
'మోదీతో తెగతెంపులు చేసేసుకున్నా'
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకున్న బంధాన్నిఇకముందు తెంచుకుంటున్నట్టు మాజీమంత్రి, సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది, రామ్ జెఠ్మలానీ ప్రకటించారు. కీలకమైన విజిలెన్స్ శాఖలో అవినీతి చరిత్ర ఉన్న కేవీ చౌదరిని సీవీసీగా (చీఫ్ విజిలెన్స్ కమిషనర్) నియమించడంతో ప్రభుత్వం మీద తనకున్న గౌరవం పోయిందని ఆయన తెలిపారు. కేవీ చౌదరి పరపతి ఏమంత గొప్పగా లేదని, ఆయన మీద అనేక ఆరోపణలున్నాయని రాం జెఠ్మలానీ అంటున్నారు. ఈ నియామకానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తాను పోరాడనున్నానని తెలిపారు. దీనికి సంబంధించి సోమవారం సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు. ఫేస్బుక్, ట్విట్టర్లో మోదీకి ఒక సందేశాన్ని పంపారు. మోదీతో తనకున్న సంబంధాలను తెంచుకున్నట్టుగా ఒక ఉత్తరాన్ని పోస్ట్ చేశారు. బీజేపీలో సీనియర్ నేతలంతా మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న సమయంలో మోదీని చాలా గట్టిగా సమర్ధించిన జెఠ్మలానీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఈ తాజా పరిణామంతో ఇప్పటికే కేవీ నియామకాన్ని వ్యతిరేకిస్తున్న మరో సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది, ఆప్ బహిష్కృత నేత ప్రశాంత్ భూషణ్ కు, రాజ్యసభ మాజీసభ్యుడు జెఠ్మలానీ మద్దతు లభించినట్టయింది. కాగా కేవీ చౌదరి నియామకాన్ని ఖండించిన ప్రశాంత్ భూషణ్... ఈ అంశంపై ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఇప్పటికే లేఖ రాశారు. ఇది అవమానకర, దురదృష్టకర ఘటన అని , దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేస్తానని ప్రకటించారు.