖైదు చేసి హింసిస్తుందని.. మతం మార్చడమే కాక బలవంతపు వివాహాలు జరిపిస్తుందని ఆరోపించారు. 6. చైనాకు ఐసీజేలో సభ్యత్వం లేనప్పటికి.. తజకిస్తాన్, కంబోడియాలు సభ్య దేశాలు కాబట్టి ఈ కేసును విచారించాల్సిందిగా పిటిషనర్లు కోరారు. ముఖ్యంగా జిన్‌పింగ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి ‘సీక్రెట్ స్పీచెస్’ పేరుతో ఉయ్ఘర్లకు వ్యతిరేకంగా అమలు చేయాల్సిన చర్యల గురించి మార్గదర్శకాలు జారీ చేశారు. నాటి నుంచి హింస మరింత పెరిగింది. జిన్జియాంగ్లో ఉయ్ఘర్ల పట్ల జరుగుతున్న అణచివేత విధానాలపై అంతర్జాతీయ సమాజం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 7. ఉయ్ఘర్ల పట్ల జరుగుతున్న హింసకు సంబంధించి పలువురు నిపుణులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. దీనిలో భాగంగా ఉపగ్రహ చిత్రాలు, ఉయ్ఘర్లకు సంబంధించి చైనా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రహస్యంగా సేకరించే పనిలో ఉన్నారు. అయితే చైనాపై చర్యలు తీసుకోవడం అంత తేలికగా జరిగే పని కాదని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు చైనా ఉయ్ఘర్ల సమస్యను అంతర్గత వ్యవహారంగా పేర్కొంటుంది. 8. ఈ క్రమంలో జర్మనీకి చెందిన ప్రసిద్ధ మానవ శాస్త్రవేత్త డాక్టర్ అడ్రియాన్ జాంజ్ చైనా దుశ్చర్యలను తెరపైకి తెచ్చారు. చైనా ప్రభుత్వం వెల్లడించిన పత్రాలను అధ్యయనం చేశారు జాంజ్. ఈ పత్రాలు మాండరిన్ భాషలో ఉన్నాయి. దీని ఆధారంగా చైనా ఏర్పాటు చేసిన రీ-ఎడ్యుకేషన్ క్యాంప్‌లో సుమారు 18 లక్షల మంది ఉయ్ఘర్ ముస్లింలను జైలులో పెట్టారని ఆయన పేర్కొన్నారు. 9. ముస్లిం జనాభాను తగ్గించడానికి చైనా అణచివేత విధానాలను అనుసరిస్తోందని జాంజ్ తెలిపారు. దేశంలోని మైనారిటీ ముస్లింలకు వ్యతిరేకంగా చైనా ప్రభుత్వం జనాభా, సాంస్కృతిక మారణహోమం విధానాల ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. 10. ఉయ్ఘర్ ప్రజలపై చైనా అణచివేత ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా దీనిపై స్పందించింది. జూన్ చివరిలో మైక్ పాంపియో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా తన అణచివేత విధానాన్ని నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ఉయ్ఘర్ల విషయంలో చైనా తీరు పట్ల అంతర్జాతీయ సమాజం స్పందించాలని పాంపియో కోరారు. -
చైనాపై ఐసీజేలో కేసు వేయాలి
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను సృష్టించిన చైనాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో (ఐసీజే) కేసు దాఖలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఈ వైరస్‌ను చైనా ఉద్దేశపూర్వకంగానే తయారు చేసిందని, నష్టపరిహారంగా 600 బిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేయాలని పిటిషనర్ కె.కె.రమేశ్ కోరారు. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి, వందలాది మరణాలకు కారణమవుతున్న కరోనా వైరస్ చైనాలోని ‘వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’లో రూపుదిద్దుకుంది అనేందుకు కచ్చితమైన ఆధారాలున్నాయని ఆ పిటిషన్లో రమేశ్ వివరించారు. -
మరో ట్విస్టు: ఐసీజేకు నిర్భయ దోషులు!
న్యూఢిల్లీ: ఉరిశిక్ష అమలు తేదీ సమీపిస్తున్న వేళ నిర్భయ దోషులు మరోసారి శిక్షను వాయిదా వేసేందుకు పావులు కదుపుతున్నారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరణశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ ఐసీజేలో ఈ మేరకు దోషులు అక్షయ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ సోమవారం పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో మరో దోషి ముఖేశ్ సింగ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసిన నేపథ్యంలో ఈ ముగ్గురు ఐసీజేను ఆశ్రయించడం గమనార్హం. కాగా 2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థినిని అత్యంత దారుణంగా హింసించి మరీ ఆరుగురు అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. అనంతరం ఆమెను, ఆమె స్నేహితుడిని రోడ్డు మీదకు విసిరేశారు. దీనస్థితిలో ప్రాణాల కోసం పోరాడి చివరకు ఆ యువతి సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూసింది. (ఇంకా ఏం మిగిలి ఉంది: సుప్రీంకోర్టు) ఈ క్రమంలో ఆమెకు నిర్భయగా నామకరణం చేసిన పోలీసులు నిందితులు రామ్‌సింగ్, అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు(అతనిపై నిఘా కొనసాగుతుంది). అనేక పరిణామాల అనంతరం మిగిలిన నలుగురు దోషులకు సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించగా.. అప్పటి నుంచి శిక్ష అమలును వాయిదా వేసేందుకు దోషులు చట్టంలోని వివిధ సెక్షన్లను ఉపయోగించుకుంటూ ఎప్పటికప్పుడు తమను తాము కాపాడుకుంటున్నారు. ఇక మార్చి 20న నలుగురు దోషులను ఉరితీయాలంటూ డెత్ వారెంట్లు జారీ అయిన నేపథ్యంలో... తమకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ వారి కుటుంబ సభ్యులు రాష్ట్రపతికి లేఖ రాయడం గమనార్హం.(‘ప్రతీకారమే శక్తికి నిర్వచనం కాదు’) చదవండి: శరీరమంతా రక్తం.. తల మీద చర్మం ఊడిపోయి -
‘రోహింగ్యాలపై హత్యాకాండ ఆపండి’
ది హేగ్: మయన్మార్ సైన్యం దాడులతో బంగ్లాదేశ్ వెళ్లి తలదాచుకుంటున్న లక్షలాది మంది రోహింగ్యా ముస్లింలకు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బాసటగా నిలిచింది. రోహింగ్యాలపై మారణకాండను ఆపేందుకు మయన్మార్ ప్రభుత్వం వెంటనే అన్ని రకాల చర్యలనూ తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తున్నదీ ముందుగా నాలుగు నెలలకు, ఆ తర్వాత ఆరు నెలలకోసారి నివేదిక అందించాలని ఐసీజే ప్రెసిడెంట్ అబ్దుల్ఖవీ అహ్మద్ యూసఫ్ కోరారు. మయన్మార్ సైన్యం రోహింగ్యాలపై అత్యాచారాలు, హత్యలు, ఆస్తుల విధ్వంసాలకు పాల్పడుతోందని ముస్లిం దేశాల తరఫున ఐసీజేలో గాంబియా వాదించింది. -
మౌనం వీడని శాంతి కపోతం
మయన్మార్‌లో రొహింగ్యా ముస్లిం శరణార్థులపై జరుగుతున్న అఘాయిత్యాలను, అత్యాచారాలను చూస్తూ కూర్చున్న వారి జాబితాతో కూడిన కేసొకటి విచారణ కోసం గురువారం అర్జెంటీనాలోని అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు వచ్చింది. ప్రధాన నిందితుల జాబితాలో ఆ దేశాన్ని పాలిస్తున్న ఆంగ్ సాన్ సూకీ పేరు కూడా ఉండటంతో ఈ పూర్వపు యోధురాలు మళ్లీ వార్తల్లోకి వచ్చారు. జీవించే హక్కును కాలరాస్తున్నారన్న ఆరోపణతో సూకీ పై తొలిసారిగా నమోదైన కేసు ఇది! సూకీ ప్రస్తుతం మయన్మార్ స్టేట్ కౌన్సెలర్. ఆ పదవి ప్రధాని పదవితో సమానం. నేరుగా ప్రధాని పదవే ఇవ్వడానికి అక్కడి రాజ్యాంగ నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. మయన్మార్ ప్రధానికి గానీ, వారి కుటుంబ సభ్యులకు గానీ విదేశీ మూలాలు ఉండేందుకు లేదు. సూకీ భర్త మైఖేల్ ఆరిస్ (1999 లో చనిపోయారు) బ్రిటిష్ దేశస్థుడు. ఈ దంపతుల పిల్లలు సహజంగానే బ్రిటిష్ సంతతి వారు అవుతారు. అందువల్ల సూకీ ‘స్టేట్ కౌన్సిలర్’ గా ఉండిపోవలసి వచ్చింది. దేశ నిర్దేశకురాలు అంతే. రాష్ట్రపతి ఉంటారు కానా, నామమాత్రం. నాడు యోధురాలు 1989 జూలై 20 నుంచి 2010 నవంబర్ 13 వరకు ఇరవయ్యొక్కేళ్ల కాలంలో మధ్య మధ్య స్వల్ప విరామాలతో దాదాపు 15 ఏళ్ల పాటు బర్మా సైనిక పాలకుల నిర్బంధంలో గడిపారు సూకీ. నిర్బంధం నుంచి బయటపడిన ఏడాదిన్నర తర్వాత – బ్యాంకాక్‌లో ఏర్పాటైన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనడం కోసం సూకీ చేసిన తొలి విమాన ప్రయాణంలో ఆమెను చూడగానే కేప్టెన్ ఆనందాన్ని పట్టలేకపోయాడు. అంతేనా! కాక్‌పిట్ లోకి ఆహ్వానించి, అక్కడ కొంతసేపు కూర్చోబెట్టి మర్యాదలు చేశాడు. ఆ హైటెక్ కంట్రోల్ ప్యానెల్ నుంచి భూమి మీద మినుకు మినుకుమని వెలుగుతున్న నగరాలను చూడగానే సూకీకి మయన్మార్ నిరుద్యోగ యువకులు, వారి కలలు, ఆశలు గుర్తొచ్చాయి. తర్వాత.. బ్యాంకాక్‌లో జరిగిన ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’లో ఆమె ప్రసంగిస్తూ.. ‘‘కొంతమంది బర్మా అని, కొంతమంది మయన్మార్ అని పిలిచే మా చిన్ని భూభాగానికి మీరంతా పెద్ద మనసుతో అసరా ఇవ్వాలి’’ అని విజ్జప్తి చేశారు. ఆ తర్వాత ఆమె అన్న మాట ఫోరమ్ సభ్యుల మనసు గెలుచుకుంది. ‘‘కొంచెం ఇవ్వండి చాలు. అవినీతికి అవకాశం కల్పించేంత భారీ స్థాయి పెట్టుబడులు అక్కర్లేదు’’ అన్నారు సూకీ. లేత నీలి రంగు దుస్తులలో, తలలో తెల్లటి పూలతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడొక స్వేచ్ఛా విహంగంలా కనిపించారంటూ అంతర్జాతీయ న్యూస్ చానళ్లు ఆహ్లాదకరమైన పోలికను తెచ్చాయి. నేడెందుకీ తారతమ్యాలు అంతటి స్వేచ్ఛా విహంగం ఇప్పుడెందుకిలా రొహింగ్యాల హక్కుల రెక్కలు విరిచేస్తున్నారన్న ఆరోపణలపై కనీసం ఒక్క మాటైనా మాట్లాడలేక, నిందితురాలిగా మిగిలిపోతున్నారు? ఇదే ప్రశ్నను బి.బి.సి. రిపోర్టర్ సూకీని అడిగినప్పుడు ఆమె చెప్పిన సమాధానం ఒక్కటే. ‘‘ఏళ్ల తరబడి ఒక దేశం నియంతృత్వంలో ఉన్నప్పుడు.. ప్రజాస్వామ్యం వచ్చాక కూడా ఆ దేశంలోని ప్రజల భయం పోదు. ఆ ప్రజలు ఎవర్నీ విశ్వసించరు. అదే విధంగా మయన్మార్ ప్రజలు బంగ్లాదేశ్ నుంచి లక్షలాదిగా వలస వస్తున్న రొహింగ్యాలను అనుమానంగా చూస్తున్నారు. పర్యవసానమే ప్రస్తుత పరిస్థితి’’ అని!! ఈ మాటతో అంతర్జాతీయ న్యాయస్థానం ఏకీభవిస్తుందా అన్నది చూడాలి. ►నిర్బంధం నుండి విముక్తురాలయ్యాక.. బ్యాంకాక్‌లో ఏర్పాటైన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనడం కోసం సూకీ చేసిన తొలి విమాన ప్రయాణంలో ఆమెను చూడగానే కేప్టెన్ ఆనందాన్ని పట్టలేకపోయాడు. అంతేనా! కాక్‌పిట్‌లోకి ఆహ్వానించి, అక్కడ కొంతసేపు కూర్చోబెట్టి సూకీకి మర్యాదలు చేశాడు. -
ఐసీజే తీర్పుకు తలొగ్గిన పాకిస్థాన్..!
ఇస్లామాబాద్ : కులభూషణ్ జాదవ్‌కు గూఢచర్యం ఆభియోగంపై పాకిస్థాన్ ప్రభుత్వం విధించిన ఉరిశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో పాక్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ మిలటరీ కోర్టు విధించిన ఉరిశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) నిలిపివేయాలన్న తీర్పుకు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్ సర్కార్ తలొగ్గింది. ఐసీజే తీర్పును అమలుచేయడానికి పాక్ సైనిక చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. ఈ సవరణ ఆధారంగా కుల్ భూషణ్ జాదవ్ తనకు విధించిన శిక్షపై సివిల్ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఆర్మీ చట్టంలో ఈ విధంగా సవరణలు చేపడుతున్నట్లు పాక్ మీడియా వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలపై 2016 మార్చి 3న పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పాక్ బలగాలు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ న్యాయస్థానం 2017 ఏప్రిల్‌లో కులభూషణ్‌కు మరణశిక్ష విధించింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇరాన్లో వ్యాపార కార్యకలాపాలు చేసుకుంటుండగా పాక్ అక్రమంగా నిర్భందించి, న్యాయస్థానానికి కూడా అనుమతివ్వలేదని భారత్ పిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఐసీజే కుల్‌భూషణ్ మరణశిక్షను నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. భారత్‌కు న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉందని, మరణశిక్షను పాక్ సమీక్షించేంతవరకు శిక్ష అమలును నిలిపివేస్తున్నట్లు నాయస్థానం ప్రకటించింది. -
కశ్మీర్‌పై ఐసీజేకి వెళ్తాం: పాక్
ఇస్లామాబాద్/జమ్మూ/శ్రీశ్రీనగర్: కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పాక్ తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విదేశాంగ మంత్రి ఖురేషి తెలిపారు. కశ్మీర్ అంశాన్ని అన్ని అంతర్జాతీయ వేదికలపైనా ప్రస్తావించడంతో పాటు, ఐసీజేలోనూ పిటిషన్ వేస్తామని ఆగస్టు 6వ తేదీన జరిగిన పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రధాని ఇమ్రాన్ ఇటీవల చెప్పారు. పాక్ కాల్పుల్లో భారత జవాను మృతి నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాలు, భారత ఆర్మీ పోస్టులే లక్ష్యంగా పాక్ బలగాలు మరోసారి కాల్పులకు తెగబడ్డాయి. పూంచ్ జిల్లాలో జరిపిన కాల్పుల్లో ఓ ఆర్మీ జవాను మరణించగా, నలుగురు పౌరులు గాయపడ్డారు. భారత బలగాలు జరిపిన కాల్పుల్లో పాక్ ఆర్మీకి భారీ నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. సరిహద్దు వెంబడి కృష్ణా ఘటి, మెందర్ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం పాకిస్తాన్ బలగాలు కాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో బిహార్‌కు చెందిన రవిరంజన్ సింగ్ (36) మరణించగా నలుగురు పౌరులు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. కాగా, బాలాకోట్ దాడుల సమయంలో పాక్ విమానాలను మిగ్–21తో ఎంతో ధైర్యంగా తరుముకుంటూ వెళ్లిన ఐఏఎఫ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను చిత్రహింసలు పెట్టిన పాక్ కమాండో అహ్మద్ ఖాన్.. భారత సైన్యం కాల్పుల్లో హతమైనట్లు సమాచారం. ఆగస్టు 17వ తేదీన భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుం డగా నక్యాల్ సెక్టార్లో సైన్యం జరిపిన కాల్పుల్లో అహ్మద్ ఖాన్ మరణించినట్లు సమాచారం. మిగ్ 21 జెట్ విమానాన్ని కూల్చేయడంతో తప్పించుకున్న అభినందన్‌ను పాక్ సైన్యం పట్టుకున్న విషయం తెలిసిందే. కాగా, జమ్మూ కశ్మీర్లో క్రమంగా ప్రశాంత వాతావరణం నెలకొంటోంది. దాదాపు 15 రోజుల తర్వాత మంగళవారం శ్రీనగర్‌లో వాణిజ్య కేంద్రం లాల్ చౌక్ వద్ద బారికేడ్లను పోలీసులు తొలగించారు. పలు ప్రాంతాల్లో ఆంక్షలను సడలించారు. శాంతి భద్రతల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాల మోహరింపు కొనసాగుతోంది. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులపై నిషేధం కొనసాగుతోంది. కశ్మీర్లోకి ప్రవేశించేందుకు యత్నించిన కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్‌ను జమ్మూ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అడ్డుకుని తిరిగి ఢిల్లీకి పంపేశారు. -
ఉరి.. సరి కాదు
ద హేగ్: అంతర్జాతీయ వేదికపై భారత్‌కు విజయం. నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(49)కు పాకిస్తాన్ విధించిన మరణ శిక్షను ఆ దేశం తప్పనిసరిగా పునఃసమీక్షించాలని నెదర్లాండ్స్‌లోని ద హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం కీలక తీర్పు చెప్పింది. ఐసీజే అధ్యక్షుడు, జడ్జి అబ్దుల్ఖవీ అహ్మద్ యూసఫ్ నేతృత్వంలోని 16 మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు చెబుతూ జాధవ్‌ను దోషిగా తేల్చడాన్ని, ఆయనకు విధించిన శిక్షను పాక్ పునఃసమీక్షించాలని ఆదేశించింది. ఈ తీర్పును ఈ ఏడాది ఫిబ్రవరి 21నే కోర్టు రిజర్వ్‌లో ఉంచి బుధవారం వెలువరించింది. ఇండియా తరఫున న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. పాకిస్తాన్ సైనిక కోర్టుల విశ్వసనీయతను ఆయన ప్రశ్నించారు. జాధవ్‌ను కలిసేందుకు భారత అధికారులను అనుమతించకుండా ఇండియాకు ఉన్న రాయబార హక్కులకు పాక్ భంగం కలిగించిందన్న వాదనను 15 మంది న్యాయమూర్తులు అంగీకరించగా, ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారు. ‘నిర్బంధంలో ఉన్న కుల్‌భూషణ్ జాధవ్‌ను కలిసేందుకు, ఆయనకు న్యాయపరమైన సహాయం అందించేందుకు భారత అధికారులను పాక్ అనుమతించకపోవడం ద్వారా, ఇండియా హక్కులను పాక్ కాలరాసింది. వియన్నా ఒప్పందం ప్రకారం జాధవ్ అరెస్టు, నిర్బంధం గురించిన సమాచారాన్ని భారత్‌కు వెంటనే తెలియజేయాల్సిన బాధ్యత పాక్‌కు ఉంది’ అని జడ్జి యూసఫ్ పేర్కొన్నారు. ఈ తీర్పుపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ ‘జాధవ్ కేసులో భారత విధానం సరైనదేనని ఈ చరిత్రాత్మక తీర్పు స్పష్టం చేస్తోంది. జాధవ్‌ను వీలైనంత త్వరగా విడుదల చేయించి భారత్‌కు తీసుకొచ్చేందుకు మేం మా పనిని కొనసాగిస్తాం’ అని పేర్కొంది. వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది.. జాధవ్‌ను నిర్బంధించిన విషయాన్ని భారత్‌కు పాక్ మూడు వారాలు ఆలస్యంగా తెలియజేయడం ద్వారా వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని తీర్పులో జడ్జి యూసఫ్ ప్రస్తావించారు. జాధవ్‌ను కలిసేందుకు తమ అధికారులను అనుమతించాల్సిందిగా అనేకసార్లు పాక్‌ను భారత్ కోరినా అందుకు ఆ దేశం అంగీకరించలేదన్న విషయం సుస్పష్టమవుతోందని పేర్కొన్నారు. గూఢచర్యం, ఉగ్రవాదం నేరాలపై జాధవ్‌కు పాక్ మిలిటరీ కోర్టు 2017 ఏప్రిల్‌లో మరణ శిక్ష విధించగా, ఆ శిక్ష అమలును నిలిపివేయాలంటూ భారత్ ఐసీజేను ఆశ్రయించడం తెలిసిందే. సమస్యాత్మక బలూచిస్తాన్ ప్రావిన్సులోకి జాధవ్ ఇరాన్ నుంచి ప్రవేశించారనీ, 2016 మార్చి 3న ఆయనను తమ భద్రతా దళాలు పట్టుకున్నాయనీ, జాధవ్ గూఢచర్యం, ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారనేది పాక్ వాదన. అయితే ఈ అంశంలో భారత్ వాదన మరోలా ఉంది. నౌకాదళం నుంచి ఉద్యోగ విరమణ పొందిన అనంతరం జాధవ్ ఇరాన్లో వ్యాపారం చేసుకుంటుండగా, పాక్ అక్కడి నుంచి ఆయనను అపహరించి బలూచిస్తాన్‌కు తీసుకొచ్చిందని భారత్ ఆరోపిస్తోంది. సైనిక కోర్టులో రహస్య విచారణ జరిపిన అనంతరం 2017 ఏప్రిల్‌లో పాక్ ఆయనకు మరణ శిక్ష విధించగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ అదే ఏడాది మే నెలలో భారత్ ఐసీజేను ఆశ్రయించింది. దీంతో తుది తీర్పు చెప్పే వరకు జాధవ్‌కు శిక్ష అమలును నిలిపివేయాలని అప్పట్లో ఐసీజే మధ్యంతర తీర్పు చెప్పింది. తర్వాత 2017 డిసెంబర్ నెలలో ఇస్లామాబాద్‌లో జాధవ్‌ను కలిసేందుకు ఆయన భార్యకు, తల్లికి పాక్ అనుమతి ఇచ్చింది. భారత్‌కు భారీ విజయం: బీజేపీ నేతలు జాధవ్ కేసులో ఐసీజేలో భారత్‌కు భారీ విజయం లభించిందని పలువురు బీజేపీ నేతలు అంటున్నారు. ‘ఐసీజే తీర్పు భారత్‌కు లభించిన భారీ విజయం’ అని రాజ్‌నాథ్ అన్నారు. జాధవ్ కుటుంబ సభ్యలకు త్వరలోనే తగిన పరిహారం దక్కుతుందని విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. తీర్పు తమకు లభించిన విజయమని పాక్ చెప్పుకోవడంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఓ ట్వీట్ చేస్తూ ‘అలా అనుకోవడం మీ తప్పు కాదు. ఎందుకంటే తీర్పును ఇంగ్లీష్‌లో చెప్పారు కదా’ అని వ్యంగ్యంగా అన్నారు. పలువురు ఇతర బీజేపీ నేతలు ఐసీజే తీర్పును స్వాగతించారు. మూడేళ్ల నాలుగు నెలలుగా... ► 2016, మార్చి 3: కుల్‌భూషణ్ జాధవ్‌ను అరెస్ట్ చేసిన పాక్ భద్రతా దళాలు. ► మార్చి 24: భూషణ్ భారత గూఢచారి అనీ, ఆయనను బలూచిస్తాన్‌లో అరెస్టు చేశామని ప్రకటించిన పాక్. ► మార్చి 26: పాక్ ఆరోపణను తోసిపుచ్చిన భారత్. ఆయన నౌకాదళ విశ్రాంత అధికారి అనీ, ఇరాన్లో వ్యాపారం చేసుకునే వారని ప్రకటన. ► మార్చి 29: జాధవ్‌ను కలవడానికి రాయబారులను అనుమతించాలంటూ 16వ సారి పాక్‌ను కోరిన ఇండియా. అయినా ఒప్పుకోని పాకిస్తాన్. ► 2017, ఏప్రిల్ 10: పాక్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నారంటూ కుల్‌భూషణ్‌కు మరణ శిక్ష విధించిన పాకిస్తాన్ సైనిక కోర్టు. ► మే 8: పాక్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఆశ్రయించిన భారత్. ► మే 9: మరణ శిక్ష అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిన ఐసీజే. ► మే 15: జాధవ్ కేసు విచారణలో ఐసీజేలో పరస్పరం ఆరోపణలు చేసుకున్న భారత్, పాక్. ► మే 18: తాము తుది తీర్పు ఇచ్చేంత వరకు జాధవ్ మరణ శిక్షను వాయిదా వేయాలని పాక్‌ను ఆదేశించిన ఐసీజే. ► జూన్ 22: పాకిస్తాన్ సైన్యాధిపతికి జాధవ్ క్షమాబిక్ష దరఖాస్తు చేసుకున్నారని సైనిక ప్రతినిధి వెల్లడి. ► నవంబర్ 10: జాధవ్‌ను కలిసేందుకు ఆయన భార్యకు అనుమతి ఇచ్చిన పాకిస్తాన్. ► డిసెంబర్ 25: జాధవ్‌ను కలిసిన ఆయన భార్య, తల్లి. ► 2019, ఫిబ్రవరి 18: జాధవ్ కేసులో నాలుగు రోజులు బహిరంగ విచారణను ప్రారంభించిన ఐసీజే. ► ఫిబ్రవరి 21: బహిరంగ విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ఐసీజే. ► జులై 17: జాధవ్ మరణశిక్షపై పునఃమీక్ష జరపాలని, అంత వరకు శిక్ష అమలును నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు. సిగ్గరి.. మంచివాడు కులభూషణ్‌పై అనెవాది గ్రామస్థుల భావన మహారాష్ట్రలోని అనెవాది గ్రామానికి చెందిన కుల్‌భూషణ్ చిన్నతనంలో పరేల్ గ్రామంలో పెరిగారు. కుల్‌భూషణ్ బిడియంతో ఉండేవాడనీ, ఎవరి జోలికీ వెళ్లేవాడు కాదని, తనపనేదో తాను చూసుకునే వాడని అనెవాది గ్రామస్థులు అంటున్నారు. ఏటా రెండు సార్లు స్వగ్రామానికి వచ్చేవాడనీ, రోజులో ఎక్కువ సమయం పొలాల్లోనే గడిపేవాడని వారు గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రులను శ్రద్ధగా చూసుకునే కుల్‌భూషణ్ పట్ల అందరికీ సదభిప్రాయమే ఉంది. కుల్‌భూషణ్ చదువులో, ఆటల్లోనూ ప్రతిభ కనబరిచేవాడని ఆయన బాల్య స్నేహితుడు తులసీరామ్ పవార్ చెప్పారు. ఏ సమయంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా తానున్నానంటూ ముందుకెళ్లేవాడని ప్రశంసించారు. నౌకాదళం నుంచి కుల్‌భూషణ్ పదవీ విరమణ చేశాక ఇరాన్లో వ్యాపారం చేసుకునే వారని వారు అంటున్నారు. జాధవ్‌ను అన్యాయంగా నిర్బంధించిన పాక్, ఆయనకు ఉరి శిక్ష విధించడం ఎంత మాత్రమూ సరికాదని అనెవాది గ్రామస్థులంటున్నారు. భారత్‌కు ఒక్క రూపాయి, పాక్‌కు 20 కోట్లు ఐసీజేలో తమ వాదనలు వినిపించేందుకు భారత్ కేవలం ఒక్క రూపాయి ఖర్చు పెట్టగా, పాక్ ఇందుకు రూ. 20 కోట్లు వ్యయం చేసింది. ఈ కేసు వాదించడానికి హరీశ్ సాల్వే కేవలం ఒక్క రూపాయిని ఫీజుగా తీసుకుటున్నారని 2017 మే 15న నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. సాధారణంగా అయితే కేసులు వాదించేందుకు హరీశ్ సాల్వే ఒక్కో రోజుకి రూ. 30 లక్షలను ఫీజుగా తీసుకుంటారని సమాచారం. పాక్ తరఫున బ్రిటన్‌కు చెందిన లాయర్ ఖురేషీ వాదనలు వినిపించారు. జాధవ్ కేసును వాదించేందుకు ఫీజుగా ఆయనకు రూ. 20 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. సత్యం, న్యాయం నిలిచాయి: మోదీ కుల్‌భూషణ్ జాధవ్ కేసులో భారత్‌కు అనుకూలంగా ఐసీజే తీర్పును ఇవ్వడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్వాగతించారు. సత్యం, న్యాయం నిలిచాయని మోదీ పేర్కొన్నారు. ప్రతీ భారతీయుడి సంక్షేమం, భద్రత కోసం తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ పనిచేస్తుందని మోదీ వెల్లడించారు. ‘ఐసీజే ఈ రోజు ఇచ్చిన తీర్పును మేం స్వాగతిస్తాం. న్యాయం, సత్యం నిలిచాయి. వాస్తవాలను విస్తృతంగా పరిశీలించి ఈ తీర్పు చెప్పినందుకు ఐసీజేకు అభినందనలు’ అని మోదీ బుధవారం ఓ ట్వీట్లో తెలిపారు. జాధవ్‌కు తప్పక న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నిర్దోషిగా తేల్చలేదు: పాక్ ఐసీజే ఇచ్చిన తీర్పు పాక్‌కే అనుకూలంగా ఉందని ఆ దేశం అంటోంది. తాము ఇప్పుడు ఐసీజే తీర్పును అనుసరించి చట్టం ప్రకారం ముందుకెళ్తామని పాక్ వెల్లడించింది. పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘అంతర్జాతీయ సమాజంలో బాధ్యత గల సభ్యదేశంగా ఈ కేసులో తొలి నుంచీ మా వైఖరికి మేం కట్టుబడి ఉన్నాం. కోర్టు తీర్పును విన్నాం. పాకిస్తాన్ ఇప్పుడు చట్టం ప్రకారం ముందుకెళ్తుంది. జాధవ్‌ను నిర్దోషిగా ప్రకటించాలనీ, విడుదల చేయాలని భారత్ ఐసీజేలో కోరింది. కానీ భారత వాదనను ఐసీజే పట్టించుకోకుండా, కేవలం పాక్ విధించిన మరణశిక్షను, జాధవ్‌ను దోషిగా తేల్చడాన్ని పునఃసమీక్షించాలని మాత్రమే తీర్పు చెప్పింది. వీసా లేకుండా, భారత పాస్పోర్టుతో, హుస్సేన్ ముబారక్ పటేల్ అనే మారుపేరుతో జాధవ్ పాక్‌లోకి ప్రవేశించారని మేం పునరుద్ఘాటిస్తున్నాం’ అని పేర్కొంది. పాకిస్తాన్ మానవహక్కుల శాఖ మంత్రి షిరీన్ మజారీ మాట్లాడుతూ ‘పునఃసమీక్షలు పూర్తయ్యే వరకే జాధవ్‌కు మరణ శిక్ష అమలు చేయకుండా ఉండేలా పాక్‌ను ఐసీజే నివారించింది. ఈ తీర్పు పాక్‌కి అనుకూలంగా ఉంది. కేవలం జాధవ్‌ను కలిసేందుకు భారత అధికారులను అనుమతించలేదన్న విషయంలో మాత్రమే భారత్‌కు అనుకూలంగా ఈ తీర్పు ఉంది. మిగిలిన అన్ని అంశాలు/కోణాల్లోనూ భారత్ ఈ కేసులో ఓడిపోయిందనే చెప్పాలి. పునఃసమీక్షలు పూర్తయ్యే వరకు మాత్రమే మరణ శిక్ష అమలుకాదు’ అని పేర్కొన్నారు. ముంబైలో స్వీట్లు తినిపించుకుంటున్న జాదవ్ స్నేహితులు -
అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు విజయం
హేగ్ : అంతర్జాతీయ న్యాయస్ధానం(ఐసీజే)లో కుల్‌భూషణ్ జాదవ్‌కు భారీ ఊరట లభించింది. గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ పాక్ సైనిక కోర్టు కుల్‌భూషణ్ జాదవ్‌కు విధించిన మరణ శిక్షను నిలిపివేయాలని ఐసీజే బుధవారం తీర్పు వెలువరించింది. కుల్‌భూషణ్‌కు తమ నిఘా విభాగంతో సంబంధం లేదని భారత్ వాదించింది. గూఢచర్యం కేసులో 2016 మార్చిలో కుల్‌భూషణ్‌ను పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. 2017 ఏప్రిల్‌లో జాదవ్‌కు పాక్ సైనిక కోర్టు మరణ శిక్ష విధించింది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన భారత్ పదునైన వాదన వినిపించడంతో సానుకూల తీర్పు వెలువడింది. 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది న్యాయమూర్తులు భారత్ వాదనతో ఏకీభవించారు. కేసును పునసమీక్షించాలని అంతర్జాతీయ న్యాయస్ధానం పాకిస్తాన్‌కు సూచించింది. న్యాయస్థానం తీర్పుపై కేంద్ర మాజీమంత్రి సుష్మా స్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత్ విజయమని ఆమె అభివర్ణించారు. తీర్పును స్వాగతించిన సుష్మా స్వరాజ్...ఐసీజే ఎదుట భారత్ తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే ప్రభావవంతంగా వాదించారని, భారత్‌కు విజయం అందించిన ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. I wholeheartedly welcome the verdict of International Court of Justice in the case of Kulbhushan Jadhav. It is a great victory for India. /1 — Sushma Swaraj (@SushmaSwaraj) 17 July 2019 కాగా, ఇరాన్లో వ్యాపారం చేసే భారత నౌకాదళ మాజీ అధికారి అయిన జాధవ్‌ను పాక్ ఉద్దేశపూర్వకంగా అపహరించినట్టు భారత్ ప్రకటించింది. అంతర్జాతీయ ఒప్పందాలను, తీర్మానాలను ఉల్లంఘించిన ఆ దేశంపై ఐసీజేలో పిటిషన్ దాఖలు చేసింది. జాధవ్ మరణ శిక్షను రద్దు చేయాలని, తక్షణమే ఆయనను విడుదల చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో తుది తీర్పు వెలువడే వరకూ శిక్షను నిలుపుదల చేయాల్సిందిగా ఐసీజే పాక్‌ను గతంలో ఆదేశించింది. 2017 డిసెంబరులో జాధవ్‌ను కలిసేందుకు వెళ్లిన ఆయన తల్లిని, భార్యను భయపెట్టే విధంగా పాకిస్థాన్ వ్యవహరించినట్టు అప్పట్లో విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విమర్శించింది. వారిద్దరి చేత బలవంతంగా దుస్తులు మార్పింపచేయడం, మాతృభాషలో మాట్లాడేందుకు అనుమతించకపోవడం వంటి చర్యలను తీవ్రంగా తప్పుబట్టింది. -
జాదవ్ కేసులో త్వరలో తుదితీర్పు
హేగ్ : కుల్‌భూషణ్ జాదవ్ కేసులో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్ధానం ఆగస్టులో తుది తీర్పు వెలువరించనుంది. జాదవ్ కేసులోఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి 21 వరకూ సాగిన తుది విచారణలో భారత్, పాకిస్తాన్‌లు తమ వాదనలను న్యాయస్ధానానికి నివేదించాయి. భారత్‌కు చెందిన జాదవ్‌ను గూఢచర్య ఆరోపణలపై పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ ఇరాన్ నుంచి అపహరించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ సైనిక కోర్టు గూఢచర్య ఆరోపణలపై జాదవ్‌కు మరణ శిక్ష విధించింది. పాకిస్తాన్ కుట్రపూరితంగా వ్యవహరించి జాదవ్‌పై గూఢచర్య అభియోగాలు మోపిందని భారత్ ఆరోపిస్తోంది. పాక్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ భారత్ అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. -
పాక్ భాషపై భారత్ తీవ్ర అభ్యంతరం
హేగ్ : భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(48) కేసు విచారణ సందర్భంగా అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో పాకిస్తాన్ వాడిన భాషపై ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది. బుధవారం భారత్ తరఫున మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తూ..‘పాక్ న్యాయవాది ఖవార్ ఖురేషీ వాడిన భాష ఈ కోర్టులో ప్రతిధ్వనించింది. సిగ్గులేని, అర్థంలేని, అవమానకరమైన, పొగరుబోతు అనే పదాలను ఐసీజేకు సమర్పించిన పత్రాల్లో పాక్ వాడింది. పాకిస్తాన్ న్యాయవాది దుర్భాషను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ రకమైన భాషను వాడకుండా భారత సంస్కృతి మమ్మల్ని అడ్డుకుంటోంది. ఓ సార్వభౌమ దేశం మరో దేశంపై విమర్శలు చేసేటప్పుడు గౌరవప్రదమైన భాషను వాడాలి. చట్టంపై పట్టున్న వ్యక్తులు చట్టం ఆధారంగా వాదిస్తారు. బలమైన సాక్ష్యాధారాలు ఉన్నవారు వాటి ఆధారంగానే వాదనలు వినిపిస్తారు. ఇవేమీ లేనివారు కోర్టులో బల్లను మాత్రమే చరుస్తారు. భారత్ సాక్ష్యధారాలను ఐసీజే ముందు సమర్పిస్తే, పాకిస్తాన్ మాత్రం బల్లను బాదుతోంది’ అని విమర్శించారు. జాధవ్‌కు విధించిన మరణశిక్షను వెంటనే రద్దుచేసి విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. లేదంటే సాధారణ కోర్టులో విచారణ జరిపించడంతో పాటు దౌత్యాధికారుల్ని కలుసుకునే అనుమతి ఇవ్వాలన్నారు. నేడు పాకిస్తాన్ వాదనలు సమర్పించిన అనంతరం జాధవ్ కేసులో విచారణ ముగియనుంది. ఈ ఏడాది వేసవిలో ఐసీజే తీర్పు ఇవ్వనుంది. -
జాధవ్‌ను విడుదల చేయండి
హేగ్: భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(48)కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ఐసీజే) సోమవారం కోరింది. కుల్‌భూషణ్ జాధవ్‌ను వెంటనే విడుదల చేసేలా పాకిస్తాన్‌ను ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. జాధవ్‌పై నమోదైన అభియోగాలను నిరూపించడంలో పాక్ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టింది. జాధవ్‌ను కలుసుకునేందుకు కనీసం భారత దౌత్యాధికారిని పాక్ అనుమతించలేదనీ, ఇది వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనంది. గూఢచర్యం, ఉగ్రవాద అభియోగాల కింద దోషిగా తేలుస్తూ పాక్ సైనిక కోర్టు జాధవ్‌కు 2017 ఏప్రిల్ 10న మరణశిక్ష విధించింది. జాధవ్‌ను పాక్ ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసిందన్న భారత్.. మరణశిక్షను సవాలు చేస్తూ ఐసీజేను ఆశ్రయించింది. సోమవారం ఐసీజే ముందు భారత్ తరఫున వాదనలు వినిపించిన మాజీ సోలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే పాక్‡శైలిని తీవ్రంగా ఎండగట్టారు. ఆర్మీ అధికారులే జడ్జీలు ‘జాధవ్‌ను కలుసుకునేందుకు అనుమతించాలని భారత్ 13 సార్లు కోరింది. పాక్ వాటిని పట్టించుకోలేదు. కేసును విచారించిన పాక్ మిలటరీ కోర్టు జడ్జీలకు న్యాయ శిక్షణ లేదు. కనీసం న్యాయశాస్త్రంలో డిగ్రీ అవసరం లేదు. పాక్ మిలటరీ కోర్టులు గత రెండేళ్లలో 161 మంది పౌరులకు మరణశిక్ష విధించాయి. పాక్ మిలటరీ కోర్టుల్లో ఆర్మీ అధికారులే జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. వీరు ఆర్మీలోని ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు. మిలటరీ కోర్టులు పౌరుల్ని విచారించడంపై ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ట్స్ అభ్యంతరాలు లేవనెత్తినప్పటికీ పాక్ రాజ్యాంగాన్ని మార్చి మరణశిక్ష విధిస్తోంది’ అని మండిపడ్డారు. బలవంతంగా వాంగ్మూలం ఇప్పించారు జాధవ్ భారత గూఢచారి అని ఆరోపిస్తున్న పాకిస్తాన్ అందుకు తగ్గ సాక్ష్యాలను మాత్రం సమర్పించలేకపోయిందని సాల్వే విమర్శించారు. ‘ కేసులో జాధవ్‌కు కనీస న్యాయ సాయం అందించడంలో పాక్ ఘోరంగా విఫలమైంది. జాధవ్‌కు పాక్‌లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకు లేదు. జాధవ్ ఉగ్రవాది అని చెబుతున్న పాక్ అందుకు సంబంధించి ఒక్క సాక్ష్యాన్ని సమర్పించలేకపోయింది. ఆయన చేత బలవంతంగా నేరాంగీకార వాంగ్మూలాన్ని ఇప్పించారు. మూడేళ్లుగా జైలులో జాధవ్ అనుభవించిన మానసిక క్షోభను, ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన్ను విడుదల చేయాలని ఐసీజేను కోరుతున్నాం’ అని తెలిపారు. 3 నెలల గడువు ఎందుకు? జాధవ్‌ను 2016, మార్చి 3న అరెస్ట్ చేసిన పాకిస్తాన్ నెల రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదుచేసిందని సాల్వే అన్నారు. ‘విదేశీ పౌరులు గూఢచర్యం అభియోగం కింద అరెస్టయినా వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36 ప్రకారం ఆ విషయాన్ని సంబంధిత దేశానికి తెలియజేయాలి. కానీ అరెస్ట్‌పై పాక్ మాకు సమాచారమివ్వలేదు. దౌత్యసాయంపై ఒప్పందం ఉన్నప్పటికీ అది వియన్నా ఒప్పందానికి అనుబంధంగానే ఉంది. పాకిస్తాన్ వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36ను ఉల్లంఘించింది. జాధవ్‌ను కలుసుకునేందుకు 3 నెలల గడువు ఎందుకు కావాలో పాక్ సమాధానం చెప్పాలి. జాధవ్‌ను కలుసుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులను 2017, డిసెంబర్ 25న పాక్ అనుమతించినప్పటికీ, ఆ సందర్భంగా పాక్ అధికారుల తీరుపై భారత్ నిరసన తెలియజేసింది’ అని సాల్వే వెల్లడించారు. భారత్ వాదనలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం పాకిస్తాన్ తమ వాదనల్ని ఐసీజే ముందు వినిపించనుంది. పాక్ జడ్జికి గుండెపోటు ఇస్లామాబాద్: అంతర్జాతీయ న్యాయస్థానంలో జాధవ్ కేసు విచారణ సందర్భంగా పాక్ తాత్కాలిక జడ్జి హుస్సేన్ గిల్లానీ(69)కి గుండెపోటు వచ్చింది. దీంతో అధికారులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, హుస్సేన్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆర్టికల్ 31 ప్రకారం ఐసీజేలో విచారణ సందర్భంగా సంబంధిత దేశానికి కోర్టులో ప్రాతినిధ్యం లేకపోతే అదే దేశానికి చెందిన వ్యక్తిని ఐసీజే బెంచ్ తాత్కాలిక జడ్జీగా ఎంపిక చేస్తుంది. ఆ తరహాలో తాజాగా ఐసీజే హుస్సేన్‌ను తాత్కాలిక జడ్జిగా నియమించింది. దీంతో ఐసీజేలో మొత్తం జడ్జీల సంఖ్య 16కు చేరుకుంది. ఐసీజేలో సాధారణంగా 15 మంది జడ్జీలు ఉంటారు. వీరు 9 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఐసీజేలో భారత్ తరఫున దల్వీర్ భండారీ జడ్జీగా వ్యవహరిస్తున్నారు. పాక్ అధికారులకు ‘నమస్కారం’ జాధవ్ కేసు విచారణ సందర్భంగా ఐసీజే ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ అధికారులతో కరచాలనం చేసేందుకు భారత అధికారులు నిరాకరించారు. జాధవ్ కేసు విచారణ మొదలయ్యే ముందు పాక్ అటార్నీ జనరల్ అన్వర్ మన్సూర్ ఖాన్ భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి దీపక్ మిట్టల్‌తో కరచాలనం చేసేందుకు చెయ్యి చాచగా, మిట్టర్ నమస్కారం పెట్టారు. దీంతో ఖాన్ నెదర్లాండ్స్‌లో భారత రాయబారి వేణు రాజమొనితో కరచాలనం చేసేందుకు యత్నించారు. కానీ అయన కూడా నమస్కారం పెట్టి తప్పుకున్నారు. ఈ ఘటనతో ఖంగుతిన్న అన్వర్ ఖాన్.. చివరికి చేసేదేం లేక భారత మాజీ అటార్నీ జనరల్ హరీశ్ సాల్వేతో కరచాలనం చేసి తన స్థానానికి వెళ్లి కూర్చున్నారు. మరోవైపు పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి, సార్క్ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ ఫైజల్‌కు కూడా మిట్టల్ నమస్కారంతోనే సరిపెట్టారు. -
జాదవ్ కేసులో విచారణ షురూ
-
జాదవ్ కేసులో విచారణ షురూ
హేగ్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నెలకొనగా, ఇదే సమయంలో కుల్ భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్ధానంలో విచారణ ప్రారంభమైంది. గూఢచర్యం ఆరోపణలపై 2016లో బెలూచిస్తాన్‌లో అరెస్టైన జాదవ్‌కు పాక్ సైనిక కోర్టు మరణ శిక్ష విధించింది. పాక్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ భారత్ అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. ఈ కేసులో తీర్పు వెలువరించే వరకూ శిక్ష అమలును నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్ధానం స్పష్టం చేసింది. జాదవ్ భారత్ గూఢచారిగా పాక్ పేర్కొంటుండగా, రిటైర్డ్ నేవీ అధికారి జాదవ్‌ను కిడ్నాప్ చేశారని భారత్ పేర్కొంటోంది. కాగా జాదవ్ కేసులో భారత్ తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే అంతర్జాతీయ న్యాయస్ధానంలో వాదనలు వినిపిస్తున్నారు. భారత్‌పై పాక్ దుష్ర్పచారం భారత్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసేందుకు పాకిస్తాన్ న్యాయస్ధానాన్ని వాడుకుంటోందని సాల్వే ఆరోపించారు. జాదవ్‌కు మరణ శిక్ష విధిస్తూ పాకిస్తాన్ సైనిక కోర్టు చేపట్టిన విచారణ సరైన పద్ధతిలో సాగలేదని స్పష్టం చేశారు. కాన్సులర్ కస్టడీ లేకుండా జాదవ్ కస్టడీ కొనసాగింపు చట్టవిరుద్ధమని ప్రకటించాలని సాల్వే కోరారు. వాస్తవాలను వక్రీకరించడంలో పాకిస్తాన్ ఘనత విస్మరించలేనిదని చురకలు అంటించారు. జాదవ్‌ను దోషిగా తేల్చే ప్రక్రియలో ప్రత్యేక దశలను నిర్ధిష్టంగా వెల్లడించేందుకు పాకిస్తాన్ విముఖత వ్యక్తం చేస్తోందని సాల్వే అభ్యంతరం వ్యక్తం చేశారు. -
నేటి నుంచి జాధవ్ విచారణ
హేగ్: భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(48)కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించడంపై నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో సోమవారం నుంచి వాదనలు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి 22 వరకూ నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ కోర్టు భారత్, పాకిస్తాన్ల వాదనల్ని విననుంది. ఈ కేసులో భారత్ తరఫున మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే, పాకిస్తాన్ తరఫున బారిస్టర్ ఖవార్ ఖురేషీ వాదనలు వినిపించనున్నారు. 2016, మార్చి 3న ఇరాన్ నుంచి బలోచిస్తాన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన కుల్‌భూషణ్ జాధవ్‌ను అరెస్ట్ చేసినట్లు పాక్ ప్రకటించింది. ముస్లిం పేరున్న నకిలీ పాస్పోర్టుతో జాధవ్ పాక్‌లో గూఢచర్యం చేసేందుకు ప్రవేశించారనే నేరంపై పాక్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. -
333 తిమింగలాలు ఊచకోత..
టోక్యో: బూడిద రంగు తిమింగలాలపై పరిశోధనల పేరుతో జపాన్ చేపట్టిన దుర్మార్గమైన సముద్ర వేటలో 333 తిమింగలాలు హతమయ్యాయి. జపాన్ ఊచకోత కోసిన 128 ఆడ తిమింగలాల్లో 122 గర్భంతో ఉన్నట్లు ఒక రిపోర్టు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. దక్షిణ అంటార్కిటికా మహా సముద్రంలో పరిశోధనల పేరిట జపాన్ ఈ ఘాతుకానికి పాల్పడింది. కాగా, 2014 మార్చిలో అంతర్జాతీయ న్యాయస్థానం జపాన్ చర్యలపై స్పందించింది. పరిశోధనల పేరుతో బూడిద రంగు తిమింగలాల విచ్చలవిడి వేటను నిలిపేయాలని ఆదేశించింది. తిమింగలాల వేటను వ్యాపార అవకాశంగా జపాన్ మారుస్తోందని కోర్టు ఆక్షేపించింది. ప్రతి ఏటా డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు 12 వారాల పాటు నిర్విరామంగా జపాన్ సముద్ర యాత్ర చేస్తుంది. అయితే, ఐసీజే ఉత్తర్వులు, అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా జపాన్ తన వైఖరి మార్చుకుంది. ఏటా దాదాపు 900 పైగా తిమింగలాలను వేటాడే బదులు ఈ ఏడాది 333 తిమింగలాలకే పరిమితమైంది. బూడిద రంగు తిమింగలాల సంఖ్య, వాటి ప్రవర్తన, జీవ శాస్త్రీయ అధ్యయనం కోసం వేటాడుతున్నామనీ, తిమింగలాల వేట తమ సంస్కృతిలో భాగమని జపాన్ వాదిస్తోంది. కాగా, ఈ ఘటనపై తిమింగలాల పరిరక్షణ సమితి మాత్రం పెద్ద ఎత్తున్న ఉద్యమించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు మూగజీవాల పట్ల జపాన్ ప్రభుత్వం కొనసాగించిన దమనకాండపై జంతు పరిరక్షణ సమితులు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తుండగా.. ఈ వేట ప్రతి యేటా జరిగే తంతేనని కొందరు కొట్టిపారేస్తున్నారు.