మోదీ డిగ్రీ సర్టిఫికెట్‌ను అపరిచితులకు చూపించలేం | Delhi HC Reserves Verdict on Delhi University Plea Against Info Disclosure | Sakshi
Sakshi News home page

మోదీ డిగ్రీ సర్టిఫికెట్‌ను అపరిచితులకు చూపించలేం

Published Fri, Feb 28 2025 4:32 AM | Last Updated on Fri, Feb 28 2025 4:32 AM

Delhi HC Reserves Verdict on Delhi University Plea Against Info Disclosure

హైకోర్టుకు చూపించడానికి అభ్యంతరం లేదు 

ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసిన ఢిల్లీ యూనివర్సిటీ 

తీర్పును రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తి 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభ్యసించిన బ్యాచిలర్‌ డిగ్రీని ఢిల్లీ హైకోర్టుకు చూపించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఢిల్లీ యూనివర్సిటీ వెల్లడించింది. అయితే, సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఈ డిగ్రీని అపరిచితులకు చూపించలేమని తేల్చిచెప్పింది. దీంతో మోదీ డిగ్రీకి సంబంధించిన కేసుపై తీర్పును న్యాయస్థానం రిజర్వ్‌ చేసింది. 

1978లో ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ పరీక్ష ఉత్తీర్ణులైన వారి వివరాలు ఇవ్వాలంటూ నీరజ్‌ అనే వ్యక్తి కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ)ని కోరారు. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్నారు. నరేంద్ర మోదీ 1978లో బీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. నీరజ్‌ వినతిపై సీఐసీ సానుకూలంగా స్పందించింది. 1978లో బీఏ పరీక్ష రాసి ఉత్తీర్ణులైన విద్యార్థుల రికార్డులను తనిఖీ చేసుకోవడానికి అంగీకారం తెలిపింది. అందుకు సహకరించాలని ఢిల్లీ యూనివర్సిటీని ఆదేశించింది. 

ఈ మేరకు 2016 డిసెంబర్‌ 21న ఆదేశాలు జారీ చేసింది. సీఐసీ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సీఐసీ ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో సీఐసీ ఆదేశాలపై హైకోర్టు 2017 జనవరి 23న స్టే విధించింది. సీఐసీ ఇచ్చిన ఆదేశాలు న్యాయబద్ధమేనని పిటిషనర్‌ పేర్కొన్నారు.

 ప్రధానమంత్రి చదువుకు సంబంధించిన వివరాలు తెలుసుకొనే హక్కు ఆర్టీఐ చట్టం కింద దేశ ప్రజలకు ఉందని స్పష్టంచేశారు. ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సచిన్‌ దత్తా గురువారం విచారణ జరిపారు. ఢిల్లీ యూనివర్సిటీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ‘తెలుసుకొనే హక్కు’ కంటే ‘గోప్యత హక్కు’ మిన్న అని వెల్లడించారు.

 ప్రధానమంత్రికి ఉన్న గోప్యత హక్కు దృష్ట్యా ఆయన డిగ్రీని ఆర్టీఐ చట్టం కింద అపరిచితులకు చూపించడం సాధ్యం కాదని చెప్పారు. హైకోర్టుకు చూపించడానికి అభ్యంతరం లేదన్నారు. కొందరు వ్యక్తులు రాజకీయపరమైన ఉద్దేశాలతో ప్రధానమంత్రి సర్టిఫికెట్‌ను కోరుతున్నారని ఆక్షేపించారు. సీఐసీ ఉత్తర్వులను తిరస్కరించాలని విన్నవించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ కేసులో తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.      
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement