పాక్‌ ప్రమాదకర క్రీడ | pakistan more agressive steps against kulbhushan | Sakshi
Sakshi News home page

పాక్‌ ప్రమాదకర క్రీడ

Published Wed, Apr 12 2017 1:18 AM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

పాక్‌ ప్రమాదకర క్రీడ

పాక్‌ ప్రమాదకర క్రీడ

భారత గూఢచారిగా ఆరోపణకు గురైన కుల్‌భూషణ్‌ జాధవ్‌కు మరణశిక్షను విధిం చినట్టు పాకిస్థాన్‌ సైనిక వర్గాలు చేసిన ప్రకటన మనకే కాదు, ప్రపంచ దేశాలకు  సైతం దిగ్భ్రాంతిని కలిగించింది. పాక్‌ ప్రభుత్వం ఆరోపించినట్టుగా కుల్‌భూషణ్‌ భారత గూఢచారే అనుకున్నా, పట్టుబడ్డ శత్రు గూఢచారులకు మరణశిక్ష విధించ డాన్ని అంతర్జాతీయ సమాజం నేడు అనాగరిక చర్యగా భావిస్తోంది. కుల్‌భూషణ్‌ స్వయంగా తాను భారత గూఢచార సంస్థ రా (రిసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌) గూఢచారినని అంగీకరించారంటూ పాక్‌ ప్రభుత్వం అప్పట్లోనే ఒక వీడియోను బయటపెట్టింది. పాక్‌ మీడియా సైతం దాన్ని లెక్కలోకి తీసుకోదగ్గదిగా పరిగణించ లేదు. సహజంగానే మన విదేశాంగశాఖ అది తీవ్ర ఒత్తిడికి గురిచేసి చెప్పించిన బలవంతపు అంగీకారమని స్పష్టం చేసింది.

కుల్‌భూషణ్‌ తమ గూఢచారి కారని రా అధికారికంగా ప్రకటించడమే కాదు, సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారులు సైతం అదే చెప్పారు. కుల్‌భూషణ్‌తో మాట్లాడేందుకు పాక్‌లోని మన కాన్సలేట్‌ అధి కారులకు అవకాశాన్ని కల్పించాలని భారత్‌ పదే పదే విజ్ఞప్తి చేస్తూనే ఉంది. అయినా పాక్‌ అందుకు నిరాకరిస్తూ వచ్చింది. ఇది వియన్నా అంతర్జాతీయ ఒప్పందానికే కాదు, ఇరు దేశాలూ సంతకాలు చేసిన అంతర్జాతీయ పౌర, రాజకీయ హక్కుల ఒప్పందానికి కూడా విరుద్ధం. నమ్మదగిన ఆధారాలు లేకుండా గుట్టు చప్పుడు కాకుండా, ఎప్పుడు విచారణ జరిగిందో, ఎప్పుడు శిక్ష విధించారో కూడా తెలుపకుండా మరణశిక్ష ప్రకటనను వెలువరించడం పూర్తి బాధ్యతా రాహిత్యం. ఏదిఏమైనా ఇది అంతర్జాతీయ న్యాయ స్థానానికి నివేదించాల్సిన నేరం. ఇక మరణశిక్షను అమలుచేస్తే భారత్‌ అంటున్నట్టు అది ‘ముందస్తు పథకం ప్రకారం చేసిన హత్యే’ అవుతుంది.

ఏడాదిగా నిర్బంధంలో ఉన్న కుల్‌భూష ణ్‌కు అన్ని అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, ఒప్పందాలను తుంగలోకి తొక్కి హడావుడిగా మరణశిక్షను విధించాల్సిన అగత్యం ఏమొచ్చింది? పాక్‌ అధికార వ్యవస్థ స్వభావం ఎప్పుడూ అంతుబట్టనిదిగానే ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న చట్టబద్ధ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజాస్వామిక, న్యాయ వ్యవస్థలకు అతీత మైన అదృశ్య హస్తం తన పని తాను చేసుకు పోతూనే ఉంటుంది. ఆ అదృశ్య హస్తం సైనిక దుస్తుల్లో ఉన్నా, గూఢచార వ్యవస్థ ఐఎస్‌ఐ రూపం ధరించినా ప్రజాస్వామ్య ప్రభుత్వానికి దాని మాట శిరోధార్యం, దాని చేతలను సమర్థించడం పరమ పవిత్ర కర్తవ్యం. కాక పోతే, కుల్‌భూషణ్‌కు వ్యతిరేకంగా తగిన ఆధారాలు లేవని పాక్‌ ప్రధాని విదేశాంగ సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ పార్లమెంటరీ కమిటీ ముందు చెప్పిన విషయాన్ని నవాజ్‌ షరీఫ్‌ మరిచేవారేనా? సైనిక న్యాయస్థానం తీర్పును వెనకేసు కొస్తూ మాట మార్చేవారేనా?

ఒక ఉన్నత స్థాయి సైనిక అధికారిని, తమ దేశపు పాస్‌పోర్ట్‌తో శత్రు దేశంలోకి గూఢచారిగా పంపే తెలివిమాలిన పని ఏ దేశమూ చేయదు. అది తెలిసీ పాక్‌ సైన్యం  ఇరాన్‌ కేంద్రంగా సొంత వ్యాపారం నడుపుకుంటున్న మన నావికాదళ మాజీ కమాండర్‌ కుల్‌భూషణ్‌ను ఇరాన్‌–బెలూచిస్థాన్‌ సరిహద్దుల్లో పట్టుకున్నా మని 2016 మార్చి 3న ప్రకటించింది. బెలూచిస్థాన్‌ వేర్పాటువాదులతో కలసి విద్రోహకాండకు పాల్పడుతున్న భారత గూఢచారి అని ఆరోపించింది. పాక్‌ వాయవ్య ప్రాంతంలోని పాక్‌ తాలిబన్‌ మిలిటెంట్లపై చేపట్టిన రెండేళ్ల సైనిక చర్యల వైఫల్యంతో అడుగంటిన ప్రతిష్టను కాపాడుకోడానికి పాక్‌ సైన్యం భారత గూఢచా రిని కనిపెట్టిందని అప్పట్లో ప్రముఖ పాక్‌ పాత్రికేయులు కొందరు వ్యాఖ్యానిం చారు. కుల్‌భూషణ్‌ గూఢచారే అయినా పట్టుబడ్డ గూఢచారుల పట్ల అనుసరించా ల్సిన లిఖిత, అలిఖిత పద్ధతులు, సంప్రదాయాలు ఉన్నాయి. నేటి ప్రపంచంలో ఇతర దేశాలలో గూఢచారులను నియమించని దేశమే లేదు. గూఢచారులు పట్టుబ డటం తరచుగా జరిగేదే. పట్టుబడ్డ గూఢచారులను అనధికారిక సంభాషణలు, బేర సారాలతో కొంత ఆలస్యంగానో లేక త్వరగానో మార్పిడి చేసుకోవడం, ఖైదీలను విడుదల చేయడం భారత్, పాక్‌ల మధ్య కూడా ఉన్న రివాజే.

కానీ 2015 నుంచి భారత్‌లో పాక్‌ సీమాంతర ఉగ్రవాద మూకల దాడులు పెరిగాయి. 2016 జనవరిలో పఠాన్‌కోట వైమానిక దళ స్థావరంపై దాడికి అవి బరితెగించాయి. దీంతో పాక్‌తో స్నేహ సంబంధాల కోసం చేయిచాస్తున్న భారత  వైఖరిలో మార్పు రావడం మొదలైంది. ఉగ్రవాదం పట్ల కఠినవైఖరిని అవలంబిస్తా నని వాగ్దానం చేసిన ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితుల్లో అదే ఏడాది సెప్టెంబర్లో జరిగిన యూరీ ఉగ్ర దాడి భారత్‌ సహనానికి పరీక్షే అయింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ‘నీరూ, నెత్తురూ కలసి ప్రవహించలేవు’ అని ప్రకటించి 1960 నాటి భారత్‌–పాక్‌ నదీ జలాల ఒప్పందానికి ఎసరు పెట్ట గలమని పాక్‌కు చురక అంటించారు. దాని కొనసాగింపుగా సెప్టెంబర్‌ 29న భారత సేనలు పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి పాక్‌ ప్రతిష్టను దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా దెబ్బతీశాయి. దీనికి తోడు ఇటీవల ‘ఉద్యో గాన్వేషణ’ కోసం నేపాల్‌ వెళ్లిన దిగువ స్థాయి రిటైర్డ్‌ పాక్‌ సైనికాధికారి ఒకరు కనిపించకుండా పోయారు. అది భారత్‌ పనేనని తమ సైన్యం భావిస్తోందని, అందుకు బదులుగా కుల్‌భూషణ్‌కు హడావుడిగా మరణశిక్ష విధించిందని పాక్‌ విశ్లేషకుల కథనం.

పాక్‌ సైన్యం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటంలో ఆశ్చర్యం లేదు. కానీ కిడ్నాపులు, బ్లాక్‌మెయిలింగ్‌లు చేసి బేరసారాలాడే స్థితికి భారత్‌ దిగ జారేదైతే, సరిహద్దుల్లో దారితప్పి పాక్‌ భూభాగంలోకి ప్రవేశించిన సరబ్‌జిత్‌ సింగ్‌ 23 ఏళ్లు పాక్‌ జైళ్లలో నరకం చూసి మరణించేవాడే కాడు. ఏదిఏమైనా పాక్‌ విపరీత చర్య భారత్‌ను రెచ్చగొట్టేదని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత విష మింపజేసేదని అంతా అంగీకరిస్తున్నారు. ఎంతకైనా తెగించగల తెంపరితనానికి మారుపేరైన పాక్‌ సైన్యం ఉరిశిక్ష విధించినంత, గుట్టుగా, హడావుడిగా ఉరి తీయనూ గలదు. పాక్‌ దుశ్చర్యను సత్వరమే అంతర్జాతీయ సమాజం దృష్టికి, వేదిక లపైకి తీసుకుపోయి కుల్‌భూషణ్‌కు ప్రాణహాని కలుగకుండా చూడటం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement