ఈసీ తీరుపై సీఐసీ విస్మయం | CIC pulls up Election Commission for not replying to RTI query on EVMs | Sakshi
Sakshi News home page

ఈసీ తీరుపై సీఐసీ విస్మయం

Published Sat, Apr 13 2024 5:28 AM | Last Updated on Sat, Apr 13 2024 5:28 AM

CIC pulls up Election Commission for not replying to RTI query on EVMs - Sakshi

న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఈవీఎం, వీవీప్యాట్‌ల పనితీరు, విశ్వసనీయతను ప్రశ్నిస్తూ అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ) తీవ్రంగా తప్పుబట్టింది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఈసీని సీఐసీ ఆదేశించింది. 

ఈవీఎంల పనితీరు, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తాము లేవనెత్తిన అనుమానాలను నివృత్తిచేసేలా సమాచారం ఇవ్వాలని మాజీ ఐఏఎస్‌ అధికారి ఎంజీ దేవసహాయం సహా ప్రముఖ సాంకేతికవిద్యా నిపుణులు, ఐఐటీ, ఐఐఎంలలోని విద్యావేత్తలు, మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారులు 2022 మే రెండో తేదీన ఈసీకి ఆర్టీఐ చట్టంకింద దరఖాస్తు పెట్టుకోవడం తెల్సిందే.

తమ ఆర్టీఐ దరఖాస్తుపై ఈసీ ఏ మేరకు చర్యలు తీసుకుందని 2022 నవంబర్‌ 22న దేవసహాయం మరోసారి ఆర్టీఐ కింద సమాచారం అడిగారు. 30 రోజుల్లోపు సమాధానం ఇవ్వాల్సి ఉన్నా ఈసీ  సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆయన సీఐసీను ఆశ్రయించారు. దేవసహాయానికి ఎందుకు మీ స్పందన తెలపలేదు? అని ఈసీలోని పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌కు చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ హీరాలాల్‌ సమరియా అడగ్గా ఆయన సమాధానం ఇవ్వలేదు. ‘‘ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇవ్వకుండా పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌(పీఐఓ) వ్యవహరించిన తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. దీనిపై 30 రోజుల్లోగా పాయింట్లవారీగా వివరణ ఇవ్వండి’ అని ఈసీని సీఐసీ ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement