ఇస్లామాబాద్: భారతీయ నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్(51) కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాక్ తాజా చర్యతో ఆయనకు భారీ ఊరట లభించింది. తన శిక్షపై అప్పీల్ చేసుకునే హక్కు ఆయనకు ఇప్పుడు లభించింది. అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తీర్పు మేరకు పాక్ జాతీయ అసెంబ్లీలోని దిగువ సభ, ఐసీజే (రివ్యూ అండ్ రీ కన్సిడరేషన్) బిల్లు–2020ను గురువారం ఆమోదించింది.
జాదవ్‌ని గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై 2017 ఏప్రిల్‌లో పాక్ మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. జాదవ్‌కు ఎలాంటి దౌత్యసాయం కల్పించకుండా, న్యాయవాదులు కలవడానికి వీల్లేకుండాచేసి, ఆయన వాదనలు వినకుండా ఉరికంబం ఎక్కించాలని పాక్ కుట్ర పన్నింది. భారత్ పంపిన దౌత్యాధికారులను జాదవ్‌ను కలవనివ్వకుండా పాక్ ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో జాదవ్ మరణ శిక్షపై సవాల్ చేసింది.
ఐసీజే చొరవతో..
వాదోపవాదాలు విన్న ఐసీజే జాదవ్ మరణశిక్షపై పాకిస్తాన్ పునఃపరిశీలన చేయాలని, ఏ మాత్రం జాప్యం లేకుండా ఆయనకు న్యాయవాదుల్ని నియమించుకునే అవకాశం ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చింది. దీంతో పాక్ ప్రభుత్వం ఇప్పుడు ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. దీనికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆర్డినెన్స్ 2020 అని పేరు పెట్టింది. సంవత్సరం సాగదీత తర్వాత గురువారం విపక్ష పార్టీల గందరగోళం, సభ నుంచి వాకౌట్‌ల నడుమ పాక్ ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. దీంతో తనకు విధించిన మరణ శిక్షపై జాదవ్ ఏ హైకోర్టులోనైనా అప్పీలు చేసుకోవచ్చు. ఈ చర్య ద్వారా తాము ఎంత బాధ్యతాయుతంగా ఉంటామో ప్రపంచ దేశాలకు తెలిసిందని పాక్ న్యాయశాఖ మంత్రి ఫరోగ్ నసీమ్ వ్యాఖ్యానించారు.
ఇక ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన లాయర్లతో జాదవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకునే వీలు కల్పించింది. అయితే భారత్ మాత్రం ఇక్కడి లాయర్‌ను నియమించాలని ప్రయత్నిస్తోంది. కాగా, గూఢచర్యం ఆరోపణలతో జాదవ్‌ను బలూచిస్థాన్‌లో పాక్ అరెస్ట్ చేసిందని ప్రకటించుకోగా.. కాదు జాదవ్‌ను ఇరాన్‌లోని చబాహర్ పోర్టులో అరెస్ట్ చేశారని భారత్ పేర్కొంది. నిజానికి ఐసీజే ఈ ఆదేశాలిచ్చి ఏడాదికి పైనే గడుస్తున్నా.. పాక్ వక్రబుద్ధి ప్రదర్శిస్తూ ఆలస్యం చేస్తూ వచ్చింది. తన కొడుకు విషయంలో ఇది ఊరట కలిగించే విషయమని, పాక్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు జాదవ్ తండ్రి సుధీర్ పేర్కొన్నాడు. ఇది మన దౌత్య విభాగం సాధించిన విజయమని జాదవ్ స్నేహితుడు అరవింద్ మీడియాకు తెలిపాడు. చదవండి: పాక్ కొత్త కుట్ర
Comments
Please login to add a commentAdd a comment