నరాలు తెగే ఉత్కంఠ.. గెలిచేదెవరంటూ చర్చోపచర్చలు.. పందెంరాయుళ్ల బెట్టింగులు.. తమ అభ్యర్థే గెలుస్తాడంటే.. కాదు తమవాడే అంటూ సాగిన సవాళ్లు.. ప్రతి సవాళ్లకు మరో 24 గంటల్లో తెరపడనుంది. హోరాహోరీగా పోరాడిన అభ్యర్థుల భవితవ్యంపై ఓటర్లు ఇచ్చిన తీర్పు గురువారం వెలువడనుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఇన్ని రోజులు పైకి బాగానే కనబడ్డా లోలోపల మాత్రం ఫలితాలపై ఆందోళనతోనే ఉన్నారు.
చిత్తూరు అర్బన్: జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు స్థానాల ఫలితాలు వెలువడ్డానికి ఒక్క రోజు మిగిలి ఉంది. ఈ ఏడాది మార్చి 10న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడం, ఏప్రిల్ 11న తొలి విడతలో జిల్లాలోని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగడం చకచకా జరిగిపోయాయి. అయితే తుది విడత ఎన్నికలు పూర్తయితే తప్ప ఓట్ల లెక్కింపు చేపట్టకూడదనే నిబంధన ఉండటంతో పోటీలో ఉన్న రాజకీయ పార్టీల అభ్యర్థులు ఒకింత డీలా పడిపోయారనే చెప్పాలి.
ఇప్పుడు ఓట్లేస్తే 43 రోజుల తర్వా త ఫలితాలు చెబుతారా అంటూ నిట్టూర్చారు. కానీ కాలచక్రం గిర్రున తిరిగింది. 43 రోజుల్లో 42 రోజులు చకచకా గడిచిపోయాయి. ఫలితాలు వెలువడే రోజు వచ్చేస్తోందని డీలాపడ్డ అభ్యర్థులే ఎగిరి గంతేస్తున్నారు. ఆ గంతుల్లో పలువురు అభ్యర్థులు కాస్త ఆందోళన, కొంచెం ధైర్యం, మరికొంత మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు.
తొలి ఓట్లు పోస్టల్ బ్యాలెట్లే..
ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రాంరభమవుతుంది. ఈవీఎం యంత్రాలను లెక్కింపు కేంద్రాల్లో ఉంచిన తర్వాత ప్రిసైండింగ్ అధికారులు, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెల్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. ఇది పూర్తయ్యాక ప్రతి నియోజకవర్గంలోని 5 వీవీప్యాట్‌లలో ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఇందులో తేడా వస్తే మళ్లీ లెక్కిస్తారు. అప్పటికే తేడా ఉంటే వీవీప్యాట్‌దే తుదిగా పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లో తుది ఫలితాలు రావడానికి రాత్రి 8 గంటలు పట్టే అవకాశముంది. అయితే ఏకపక్షంగా అభ్యర్థులకు తొలిరౌండ్ నుంచే ఆధిక్యం కొనసాగితే ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గంటన్నరలో ఫలితం తెలిసిపోతుంది.
మెజారిటీపై లెక్కలు..
ఇప్పటికే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో కొందరు ధీమాగా ఉన్నారు. గెలుపు దాదాపు ఖరారైపోయిందని, మిగిలింది మెజారిటీ ఎంతొస్తుందనే దానిపైనే లెక్కలు వేసుకుంటున్నారు. ఇందులో మండలాల వారీగా ఏయే ప్రాంతంలో ఎంత మెజారిటీ వస్తుంది..? అక్కడున్న సామాజికవర్గాల వారీగా ఓట్ల వివరాలు, కలిసొచ్చే అనుకూల అంశాలు, మెజారిటీ రాకపోవడానికి ప్రతికూల అంశాలపై బేరీజు వేస్తున్నారు.
కొన్నిచోట్ల అయితే మొన్నటి వరకు 20 వేల ఓట్ల మెజారిటీతో తానే గెలుస్తానని ధీమాగా ఉన్న అభ్యర్థులు గెలిస్తే చాలు దేవుడా అంటూ కార్యకర్తల వద్ద దిగాలు పడుతున్నారు. ఏది ఏమైనా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఆంక్షలు..
ఇక ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జిల్లాలో ఆంక్షలు విధించారు. 23వ తేదీ జిల్లాలో ఎక్కడా మద్యం దుకాణాలు తెరవడానికి వీల్లేదు. బార్లు సైతం మూసేయాలి. ఎక్కడైనా మద్యం విక్రయించినట్లు తెలిస్తే నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. దుకాణాన్ని సీజ్ చేస్తారు. అలాగే గెలిచిన అభ్యర్థులు ఊరేగింపులు చేసుకోవడం.. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎదుటివారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించినా చర్యలు తీసుకుంటారు.
కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
చిత్తూరు కలెక్టరేట్ : ఓట్ల లెక్కింపునకు సమయం 24 గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుం ది. ఏప్రిల్ 11న జరిగిన ఈవీఎంలన్నింటినీ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న సీతమ్స్, ఎస్వీ సెట్ కళాశాలల్లోని స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు.
వాటికి సీసీ కెమెరాలు, కేంద్ర బలగాల పహారాలో ఉంచారు. జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న మంగళవారం సాయంత్రం ఆర్వోలకు సీతమ్స్ కౌంటింగ్ కేంద్రంలో శిక్షణ కల్పించారు. ఎస్వీ సెట్ కళాశాలలో డెప్యూటీ ఎన్నికల అధికారి గిరీష ఏర్పాట్లను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment