కుల్‌భూషణ్ జడ్జిమెంట్ కాపీలో ఏముంది?
న్యూఢిల్లీ: భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు విధించిన మరణ శిక్ష తీర్పు కాపీని భారత ప్రభుత్వం పాక్‌ను తప్పక అడిగి తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ సూచించారు. తీర్పు కాపీ చూస్తే ఏ కారణంతో ఆయనకు మరణ శిక్ష విధించారన్నది తెలుస్తుందని అన్నారు. ఇక్కడి ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో మెరుగవుతున్న భారత్-పాక్ సంబంధాలు అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్, పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఖుర్షీద్ మహమూద్ కసూరీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామ్ జెఠ్మలానీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘వారు ఇచ్చిన తీర్పు సరైనదా కాదా అన్నది మనం తెలుసుకోవాలి. వారు మోపిన నేరం సరైనదా కాదా.. అన్నదీ తెలుసుకోవాలి. అప్పుడు దానికి ఏ శిక్ష పడుతుందన్న ప్రశ్న తలెత్తుతుంది. ఉదాహరణకు ఆయనపై తప్పుడు సాక్ష్యం ఆధారంగా నేరం మోపితే.. అప్పుడు భారత్ గట్టిగా వాదించడానికి ఉపయోగపడుతుంది. ప్రజలంతా జాదవ్ విషయమై పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. అది సరికాదు. మన స్టాండ్ మనకు ఉంటుంది. కానీ తీర్పు కాపీ చదవకుండా అభిప్రాయం చెప్పడం ఎవరికీ సరికాదు’ అని అభిప్రాయపడ్డారు.