Ram Jethmalani
-
రామ్ జఠ్మలానీ బయోపిక్ తీస్తున్నాం: హీరోయిన్
ప్రముఖ న్యాయవాది దివంగత రామ్ జెఠ్మలానీ ఆత్మకథను తెరకెక్కించనున్నట్టు బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ వెల్లడించారు. గత మూడేళ్లుగా వార్తల్లో ఉన్న ఈ బయోపిక్ విషయంలో వెనక్కు తగ్గేది లేదని ఆమె స్పష్టం చేశారు. సంపూర్థ కుటుంబానికి అవసరమైన పోషకాహార ఉత్పత్తులపై కాలిఫోర్నియా ఆల్మండ్స్ ఆధ్వర్యంలో నగరంలోని తాజ్ డెక్కన్ హోటల్లో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. గత కొన్నేళ్లు అనుకుంటున్న రామ్ జెఠ్మలానీ బయోపిక్ స్క్రిప్ట్ పూర్త కావచ్చిందని, త్వరలోనే సెట్స్‌కి వెళ్లనుందని నాయక పాత్రను తన భర్త నటుడు కునాల్ పోషించనున్నట్లు తెలిపారు. దాదాపు 70 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిలో ఉండి, అనేక మంది అతిరథ మహారథుల వంటి రాజకీయ నేతలు, క్రిమినల్స్‌కు వకల్తాగా, వ్యతిరేకంగా పని చేసిన జెఠ్మలానీ కథ అత్యంత ఆసక్తికరంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. -
రెబెల్ న్యాయవాది
కొందరు ప్రశ్నించడానికే పుట్టినట్టుంటారు. ఎంతటివారినైనా నిలదీస్తారు. ఆ క్రమంలో ఎంత పరుషంగా మాట్లాడటానికైనా సిద్ధపడతారు. అవతలివారిని ఇరకాటంలోకి నెడతారు. అందుకే వారిని చూస్తే అధికార పీఠాలు వణుకుతాయి. ఆదివారం ఉదయం కన్నుమూసిన సుప్రసిద్ధ న్యాయకోవిదుడు రాంజెఠ్మలానీ ఆ కోవకు చెందిన అరుదైన వ్యక్తి. ‘తన మనసులోని మాటలను వ్యక్తం చేయడానికి వెనుదీయని ధైర్యశాలి జెఠ్మలానీ’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్న మాట అక్షరసత్యం. 2015లో చీఫ్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ)గా కెవి చౌదరి నియామకం జరిగినప్పుడు ‘ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను ఎంతమాత్రం అనుకోలేదు. మీపై క్రమేపీ తగ్గుతూ వస్తున్న గౌరవం, ఇవాళ్టితో పూర్తిగా అడుగంటింది’ అని మోదీకి ఘాటైన లేఖరాసినా...‘మీరు విశ్వాసఘాతకులు. నాకు కృతజ్ఞతగా ఉండాల్సిన మీరు శత్రువుగా మారి వంచకులతో చేతులు కలిపారు’ అంటూ బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అడ్వాణీపై నిప్పులు చెరిగినా...మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అధికారంలో ఉండగా ఆయనకు బోఫోర్స్‌పై రోజుకు పది ప్రశ్నలతో లేఖలు సంధిం చినా అది రాంజెఠ్మలానీకే చెల్లుతుంది. ఆ లేఖల గురించి ఒకరు ప్రస్తావించినప్పుడు రాజీవ్‌గాంధీ సహనం కోల్పోయి, ‘అరిచే ప్రతి కుక్కకూ జవాబివ్వాల్సిన అవసరం లేద’ని ఈసడిం చగా...‘అవును నేను కుక్కనే. ఈ ప్రజాస్వామ్యానికి కావలి కుక్క’ను అని రాంజెఠ్మలానీ తడుము కోకుండా ప్రత్యుత్తరమిచ్చారు. పదవుల పంపకం జరిగినప్పుడల్లా అవి దక్కనివారు అలగటం, నిష్టూరంగా మాట్లాడటం ఇంచుమించు అన్ని పార్టీల్లో గమనిస్తాం. ఆ ధోరణి జెఠ్మలానీలో కూడా కనబడుతుంది. అయితే ఆయన అలక విలక్షణమైనది. ముందూ మునుపూ ‘పనికొస్తుంద’ని ఏ విషయం దాచుకోవడం అంటూ ఉండదు. తాను ఏం ఆశించాడో, ఎందుకు ఆశించాడో చెప్పడంతోపాటు... నాయకుడు తన నెలా నట్టేట ముంచాడో కుండబద్దలు కొట్టడం జెఠ్మలానీ ప్రత్యేకత. ఆయన కాంగ్రెస్ మొదలుకొని అన్ని పార్టీల్లోనూ చేరారు. ఇంచుమించు అంతే వేగంగా బయటికొచ్చారు. రాజ్యసభ సభ్యత్వమో, మరొకటో ఇస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత మాట తప్పినప్పుడు నిప్పులు చెరగడం జెఠ్మలానీకి రివాజు. అలా అని ఆయన్ను సగటు రాజకీయ నాయకుడిగా భావించలేం. అనుకున్న పదవి దక్కి నిక్షేపంగా ఉన్నప్పుడు సైతం ఆయన మౌనంగా, ప్రశాంతంగా గడిపిన సందర్భం లేదు. అటల్ బిహారీ వాజపేయి కేబినెట్లో న్యాయ శాఖమంత్రి ఉంటూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఏఎస్ ఆనంద్‌కు వ్యతిరేకంగా ప్రకటన చేసి జెఠ్మలానీ పదవి పోగొట్టుకున్నారు. తదనంతరం 2004లో ఆయన వాజపేయిపైనే లక్నో నియోజకవర్గం నుంచి పోటీచేశారు. బీజేపీలో ఉంటూనే 2012లో అప్పటి అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి లేఖరాస్తూ యూపీఏ ప్రభుత్వ అవినీతిపై పార్టీ నేతలెవరూ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీయడంతో ఆగ్రహించిన పార్టీ ఆయన్ను ఆరేళ్ల పాటు బహిష్కరించగా, పార్టీపైనే పరువు నష్టం దావా వేశారు. ఆ సందర్భంలోనే అడ్వాణీపై నిప్పులు చెరిగారు. ఆయనే ఇతరులతో చేతులు కలిపి తన బహిష్కరణకు కారణమయ్యారని విమర్శించారు. జైన్ హవాలా కేసులో వాదించి ఆయన్ను నిర్దోషిగా నిరూపిస్తే, ఇది అడ్వాణీ చేసిన ప్రత్యుపకారమని దుయ్యబట్టారు. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కూడా ఆయన మౌనంగా లేరు. రోజూ ఆయన చేసే పదునైన విమర్శలను తట్టుకోలేని ఇందిర ప్రభుత్వం ఆయనపై అరెస్టు వారెంట్ జారీ చేస్తే దానిపై బొంబాయి హైకోర్టు స్టే విధించింది. అనంతరం ఆయన కెనడా వెళ్లి అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ఉద్యమించారు. దాన్ని తొలగించాకే దేశంలో అడుగుపెట్టారు. క్రిమినల్ కేసులు స్వీకరించడంలోనైనా, వాటిని వాదించడంలోనైనా జెఠ్మలానీ వ్యవహారశైలి ఎవరి ఊహకూ అందేది కాదు. సాక్షుల్ని క్రాస్ ఎగ్జామ్ చేయడంలో ఆయన సాటి దేశంలోనే మరెవరూ లేరంటారు. దాని వెనకున్న రహస్యాన్ని ఆయనొకసారి చెప్పారు. కక్షిదారు చెబుతున్న అంశాలపైనే ఆధారపడినా, కేవలం చట్టనిబంధనలు చదువుకు వెళ్లినా అనుకున్న ఫలితం రాదని... స్వయంగా ఘటనా స్థలానికెళ్లి సొంతంగా పరిశోధించి జరిగిందేమిటో తెలుసుకున్నప్పుడే ఏ కేసునైనా సమర్థవంతంగా వాదించగలుగుతామన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. ఏడు దశాబ్దాల న్యాయవాద వృత్తిలో గడించిన అపారానుభవం నుంచి చెప్పిన మాటలవి. దేశంలో నేర న్యాయ వ్యవస్థ ఒక రూపం సంతరించుకోవడంలో జెఠ్మలానీ పాత్ర ఎనలేనిది. ఆయన వాదించిన కేసులు చూస్తే జెఠ్మలానీ విలక్షణ శైలి అర్ధమవుతుంది. 70వ దశకంలో పేరుమోసిన స్మగ్లర్ హాజీ మస్తాన్ మొదలుకొని 90లనాటి హర్షద్ మెహతా, కేతన్ పారిఖ్ వంటి స్టాక్ మార్కెట్ స్కాం నిందితుల వరకూ...ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హత్య కేసు నిందితులు, పార్లమెంటుపై దాడి కేసులో ఉన్న అప్పటి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్ఏఆర్ జిలానీ వరకూ జెఠ్మలానీ స్వీకరించిన కేసులన్నీ దిగ్భ్రాంతిపరిచేవే. ఈ కేసుల్లో ఆయన మొక్కుబడిగా వాదించడం కాదు... తన వాదనా పటిమతో ఆ కేసుల్లోని బహుముఖ కోణాలను విప్పి చెప్పి, నిందితుల నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి చేసే ప్రయత్నాలు న్యాయమూర్తులనే అబ్బురపరిచేవి. సమాజం గీసే లక్ష్మణరేఖలు ఎప్పుడూ జెఠ్మలా నీని నివారించలేకపోయాయి. ఈ కేసుల్లోని నిందితులు జాతి వ్యతిరేకులని, దేశద్రోహులని, వారి తరఫున వాదించినవారూ ద్రోహులేనని గుండెలు బాదుకుంటున్నవారిని చూసి ఆయన జాలిపడి ఊరుకునేవారు. నేర నిరూపణ జరిగేవరకూ ఏ కేసులోని నిందితులైనా నిరపరాధులేనన్నది ఆయన నిశ్చిత భావన. సంపన్న కక్షిదారుల నుంచి ఫీజు రూపంలో భారీగా వసూలు చేయడం, నిస్సహాయ కక్షిదారుల తరఫున ఉచితంగా వాదించడం జెఠ్మలానీ ఎంచుకున్న విధానం. ఆయన జీవిత చరిత్ర పుస్తకం పేరు ‘తిరుగుబాటుదారు’. జెఠ్మలానీ చివరి వరకూ అలాగే జీవించారు. -
జెఠ్మలాని మృతి.. ప్రధాని, రాష్ట్రపతి సంతాపం
న్యూఢిల్లీ : ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలాని (95) మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. దేశం ఓ గొప్ప న్యాయవేత్తను కోల్పోయిందని పేర్కొంటూ నివాళులర్పించారు. జెఠ్మలాని కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘ఎమర్జెన్సీ కాలంలో (1975-77) ప్రజల స్వేచ్ఛకోసం ధైర్యంగా పోరాటం సాగించిన గొప్ప న్యాయ కోవిదుడు’అని ప్రధాని ట్విటర్లో పేర్కొన్నారు. రామ్ జెఠ్మలాని కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలాని మృతి బాధాకరం. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయనెంతో కృషి చేశారు. దేశం ఓ గొప్ప, సమర్థత గల న్యాయవేత్తను కోల్పోయింది’ ప్రధాని ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి : ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ కన్నుమూత) ‘దేశ పార్లమెంటు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పటిష్టతకు గొప్ప సేవలందించిన న్యాయవేత్తను, ప్రజల మనిషిని దేశం కోల్పోయింది. తను ఎంచుకున్న మార్గంలో లౌక్యం, ధైర్యంతో ముందుకు దూసుకుపోయే మనిషి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెన్నుచూపని న్యాయవాది’ అని జెఠ్మలానిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గుర్తు చేసుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జెఠ్మలాని మృతికి సంతాపం తెలిపారు. ‘జెఠ్మలాని నాకొక ఆప్త మిత్రుడు’అని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్ తదితరులు జఠ్మలాని మృతికి సంతాపం ప్రకటించారు. -
ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ కన్నుమూత
-
ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ కన్నుమూత
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జెఠ్మలానీ 1923 సెప్టెంబర్ 14న సింధు ప్రావినెన్స్‌లోని సిఖర్పూర్లో జన్మించారు. న్యాయవాద వృత్తిలో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. చరిత్రలో లిఖించదగ్గ పలు కేసులను ఆయన వాదించారు. రాజీవ్ గాంధీ హత్య కేసు, హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ వంటి పలు కేసులను ఆయన వాదించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా సేవలందించారు. జఠ్మాలనీ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా... జెఠ్మాలనీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. జెఠ్మాలనీ మృతిపట్ల ఏపీ సీఎం జగన్ సంతాపం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రామ్ జెఠ్మాలనీ మృతిపట్ల సంతాపం తెలిపారు. జెఠ్మాలనీ కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామ్ జెఠ్మాలనీ గొప్ప న్యాయశాస్త్ర నిపుణులని, ఆయన సుదీర్ఘ ప్రస్తానంలో పలు కీలకమైన కేసులు వాదించారని ఈ సందర్భంగా వైఎస్ జగన్ గుర్తు చేసుకున్నారు. -
వజూభాయ్ తీరు సిగ్గుచేటు: రామ్ జెఠ్మలాని
న్యూఢిల్లీ: తగినంత సంఖ్యాబలం లేని బీజేపీని గవర్నర్ వజూభాయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం సిగ్గుచేటని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలాని మండిపడ్డారు. యడ్యూరప్పను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడాన్ని సవాలుచేస్తూ జెఠ్మలాని సుప్రీంకోర్టులో దాఖలుచేసిన పిటిషన్ విచారణ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జెఠ్మలాని వాదనలు వినిపిస్తూ..అసెంబ్లీలో బలం నిరూపించుకోవడానికి గవర్నర్ 15 రోజుల గడువు ఇవ్వడమంటే అవినీతికి బహిరంగంగా ఆహ్వానం పంపినట్టేనని అన్నారు. -
కర్ణాటక గవర్నర్‌పై సుప్రీంకు రాంజెఠ్మలానీ
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక వ్యవహారంలో న్యాయపోరాటం తీవ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. దేశంలో పేరొందిన న్యాయకోవిదుడైన సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు తాజాగా ముందుకొచ్చారు. బీజేపీకి మెజారిటీ లేకపోయినప్పటికీ.. యడ్యూరప్పతో ముఖ్యమంత్రిగా గవర్నర్ ప్రమాణం చేయించడాన్ని సవాలు చేస్తూ.. సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ వ్యక్తిగత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఎదుట ఆయన ఈ మేరకు పిటిషన్ చేశారు. గవర్నర్ నిర్ణయాన్ని వ్యక్తిగతంగా సవాలు చేస్తూ ఈ కేసులో వ్యక్తిగతంగా ఇంప్లీడ్ అయ్యే అవకాశం కల్పించాలని కోరారు. అయితే, శుక్రవారం ఈ విషయాన్ని సరైన బెంచ్ ముందు ప్రతిపాదించాలని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఆయనకు సూచించింది. ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ.. ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కానీ సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని వెంటనే నిలిపేయాలని కోరుతూ ఆ పార్టీలు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. అయితే, గురువారం మధ్యాహ్నం రెండు గంటలలోగా ఎమ్మెల్యేల మద్దతు లేఖను తమకు సమర్పించాలని యడ్యూరప్పను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్, జేడీఎస్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుందని, యడ్యూరప్ప ప్రమాణస్వీకార అంశం తుది తీర్పుకు లోబడి ఉంటుందని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేసినప్పటికీ.. అసెంబ్లీలో ఆయన బలనిరూపణ చేసుకునే వరకు కర్ణాటక ప్రభుత్వం విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాం జెఠ్మలానీ సైతం గవర్నర్ వజుభాయ్ వాలా నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
చాలెంజింగ్ పాత్ర..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ జీవితకథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతున్నది. ప్రముఖ నటి సోహా అలి ఖాన్ తన భర్త కునాల్ కెముతో కలసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ‘రెనగెడ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి రోనీ స్క్రూవాలా సహ నిర్మాత. ఈ సినిమాలో కునాల్ కేము రాం జెఠ్మలానీ పాత్రను చేయబోతున్నారు. ఎంతో చాలెంజ్‌గా తీసుకొని.. ఈ సినిమా తెరకెక్కిస్తున్నామని సోహా అలీఖాన్ తెలిపారు. జెఠ్మాలనీ వయసు ప్రస్తుతం 94 ఏళ్లు అని, ఆయన తన 70 ఏళ్ల వృత్తిజీవితంలో ప్రముఖ రాజకీయ నాయకుల నుంచి కరుడుగట్టిన నేరస్తుల వరకు ఎన్నో సంచలన కేసులను వాదించారని చెప్పారు. అంత గొప్ప వ్యక్తి పూర్తి జీవితాన్ని తాము కేవలం రెండున్నర గంటల్లో చెప్పలేకపోవచ్చు, కానీ ముఖ్యమైన అంశాలను తెరకెక్కిస్తామన్నారు. స్క్రిప్ట్, దర్శకుడు ఫైనల్ అవ్వగానే సెట్స్ మీదకు వెళ్తామన్నారు. -
రామ్ జెఠ్మలానీ రిటైర్మెంట్ ప్రకటన
-
'సీఎం చెప్పారని ఆయన నన్ను దూషించారు'
న్యూఢిల్లీ: తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడంపై లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అందుకు కేజ్రీవాల్‌కు నాలుగు వారాలు గడువిచ్చింది. తనను దూషించాలని, తనపై అసభ్య పదజాలం వాడాలని కేజ్రీవాల్ తన లాయర్ రామ్ జెఠ్మాలానీకి సూచించినట్లు అరుణ్ జైట్లీ కోర్టుకు బుధవారం మరోసారి తెలిపారు. కేజ్రీవాల్‌పై గతంలో దాఖలైన పిటిషన్ విచారణ గత మే 15, 17 తేదీల్లో విచారణ సాగుతుండగా సీనియర్ లాయర్ రాం జెఠ్మలానీ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని జైట్లీ తన రెండో పిటిషన్లో పేర్కొన్న విషయం తెలిసిందే. తన ప్రతిష్టకు భంగంకలిగించే వ్యాఖ్యలు చేశారంటూ కేజ్రీవాల్‌పై జైట్లీ రూ. 10 కోట్ల దావా వేశారు. అయితే కేసు విచారణ కొనసాగుతుండగా జెఠ్మలానీ తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ కేసు వాదించారని జైట్లీ ఢిల్లీ హైకోర్టుకు విన్నవించారు. కేజ్రీ చెబితేనే తాను అసభ్య పదజాలం వాడినట్లు జెఠ్మలానీ తనకు ఓ లేఖ ద్వారా తెలిపినట్లు కోర్టులో జైట్లీ వెల్లడించారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఆప్ అధినేత కేజ్రీకి నాలుగు వారాలు గడువిస్తూ లిఖిత పూర్వకంగా తప్పుడు అఫిడవిట్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జైట్లీని దూషించాలని కేజ్రీవాల్ తనకు సూచించారని జెఠ్మలానీ వెల్లడించడంతో కేజ్రీ కష్టాలు మొదటికొచ్చాయి. తాను జెఠ్మాలానీకి ఇలాంటి విషయాలు సూచించలేదని కేజ్రీవాల్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయగా.. ఢిల్లీ సీఎం అబద్ధాలు చెప్తున్నారని, ఈ కేసులో తాను, కేజ్రీవాల్ చర్చించుకున్న విషయాలు ఉన్న లేఖను బయటపెడతానని జెఠ్మలానీ హెచ్చరించిన విషయం తెలిసిందే. వివాదం ముదరడంతో ఈ పరువునష్టం కేసులో ఇక ఎంతమాత్రం కేజ్రీవాల్ తరఫున వాదించబోనంటూ జెఠ్మలానీ స్పష్టం చేశారు. కేసు వాదన నుంచి జెఠ్మలానీ తప్పుకోవడం, ఆయన సూచించిన కారణంగా తనపై జెఠ్మలానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారని జైట్లీ కోర్టులో పేర్కొనడంతో కేజ్రీ చుట్టు ఉచ్చు మరింత బిగుసుకున్నట్లు కనిపిస్తోంది. -
ముఖ్యమంత్రిపై టాప్ లాయర్ ఫైర్
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు, ఆయన మాజీ లాయర్ రాంజెఠ్మలానీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తనపై పరువు నష్టం కేసు దాఖలైన తరువాత కేజ్రీవాల్ కేంద్ర అరుణ్‌జైట్లీపై ఎన్నో పరుష పదాలు వాడారని రాంజెఠ్మలానీ ఆరోపించారు. ఈమేరకు జూలై 20న కేజ్రీకి రాసిన లేఖను తన బ్లాగ్‌లో పోస్ట్ చేశారు. కేసు విచారణ సందర్భంగా జైట్లీపై అసభ్యకర పదాలు వాడమని రామ్జెఠ్మలానికి సూచించలేదని కేజ్రీవాల్ పేర్కొనడంతో ఇద్దరి మధ్య విభేదాలు వెలుగుచూశాయి. ‘జైట్లీ తొలిసారి పరువు నష్టం కేసు వేశాక నా సేవలు వాడుకోవాలనుకున్నారు. జైట్లీపై ‘క్రూక్’(మోసగాడు)ని మించిన పరుష పదాలు ఎన్ని వాడారో మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ఆ క్రూక్‌కు గుణపాఠం చెప్పాలని వందసార్లు అడిగార’ని జెఠ్మలానీ లేఖలో తెలిపారు. ఈ లేఖ ప్రతిని అరుణ్ జైట్లీకి కూడా పంపించడం గమనార్హం. పరువునష్టం కేసులో వాదించినందుకు లీగల్ ఫీజు కింద తనకు రూ. రెండు కోట్లు ఇవ్వాలని ఇంతకుముందు కేజ్రీవాల్‌ను జెఠ్మలానీ డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ తరపున వాదించబోనంటూ ఈ నెల 20న జెఠ్మలానీ ప్రకటించారు. -
సీఎంకు షాకిచ్చిన టాప్ లాయర్!
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ వేసిన పరువునష్టం దావాలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అబద్ధాలు చెప్తున్నారని సీనియర్ లాయర్ రాం జెఠ్మలానీ ఆరోపించారు. ఈ పరువునష్టం కేసులో ఇక ఎంతమాత్రం కేజ్రీవాల్ తరఫున వాదించబోనంటూ ఆయన తెలిపారు. అంతేకాదు ఇప్పటివరకు ఈ కేసులో వాదించినందుకు ఏకంగా రూ. రెండు కోట్లు లీగల్ ఫీజు కింద చెల్లించాలంటూ షాక్ ఇచ్చారు. కేసు విచారణ సందర్భంగా జైట్లీని ఉద్దేశించి లాయర్ జెఠ్మలానీ నిందాపూర్వక వ్యాఖ్య చేసిన సంగతి తెలిసిందే. దీనిని తీవ్రంగా తప్పుబట్టిన ఢిల్లీ హైకోర్టు.. ఈ వ్యాఖ్య మీరే చేశారా? లేదా మీ క్లైంట్ సూచిస్తే చేశారా? అని ప్రశ్నించింది. దీంతో సీఎం కేజ్రీవాల్ సూచిస్తేనే తాను ఈ వ్యాఖ్య చేశానని జెఠ్మలానీ చెప్పుకొచ్చారు. దీనిని ఖండిస్తూ లాయర్ చెప్పినట్టు తాను ఆ వ్యాఖ్య చేయలేదని కేజ్రీవాల్ తాజాగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే, అఫిడవిట్లో సీఎం కేజ్రీవాల్ అబద్ధాలు చెప్తున్నారని, ఆయన ఆ వ్యాఖ్య చేసిన సంగతి వాస్తవమని జెఠ్మలానీ ఆరోపించారు. ఈ కేసులో తాను, కేజ్రీవాల్ చర్చించుకున్న విషయాలు ఉన్న లేఖను బయటపెడతానని జెఠ్మలానీ హెచ్చరించారు. ఈ చర్చలలో జైట్లీని ఉద్దేశించి తీవ్రమైన కించపరిచే వ్యాఖ్యలు కేజ్రీవాల్ చేసినట్టు ఇప్పటికే కథనాలు వస్తున్నాయి. ఈ కించపరిచే వ్యాఖ్య నేపథ్యంలో కేజ్రీవాల్‌పై జైట్లీ మరో పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తన ప్రతిష్టకు భంగంకలిగించే వ్యాఖ్యలు చేశారంటూ కేజ్రీవాల్‌పై రూ. 10 కోట్ల దావా వేశారు. అంతకుముందు రూ. 10 కోట్ల పరువునష్టం దావాను జైట్లీ కేజ్రీవాల్‌పై వేశారు. తనపై జైట్లీ మరో పరువునష్టం దావా వేయడంతో.. కేజ్రీవాల్ తన లాయర్‌గా జెఠ్మలానీని తొలగించారు. -
టాప్ లాయర్‌కు ముఖ్యమంత్రి షాక్
-
టాప్ లాయర్‌కు ముఖ్యమంత్రి షాక్
దేశంలో ఉన్న అతి కొద్దిమంది రాజ్యాంగ నిపుణులలో ఆయనొకరు. కేసు టేకప్ చేశారంటే కోటి రూపాయలు, ఒక్కసారి కోర్టు విచారణకు వచ్చారంటే కనీసం 25 లక్షలు తీసుకునే రేంజ్ ఆయనది. ఆయనెవరో ఈపాటికే తెలిసి ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయవాది రాం జెఠ్మలానీ. ఆయన వాదిస్తుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఒక్క నిమిషం ఆగి.. సాలోచనగా వింటారు. అలాంటి అగ్రశ్రేణి న్యాయవాదికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ షాకిచ్చారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో తన తరఫున ఇన్నాళ్లూ వాదిస్తున్న ఆయనను తన న్యాయవాదిగా తీసేశారు. ఇప్పటికే ఒక కేసు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ మీద.. జైట్లీ మరో కేసు కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. పాత కేసుకు సంబంధించి జెఠ్మలానీ ఒక అనరాని పదం అనడంతో కోర్టు తీవ్రంగా మందలించింది. అది మీరే అన్నారా లేదా మీ క్లయింటు (కేజ్రీవాల్) చెబితే అన్నారా అని కూడా ప్రశ్నించింది. ఆ తర్వాతే కేజ్రీవాల్ తనను అవమానించారంటూ అరుణ్ జైట్లీ రూ. 10 కోట్లకు కొత్త పరువునష్టం కేసు దాఖలు చేయడంతో ఇప్పుడు ఏకంగా రాం జెఠ్మలానీనే కేజ్రీవాల్ తీసేశారని అంటున్నారు. -
కుల్‌భూషణ్ జడ్జిమెంట్ కాపీలో ఏముంది?
న్యూఢిల్లీ: భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు విధించిన మరణ శిక్ష తీర్పు కాపీని భారత ప్రభుత్వం పాక్‌ను తప్పక అడిగి తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ సూచించారు. తీర్పు కాపీ చూస్తే ఏ కారణంతో ఆయనకు మరణ శిక్ష విధించారన్నది తెలుస్తుందని అన్నారు. ఇక్కడి ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో మెరుగవుతున్న భారత్-పాక్ సంబంధాలు అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్, పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఖుర్షీద్ మహమూద్ కసూరీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ జెఠ్మలానీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘వారు ఇచ్చిన తీర్పు సరైనదా కాదా అన్నది మనం తెలుసుకోవాలి. వారు మోపిన నేరం సరైనదా కాదా.. అన్నదీ తెలుసుకోవాలి. అప్పుడు దానికి ఏ శిక్ష పడుతుందన్న ప్రశ్న తలెత్తుతుంది. ఉదాహరణకు ఆయనపై తప్పుడు సాక్ష్యం ఆధారంగా నేరం మోపితే.. అప్పుడు భారత్ గట్టిగా వాదించడానికి ఉపయోగపడుతుంది. ప్రజలంతా జాదవ్ విషయమై పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. అది సరికాదు. మన స్టాండ్ మనకు ఉంటుంది. కానీ తీర్పు కాపీ చదవకుండా అభిప్రాయం చెప్పడం ఎవరికీ సరికాదు’ అని అభిప్రాయపడ్డారు. -
కేజ్రీవాల్ నిరుపేద సీఎం
ఫ్రీగా వాదిస్తా: రాం జెఠ్మలానీ న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిరుపేద సీఎం అని, ఎటువం టి ఫీజు తీసుకోకుండా ఆయన తరఫున కోర్టులో వాదించేందుకు తాను సిద్ధమని ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ చెప్పారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువునష్టం కేసులో వాదించడానికి జెఠ్మలానీని కేజ్రీవాల్ నియమించుకోవడం తెలిసిందే. ఇందు కోసం రూ.3.4 కోట్ల ఫీజుకు సంబంధించిన బిల్లులను జెఠ్మలానీ పంపారు. ఈ ఫీజును ఢిల్లీ ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించేందుకు యత్నించడం వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో జెఠ్మలానీ స్పందించారు. ఢిల్లీ సీఎం తన ఫీజును చెల్లించలేని స్థితిలో ఉన్నట్లయితే తాను ఉచితంగా వాదిస్తానని చెప్పారు. ‘‘ఫీజు చెల్లించక పోయినా కేజ్రీవాల్ తరఫున వాదిస్తా. కానీ ఆయన బిల్లులు పంపమని కోరడంతో పంపాను. ఒకవేళ ప్రభుత్వం ఆయనకు మద్దతుగా నిలవకున్నా నేను నిలుస్తా. అవసరమైతే ఆయన జీవనానికి అవస రమైన సొమ్మును కూడా ఇస్తా. ఎందుకంటే అరుణ్‌జైట్లీతో పోలిస్తే కేజ్రీవాల్ అత్యంత నిజాయితీపరుడు. పేదవాడు’’ అని జెఠ్మలానీ అన్నారు. ఈ వివాదంపై కేజ్రీవాల్ స్పందిస్తూ ఇది తన వ్యక్తిగత కేసు కాదనీ, తన సొంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలని ప్రశ్నించారు. -
జనం నెత్తిన కేజ్రీవాల్ లీగల్ బిల్లు.. 3.42 కోట్ల భారం!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరువు నష్టం దావా వేశారు. తన తరఫున ఆ కేసు వాదించడానికి రాం జెఠ్మలానీని కేజ్రీవాల్ నియమించుకున్నారు. జెఠ్మలానీ అంటే ఆషామాషీ లాయర్ కారు. సుప్రీంకోర్టు జడ్జీలు సైతం ఆయన దగ్గర కాస్త గౌరవంగా ఉంటారు. కేజ్రీవాల్ తరఫున వాదించినందుకు ఆయన వేసిన బిల్లు అక్షరాలా రూ. 3.42 కోట్లు. ఆ డబ్బులను వ్యక్తిగతంగా చెల్లించాల్సింది పోయి.. దాన్నంతటినీ ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాలని కేజ్రీవాల్ చూస్తున్నారు. అంటే.. ఆ భారం మొత్తం ప్రజలు భరించాల్సిందేనన్న మాట. ప్రజలు పన్నులు కట్టగా వచ్చిన ఆదాయం నుంచి కేజ్రీవాల్ తన సొంత న్యాయ ఖర్చులను చెల్లిస్తున్నారన్న మాట. కేజ్రీవాల్ తరఫున వాదించేందుకు వకాల్తా పుచ్చుకున్నందుకు 2016 డిసెంబర్ ఒకటో తేదీన జెఠ్మలానీ కోటి రూపాయల బిల్లు వేశారు. ఆ తర్వాత కోర్టుకు హాజరైనందుకు ఒక్కోసారి రూ. 22 లక్షలు బిల్లు వేశారు. ఆయన మొత్తం 11 సార్లు కోర్టుకు రావడంతో మొత్తం బిల్లు రూ. 3.42 కోట్లయింది. అయితే, ముఖ్యమంత్రి కార్యాలయం మీద సీబీఐ దాడులకు ఈ కేసుకు సంబంధం ఉంది కాబట్టి ఈ బిల్లును ప్రభుత్వం క్లియర్ చేయాలని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా సంబంధిత ఫైలు మీద రాశారు. ఇలాంటి దాడుల మీద ప్రభుత్వ విధానాన్ని మీడియాకు వివరిస్తూ ముఖ్యమంత్రి కొన్ని ప్రకటనలు చేశారని, వాటిమీదే పరువు నష్టం దావాలు నమోదయ్యాయని అందువల్ల ఇదంతా అధికారికమే అవుతుందని చెప్పారు. ఆ తర్వాత ఈ ఫైలు ఢిల్లీ ప్రభుత్వ న్యాయశాఖలోని లిటిగేషన్ బ్రాంచికి వెళ్లింది. అయితే, దీనికి చెల్లింపులు చేసేందుకు న్యాయశాఖ మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీనికి ఆర్థికశాఖ నుంచి, ఇంకా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం నుంచి కూడా అనుమతులు అవసరమని చెప్పింది. అయితే ఫైలును లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపాల్సిన అవసరం లేదని, దానికిబదులు సంబంధిత పాలనా శాఖకు, జీఏడీకి పంపితే సరిపోతుందని మనీష్ సిసోదియా అన్నారు. చివరకు ముఖ్యమంత్రి ఆమోదంతో వెంటనే ఫైలును ఆమోదించేశారు. కానీ.. వాస్తవానికి ఈ కేసులో అరుణ్ జైట్లీ, అరవింద్ కేజ్రీవాల్ మధ్య వ్యక్తిగతంగా న్యాయపోరాటం జరిగింది. ఒకవేళ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలోనే కేసుకు హాజరు కావాలనుకుంటే అప్పుడు సివిల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 80ని అమలుచేయాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇదేమీ చేయకుండా నేరుగా ప్రజాధనాన్ని తన సొంత వ్యవహారాల కోసం ఖర్చుపెట్టేస్తున్న ఘనత అరవింద్ కేజ్రీవాల్‌కే దక్కింది. -
సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీకి అస్వస్థత
కొచ్చి: ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ,కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు రామ్ జెఠ్మలానీ అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. కేరళలోని క్రిమినల్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ఎన్ ఈ వీనింగ్ విత్ లెజెండ్’ పేరుతో న్యాయవాద వృత్తిలో 75 సం.రాల పాటు ఆయన చేసిన సేవలకు గాను ఓ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన కొచ్చీ వెళ్లారు. ఈ సందర్భంగా తనకు అన్ ఈజీగా ఉందని చెప్పడంతో వెంటనే న్యాయవాదులు ఆయనను ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగాఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కానీ 24 గంటల పరిశీలన కోసం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచినట్టు చెప్పారు. వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తోందని తెలిపారు. -
హైకోర్టు జడ్జికి ఘాటు లేఖ
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థను నాశనం చేయొద్దంటూ దేశ న్యాయ చరిత్రలో మొదటిసారి కోర్టు ధిక్కార కేసులో అరెస్టు వారెంట్ అందుకున్న కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ సోమవారం బహిరంగ లేఖ రాశారు. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పదాన్ని వెనక్కి తీసుకోవాలని జస్టిస్ కర్ణన్‌కు ఆయన సూచించారు. కర్ణన్ కు మతి చెడిందని, కోర్టు ధిక్కార చర్యలకు క్షమాపణ చెప్పాలని కోరారు. 'బార్ లో సీనియర్ సభ్యుడిగా, వయసులో పెద్దవాడిగా మీకో సలహా ఇస్తున్నాను. ఇప్పటివరకు మీరు మాట్లాడిన ప్రతి పదాన్ని వెనక్కు తీసుకోండి. మీరు పాల్పడ్డ తెలివిలేని చర్యలకు సవినయంగా క్షమాపణ కోరండి. మీకు పిచ్చి ఎంతగా ముదిరిపోయిందో తెలియకపో నన్ను కలవండి. నేను మీకు తెలివి వచ్చేలా చేస్తాన'ని జెఠ్మలానీ లేఖలో పేర్కొన్నారు. కోర్టు ధిక్కార కేసులో జస్టిస్ కర్ణన్ తమ ముందు హాజరుకాకపోవడంతో ఈ నెల 10న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం కర్ణన్‌కు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీనిపై కర్ణన్ స్పందిస్తూ దళితుడిని కావడం వల్లనే తనపై ఈ దాడిచేస్తున్నారని, తన జీవితాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. -
జైట్లీని క్రాస్ ఎగ్జామిన్ చేసిన జెఠ్మలానీ
న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై జైట్లీ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు ఓపెన్ హాలులో జైట్లీని జెఠ్మలానీ క్రాస్ ఎగ్జామిన్ చేశారు. మీ పరువుకు కేజ్రీవాల్ ఏవిధంగా భంగం కలిగించారో వివరించాలని జైట్లీని జెఠ్మలానీ కోరారు. అసత్య ఆరోపణలతో తనపై బురద చల్లారని, తన ప్రతిష్టకు భంగం కలిగించారని జైట్లీ తెలిపారు. నిరాధార ఆరోపణలతో తనను మానసికంగా ఒత్తిడికి గురి చేశారని వెల్లడించారు. మీడియాలో, పార్లమెంట్ ఎదుట, ఢిల్లీ అసెంబ్లీలో తనపై నోటికొచ్చినట్టు ఆరోపణలు గుప్పించారని వాపోయారు. తనకు జరిగిన నష్టాన్ని డబ్బులతో కొలవలేమని చెప్పారు. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలతో ఆర్థికంగా జైట్లీ నష్టపోలేదని జెఠ్మలానీ కోర్టుకు తెలిపారు. ఢిల్లీ క్రికెట్ సంఘం(డీడీసీఏ) అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జైట్లీ, ఆయన కుటుంబ సభ్యులు అక్రమాలు పాల్పడ్డారని కేజ్రీవాల్ ఆరోపించారు. దీంతో కేజ్రీవాల్ పై జైట్లీ పరువునష్టం దావా వేశారు. -
నేనెప్పుడు చనిపోతానో మీకెందుకు?
ఎవరికైనా 90 ఏళ్ల వయసు దాటిందంటే కృష్ణా రామా అనుకోవడం.. ఎప్పుడు వెళ్లిపోతామా అని చూడటం సర్వసాధారణం. కానీ, కొంతమంది మాత్రం ఎంత వయసు వచ్చినా చురుగ్గానే ఉంటారు. వయసు ప్రభావం శరీరం మీదే కాదు.. మనసు మీద కూడా లేదంటారు. ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ 93 ఏళ్ల వయసు వచ్చినా ఇప్పటికీ ఆయనకు డిమాండు ఏమాత్రం తగ్గలేదు, ఆయన వాదనల్లో వాడి వేడి కూడా తగ్గలేదు. అందుకే సుప్రీంకోర్టులో ఇప్పటికీ ఆయనే నెంబర్ వన్ క్రిమినల్ లాయర్. సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తిని సైతం నిలదీసి ప్రశ్నించే సత్తా ఆయన సొంతం. సరిగ్గా ఇలాంటి ఘటనే సుప్రీంకోర్టులో చోటు చేసుకుంది. ఎంఎం కశ్యప్ అనే న్యాయవాదిని ఆయన ఛాంబర్ ఖాళీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించడంతో దానికి సంబంధించిన కేసును ఆయన వాదిస్తున్నారు. ఈ సందర్భంలోనే.. మీరెప్పుడు రిటైర్ అవుతున్నారు అంటూ జెఠ్మలానీని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. దానికి జెఠ్మలానీ అంతే స్థాయిలో స్పందించారు. ''నేను ఎప్పుడు చనిపోతానని మీరు అడుగుతున్నారు'' అని ఆయన అడిగారు. అంటే.. తాను ఊపిరి ఉన్నంతవరకు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే ఉంటానని, కేవలం మృత్యువు మాత్రమే తనను ఆపగలదని ఆయన చెప్పకనే చెప్పారు. దటీజ్ రాం జెఠ్మలానీ. అందుకే హైప్రొఫైల్ కేసులకు సంబంధించి ఏమైనా వాదించాలంటే గంటకు ఇంత అని మాట్లాడుకుని మరీ ఆయనను వివిధ హైకోర్టులకు కూడా రప్పించుకుంటారు. -
సీవీసీని జైల్లో పెట్టాలి: రామ్ జెఠ్మలానీ
జైలుకు వెళ్లాల్సిన వ్యక్తిని ఎన్డీయే ప్రభుత్వం ప్రధాన విజిలెన్స్ కమిషనర్‌గా నియమించిందంటూ కేంద్ర న్యాయశాఖ మాజీమంత్రి రామ్ జెఠ్మలానీ మండిపడ్డారు. కేవీ చౌదరిని సీవీసీగా నియమించడాన్ని సవాలుచేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, జెఠ్మలానీ వ్యాఖ్యలపై సుప్రీం ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ''జైల్లో ఉన్న చాలామంది ఖైదీల తరఫున మీరు వాదించి, వాళ్లను బయటకు పంపాలని కోరుతారు, ఇప్పుడు మీరు ఓ వ్యక్తిని జైలుకు పంపాలని అడుగుతున్నారా..'' అని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే.. ''ఇప్పటికైనా నేను మారినందుకు మీరు నన్ను ప్రశంసించాలి'' అని దానికి జెఠ్మలానీ సమాధానమిచ్చారు. సీవీసీ నియామకం కేసు విచారణను ధర్మాసనం ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మాజీ అదినేత కేవీ చౌదరిని సీవీసీగాను, ఇండియన్ బ్యాంకు మాజీ సీఎండీ టీఎం భాసిన్‌ను విజిలెన్స్ కమిషనర్‌గాను నియమించడాన్ని 'కామన్ కాజ్' అనే స్వచ్ఛంద సంస్థ సవాలు చేసింది. -
ఢిల్లీ హైకోర్టులో సోమనాథ్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: రాష్ట్ర పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆప్ నేత, న్యాయ శాఖ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతి వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. 2014లో అప్పటి మంత్రిగా ఓ లాడ్జిపై దాడి చేసినప్పుడు ఓ ఆఫ్రికన్ మహిళా వేసిన వేధింపుల కేసుపై ట్రయల్ కోర్టు వేసిన ప్రశ్నలకు పోలీసులు సమాధానం ఇవ్వలేదని, దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని సోమ్‌నాథ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్‌లతో కూడా ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. ఇది అనవసరమైన పిటిషన్ అని ధర్మాసనం పేర్కొంది. సోమ్‌నాథ్ తరఫున్ సీనియర్ న్యాయవాది రామ్ జఠ్మలాని వాదించారు. -
రామ్‌జఠ్మలానీ(న్యాయవాది) రాయని డైరీ
జీవించడానికి ఒక ఆశ ఉండాలి. నాకైతే ఒక కేసు ఉండాలి. ఉదయాన్నే ఓ గంట బ్యాడ్మింటన్, కొద్దిగా పండ్ల ముక్కలు, మజ్జిగ తో మధ్యాహ్న భోజనం, రెండు పెగ్గుల విస్కీతో రాత్రి భోజనం, అకేషనల్‌గా ఓ స్కూప్ ఐస్‌క్రీమ్, వీటితో పాటు రోజూ కోర్టు మెట్లు ఎక్కిదిగడానికి ఎట్లీస్ట్ ఒక కేసు.. ఈ తొంభై రెండేళ్ల వయసులో నా జీవన మాధుర్యాలు. కొన్నిసార్లు బ్యాడ్మింటన్ ఉండదు. లంచ్‌కి, డిన్నర్‌కి టైమ్ కుదరదు. పండ్లముక్కలు, మజ్జిగ, విస్కీ, ఐస్‌క్రీమ్ కూడా అందుబాటులో ఉండవు. అవేవీ లేకున్నా.. ఆ పూట నేను వాదించిన కేసుతోనో, వాదించబోయే కేసుతోనో నా ప్రాణాలు నిలబెట్టుకుంటాను. కోర్టులు, కేసులు ప్రాణాలు తీస్తాయంటారు. ఆ మాట తప్పు. వాయిదాలు, ఫీజులు మాత్రమే ప్రాణాలు తీస్తాయి. నేను వాదిస్తే వాయిదాలు ఉండవు. నేను కేసు టేకప్ చేస్తే ఫీజులు ఉండవు. ఫీజులు తీసుకోనని కాదు. కేసులు తీసుకున్నంత కుతూహలంగా ఫీజులు తీసుకోనని. వాదించడం నాకు ముఖ్యం. ఎవరి తరఫున వాదిస్తున్నాను అన్నది ముఖ్యం కాదు. హాజీ మస్తాన్ అండర్‌వరల్డ్ డాన్. హర్షద్ మెహతా స్టాక్‌మార్కెట్ డాన్. ఆశారామ్ బాపూ అత్యాచారాల డాన్. అమిత్ షా.. ఫేక్ ఎన్కౌంటర్ల డాన్. లాలూ ప్రసాద్ యాదవ్ పశువుల దాణా డాన్. వాళ్ల వైపు వాదించాను కాబట్టి నేను అడ్వొకేట్ డాన్! ఇలాగే ఉంటుంది లోకం తీరు. లలిత్ మోదీ ప్రజల దృష్టిలో నేరస్థుడని చెప్పి అతడి తరఫున వాదించకపోవడం, ఇందిరాగాంధీని హత్యచేశారని చెప్పి, హంతకులకు వ్యతిరేకంగా వాదించడం వృత్తిధర్మం కాదు. లాయర్‌కి మనస్సాక్షి ఏదైతే చెబుతుందో అదే ధర్మం. వాదనల్లో జడ్జికి ఏదైతే ధర్మం అనిపిస్తుందో అదే తీర్పు. రెండు న్యాయాలు, రెండు ధర్మాలు, రెండు కోర్టులు, రెండు తీర్పులు ఉంటున్నప్పుడు.. న్యాయవాది దేనిపై నిలబడి వాదించాలి? దేనిపైనా నిలబడనవసరం లేదు. తను నమ్మినదాన్ని నిలబెడితే చాలు. నమ్మకం లేకపోయినా నిలబెట్టవలసిన కేసులు కొన్ని ఉంటాయి. సోనియాజీదీ, రాహుల్‌దీ అలాంటి కేసే. నేషనల్ హెరాల్డ్ కేసులో వాళ్లిద్దరూ నిర్దోషులన్న నమ్మకం నాకేం లేదు. కానీ వారి వైపు వాదిస్తానన్నాను. ఫీజు కూడా వద్దన్నాను. లేకుంటే కోర్టులో వాదించవలసిన కేసును వాళ్లు రాజ్యసభలో వాదించేలా ఉన్నారు. ‘మీరు అక్కడ వాదించడం మానండి, నేనిక్కడ వాదిస్తాను’ అని చెప్పాను. సరేనన్నారు సోనియాజీ. అనడానికైతే అన్నారు కానీ, సభలో రభస జరక్కుండా ఆపలేకపోయారు! నా స్టాండ్ మార్చుకున్నాను. మీ తరఫున వాదించేది లేదని చెప్పేశాను. వాదనను బట్టి వాస్తవం మారిపోదు నిజమే. కానీ, వాస్తవాన్ని బతికించడమా? వాదనను బతికించుకోవడమా? అన్న మీమాంసలో ప్రతి న్యాయవాదీ జీవితంలో ఒక్కసారైనా అంతరాత్మ అనే బోనులో నిలబడవలసి వస్తుంది. నేను నిలబడిందైతే.. లెక్కలేనన్నిసార్లు! -మాధవ్ శింగరాజు -
'జైట్లీకి సిగ్గులేదు'
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీపై సీనియర్ న్యాయవాది రామ్‌జెఠ్మలానీ తీవ్రంగా దుమ్మెత్తిపోశారు. జైట్లీ ఓ సిగ్గులేని వ్యక్తి అంటూ విరుచుకుపడ్డారు. అలాగే జైట్లీని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీతో పోల్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆయన దుయ్యబట్టారు. 'నరేంద్రమోదీ తానే అంతా అనుకొని జైట్లీని అద్వానీతో పోలుస్తున్నారు. జైట్లీ ఓ సిగ్గులేని మనిషి. అతనిపై వందలాది ఆరోపణలు ఉన్నాయి' అని రామ్‌జెఠ్మలానీ విమర్శించారు. ఢిల్లీ క్రికెట్ బోర్డు అక్రమాల వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన హస్తిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై జైట్లీ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరువు నష్టం దావా కేసులో కేజ్రీవాల్ తరఫున వాదిస్తున్న రామ్‌జెఠ్మలానీ జైట్లీ తీరును తప్పుబట్టారు. హవాలా కుంభకోణం కేసులో అద్వానీ తరఫున తాను వాదించడం వల్లే ఆయన విజయం సాధించారని, ప్రస్తుతం తాను కేజ్రీవాల్ దన్నుగా పరువునష్టం కేసులో జైట్లీని ప్రాసిక్యూట్ చేయబోతున్నానని, పరిస్థితి ఎలా ఉంటుందో మీరు గుర్తించవచ్చునని ఆయన చెప్పారు. అందరూ తప్పు చేస్తారని, కానీ తనకు జైట్లీ అంటే ఇష్టం లేదని ఆయన పేర్కొన్నారు.