violation of guidelines
-
3 ఎయిర్‌లైన్స్‌పై డీజీసీఏ చర్యలు
న్యూఢిల్లీ: వివిధ నిబంధనల ఉల్లంఘనలకు గాను మూడు విమానయాన సంస్థలు, 1 ఫ్లయింగ్ ట్రైనింగ్ సంస్థపై విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ చర్యలు తీసుకుంది. రద్దయిన ఫ్లయిట్లకు సంబంధించి ప్రయాణికులకు పరిహారం చెల్లించనందుకు గాను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు రూ. 10 లక్షల జరిమానా విధించింది. అలాగే సంక్షోభంలో చిక్కుకున్న స్పైస్‌జెట్‌పై పర్యవేక్షణ స్థాయిని పెంచడంతో పాటు పలు ఉల్లంఘనలకు గాను ఆకాశ ఎయిర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫ్లయిట్స్ తరచుగా రద్దవుతున్న వార్తల నేపథ్యంలో ఆగస్టు 7, 8 తేదీల్లో కంపెనీ ఇంజినీరింగ్ యూనిట్ల స్పెషల్ ఆడిట్ నిర్వహించగా, నిర్దిష్ట లోపాలు తమ దృష్టికి వచ్చినట్లు డీజీసీఏ తెలిపింది. ఈ నేపథ్యంలోనే సంస్థపై పర్యవేక్షణను మరింతగా పెంచినట్లు పేర్కొంది. అటు, ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదంపై ఆడిట్ నిర్వహించిన మీదట అల్కెమిస్ట్ ఏవియేషన్ అనుమతులను డీజీసీఏ సస్పెండ్ చేసింది. -
తల్లిదండ్రుల అనుమతి లేకుండా పిల్లల డేటా సేకరణ!
ప్రముఖ సోషల్‌మీడియా యాప్ టిక్‌టాక్‌పై యూఎస్ ప్రభుత్వం కోర్టులో దావా వేసింది. పదమూడేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల సమాచార గోప్యతను పాటించడంలో కంపెనీ యాజమాన్యం విఫలమైందని ఆరోపించింది. పిల్లల తల్లిదండ్రుల అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా సమాచారాన్ని సేకరించిందని చెప్పింది. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వం టిక్‌టాక్, దాని మాతృసంస్థ బైట్‌డాన్స్‌పై కోర్టులో దావా వేసింది.యూఎస్ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం..చైనా ఆధారిత సోషల్‌మీడియా యాప్ టిక్‌టాక్ యూఎస్‌లో 13 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించింది. అందుకు వారి తల్లిదండ్రుల సమ్మతిని పొందాల్సి ఉంటుంది. కానీ కంపెనీ యాజమాన్యం ఎలాంటి నిబంధనలు పాటించలేదు. పిల్లల ఆన్లైన్ గోప్యతా రక్షణ చట్టాన్ని టిక్‌టాక్ ఉల్లంఘించింది. ఇది భవిష్యత్తులో అమెరికన్ల సమాచార భద్రతకు హాని కలిగించే ప్రమాదం ఉంది.ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీలోని డెమొక్రాట్ ప్రతినిధి ఫ్రాంక్ పల్లోన్ మాట్లాడుతూ..‘చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నియంత్రణలోని టిక్‌టాక్‌ను ఉపసంహరించుకోవాలి. పిల్లల తల్లిదండ్రులకు తెలియకుండానే కుంటుంబ సభ్యుల సమాచారాన్ని సేకరించడం సరికాదు. అమెరికన్ల సమాచార గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది’ అన్నారు. ఈ నేపథ్యంలో పిల్లల నుంచి డేటా సేకరించినందుకుగాను టిక్‌టాక్‌పై రోజూ ఒక్కో ఉల్లంఘనకు 51,744 డాలర్లు(రూ.43 లక్షలు) జరిమానా విధించాలని ఫెడరల్ ట్రేడ్ కమిషన్(ఎఫ్‌టీసీ) ప్రతిపాదించింది. ఇదే జరిగితే కంపెనీ కోట్ల రూపాయలు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: బ్యాంకు సర్వీసులను అప్డేట్ చేయట్లేదుఈమేరకు టిక్‌టాక్ స్పందిస్తూ..యూఎస్ ప్రభుత్వం కోర్టులో వేసిన దావాను తీవ్రంగా ఖండించింది. అందులోని వివరాలు పూర్తిగా అబద్ధమని చెప్పింది. కొన్ని సంఘటనలు గతంలో జరిగినా అవి చాలాకాలం కిందటే పరిష్కరించామని పేర్కొంది. పిల్లల భద్రతకు కంపెనీ యాజమాన్యం పూర్తి మద్దతు ఇస్తోందని స్పష్టం చేసింది. టిక్‌టాక్‌ను మరింత మెరుగుపరిచేందుకు చేస్తున్న సన్నాహాలు ఆపమని తేల్చి చెప్పింది. ఇదిలాఉండగా, చైనీస్ యాజమాన్యంలోని టిక్‌టాక్ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌ను యూఎస్‌లో దాదాపు 170 మిలియన్ల(17 కోట్లు) మంది వినియోగిస్తున్నారు. పిల్లల డేటా నిర్వహణకు సంబంధించి సరైన నిబంధనలు పాటించకపోవడంతో సంస్థపై గతేడాది యూరోపియన్ యూనియన్, యూకే ప్రభుత్యాలు జరిమానా విధించాయి. -
ప్రధానిపై సభాహక్కుల తీర్మానం
న్యూఢిల్లీ: విపక్షనేత రాహుల్ గాందీపై లోక్‌సభలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వివాదం మరో మలుపు తీసుకుంది. అనురాగ్ వ్యాఖ్యల్లో స్పీకర్ తొలగించిన భాగాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ’ఎక్స్‘లో షేర్ చేశారని, ఇది సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు ఇచ్చారు. సభా నియమావళి రూల్–222 కింద ప్రధానిపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానానికి నోటీసు ఇస్తున్నట్లు చన్నీ తెలిపారు. మంగళవారం అనురాగ్ ఠూకూర్ లోక్‌సభలో మాట్లాడుతూ.. తమ కులమేమిటో తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారని రాహుల్‌ను ఉద్దేశించి అన్నారు. దీనిపై విపక్ష సభ్యుల అభ్యంతరంతో స్పీకర్ స్థానంలో ఉన్న జగదంబికా పాల్ (కాంగ్రెస్ ఎంపీ) అనురాగ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. ‘నిబంధనల ప్రకారం రికార్డుల నుంచి తొలిగించిన వ్యాఖ్యలను ప్రచురించడం సభాహక్కుల ఉల్లంఘనే. సుప్రీంకోర్టు కూడా దీన్నే ధృవకరించింది’ అని చన్నీ తెలిపారు. ‘ అయితే అనురాగ్ తమ కులమేమిటో తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారని అన్నపుడు ఎవరి పేరునూ తీసుకోలేదని, ఈ వ్యాఖ్యను రికార్డుల నుంచి తొలగించలేదని, దీని ఆధారంగా చన్నీ ఇచ్చే నోటీసు పరిగణనకు రాకపోవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ మంగళవారం ఎక్స్‌లో అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని మొత్తం షేర్ చేస్తూ.. ‘తప్పకుండా వినాల్సినది. వాస్తవాలు, హాస్యం మేలు కలయిక. ఇండియా కూటమి నీచ రాజకీయాలను ఎండగట్టింది’ అని కితాబిచ్చారు. అనురాగ్ వ్యాఖ్యలపై బుధవారం కూడా లోక్‌సభలో తీవ్ర దుమారం రేగింది. -
ఈసీ తీరుపై సీఐసీ విస్మయం
న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరు, విశ్వసనీయతను ప్రశ్నిస్తూ అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) తీవ్రంగా తప్పుబట్టింది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఈసీని సీఐసీ ఆదేశించింది. ఈవీఎంల పనితీరు, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తాము లేవనెత్తిన అనుమానాలను నివృత్తిచేసేలా సమాచారం ఇవ్వాలని మాజీ ఐఏఎస్ అధికారి ఎంజీ దేవసహాయం సహా ప్రముఖ సాంకేతికవిద్యా నిపుణులు, ఐఐటీ, ఐఐఎంలలోని విద్యావేత్తలు, మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారులు 2022 మే రెండో తేదీన ఈసీకి ఆర్టీఐ చట్టంకింద దరఖాస్తు పెట్టుకోవడం తెల్సిందే. తమ ఆర్టీఐ దరఖాస్తుపై ఈసీ ఏ మేరకు చర్యలు తీసుకుందని 2022 నవంబర్ 22న దేవసహాయం మరోసారి ఆర్టీఐ కింద సమాచారం అడిగారు. 30 రోజుల్లోపు సమాధానం ఇవ్వాల్సి ఉన్నా ఈసీ సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆయన సీఐసీను ఆశ్రయించారు. దేవసహాయానికి ఎందుకు మీ స్పందన తెలపలేదు? అని ఈసీలోని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌కు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ హీరాలాల్ సమరియా అడగ్గా ఆయన సమాధానం ఇవ్వలేదు. ‘‘ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇవ్వకుండా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(పీఐఓ) వ్యవహరించిన తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. దీనిపై 30 రోజుల్లోగా పాయింట్లవారీగా వివరణ ఇవ్వండి’ అని ఈసీని సీఐసీ ఆదేశించింది. -
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, జేఎంఎఫ్పీలో ప్రత్యేక ఆడిట్
న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘనలపై చేపట్టిన దర్యాప్తులో భాగంగా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, జేఎం ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ (జేఎంఎఫ్పీ)లో ఆర్బీఐ ప్రత్యేక ఆడిట్ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి ఆడిటర్ల నియామక ప్రక్రియ చేపట్టింది. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన టెండరు ప్రకటన ప్రకారం ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు సెబీ ఆమోదం పొందిన ఆడిట్ సంస్థలు ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను సమరి్పంచేందుకు ఆఖరు తేదీ ఏప్రిల్ 8 కాగా, ఎంపికైన సంస్థలకు ఏప్రిల్ 12న విధులను కేటాయిస్తారు. గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలో పర్యవేక్షణపరమైన అవకతవకలను పరిశీలించిన మీదట తదుపరి బంగారం రుణాలు ఇవ్వరాదంటూ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌ను ఆర్బీఐ ఆదేశించింది. అలాగే ఐపీవోలకు బిడ్ చేసే కస్టమర్లకు నిధులు సమకూర్చే విషయంలో అవకతవకలకు గాను జేఎంఎఫ్పీపైనా ఆంక్షలు విధించింది. -
ఫేమ్ ఉల్లంఘనలపై విచారణ
న్యూఢిల్లీ: ఫేమ్–2 స్కీము నిబంధనల ఉల్లంఘనలో అధికారులపరంగా తప్పిదాలు జరిగాయన్న ఆరోపణలపైనా కేంద్రం దృష్టి పెట్టింది. వాటితో పాటు వేలిడేషన్, టెస్టింగ్ ఏజెన్సీలైన ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసీఏటీ) అధికారుల పాత్రపైనా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ విచారణ ప్రారంభించింది. దీనికి సంబంధించి నెల రోజుల వ్యవధిలో నివేదిక రావచ్చని శాఖ కార్యదర్శి కమ్రాన్ రిజ్వి తెలిపారు. ఆ తర్వాత ఉల్లంఘనలకు బాధ్యులైన వారితో పాటు సిస్టమ్స్‌ను కూడా సరిదిద్దే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. స్థానికంగా తయారీని, విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు సబ్సిడీలు ఇచ్చేలా కేంద్రం రూ. 10,000 కోట్లతో ఫేమ్–2 స్కీమును ప్రవేశపెట్టింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా పలు కంపెనీలు పెద్ద స్థాయిలో దిగుమతి చేసుకుంటున్నాయని, ఏడు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ప్రోత్సాహకాలు పొందాయని ఆరోపణలొచ్చాయి. -
రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్
న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘన, అనుచిత ప్రవర్తన, ధిక్కార వైఖరి ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గుర య్యారు. ఆయన సస్పెన్షన్‌పై శుక్రవారం రాజ్యసభ నేత పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దేశ రాజధాని ఢిల్లీ(సవరణ) బిల్లు–2023పై ప్రతిపాది త సెలెక్ట్ కమిటీకి అనుమతి తీసుకోకుండానే కొందరు సభ్యుల పేర్లను చేర్చినందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై సభా హక్కుల కమిటీ విచారణ జరిపి, నివేదిక ఇచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపింది. ఆప్ మరో నేత సంజయ్ సింగ్ సస్పెన్షన్ పొడిగించే తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. వర్షాకాల సమావేశాల ప్రారంభంలోనే సంజయ్ సింగ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. -
ప్రధాని మోదీపై వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి లోక్‌సభ సెక్రెటేరియట్ నోటీసులిచ్చింది. లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 15వ తేదీలోగా వివరణ ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు ఆయనకు ఓ లేఖ రాసింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధర్మాసనం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీపై రాహుల్ చేసిన విమర్శల పట్ల బీజేపీ సభ్యులు నిశికాంత్ దూబే, ప్రహ్లాద్ జోషీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. వీటిపై లోక్‌సభ సెక్రెటేరియట్ రాహుల్‌కు లేఖ రాసింది. -
రెండేళ్లుగా అడ్డగోలు చెత్త బంధం..!!
సాక్షి, విశాఖపట్నం: దాసుడి తప్పు దండంతోనే సరి.. అన్నట్టుగా అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడిన అసలు సూత్రధారులను దర్జాగా వదిలేసి.. పాత్రధారులపై కొరడా ఝుళిపించారు జీవీఎంసీ ఉన్నతాధికారులు. నిబంధనలు మీరి రైల్వే స్టేషన్లలో చెత్త తరలింపునకు కార్పొరేషన్ వాహనాలు వినియోగించిన వైనం బట్టబయలైంది. అయితే దొరికేంత వరకూ దొరలే అన్నచందంగా.. కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే జరిగిందన్నట్లుగా.. అధికారుల కళ్లుగప్పేశారు. కానీ.. ఈ ‘చెత్త’ బంధం సుమారు రెండేళ్ల నుంచి సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవీఎంసీ ఖజానాకు కన్నం పెట్టి.. రైల్వే కాంట్రాక్టర్ కాసులకు కక్కుర్తిపడిన పెద్ద చేపల్ని వదిలేసి.. కేవలం ఒక డ్రైవర్ సస్పెన్షన్తోనే మమా అనిపించెయ్యడం గమనార్హం. మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో పరిధిలో పోగవుతున్న చెత్తను తీసేందుకు తీరిక లేని పారిశుధ్య కాంట్రాక్టర్లకు.. తమ పరిధి కాని ప్రాంతాల్లో మాత్రం శ్రద్ధగా పనులు కానిచ్చేస్తున్నారు. ఇటీవల రైల్వే స్టేషన్లో జరిగిన అక్రమ చెత్త నిర్వహణ అంశం బయటపడిన విషయం విదితమే. అసలేం జరిగిందంటే... రైల్వేస్టేషన్ పరిధిలో ఉన్న చెత్త నిర్వహణ బాధ్యతను రైల్వే శాఖ ప్రత్యేకంగా మూడేళ్ల కాలపరిమితితో కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఆ పరిధిలో జీవీఎంసీ పారిశుధ్య కార్మికులకు గానీ, వాహనాలకు గానీ పని లేదు. కేవలం రైల్వే స్టేషన్ మాత్రమే కాదు.. ఏ పబ్లిక్ సెక్టార్ పరిధిలోనైనా చెత్త నిర్వహణ బాధ్యత ఆయా సంస్థలు మాత్రమే నిర్వహించుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో జీవీఎంసీ కమిషనర్‌కు లేఖ రాసి.. ఆయన అనుమతితోనే ఇక్కడ సిబ్బందిని చెత్త నిర్వహణ పనులకు వినియోగించుకుంటారు. కానీ రైల్వే స్టేషన్లో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా పారిశుధ్య పనులకు జీవీఎంసీ వాహనాలను వినియోగిస్తున్న విషయం బట్టబయలైంది. కొందరు స్థానికులు జీవీఎంసీ ఉన్నతాధికారులకు ఇక్కడ జరుగుతున్న తీరుపై ఫిర్యాదు చేయడంతో అధికారులు అవాక్కయ్యారు. రెండేళ్లుగా.. జీవీఎంసీ జోన్–4లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది, కాంట్రాక్టర్ తో కలిసి అక్రమార్జన కోసం రైల్వే కాంట్రాక్టర్‌తో అడ్డగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. జీవీఎంసీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పనులు చేస్తున్నట్లుగా చెప్పి ఒక టిప్పర్, బాబ్ కార్ట్ ని రైల్వే స్టేషన్ ఆవరణలో పారిశుధ్య నిర్వహణ పనులు గుట్టుగా కానిచ్చేస్తున్నారు. దీనికి అవసరమైన ఇంధనాన్ని కూడా జీవీఎంసీకి చెందినదే కావడం గమనార్హం. ఈ అక్రమ వ్యవహారం బట్టబయలవ్వడంతో.. ఆ ఒక్క రోజు మాత్రమే ఇలా జరిగిందంటూ అధికారులకు తప్పుడు సమాచారం అందించారు. ఇలా రైల్వే స్టేషన్లో చెత్త సేకరణకు సుమారు రెండేళ్ల కాలం నుంచి వాహనాల్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ చెత్త సేకరణ సమయం పూర్తయిన వెంటనే రైల్వే స్టేషన్‌కు వెళ్లి.. అక్కడి చెత్తని తాటిచెట్లపాలెంలోని మినీ సూయిజ్ ఫాం(ఎంఎస్ఎఫ్)కు తరలించినట్లు సమాచారం. రైల్వే కాంట్రాక్టర్‌తో జీవీఎంసీ జోన్–5 పరిధిలో ఉన్న ఒక కాంట్రాక్టర్, ముఖ్య అధికారి చేతులు కలిపి ఈ పనులకు వాహనాల్ని పంపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం జీవీఎంసీకి చెందిన రూ.లక్షలాది రూపాయిల ఇంధనాన్నే వినియోగించినట్లు తెలుస్తోంది. అసలువారిని వదిలేసి.. ఈ అక్రమ నిర్వహణ వ్యవహారం వెలుగులోకి రావడంతో జోన్–5 అధికారులు, సిబ్బంది, ఎంఎస్ఎఫ్ కాంట్రాక్టర్ ఉలిక్కిపడ్డారు. తప్పు తమవైపు రాకుండా ఉండేందుకు ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక అందించినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న సమయంలో ఎంఎస్‌ఎఫ్‌కు వస్తున్నప్పుడు అక్కడి రైల్వే కాంట్రాక్టర్ రూ.1000 ఇస్తే.. ఆ ఒక్క రోజు మాత్రమే చెత్తని తీసేందుకు వెళ్లారని అధికారులకు చెప్పారు. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ అధికారులను ఆదేశించగా.. జోన్–5 అధికారులు టిప్పర్ డ్రైవర్‌ను బలిపశువులా సస్పెండ్ చేశారు. కాంట్రాక్టర్ పరిధిలో ఉన్న బాబ్‌కార్డ్ అవుట్సోర్సింగ్ డ్రైవర్ని మరో చోటికి పంపించేసి చేతులు దులిపేసుకున్నారు. కానీ జీవీఎంసీకి నష్టం తీసుకొచ్చిన కాంట్రాక్టర్‌పైనా, అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. అధికారుల ఒత్తిడి లేకుండా దిగువస్థాయి సాధారణ సిబ్బంది ఈ తరహా పనులకు వెళ్లే అవకాశం లేదు. దీనిపై కమిషనర్ లక్ష్మీశను వివరణ కోరగా.. సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. (చదవండి: ఏపీ సర్కార్‌ని చూస్తే అసూయగా ఉంది) -
గూగుల్‌కు భారీ షాకిచ్చిన రష్యా
మాస్కో: సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్‌కు రష్యా ప్రభుత్వం మరోసారి భారీ షాక్ ఇచ్చింది. వ్యక్తిగత డేటా చట్టాన్ని ఉల్లంఘించిందంటూ గూగుల్‌కు 3 మిలియన్ రూబిళ్లు ( సుమారు 31 లక్షల రూపాయల) జరిమానా విధించింది. ఈ విషయంలో గూగుల్‌కు ఇది మొదటి జరిమానా అని మాస్కో టాగన్స్కీ జిల్లా కోర్టు గురువారం తెలిపింది. ఈ జరిమానాను ధృవీకరించిన గూగుల్ దీనిపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. రష్యాకు టెగ్ దిగ్గజాలకు ప్రధానంగా గూగుల్‌కు మధ్య ఇటీవల నెలకొన్న వైరుధ్యాల మధ్య ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యాలో వినియోగదారుల వ్యక్తిగత డేటాను నిల్వ చేయనందుకు ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థ గూగుల్‌కు 6 మిలియన్ రూబిళ్లు వరకు జరిమానా విధించవచ్చని స్టేట్ కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ రోస్కోమ్నాడ్జోర్ గత నెలలో వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా నిషేధిత విషయాలను తొలగించడంలో వైఫల్యం, రష్యాలో విదేశీ టెక్ సంస్థల కార్యాలయాలను తెరవని కారణంగా సోషల్ మీడియా దిగ్గజాలకు రష్యా ప్రభుత్వం జరిమానా విధిస్తోంది. నిషేధిత కంటెంట్‌ను తొలగించనందుకు గతంలో గూగుల్‌కు జరిమానా విధించింది. అలాగే అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ పైనా రష్యా చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. మరోవైపు ఇటీవల యూరోపియన్ యూనియన్ కూడా గూగుల్‌కు వ్యతిరేకంగా మూడు కేసులు నమోదు చేసింది. -
పీఏతో మంత్రి రాసలీలలు.. ఫొటోలు లీక్
కరోనా టైం.. అందులో కఠిన ఆంక్షలు అమలులో ఉన్నవేళ. సోయి మరిచి తన అనుచరురాలితో ఆఫీసులోనే రాసలీలలు సాగించాడు ఓ మంత్రి. ఆ మంత్రి రొమాంటిక్ యాంగిల్ఫొటోలు మీడియా ద్వారా జనాల్లోకి లీక్ అయ్యాయి. ఇంకేం ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. రాజకీయ విమర్శలు చుట్టు ముట్టాయి. చివరికి యూకే ఆరోగ్యశాఖా మంత్రి మ్యాట్ హాంకాక్ రాజీనామా చేయాల్సి వచ్చింది. లండన్: ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శి మ్యాట్ హాంకాక్ యవ్వారం.. వారం నుంచి యూకే రాజకీయాలను కుదేలు చేస్తోంది. వివాహితుడైన హాంకాక్.. ఓ మహిళను ఏరికోరి తన అసిస్టెంట్‌గా నియమించుకున్నాడు. ఆమెతో తన కార్యాలయంలోనే రాసలీలు కొనసాగించాడు. ఆమెను ముద్దులు పెట్టుకున్నట్లుగా ఓ ఫొటోతో ‘పీఏతో హాంకాక్ రాసలీలలు’ పేరుతో ది సన్ టాబ్లాయిడ్ ప్రముఖంగా ప్రచురించింది. పైగా కరోనా నిబంధనలు అమలులో ఉన్న టైంలో ఆ పని చేశాడంటూ కథనం ప్రచురించింది. ఇంకేం విమర్శలు మొదలయ్యాయి. ఈ బంధం ఏనాటిదో.. కాగా, ఆ ఫొటోలు మే 6 నుంచి 11 మధ్య కాలంలో, అది కూడా మ్యాట్ కార్యాలయంలోనే తీసినవని సమాచారం. అయితే ఆ ఫొటోల్ని ఎలా సంపాదించింది మాత్రం సన్ వెల్లడించలేదు. అప్పటికీ ఇంకా లాక్డౌన్ కఠిన నిబంధనల్ని, ఆంక్షల్ని ఎత్తివేయలేదని మాత్రం పేర్కొంది. ఇంట్లో వ్యక్తులతో తప్ప బయటివారిని కౌగిలించుకోవడం, వారితో శారీరక సంబంధం పెట్టుకోవడానికి అనుమతించని రోజుల్లో ఈ ఘటన జరిగిందని తెలిపింది. అంతేకాకుండా ఆ ఫొటోలో ఉన్న మహిళను హాంకాక్.. 2000 సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కలిశాడని, పోయిన నెలలోనే ఆమెను ఇన్‌కంటాక్స్ విభాగంలో తన సహాయకురాలిగా నియమించుకున్నాడని తేలింది. ఎట్టకేలకు రాజీనామా కరోనా టైంలో మాస్క్‌లు లేకుండా తిరగొద్దని హాంకాక్ విస్తృతంగా ప్రచారం చేశాడు. పైగా భావోద్వేగంగా ఉపన్యాసాలు దంచాడు. అలాంటి వ్యక్తే.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై విమర్శలు వెలువెత్తాయి. ఈ మేరకు శనివారం ప్రధాని బోరిస్ జాన్సన్‌కు, మాట్ హాంకాక్‌కు ఓ క్షమాపణ లేఖ రాశాడు. నేనే మార్గదర్శకాల్ని ఉల్లంఘించా.. అందుకే రాజీనామా చేస్తున్నా అని తెలిపాడు. ఇక విమర్శల నేపథ్యంలో హాన్కాక్ రాజీనామాను ఆమోదించిన బోరిస్.. అప్పటిదాకా ఆయన అందించిన సేవలను కొనియాడాడు. చదవండి: పార్లమెంట్లో పొంగుతున్న బీర్లు -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఆర్థిక ఉగ్రవాద సంస్థలు!
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఆర్థిక ఉగ్రవాద సంస్థలని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) తీవ్రంగా విమర్శించింది. ఇవి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘించాయని, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. చిన్న వ్యాపారస్తులు గత ఏడాది కాలంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇంకా ఇతర ఈ–కామర్స్ సంస్థల చేతుల్లో విలవిలలాడుతున్నాయని, ఫలితంగా వాటి వ్యాపారం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, భారతలోని చట్టాల ప్రకారమే వ్యాపారం చేస్తున్నామని, ఎలాంటి ఎఫ్‌డీఐ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని ఫ్లిప్‌కార్ట్ స్పష్టం చేసింది. -
డాక్టర్ రెడ్డీస్‌పై కొరియా కంపెనీ దావా
♦ తయారీ మార్గదర్శకాల ఉల్లంఘన, మోసానికి పాల్పడిందన్న ఆరోపణలు ♦ న్యూజెర్సీ స్టేట్ కోర్టులో పిటిషన్ దాఖలు ♦ మిలియన్ల డాలర్ల జరిమానా రాబట్టాలని వినతి హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే బహుళజాతి భారతీయ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్‌కు మరో చిక్కు వచ్చి పడింది. డాక్టర్ రెడ్డీస్‌పై దక్షిణ కొరియాకు చెందిన బయోటెక్ కంపెనీ మెజియాన్ ఫార్మా కోర్టుకెక్కింది. ఉత్తమ తయారీ విధానం మార్గదర్శకాల (సీజీఎంపీ) విషయంలో పెద్ద ఎత్తున లోపాలను దాచిపెట్టి డాక్టర్ రెడ్డీస్ మోసానికి పాల్పడిందని ఆరోపిస్తూ అమెరికాలోని న్యూజెర్సీ స్టేట్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. నిబంధనల అమలులో తప్పుదోవ పట్టించి, మోసపూరితంగా విషయాలను దాచిపెట్టిన డాక్టర్ రెడ్డీస్ నుంచి మిలియన్ డాలర్లను నష్టాల కింద వసూలు చేయాలని కోరింది. అంగస్తంభన లోపానికి సంబంధించి తమ నూతన ఔషధం ఉడెనాఫిల్ దరఖాస్తుకు యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతి నిరాకరించడానికి కారణం డాక్టర్ రెడ్డీస్ తప్పుదోవ పట్టించడమేనని మెజియాన్ ఆరోపించింది. ఉడెనాఫిల్ మార్కెటింగ్‌కు అనుమతి నిరాకరించడం వల్ల కాలహరణంతోపాటు వ్యయాలకు దారితీసిందన్నది మెజియాన్ ఆరోపణ. దీనివల్ల ఉడెనాఫిల్ ఔషధానికి సంబంధించి కొత్తగా తయారీ, సరఫరాదారులను వెతుక్కోవాల్సిన పరిస్థితి మెజియాన్ ఎదుర్కొంది. ఉడెనాఫిల్ ఎన్డీఏ అనుమతి కోసం మరోసారి దరఖాస్తు చేసే చర్యలను ఈ కంపెనీ ఇప్పటికే చేపట్టింది. మాకు సమాచారం లేదు... కేసు విషయాన్ని డాక్టర్ రెడ్డీస్ కంపెనీ దృష్టికి తీసుకెళ్లగా... మెజియాన్ నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదని, న్యూజెర్సీ స్టేట్ కోర్టు నుంచి లీగల్ నోటీసు కూడా ఏదీ రాలేదని స్పష్టం చేసింది. తమకు అధికారికంగా ఏదైనా సమాచారం వస్తే అప్పుడు స్పందిస్తామని డాక్టర్ రెడ్డీస్ ప్రతినిధి తెలిపారు. డాక్టర్ రెడ్డీస్‌కు చెందిన మిర్యాలగూడ, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్లాంట్లలో తనిఖీల సందర్భంగా పలు నిబంధనల ఉల్లంఘనలు, అతిక్రమణలు బయటపడడంతో 2015 నవంబర్‌లో ఎఫ్‌డీఏ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటి నుంచి బయటపడకముందే తాజాగా మెజియాన్ రూపంలో మరో సమస్యను కంపెనీ ఎదుర్కోనుంది. కాగా, అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్లాంట్లలో ప్రస్తుత త్రైమాసికంలోనే యూఎస్ఎఫ్డీఏ మరోసారి డిట్ నిర్వహిస్తుందని కంపెనీ భావిస్తోంది.