టాప్ లాయర్కు ముఖ్యమంత్రి షాక్
దేశంలో ఉన్న అతి కొద్దిమంది రాజ్యాంగ నిపుణులలో ఆయనొకరు. కేసు టేకప్ చేశారంటే కోటి రూపాయలు, ఒక్కసారి కోర్టు విచారణకు వచ్చారంటే కనీసం 25 లక్షలు తీసుకునే రేంజ్ ఆయనది. ఆయనెవరో ఈపాటికే తెలిసి ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయవాది రాం జెఠ్మలానీ. ఆయన వాదిస్తుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఒక్క నిమిషం ఆగి.. సాలోచనగా వింటారు. అలాంటి అగ్రశ్రేణి న్యాయవాదికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ షాకిచ్చారు.
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో తన తరఫున ఇన్నాళ్లూ వాదిస్తున్న ఆయనను తన న్యాయవాదిగా తీసేశారు. ఇప్పటికే ఒక కేసు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ మీద.. జైట్లీ మరో కేసు కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. పాత కేసుకు సంబంధించి జెఠ్మలానీ ఒక అనరాని పదం అనడంతో కోర్టు తీవ్రంగా మందలించింది. అది మీరే అన్నారా లేదా మీ క్లయింటు (కేజ్రీవాల్) చెబితే అన్నారా అని కూడా ప్రశ్నించింది. ఆ తర్వాతే కేజ్రీవాల్ తనను అవమానించారంటూ అరుణ్ జైట్లీ రూ. 10 కోట్లకు కొత్త పరువునష్టం కేసు దాఖలు చేయడంతో ఇప్పుడు ఏకంగా రాం జెఠ్మలానీనే కేజ్రీవాల్ తీసేశారని అంటున్నారు.