- రష్యా అధినేత పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
- తాను అధికారంలో ఉంటే ఉక్రెయిన్–రష్యా యుద్ధం జరిగేది కాదని వెల్లడి
వాషింగ్టన్: రష్యా అధినేత పుతిన్‌ను కలుసుకోవడానికి ఆసక్తితో ఉన్నానని, ఎప్పుడైనా సరే ఆయనతో చర్చలకు తాను సిద్ధమని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. చర్చలకు ముందుకు రాకపోతే రష్యాపై అదనపు ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. చర్చల బల్ల వద్ద కలుసుకుందామని పుతిన్‌కు సూచించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఇప్పటికే లక్షలాది మంది మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు.
సైనికులతోపాటు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం, నగరాలు, పట్టణాలు శిథిలాలుగా మారుతుండడం బాధాకరమని అన్నారు. మీడియాలో వస్తున్న వార్తల కంటే ఉక్రెయిన్‌లో మృతుల సంఖ్య అధికంగా ఉందన్నారు. వాస్తవాలు చెప్పడం లేదని మీడియాపై మండిపడ్డారు. ట్రంప్ స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
నాలుగేళ్ల క్రితం తాను అధ్యక్షుడిగా ఎన్నికై ఉంటే ఉక్రెయిన్–రష్యా యుద్ధం జరిగేది కాదని స్పష్టంచేశారు. సమర్థుడైన పాలకుడు అధికారంలో ఉంటే యుద్ధాలకు ఆస్కారం ఉండదని అన్నారు. పుతిన్ చాలా తెలివైన వ్యక్తి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తమ గత అధ్యక్షుడు జో బైడెన్‌ను, రష్యా ప్రజలను పుతిన్ అగౌరవపర్చారని ఆక్షేపించారు. పుతిన్ గురించి తనకు బాగా తెలుసని చెప్పారు. తాను పదవిలో ఉంటే మధ్యప్రాచ్యంలో సంక్షోభం తలెత్తేది కాదని పునరుద్ఘాటించారు.
200 మిలియన్ డాలర్లు అధికంగా ఖర్చు చేశాం
ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా, ఆర్థిక సాయం నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడుతున్నామని, త్వరలో పుతిన్‌తోనూ మాట్లాడుతామని చెప్పారు. ‘‘ఉక్రెయిన్– రష్యా యుద్ధానికి యూరోపియన్ యూనియన్ కంటే అమెరికా 200 మిలియన్ డాలర్లు అధికంగా ఖర్చు చేసింది.
మాతో సమానంగా యూరోపియన్ యూనియన్ భారం భరించాల్సిందే. మేము ఎక్కువ ఖర్చు పెట్టాం అంటే నిజంగా మూర్ఖులమే. అందులో సందేహం లేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. శాంతిని కోరుకుంటున్నట్లు జెలెన్‌స్కీ తనతో చెప్పారని వివరించారు. ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు. పుతిన్ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు చర్చలకు సిద్ధమని ట్రంప్ తేలి్చచెప్పారు. యుద్ధంలో మరణాలు ఇక ఆగిపోవాలని అన్నారు.
కృత్రిమ మేధలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
చైనా నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం టారిఫ్ విధించాలని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. చైనా నుంచి ఫెంటానైల్ అనే ప్రమాదకరమైన మాదకద్రవ్యం రాకుండా అడ్డుకోనున్నట్లు చెప్పారు. చైనా నుంచి మెక్సికో, కెనడా వంటి దేశాలకు, అక్కడి నుంచి అమెరికాకు ఫెంటానైల్ చేరుకుంటోందని ఆందోళన వ్యక్తంచేశారు.
డ్రగ్స్‌తోపాటు అక్రమ వలసదార్లను అమెరికాలోకి పంపిస్తున్న దేశాల ఉత్పత్తులపై భారీగా పన్నులు విధిస్తామని ఆయన గతంలోనే హెచ్చరించిన సంగతి తెలిసిందే. కృత్రిమ మేధ(ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనకు 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఒక కొత్త కంపెనీ ద్వారా నిధులు ఖర్చు చేస్తామన్నారు. ఒరాకిల్, సాఫ్ట్‌బ్యాంక్, ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో ఈ కంపెనీని స్థాపిస్తామన్నారు. స్టార్‌గేట్‌గా పిలిచే ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment