నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ చన్నీ
రికార్డుల్లోంచి తొలగించిన వ్యాఖ్యలను షేర్ చేశారని ఆరోపణలు
న్యూఢిల్లీ: విపక్షనేత రాహుల్ గాందీపై లోక్‌సభలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వివాదం మరో మలుపు తీసుకుంది. అనురాగ్ వ్యాఖ్యల్లో స్పీకర్ తొలగించిన భాగాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ’ఎక్స్‘లో షేర్ చేశారని, ఇది సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు ఇచ్చారు.
సభా నియమావళి రూల్–222 కింద ప్రధానిపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానానికి నోటీసు ఇస్తున్నట్లు చన్నీ తెలిపారు. మంగళవారం అనురాగ్ ఠూకూర్ లోక్‌సభలో మాట్లాడుతూ.. తమ కులమేమిటో తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారని రాహుల్‌ను ఉద్దేశించి అన్నారు. దీనిపై విపక్ష సభ్యుల అభ్యంతరంతో స్పీకర్ స్థానంలో ఉన్న జగదంబికా పాల్ (కాంగ్రెస్ ఎంపీ) అనురాగ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.
‘నిబంధనల ప్రకారం రికార్డుల నుంచి తొలిగించిన వ్యాఖ్యలను ప్రచురించడం సభాహక్కుల ఉల్లంఘనే. సుప్రీంకోర్టు కూడా దీన్నే ధృవకరించింది’ అని చన్నీ తెలిపారు. ‘ అయితే అనురాగ్ తమ కులమేమిటో తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారని అన్నపుడు ఎవరి పేరునూ తీసుకోలేదని, ఈ వ్యాఖ్యను రికార్డుల నుంచి తొలగించలేదని, దీని ఆధారంగా చన్నీ ఇచ్చే నోటీసు పరిగణనకు రాకపోవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ మంగళవారం ఎక్స్‌లో అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని మొత్తం షేర్ చేస్తూ.. ‘తప్పకుండా వినాల్సినది. వాస్తవాలు, హాస్యం మేలు కలయిక. ఇండియా కూటమి నీచ రాజకీయాలను ఎండగట్టింది’ అని కితాబిచ్చారు. అనురాగ్ వ్యాఖ్యలపై బుధవారం కూడా లోక్‌సభలో తీవ్ర దుమారం రేగింది.
Comments
Please login to add a commentAdd a comment