రష్యా అధ్యక్ష ఎన్నికల్లో హాట్‌ఫేవరెట్‌గా వ్లాదిమిర్ పుతిన్
నేటి నుంచి మూడ్రోజులపాటు కొనసాగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్
దాదాపు ఖాయమైన గెలుపు?
ఈ విజయంతో 2030దాకా పుతిన్ పాలనే!!
వ్లాదిమిర్ పుతిన్ పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే దేశం రష్యా. చాలా సంవత్సరాలుగా పుతిన్ ఏలుబడిలో ఉన్న రష్యాలో ఇవాళ్టి నుంచి మూడు రోజులు కీలకంగా మారనుంది. అందుకు కారణం.. ఆ దేశానికి అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం. గతంలో ఒక్కరోజులో పోలింగ్ పూర్తయ్యేది. అయితే.. దేశ చరిత్రలో తొలిసారిగా వరసగా మూడు రోజులపాటు అంటే 15, 16, 17 తేదీల్లో పోలింగ్‌కు రష్యా సిద్ధమైంది. శుక్రవారం పోలింగ్ ప్రారంభమైందక్కడ..
ప్రస్తుత పదవీకాలంతో కలిపి పుతిన్ ఇప్పటికే నాలుగు సార్లు(2000, 2004, 2012, 2018)లో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. 2008లో ప్రధానిగానూ సేవలందించారు. మానవహక్కుల గొంతుక, విపక్ష నేత అలెక్సీ నావల్నీ గత నెల మారుమూల కారాగారంలో అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఈసారి పుతిన్ వ్యతిరేక ఓటింగ్ పెరుగుతుందా? లేదా అనేది వేచిచూడాలి. ఉక్రెయిన్‌పై దురాక్రమణతో ప్రస్తుతం తన అధీనంలో ఉన్న నాలుగు ఉక్రెయిన్ రీజియన్‌లలోనూ ఈ ఎన్నిక క్రతువు కొనసాగనుంది.
పుతిన్ హవా..
అధ్యక్ష రేసులో పుతిన్ విజయబావుటా ఎగరేస్తారని ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. అయినా సరే పౌర హక్కులను కాలరాస్తూ, నియంత పోకడలతో దేశాన్ని ఏలుతున్న పుతిన్ పాలనకు అంతం పలుకుతామంటూ విపక్ష పార్టీల నేతలు ప్రతినబూనారు. ఎన్నికల రణరంగంలో పుతిన్‌ను ఓడిస్తామంటూ లిబరల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ రష్యా(ఎల్‌డీపీఆర్) తరఫున అభ్యరి్థగా లియోనిడ్ స్లట్‌స్కీ, న్యూ పీపుల్ పార్టీ అభ్యరి్థగా వ్లాదిస్లేవ్ దవాన్‌కోవ్, కమ్యూనిస్ట్ పార్టీ అభ్యరి్థగా నికోలే ఖరిటోనోవ్‌లు ఎన్నికల బరిలో నిలిచారు. దేశ ఓటర్లలో పుతిన్‌కు 75 శాతం మద్దతు ఉందని, ఈ ముగ్గురు తలో 5 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటారని ముందస్తు పోలింగ్ అంచనాలు విశ్లేíÙస్తున్నాయి.
పోలింగ్ ఎక్కడెక్కడ?
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ గురువారం కంటే ముందే మొదలుపెట్టారు. శుక్రవారం సాధారణ ఓటింగ్ మొదలైంది. ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాలపై పుతిన్ ప్రధానంగా దృష్టిపెట్టారు. రష్యా భూభాగంలో ఎలాగూ మెజారిటీ సాధిస్తానని పుతిన్ బలంగా నమ్ముతున్నారు. ఉక్రెయిన్ ప్రాంతాల్లో గెలిచి తమది అధర్మ యుద్ధం కాదని ప్రపంచానికి చాటి చెప్పాలని పుతిన్ యోచిస్తున్నారు. ఇక్కడ స్థానిక ఎన్నికలు, రెఫరెండమ్‌లు ఇప్పటికే నిర్వహించారు.
అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘనకు గురయ్యాయని ప్రపంచదేశాలు మొత్తుకున్నా పుతిన్ పట్టించుకోవట్లేదు. ఈసారి 11.42 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలుస్తోంది. అర్హులైన ఓటర్లు విదేశాల్లో ఉన్నా సరే ఓటేయొచ్చు. మార్చి 19 కల్లా తొలి దఫా ఫలితాలు వెల్లడి కావచ్చు. తుది ఫలితాలు తెలియాలంటే మార్చి 29వ తేదీకా ఆగాల్సిందే. 2018 గత అధ్యక్ష ఎన్నికల్లో 68 శాతం పోలింగ్ నమోదైంది.
ఇంకెన్నాళ్లు పుతిన్ పాలిస్తారు?
మరో రెండు పర్యాయాలు దేశ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అనువుగా చట్టం చేసి 2021లో పుతిన్ దానిపై సంతకం చేశారు. ఈసారి గెలిచి, 2030లోనూ గెలిస్తే 2036దాకా పుతిన్ దేశాధ్యక్షుడిగా కొనసాగుతారు. రష్యా పాలకుడు జోసెఫ్ స్టాలిన్ తర్వాత అత్యంత ఎక్కువకాలం దేశాన్ని పాలించిన నేతగా పుతిన్ పేరు ఇప్పటికే చరిత్రకెక్కింది.
కుంభస్థలిని కొట్టగలరా ?
పోటీలో ఏ అభ్యర్థి నిలబడాలి అనేది దాదాపు దేశ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) నిర్ణయిస్తుంది. ఎల్‌డీపీఆర్ నేత లియోనిడ్ స్లట్‌స్కీ, న్యూ పీపుల్ పార్టీ నేత వ్లాదిస్లేవ్ దవాన్‌కోవ్, కమ్యూనిస్ట్ పార్టీ నేత నికోలే ఖరిటోనోవ్‌లు ఈసారి బరిలో దిగారు. పుతిన్‌ను వీరంతా విమర్శిస్తున్నప్పటికీ ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని వీరు వ్యతిరేకించలేదు. యుద్ధాన్ని వ్యతిరేకించిన ఏకైక విపక్ష నేత బోరిస్ నదేహ్‌దిన్‌ను పోటీకి నిలబడకుండా సీఈసీ అడ్డుకుంది.
అభ్యరి్ధత్వానికి సరిపడా సంతకాలను సేకరించలేకపోయారని ఆయన అభ్యరి్ధత్వాన్ని తిరస్కించింది. మరో అభ్యర్ధి యెకటేరియా డుంట్‌సోవానూ సీఈసీ ఇలాగే పక్కకునెట్టింది. పుతిన్‌ను ప్రధానంగా విమర్శించే విపక్ష నేత అలెక్సీ నావల్నీ ఇప్పుడు ప్రాణాలతో లేడు. స్లట్‌స్కీ, దవాన్‌కోవ్, ఖరిటోనోవ్‌లు దేశ సమైక్యత విషయానికొచ్చేసరికి పుతిన్‌కు పరోక్షంగా మద్దతు పలుకుతారు. ఈ లెక్కన దేశ సమైక్యత జెండా పట్టిన పుతిన్‌కే ఎక్కువ ఓట్లు పడతాయి. దీంతో వీళ్లు పుతిన్‌ను ఓడించడం అనేది అసంభవం.
పుతిన్‌కు నిజంగా అంతటి ఫాలోయింగ్ ఉందా?
రష్యా పౌరులు ఆంక్షల చట్రం, నిఘా నీడలో జీవిస్తారని పశి్చమదేశాలు తరచూ ఆరోపిస్తుంటాయి. దీంతో పుతిన్‌ను ఇష్టపడే ఎన్నుకుంటున్నారా లేదంటే మరో ప్రత్యామ్నాయం లేక పుతిన్‌కు జై కొడుతున్నారా అనేది ఇతమిద్ధంగా ఎవరికీ తెలీదు. పుతిన్ పాపులారిటీ 80 శాతాన్ని దాటేసిందని అక్కడి ప్రభుత్వేతర ఎన్నికల మేథో సంస్థ ‘ది లెవడా సెంటర్’ ఇటీవల ప్రకటించింది. అయితే 2023 చివరి నుంచి దేశవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరవరలు ఎగిసిన నేపథ్యంలో పుతిన్ పాలనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగాయని సంస్థ విశ్లేషించడం గమనార్హం. తనను వ్యతిరేకించే వాళ్లను పుతిన్ అస్సలు సహించలేడని పుతిన్‌కు గతంలో ప్రసంగాలు రాసి ఇచ్చిన అబ్బాస్ గలియమోవ్ చెప్పారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment