ద హేగ్: అంతర్జాతీయ వేదికపై భారత్‌కు విజయం. నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(49)కు పాకిస్తాన్ విధించిన మరణ శిక్షను ఆ దేశం తప్పనిసరిగా పునఃసమీక్షించాలని నెదర్లాండ్స్‌లోని ద హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం కీలక తీర్పు చెప్పింది. ఐసీజే అధ్యక్షుడు, జడ్జి అబ్దుల్‌ఖవీ అహ్మద్ యూసఫ్ నేతృత్వంలోని 16 మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు చెబుతూ జాధవ్‌ను దోషిగా తేల్చడాన్ని, ఆయనకు విధించిన శిక్షను పాక్ పునఃసమీక్షించాలని ఆదేశించింది.
ఈ తీర్పును ఈ ఏడాది ఫిబ్రవరి 21నే కోర్టు రిజర్వ్‌లో ఉంచి బుధవారం వెలువరించింది. ఇండియా తరఫున న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. పాకిస్తాన్ సైనిక కోర్టుల విశ్వసనీయతను ఆయన ప్రశ్నించారు. జాధవ్‌ను కలిసేందుకు భారత అధికారులను అనుమతించకుండా ఇండియాకు ఉన్న రాయబార హక్కులకు పాక్ భంగం కలిగించిందన్న వాదనను 15 మంది న్యాయమూర్తులు అంగీకరించగా, ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారు.
‘నిర్బంధంలో ఉన్న కుల్‌భూషణ్ జాధవ్‌ను కలిసేందుకు, ఆయనకు న్యాయపరమైన సహాయం అందించేందుకు భారత అధికారులను పాక్ అనుమతించకపోవడం ద్వారా, ఇండియా హక్కులను పాక్ కాలరాసింది. వియన్నా ఒప్పందం ప్రకారం జాధవ్ అరెస్టు, నిర్బంధం గురించిన సమాచారాన్ని భారత్‌కు వెంటనే తెలియజేయాల్సిన బాధ్యత పాక్‌కు ఉంది’ అని జడ్జి యూసఫ్ పేర్కొన్నారు. ఈ తీర్పుపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ ‘జాధవ్ కేసులో భారత విధానం సరైనదేనని ఈ చరిత్రాత్మక తీర్పు స్పష్టం చేస్తోంది. జాధవ్‌ను వీలైనంత త్వరగా విడుదల చేయించి భారత్‌కు తీసుకొచ్చేందుకు మేం మా పనిని కొనసాగిస్తాం’ అని పేర్కొంది.
వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది..
జాధవ్‌ను నిర్బంధించిన విషయాన్ని భారత్‌కు పాక్ మూడు వారాలు ఆలస్యంగా తెలియజేయడం ద్వారా వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని తీర్పులో జడ్జి యూసఫ్ ప్రస్తావించారు. జాధవ్‌ను కలిసేందుకు తమ అధికారులను అనుమతించాల్సిందిగా అనేకసార్లు పాక్‌ను భారత్ కోరినా అందుకు ఆ దేశం అంగీకరించలేదన్న విషయం సుస్పష్టమవుతోందని పేర్కొన్నారు. గూఢచర్యం, ఉగ్రవాదం నేరాలపై జాధవ్‌కు పాక్ మిలిటరీ కోర్టు 2017 ఏప్రిల్‌లో మరణ శిక్ష విధించగా, ఆ శిక్ష అమలును నిలిపివేయాలంటూ భారత్ ఐసీజేను ఆశ్రయించడం తెలిసిందే. సమస్యాత్మక బలూచిస్తాన్ ప్రావిన్సులోకి జాధవ్ ఇరాన్ నుంచి ప్రవేశించారనీ, 2016 మార్చి 3న ఆయనను తమ భద్రతా దళాలు పట్టుకున్నాయనీ, జాధవ్ గూఢచర్యం, ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారనేది పాక్ వాదన.
అయితే ఈ అంశంలో భారత్ వాదన మరోలా ఉంది. నౌకాదళం నుంచి ఉద్యోగ విరమణ పొందిన అనంతరం జాధవ్ ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటుండగా, పాక్ అక్కడి నుంచి ఆయనను అపహరించి బలూచిస్తాన్‌కు తీసుకొచ్చిందని భారత్ ఆరోపిస్తోంది. సైనిక కోర్టులో రహస్య విచారణ జరిపిన అనంతరం 2017 ఏప్రిల్‌లో పాక్ ఆయనకు మరణ శిక్ష విధించగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ అదే ఏడాది మే నెలలో భారత్ ఐసీజేను ఆశ్రయించింది. దీంతో తుది తీర్పు చెప్పే వరకు జాధవ్‌కు శిక్ష అమలును నిలిపివేయాలని అప్పట్లో ఐసీజే మధ్యంతర తీర్పు చెప్పింది. తర్వాత 2017 డిసెంబర్ నెలలో ఇస్లామాబాద్‌లో జాధవ్‌ను కలిసేందుకు ఆయన భార్యకు, తల్లికి పాక్ అనుమతి ఇచ్చింది.
భారత్‌కు భారీ విజయం: బీజేపీ నేతలు
జాధవ్ కేసులో ఐసీజేలో భారత్‌కు భారీ విజయం లభించిందని పలువురు బీజేపీ నేతలు అంటున్నారు. ‘ఐసీజే తీర్పు భారత్‌కు లభించిన భారీ విజయం’ అని రాజ్‌నాథ్ అన్నారు. జాధవ్ కుటుంబ సభ్యలకు త్వరలోనే తగిన పరిహారం దక్కుతుందని విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. తీర్పు తమకు లభించిన విజయమని పాక్ చెప్పుకోవడంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఓ ట్వీట్ చేస్తూ ‘అలా అనుకోవడం మీ తప్పు కాదు. ఎందుకంటే తీర్పును ఇంగ్లీష్‌లో చెప్పారు కదా’ అని వ్యంగ్యంగా అన్నారు. పలువురు ఇతర బీజేపీ నేతలు ఐసీజే తీర్పును స్వాగతించారు.
మూడేళ్ల నాలుగు నెలలుగా...
► 2016, మార్చి 3: కుల్‌భూషణ్ జాధవ్‌ను అరెస్ట్ చేసిన పాక్ భద్రతా దళాలు.
► మార్చి 24: భూషణ్ భారత గూఢచారి అనీ, ఆయనను బలూచిస్తాన్‌లో అరెస్టు చేశామని ప్రకటించిన పాక్.
► మార్చి 26: పాక్ ఆరోపణను తోసిపుచ్చిన భారత్. ఆయన నౌకాదళ విశ్రాంత అధికారి అనీ, ఇరాన్‌లో వ్యాపారం చేసుకునే వారని ప్రకటన.
► మార్చి 29: జాధవ్‌ను కలవడానికి రాయబారులను అనుమతించాలంటూ 16వ సారి పాక్‌ను కోరిన ఇండియా. అయినా ఒప్పుకోని పాకిస్తాన్.
► 2017, ఏప్రిల్ 10: పాక్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నారంటూ కుల్‌భూషణ్‌కు మరణ శిక్ష విధించిన పాకిస్తాన్ సైనిక కోర్టు.
► మే 8: పాక్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఆశ్రయించిన భారత్.
► మే 9: మరణ శిక్ష అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిన ఐసీజే.
► మే 15: జాధవ్ కేసు విచారణలో ఐసీజేలో పరస్పరం ఆరోపణలు చేసుకున్న భారత్, పాక్.
► మే 18: తాము తుది తీర్పు ఇచ్చేంత వరకు జాధవ్ మరణ శిక్షను వాయిదా వేయాలని పాక్‌ను ఆదేశించిన ఐసీజే.
► జూన్ 22: పాకిస్తాన్ సైన్యాధిపతికి జాధవ్ క్షమాబిక్ష దరఖాస్తు చేసుకున్నారని సైనిక ప్రతినిధి వెల్లడి.
► నవంబర్ 10: జాధవ్‌ను కలిసేందుకు ఆయన భార్యకు అనుమతి ఇచ్చిన పాకిస్తాన్.
► డిసెంబర్ 25: జాధవ్‌ను కలిసిన ఆయన భార్య, తల్లి.
► 2019, ఫిబ్రవరి 18: జాధవ్ కేసులో నాలుగు రోజులు బహిరంగ విచారణను ప్రారంభించిన ఐసీజే.
► ఫిబ్రవరి 21: బహిరంగ విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ఐసీజే.
► జులై 17: జాధవ్ మరణశిక్షపై పునఃమీక్ష జరపాలని, అంత వరకు శిక్ష అమలును నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు.
సిగ్గరి.. మంచివాడు
కులభూషణ్‌పై అనెవాది గ్రామస్థుల భావన
మహారాష్ట్రలోని అనెవాది గ్రామానికి చెందిన కుల్‌భూషణ్ చిన్నతనంలో పరేల్ గ్రామంలో పెరిగారు. కుల్‌భూషణ్ బిడియంతో ఉండేవాడనీ, ఎవరి జోలికీ వెళ్లేవాడు కాదని, తనపనేదో తాను చూసుకునే వాడని అనెవాది గ్రామస్థులు అంటున్నారు. ఏటా రెండు సార్లు స్వగ్రామానికి వచ్చేవాడనీ, రోజులో ఎక్కువ సమయం పొలాల్లోనే గడిపేవాడని వారు గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రులను శ్రద్ధగా చూసుకునే కుల్‌భూషణ్ పట్ల అందరికీ సదభిప్రాయమే ఉంది. కుల్‌భూషణ్ చదువులో, ఆటల్లోనూ ప్రతిభ కనబరిచేవాడని ఆయన బాల్య స్నేహితుడు తులసీరామ్ పవార్ చెప్పారు. ఏ సమయంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా తానున్నానంటూ ముందుకెళ్లేవాడని ప్రశంసించారు. నౌకాదళం నుంచి కుల్‌భూషణ్ పదవీ విరమణ చేశాక ఇరాన్‌లో వ్యాపారం చేసుకునే వారని వారు అంటున్నారు. జాధవ్‌ను అన్యాయంగా నిర్బంధించిన పాక్, ఆయనకు ఉరి శిక్ష విధించడం ఎంత మాత్రమూ సరికాదని అనెవాది గ్రామస్థులంటున్నారు.
భారత్‌కు ఒక్క రూపాయి, పాక్‌కు 20 కోట్లు
ఐసీజేలో తమ వాదనలు వినిపించేందుకు భారత్ కేవలం ఒక్క రూపాయి ఖర్చు పెట్టగా, పాక్ ఇందుకు రూ. 20 కోట్లు వ్యయం చేసింది. ఈ కేసు వాదించడానికి హరీశ్ సాల్వే కేవలం ఒక్క రూపాయిని ఫీజుగా తీసుకుటున్నారని 2017 మే 15న నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. సాధారణంగా అయితే కేసులు వాదించేందుకు హరీశ్ సాల్వే ఒక్కో రోజుకి రూ. 30 లక్షలను ఫీజుగా తీసుకుంటారని సమాచారం. పాక్ తరఫున బ్రిటన్‌కు చెందిన లాయర్ ఖురేషీ వాదనలు వినిపించారు. జాధవ్ కేసును వాదించేందుకు ఫీజుగా ఆయనకు రూ. 20 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.
సత్యం, న్యాయం నిలిచాయి: మోదీ
కుల్‌భూషణ్ జాధవ్ కేసులో భారత్‌కు అనుకూలంగా ఐసీజే తీర్పును ఇవ్వడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్వాగతించారు. సత్యం, న్యాయం నిలిచాయని మోదీ పేర్కొన్నారు. ప్రతీ భారతీయుడి సంక్షేమం, భద్రత కోసం తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ పనిచేస్తుందని మోదీ వెల్లడించారు. ‘ఐసీజే ఈ రోజు ఇచ్చిన తీర్పును మేం స్వాగతిస్తాం. న్యాయం, సత్యం నిలిచాయి. వాస్తవాలను విస్తృతంగా పరిశీలించి ఈ తీర్పు చెప్పినందుకు ఐసీజేకు అభినందనలు’ అని మోదీ బుధవారం ఓ ట్వీట్‌లో తెలిపారు. జాధవ్‌కు తప్పక న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
నిర్దోషిగా తేల్చలేదు: పాక్
ఐసీజే ఇచ్చిన తీర్పు పాక్‌కే అనుకూలంగా ఉందని ఆ దేశం అంటోంది. తాము ఇప్పుడు ఐసీజే తీర్పును అనుసరించి చట్టం ప్రకారం ముందుకెళ్తామని పాక్ వెల్లడించింది. పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘అంతర్జాతీయ సమాజంలో బాధ్యత గల సభ్యదేశంగా ఈ కేసులో తొలి నుంచీ మా వైఖరికి మేం కట్టుబడి ఉన్నాం. కోర్టు తీర్పును విన్నాం. పాకిస్తాన్ ఇప్పుడు చట్టం ప్రకారం ముందుకెళ్తుంది. జాధవ్‌ను నిర్దోషిగా ప్రకటించాలనీ, విడుదల చేయాలని భారత్ ఐసీజేలో కోరింది. కానీ భారత వాదనను ఐసీజే పట్టించుకోకుండా, కేవలం పాక్ విధించిన మరణశిక్షను, జాధవ్‌ను దోషిగా తేల్చడాన్ని పునఃసమీక్షించాలని మాత్రమే తీర్పు చెప్పింది.
వీసా లేకుండా, భారత పాస్‌పోర్టుతో, హుస్సేన్ ముబారక్ పటేల్ అనే మారుపేరుతో జాధవ్ పాక్‌లోకి ప్రవేశించారని మేం పునరుద్ఘాటిస్తున్నాం’ అని పేర్కొంది. పాకిస్తాన్ మానవహక్కుల శాఖ మంత్రి షిరీన్ మజారీ మాట్లాడుతూ ‘పునఃసమీక్షలు పూర్తయ్యే వరకే జాధవ్‌కు మరణ శిక్ష అమలు చేయకుండా ఉండేలా పాక్‌ను ఐసీజే నివారించింది. ఈ తీర్పు పాక్‌కి అనుకూలంగా ఉంది. కేవలం జాధవ్‌ను కలిసేందుకు భారత అధికారులను అనుమతించలేదన్న విషయంలో మాత్రమే భారత్‌కు అనుకూలంగా ఈ తీర్పు ఉంది. మిగిలిన అన్ని అంశాలు/కోణాల్లోనూ భారత్ ఈ కేసులో ఓడిపోయిందనే చెప్పాలి. పునఃసమీక్షలు పూర్తయ్యే వరకు మాత్రమే మరణ శిక్ష అమలుకాదు’ అని పేర్కొన్నారు.
ముంబైలో స్వీట్లు తినిపించుకుంటున్న జాదవ్ స్నేహితులు
Comments
Please login to add a commentAdd a comment