హేగ్: ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై యుద్ధనేరం ఆరోపణల కింద దర్యాప్తు చేపడతామని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీసీ) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలు యుద్ధ నేరాలుగా పరిగణించేందుకు తగు ఆధారాలున్నాయని కూడా ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ అంటున్నారు. అయితే, అంతర్జాతీయ నేర చట్టాలకు కొన్ని పరిమితులు ఉన్నాయంటున్నారు నిపుణులు.
రష్యా అధ్యక్షుడిని ఐసీసీ ముందుకు తీసుకురావడం అంత తేలికైన పని కాదని తేల్చేస్తున్నారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న వాటికి ఆయన్ను బాధ్యుడిగా చేయడానికి తగిన ఆధారాలు, సాక్ష్యాలు సేకరించడం ఐసీసీ ప్రాసిక్యూటర్‌కు సులువైన పనేమీ కాదని చెబుతున్నారు. రోమ్ ఒప్పందం ప్రకారం నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో 1998లో 123 సభ్య దేశాలతో అంతర్జాతీయ శాశ్వత నేర న్యాయస్థానం(ఐసీసీ) అవతరించింది. ఈ ఒప్పందంపై రష్యా, ఉక్రెయిన్‌లు సంతకాలు కూడా చేశాయి. కానీ, దీనిని ఆదేశాలు ధ్రువీకరించలేదు. ఈ కోర్టు పరిధిలోకి జనహననం, యుద్ధనేరాలు, దురాక్రమణ నేరాలు, మానవాళిపై దురాగతాలు వంటి నాలుగు అంశాలు వస్తాయి.
చీఫ్ ప్రాసిక్యూటర్ ఏమంటున్నారు..?
ఉక్రెయిన్‌లో జరిగే దురాగతాలపై ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీంఖాన్ 2014 నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ఉక్రెయిన్‌లో తాజాగా చోటుచేసుకుంటున్న అన్ని అనుమానిత నేరాలను కూడా ఈ దర్యాప్తులో కలుపుతామని ఇటీవల ఆయన ప్రకటించారు. ఉక్రెయిన్ మానవాళిపై జరిగే దురాగతాలు, యుద్ధ నేరాలు, జనహననం అనే మూడు రకాల నేరాలను పరిగణనలోకి తీసుకునేందుకు ఐసీసీకి అధికారం ఉంటుందని కొందరు నిపుణులు అంటున్నారు. రష్యా గానీ, ఉక్రెయిన్ గానీ రోమ్ ఒప్పందాన్ని ఆమోదించనందున ఐసీసీ అధికార వర్తింపుపై అనేక అనుమానాలున్నాయి.
అయితే, ఐసీసీ దర్యాప్తునకు అనుమతిస్తూ ఉక్రెయిన్ ఇటీవల ఒక నోటిఫికేషన్ జారీ చేసినందున విచారణకు అడ్డంకులు ఉండవని కూడా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉండగా ఆయన్ను ఐసీసీ ముందుకు తీసుకురావడం కష్టమే అయినా, భవిష్యత్తులో ఆయన పదవి నుంచి వైదొలిగిన పరిస్థితుల్లో సాధ్యమయ్యేందుకు అవకాశం ఉందని మరో కోణంలో విశ్లేషిస్తున్నారు. గతంలో అధికారంలో ఉండగా కొందరు దేశాధ్యక్షులను అంతర్జాతీయ న్యాయస్థానం ముందు నిలబెట్టిన దుష్టాంతాలున్నాయంటూ యుగోస్లేవియా నేత స్లొబొడాన్ విలోసెవిక్, లైబీరియా నేత చార్లెస్ టేలర్ వంటి వారి పేర్లను గుర్తు చేస్తున్నారు.
పుతిన్‌ను బాధ్యుడ్ని చేస్తారా?
రష్యా అధ్యక్షుడు ఐసీసీ ముందుకు వచ్చే విషయంలో చట్టపరమైన పలు అంశాలు అడ్డుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఐసీసీ అభియోగాలుమోపి, ఆధారాలు సేకరించి అరెస్ట్ వారెంట్ జారీ చేసినా పుతిన్‌ను కోర్టుకు రప్పించడంలో మిగతా సభ్య దేశాలు కోర్టుకు సహకరించకపోవచ్చు. ‘ఇలాంటి సందర్భాల్లో నేర దర్యాప్తు పూర్తయ్యేందుకు చాలా సమయం తీసుకుంటుంది. ఇంతా చేసి పుతిన్‌ను కోర్టుకు తీసుకువస్తారా అంటే అదీ అనుమానమేనన్నది పరిశీలకుల మాట.
అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉక్రెయిన్
తమపై దురాక్రమణ నిలిపివేయాలని ఉక్రెయిన్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ఐసీజే) ఆశ్రయించింది. రష్యాను నిలువరించడంలో ఐసీజే కీలకమని ఉక్రెయిన్ ప్రతినిధి అంటోన్ కొరినివిచ్ చెప్పారు. వెంటనే మిలటరీ ఆపరేషన్లు నిలిపివేయాలని రష్యాను ఆదేశించాలని కోరారు. ఒకవేళ మిలటరీ చర్య ఆపాలని ఐసీజే ఆదేశించినా, రష్యా లెక్క చేయకపోవచ్చని యుద్ధ నిపుణుడు టెర్రీ గిల్ అభిప్రాయపడ్డారు. ఒక దేశం ఐసీజే ఆదేశాలను పాటించకపోతే సదరు దేశంపై చర్య తీసుకోవాలని ఐరాస భద్రతామండలిని ఐసీజే కోరుతుంది. మండలిలో రష్యాకు వీటో పవర్ ఉందని గిల్ చెప్పారు. ప్రస్తుత విచారణకు సైతం రష్యా ప్రతినిధులు హాజరవలేదు. 1948 ఒప్పందం ప్రకారం ఇరుదేశాలకు మధ్య వివాదం తలెత్తితే ఐసీజేను ఆశ్రయించవచ్చు. దీని ఆధారంగా ఉక్రెయిన్ పిటిషన్ వేసింది.
Comments
Please login to add a commentAdd a comment