Right to Information Act (RTI
-
MUDA scam: సిద్ధూ మెడకు ‘ముడా’ ఉచ్చు
సాక్షి, బెంగళూరు: మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూముల కేటాయింపుల వివాదం చివరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మెడకు చుట్టుకుంటోంది. ఖరీదైన భూములు భార్య పార్వతికి దక్కేలా సిద్ధరామయ్య కుట్ర చేశారని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ చేసిన అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ శనివారం అనుమతి ఇచ్చినట్లు రాజ్‌భవన్ ప్రకటించింది. దీంతో సిద్ధూపై కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టే అవకాశముంది. ‘‘ నాకు అందిన పిటిషన్ ప్రకారం భూకేటాయింపుల్లో అక్రమాలపై ప్రాథమిక ఆధారాలున్నాయి. మీపై విచారణకు ఎందుకు ఆదేశించకూడదో 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సీఎంకు గత నెల 26న షోకాజ్ నోటీసు ఇచ్చా. దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర మంత్రి మండలి చేసిన తీర్మానంలో హేతుబద్ధత లేదు. కేసు విచారణ పారదర్శకంగా జరగాలి. హడావిడిగా మాజీ ఐఏఎస్ వెంకటాచ లపతి ఆధ్వర్యంలో విచారణ కమిటీ, హైకోర్టు విశ్రాంత జడ్జి పీఎన్ దేశాయ్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేయడం చూస్తుంటే ఇందులో భారీ అవకతవకలు జరిగినట్లు భావించవచ్చు’’ అని గవర్నర్ గెహ్లోత్ వ్యాఖ్యానించారు. అయితే గవర్నర్ ఉత్తర్వులను రద్దుచేయాలంటూ సిద్ధరా యమ్య హైకోర్టును ఆశ్రయిస్తే ఆ కేసు విచారణ సందర్భంగా తమ వాదనలు సైతం వినాలంటూ ఫిర్యాదుదారుల్లో ఒకరైన ప్రదీప్ శనివారం కర్ణాటక హైకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలుచేశారు. 21వ తేదీన ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులోనూ కేసు వేస్తానని టీజే అబ్రహాం చెప్పారు.తీవ్రంగా తప్పుబట్టిన సిద్ధరామయ్యతనపై దర్యాప్తునకు గవర్నర్ ఆదేశించడాన్ని సీఎం తీవ్రంగా తప్పుబట్టారు. నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలన్న బీజేపీ డిమాండ్‌పై స్పందించారు. ‘‘గవర్నర్ కేంద్రప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారారు. చట్టవ్యతిరేక ఉత్తర్వులిచ్చి రాజ్యాంగబద్ధ పదవిని ఆయన దుర్వినియోగం చేస్తున్నారు. ఉత్తర్వులపై చట్టప్రకారం పోరాడతా. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నారు. కేంద్రం, బీజేపీ, జేడీ(ఎస్) ఇందులో కీలక పాత్రధారులు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల మద్దతు నాకు ఉంది. నేను రాజీనామా చేయాల్సినంత తప్పేమీ చేయలేదు. మైనింగ్ లైసెన్స్‌ల కుంభకోణంలో జేడీఎస్ నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిపై లోకాయుక్త దర్యాప్తునకు కోరితే ఆయనపై విచారణకు ఆదేశించలేదుగానీ నాపై ఆగమేఘాల మీద విచారణకు ఆదేశించారు. ఫిర్యాదులున్నా బీజేపీ మాజీ కేంద్ర మంత్రులు శశికళ జోళె, మురుగేశ్ నీలాని, జనార్ధన్ రెడ్డిలపై దర్యాప్తునకు ఎందుకు ఆదేశాలివ్వలేదు?’’ అని సీఎం అన్నారు.విమర్శలు ఎక్కుపెట్టిన బీజేపీవిచారణను ఎదుర్కొంటున్న సిద్ధరామయ్యకు సీ ఎంగా కొనసాగే అర్హత లేదని, రాజీనామా చేయా లని రాష్ట్రంలో విపక్ష బీజేపీ డిమాండ్చేసింది. ఆయ న దిగిపోతేనే దర్యాప్తు పారదర్శకంగా సాగుతుందని కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర అన్నారు. ‘‘కాంగ్రెస్ వంచనకు, కుటుంబ రాజకీయాలకు ఈ స్కామ్ మరో మచ్చుతునక. దళితులకు అండగా ఉంటామనే సీఎం స్వయంగా దళితుల భూములను లాక్కున్నారు’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. దాదాపు రూ.4,000–5,000 కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపించారు.బీజేపీయేతర ప్రభుత్వాలను వేధిస్తున్నారు: ఖర్గేప్రతిపక్షాలపాలిత రాష్ట్రాలను మోదీ సర్కార్ నియమించిన గవర్నర్లు తీవ్రంగా వేధిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ‘‘ ఏకంగా సీఎం మీదనే విచారణకు ఆదేశించేంత తప్పు ఏం జరిగింది?. ఏ కారణాలు చెప్పి దర్యాప్తునకు అనుమతి ఇచ్చారు?. పశ్చిమబెంగాల్, కర్ణాటక, తమిళనాడు ఇలా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందుల పాల్జేస్తున్నారు’’ అని ఖర్గే అన్నారు.ఏమిటీ ముడా భూవివాదం?సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ బోర్డ్‌గా 1904లో ఏర్పాటై తదనంతరకాలంలో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా)గా అవతరించిన సంస్థ ఇప్పుడు భూకేటాయింపుల వివాదంలో కేంద్రబిందువుగా నిలిచింది. కెసెరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. ఈ గ్రామంలో దేవనార్ 3ఫేజ్ లేఅవుట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. నష్టపరిహారంగా 2021లో మైసూర్‌లోని విజయనగర మూడో, నాలుగో ఫేజ్ లేఅవుట్లలో 38,284 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 ప్లాట్లను కేటాయించింది. అయితే పార్వతి నుంచి తీసుకున్న భూముల కంటే కేటాయించిన ప్లాట్ల విలువ రూ.45 కోట్లు ఎక్కువ అని ఆర్టీఐ కార్యకర్త అబ్రహాం లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేటాయింపుల అంశం వార్తల్లోకెక్కింది. కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లిఖార్జున స్వామి 2010 అక్టోబర్‌లో బహుమతిగా ఇచ్చాడు. ప్రభుత్వం సేకరించాక 2014 జూన్‌లో నష్టపరిహారం కోసం పార్వతి దరఖాస్తు చేసుకున్నారు. ప్లాట్ల కేటాయింపుపై సిద్ధూ గతంలోనే స్పష్టతనిచ్చారు. ‘‘2014లో నేను సీఎంగా ఉన్నపుడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కష్టమని అధికారులు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు 2021లో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఈ ప్లాట్లను కేటాయించారు’’ అని సిద్దూ అన్నారు. అయితే గతంలో ముడా 50: 50 పేరిట ఒక పథకాన్ని అమలుచేసింది. నిరుపయోగ భూమి తీసుకుంటే వేరే చోట ‘అభివృద్ధి చేసిన’ స్థలాన్ని కేటాయిస్తారు. ప్రతీ కేటాయింపు ముడా బోర్డు దృష్టికి తేవాలి. అయితే కొందరు ముడా అధికారులతో చేతులు కలిపి, బోర్డు దృష్టికి రాకుండా, పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను రాయించుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లోపాలున్న పథకాన్ని 2023 అక్టోబర్‌లో రద్దుచేశారు. అయితే తన భూమికి ఎక్కువ విలువ ఉంటుందని రూ.62 కోట్ల నష్టపరిహారం కావాలని సిద్ధరామయ్య ఈఏడాది జూలై నాలుగున డిమాండ్ చేయడం విశేషం. అయితే అసలు ఈ భూమి పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామిది కాదని, అక్రమంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి 2004లో తన పేరిట రాయించుకున్నాడని ఆరోపణలున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈసీ తీరుపై సీఐసీ విస్మయం
న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరు, విశ్వసనీయతను ప్రశ్నిస్తూ అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) తీవ్రంగా తప్పుబట్టింది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఈసీని సీఐసీ ఆదేశించింది. ఈవీఎంల పనితీరు, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తాము లేవనెత్తిన అనుమానాలను నివృత్తిచేసేలా సమాచారం ఇవ్వాలని మాజీ ఐఏఎస్ అధికారి ఎంజీ దేవసహాయం సహా ప్రముఖ సాంకేతికవిద్యా నిపుణులు, ఐఐటీ, ఐఐఎంలలోని విద్యావేత్తలు, మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారులు 2022 మే రెండో తేదీన ఈసీకి ఆర్టీఐ చట్టంకింద దరఖాస్తు పెట్టుకోవడం తెల్సిందే. తమ ఆర్టీఐ దరఖాస్తుపై ఈసీ ఏ మేరకు చర్యలు తీసుకుందని 2022 నవంబర్ 22న దేవసహాయం మరోసారి ఆర్టీఐ కింద సమాచారం అడిగారు. 30 రోజుల్లోపు సమాధానం ఇవ్వాల్సి ఉన్నా ఈసీ సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆయన సీఐసీను ఆశ్రయించారు. దేవసహాయానికి ఎందుకు మీ స్పందన తెలపలేదు? అని ఈసీలోని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌కు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ హీరాలాల్ సమరియా అడగ్గా ఆయన సమాధానం ఇవ్వలేదు. ‘‘ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇవ్వకుండా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(పీఐఓ) వ్యవహరించిన తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. దీనిపై 30 రోజుల్లోగా పాయింట్లవారీగా వివరణ ఇవ్వండి’ అని ఈసీని సీఐసీ ఆదేశించింది. -
SBI: ఆర్టీఐ కింద ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వలేం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమాచార హక్కు చట్టం(ఆరీ్టఐ) కింద బహిర్గతం చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిరాకరించింది. ఇది వ్యక్తిగత సమాచారమని పేర్కొంది. సంబంధిత రికార్డులు ఎన్నికల సంఘం వెబ్సైట్ అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ ఆర్టీఐ కింద ఈ వివరాలు ఇవ్వడం సాధ్యం కాదని తేలి్చచెప్పింది. ఈ బాండ్లకు సంబంధించిన పూర్తి డేటాను డిజిటల్ రూపంలో ఇవ్వాలని కోరుతూ సమాచార హక్కు చట్టం కార్యకర్త లోకేశ్ బాత్రా మార్చి 13న దరఖాస్తు చేశారు. -
రూ.15 వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్ల అమ్మకం
సాక్షి, న్యూఢిల్లీ: 2018 ఏడాది నుంచి ఇప్పటిదాకా రూ.15 వేల కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను విక్రయించామని భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) వెల్లడించింది. సమాచార హక్కు చట్టం(ఆరీ్టఐ) కింద ఒక ఆర్టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎస్బీఐ ఈ విషయం చెప్పింది. ‘‘2018 ఏడాది నుంచి ఇప్పటిదాకా 29 దఫాలుగా ఎలక్టోరల్ బాండ్లను విక్రయించాం. వాటి మొత్తం విలువ రూ.15,956.30 కోట్లు. ఇందులో రూ.23.88 కోట్ల విలువైన 194 బాండ్లు ఏ రాజకీయ పార్టీ బ్యాంక్ ఖాతాలో జమకాని కారణంగా ఆ బాండ్ల మొత్తాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(పీఎంఎన్ఆర్ఎఫ్)కు బదిలీ చేశాం’’ అని బ్యాంక్ తెలిపింది. లోకేశ్ బాత్రా అనే మాజీ నావికా అధికారి ఆర్టీఐ చట్టం కింద అభ్యరి్థంచడంతో బ్యాంక్ పై విధంగా సమాధానమిచి్చంది. -
వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ. 19,675 కోట్లు ఖర్చు
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ల కొనుగోలుకు ఈనెల 20వ తేదీ దాకా రూ. 19,675 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేశామని సామాజిక కార్యకర్త అమిత్ గుప్తా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సమాధానమిచ్చింది. 2021–22 కేంద్ర బడ్జెట్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 35,000 కోట్లను కేటాయించింది. ఈ ఏడాది జనవరి 16న మనదేశంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. కోవిన్ పోర్టల్ ప్రకారం దేశంలో ఇప్పటిదాకా 140 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. మే 1 నుంచి డిసెంబరు 20వ తేదీ దాకా 117.56 కోట్ల డోసులను ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో (సీవీసీ) ప్రజలకు ఉచితంగా అందజేశామని, 4.18 కోట్ల డోసులను మాత్రం ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రజలు తీసుకున్నారని ఆరోగ్య శాఖ వివరించింది. జూన్ 21న మార్చిన నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ తయారీ సంస్థలు తమ నెలవారీ ఉత్పత్తి సామర్థ్యంలో 25 శాతం టీకాలను ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా అమ్ముకోవచ్చు. 60 శాతం మందికి డబుల్ డోస్ దేశంలో అర్హులైన వారిలో (18 ఏళ్లకు పైబడిన వారిలో) 60 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం వెల్లడించారు. 89 శాతం మంది కనీసం ఒక డోసు తీసుకున్నారని తెలిపారు. కాగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య గురువారం 300 దాటింది. -
బాల భారతం.. బలహీనం
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విసిరిన పంజాకు లక్షల కుటుంబాల ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఎన్నో కుటుంబాలు పేదరికంలోకి జారిపోయాయి. ఫలితంగా ఆయా కుటుంబాల్లోని పిల్లలకు సరైన పోషకాహారం అందడం లేదు. బాల భారతం బలహీనంగా మారుతోంది. దేశంలో గత ఏడాది నవంబర్ నాటికి ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారుల్లో 9,27,606 మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తేలిందని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, బిహార్‌లోనే ఉన్నారని తెలియజేసింది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల గణాంకాలను విడుదల చేసింది. దీనిప్రకారం.. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 3,98,359 మంది, బిహార్‌లో 2,79,427 మంది బాధిత బాలలు ఉన్నారు. లద్దాఖ్, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మధ్యప్రదేశ్‌లో తీవ్రమైన పోషకాహార కొరతను ఎదుర్కొంటున్న చిన్నారులెవరూ లేకపోవడం గమనార్హం. అనారోగ్య ముప్పు అధికం ఎత్తుకు తగిన బరువు లేకుండా... చాలా బలహీనంగా ఉంటే తీవ్రమైన పోషకాహార లోపంగా (ఎస్ఏఎం) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్వచించింది. ఈ సమస్యతో బాధపడుతున్న చిన్నారులు ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువు ఉంటారు. వారిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. అందువల్ల సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే.. అలాంటి వారికి ఏదైనా వ్యాధి సోకితే మరణించే అవకాశాలు 9 రెట్లు అధికంగా ఉంటాయి. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న బాలల సంఖ్య ఇంకా పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ‘‘దేశంలో కరోనా మహమ్మారి వల్ల చాలామంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతున్నారు. నిరుద్యోగ సమస్య వేగంగా పెరుగుతోంది. ఆర్థిక సంక్షోభం ఇప్పటికే మొదలయ్యింది. ఫలితంగా ఆకలి రక్కసి కాటేస్తోంది. ఆకలి ఉన్నచోట పోషకాహార సమస్య కచ్చితంగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేయాలి’’అని హెచ్ఏక్యూ సెంటర్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు ఇనాక్షీ గంగూలీ సూచించారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం.. 2020 నవంబర్ నాటికి ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారుల్లో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు మహారాష్ట్రలో 70,665 మంది, గుజరాత్లో 45,749, ఛత్తీస్‌గఢ్‌లో 37,249, ఒడిశాలో 15,595, తమిళనాడులో 12,489, జార్ఖండ్‌లో 12,059, ఆంధ్రప్రదేశ్‌లో 11,210, తెలంగాణలో 9,045, అస్సాంలో 7,218, కర్ణాటకలో 6,899, కేరళలో 6,188, రాజస్తాన్‌లో 5,732 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్షలకు పైగా అంగన్వాడీ కేంద్రాల నుంచి ఈ సమాచారం సేకరించారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడంలో అంగన్వాడీ కేంద్రాలదే కీలక బాధ్యత అని ఇనాక్షీ గంగూలీ చెప్పారు. చిన్నారులు, కౌమార బాలికలు, మహిళల్లో పోషకాహార సమస్యను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం 2018లో పోషన్ అభియాన్ పథకాన్ని ప్రారంభించింది. -
ముంబైలో 229 అత్యాచారాలు, 8 గ్యాంగ్ రేప్స్
గత 8 ఎనిమిది నెలల కాలంలో భారత ఆర్ధిక రాజధాని ముంబై నగరంలో మహిళలపై అత్యాచారాలు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. సామాజిక కార్యకర్త అనిల్ గాల్ గాలి విజ్క్షప్తి మేరకు సమాచార హక్కు చట్టం కింద అందించిన వివరాల ప్రకారం ఈ సంవత్సరం ఆగస్టు చివరి వరకు ముంబైలో 229 అత్యాచార కేసులు, ఎనిమిది గ్యాంగ్ రేప్ కేసులు నమోదయ్యాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే పరిచయస్తులు, స్నేహితులు, ప్రేమికులు, ఇరుగుపోరుగు వారే అత్యధిక కేసుల్లో నిందితులు పోలీసులు తెలిపారు. ఈ సంవత్సరం చివరి వరకు అత్యాచారాల సంఖ్య మరింత పెరుగుతుందని పోలీసులు తెలిపారు. నవంబర్ లోనే మైనర్లపై రెండు అత్యాచార కేసులు నమోదయ్యాయి. వీధుల్లో పోలీసుల పర్యవేక్షణ లోపించడం, నాకా బందీలు చేయకపోవడం కారణంగానే మహిళపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని సామాజిక కార్యకర్త అభిప్రాయపడ్డారు. గత సంవత్సరం 223 అత్యాచా కేసులు, ఎనిమిది గ్యాంగ్ రేప్ కేసులు కాగా, 211 అత్యాచారాలు, 9 గ్యాంగ్ రేప్ కేసుల, 2010 లో 188, 7 గ్యాంగ్ రేప్ లు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్ లాంటి సంఘటనలు ముంబైలో అరుదుగా నమోదవుతుంటాయని పోలీసులు తెలిపారు. నేరాలను అరికట్టేందుకు తాము శాయశక్తుల ప్రయత్నిస్తున్నాం అని పోలీసులు అన్నారు.