Bachelors Degree
-
అమెరికాలో రెన్యువల్ భయం !
⇔ హెచ్1బీ వీసా పొడిగింపు దరఖాస్తులకు అధికారుల కొర్రీలు ⇔ దాదాపు ప్రతి దరఖాస్తుకూ ఎవిడెన్స్ కావాలంటూ లేఖలు ⇔ కొన్ని ఆఫీసులకు నేరుగా వెళ్తున్న యూఎస్సీఐఎస్ సిబ్బంది ⇔ బ్యాచిలర్ డిగ్రీ లేకున్నా స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామంటున్న అమెరికన్ సంస్థలు ⇔ భారత ఐటీ కంపెనీల స్థానిక రిక్రూట్మెంట్లు కూడా షురూ ⇔ దీంతో అమెరికాలోని తెలుగు ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన ⇔ మున్ముందు పరిస్థితులు ఇబ్బందికరమేనంటున్న నిపుణులు ⇔ కొత్త టెక్నాలజీలకు అప్‌గ్రేడ్ కావడమే మార్గమని సూచన హైదరాబాద్– బిజినెస్ బ్యూరో : శ్రీధర్ చాన్నాళ్ల కిందట హెచ్1బీ వీసాపై అమెరికా వెళ్లాడు. గ్రీన్‌కార్డుకు అప్లయ్ చేశాడు కానీ... ఇంకా రాలేదు. అది క్యూలో ఉంది కనక డిపెండెంట్ వీసాపై అమెరికా వెళ్లిన శ్రీధర్ భార్య భార్గవి కూడా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) సాయంతో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ రెండేళ్ల కిందటే అక్కడ ఇల్లు కూడా కొన్నారు. ఈఎంఐ కాస్త ఎక్కువే. అయితేనేం!! ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు కనక ఇబ్బంది లేదు. కాకపోతే శ్రీధర్ హెచ్1బీ గడువు ముగుస్తోంది. దీంతో మూడేళ్ల పొడిగింపు కోసం దరఖాస్తు చేశాడు. దానికి వీసా కార్యాలయం నుంచి ఎవిడెన్స్‌లు కావాలనే అభ్యర్థన (ఆర్ఎఫ్ఏ) వచ్చింది. దీంతో తన వీసా తిరస్కరణకు గురవుతుందా? ఇబ్బందులేమైనా వస్తాయా? అనే గుబులు శ్రీధర్‌లో మొదలైంది. రాఘవ కూడా దాదాపు రెండున్నరేళ్ల కిందట హెచ్1బీపై అమెరికాకు వెళ్లాడు. తన వీసా గడువు మూడేళ్లు. మరో ఆరు నెలలే ఉండటంతో గతనెల్లో రెన్యువల్ కోసం దరఖాస్తు చేశాడు. తనక్కూడా యూఎస్సీఐఎస్ కార్యాలయం నుంచి ఆర్ఎఫ్ఏ వచ్చింది. ఆ రిక్వెస్ట్‌లో వారు పేర్కొన్న అన్ని పత్రాలనూ రాఘవ సమర్పించాడు. అయితే యూఎస్సీఐఎస్ సిబ్బంది రాఘవ పనిచేస్తున్న కార్యాలయాన్ని కూడా సందర్శిస్తామని చెప్పారు. ఇదంతా చూశాక... రాఘవకు తన వీసా రెన్యువల్ అవుతుందా? అనే అనుమానం మొదలైంది. రోజులు గడుస్తున్న కొద్దీ అది పెరుగుతోంది కూడా!! ‘అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే’ అనే నినాదంతో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచాక అక్కడి ఉద్యోగ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఆ ప్రభావం ఇండియాపై ఎక్కువగానే పడుతోంది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్... అక్కడే మూడు కేంద్రాలు ఆరంభిస్తామని, స్థానికులను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పటమే కాక... దానికి తగ్గట్టు అక్కడ రిక్రూట్మెంట్లు కూడా మొదలుపెట్టింది. కాగ్నిజెంట్, టీసీఎస్, విప్రో తదితర ఐటీ దిగ్గజాలు కూడా అదే పనిలో పడ్డాయి. ఫలితంగా ఆయా సంస్థలు ఇండియాలో సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. కోతలు పెంచుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే... కొన్నాళ్ల కిందటే అమెరికాకు హెచ్1బీపై వెళ్లి... అక్కడి కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు, ముఖ్యంగా తెలుగు వారికి వీసా రెన్యువల్ రూపంలో కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ‘‘ఇదివరకు వీసా రెన్యువల్‌కు చేసిన దరఖాస్తుల్లో తక్కువ వాటికే ఆర్ఎఫ్ఏ వచ్చేది. కానీ ఇపుడు దాదాపు అన్ని దరఖాస్తులకూ ఆర్ఎఫ్ఏ వస్తున్నట్లు చెబుతున్నారు. దీన్నిబట్టి వీసా నిబంధనలను మరింత కఠినం చెస్తున్నట్లు అర్థమవుతోంది. పరి స్థితి ఇలాగే కొనసాగితే పలువురు తెలుగువారు తిరిగి స్వదేశానికి వెళ్లక తప్పదు’’ అని 20 ఏళ్ల కిందట యూఎస్‌కు వెళ్లి స్థిరపడ్డ అనంతపురం వాసి ఒకరు చెప్పారు. పోటీ మరో రూపంలోనూ వస్తోంది! అమెరికాలో ఇండియన్లు పలు రంగాల్లో ఉన్నా... ఐటీ రంగంలో మాత్రం తెలుగువారిదే పైచేయి. దాదాపు 25 లక్షల మంది తెలుగువారు ఐటీ ఉద్యోగులుగా కొనసాగుతున్నట్లు స్థానిక అసోసియేషన్లు చెబుతున్నాయి. స్థానికులు చెబుతున్న సమాచారం మేరకు... ఇపుడు రిక్రూట్మెంట్లలో అమెరికన్ కంపెనీల దృక్పథం కూడా మారుతోంది. ట్రంప్ పాలసీలకు అనుగుణంగా మరింత మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించటానికి వారు కొన్ని నిబంధనల్ని కూడా సడలించుకుంటున్నారు. అక్కడ ఐటీ రంగంలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు ఇప్పటిదాకా బీఎస్ (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్) ఉత్తీరణ తప్పనిసరి అనేవారు. ‘‘నిజానికి అక్కడ హైస్కూల్ చదువుతో ఆపేసిన పలువురు యువతకు వివిధ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌లపై పట్టు ఉంది. కోడ్ రాయటం వారికి పెద్ద పనేమీ కాదు. కానీ బీఎస్ లేదన్న కారణంతో ఇన్నాళ్లూ వారు ఐటీ ఉద్యోగాలకు నోచుకోలేదు. కానీ ఇపుడు కంపెనీలు తమ ధోరణి మార్చుకుంటున్నాయి. బీఎస్ అనే నిబంధనను సడలించి ఉద్యోగంలోకి తీసుకుందామని, తరవాత తామే బీఎస్ చదువుకునేలా స్పాన్సర్ చేయొచ్చని అవి యోచిస్తున్నాయి. ఇది పూర్తిస్థాయిలో అమలయితే దీని ప్రభావం ఎక్కువగా పడేది తెలుగువాళ్లపైనే’’ అని స్థానికంగా సాఫ్ట్వేర్ సంస్థ నడుపుతున్న మరో తెలుగు వ్యక్తి అభిప్రాయపడ్డారు. స్థానిక కంపెనీలదీ అదే బాట!! టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటిదాకా తమ సిబ్బందిని క్లయింట్ సంస్థలుండే అమెరికాకు పంపటం ఎక్కువగానే జరిగేది. ఈ సంవత్సరం అది బాగా తగ్గిపోయింది. అక్కడి వారినే తీసుకుందామని కంపెనీలు భావించటం దీనికి ప్రధాన కారణం. అదేకాదు. కొన్నాళ్ల కిందటి దాకా క్లయింట్లతో సమావేశాలకు తమ సిబ్బందిని ఈ కంపెనీలు తాత్కాలికంగా యూఎస్, యూకేలకు పంపించేవి. ఇపుడు వాటికి కూడా పూర్తిగా కోతపెట్టాయి. ఇక్కడి నుంచే ‘టెలీ ప్రజెన్స్’లో సమావేశం కావాలని తమ సిబ్బందికి చెబుతున్నారు. అంటే ఒకరకమైన వీడియో కాల్స్ వంటివన్న మాట. మనం సర్వీసెస్‌లో ఉండిపోవటం వల్లేనేనా? భారత ఐటీ రంగం చిరకాలంగా సర్వీసులపైనే ఆధారపడి నెట్టుకొస్తోందని, మన నుంచి బ్లాక్‌బస్టర్ ఉత్పత్తి ఒక్కటీ లేదని ఐటీ కన్సల్టెంట్ ఒకరు అభిప్రాయపడ్డారు. ‘‘మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు పలు ఉత్పత్తుల్ని తెస్తున్నాయి. భారతీయులే వాటిని నడిపించే స్థానాల్లో ఉన్నా... భారత దేశం నుంచి ఒక్క ఉత్పత్తీ లేకపోవటం విషాదకరమే. ప్రస్తుతం ఉత్పత్తులు పెరుగుతున్నాయి కానీ సర్వీసులు పెరగటం లేదు. అదే తాజా పరిస్థితులకు కారణం’’ అని ఆయన తెలియజేశారు. అసలు కారణాలివీ... నిజానికి ఐటీ రంగంలో ఉద్యోగాలు పోవటానికి అంతా ట్రంప్‌నే కారణంగా చూపిస్తున్నా... నిపుణులు మాత్రం అదొక్కటే కారణం కాదని చెబుతున్నారు. ‘‘కొన్నాళ్లుగా ఐటీ రంగం నెమ్మదించింది. ఎందుకంటే వివిధ సంస్థలు ఐటీపై పెడుతున్న ఖర్చును తగ్గించేశాయి. దీంతో గత నాలుగేళ్లుగా ఐటీ కంపెనీల బిల్లింగ్ పెరగటం లేదు. పైపెచ్చు ఐటీ సంస్థల మధ్య పోటీ పెరగటంతో ఇపుడు బిల్లింగ్ తగ్గిస్తామని బేరాలు కూడా ఆడుతున్నారు. మరోవంక ఐటీ కంపెనీలు మాత్రం ప్రతి ఏటా తమ సిబ్బందికి కనీసం 10 శాతం జీతం పెంచాల్సి వస్తోంది. దీంతో ఖర్చులు పెరిగి, చివరకు ఉద్యోగాల్లో కోత పెట్టాల్సి వస్తోంది’’ అని టీసీఎస్ సీనియర్ ఉద్యోగి ఒకరు అభిప్రాయపడ్డారు. ‘‘డొనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల పలు భారతీయ కంపెనీలు అమెరికాలో అక్కడి వారినే నియమించడానికి దిగుతున్నాయి. ఈ ప్రభావం ఇక్కడి ఉద్యోగాలపై కచ్చితంగా ఉంటుంది. దీనికితోడు ఆటోమేషన్ వల్ల పలువురి ఉద్యోగాలు పోతున్నాయి. ఈ మూడు కారణాలూ కలిసి ఐటీని భయపెడుతున్నాయి’’ అని కాగ్నిజెంట్ సీనియర్ ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారు. ఆటోమేషన్, డిజిటల్ విభాగాల్లో ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయని, ఆ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ అయిన వారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని అమెరికాలో క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థను నిర్వహిస్తూ... విజయవాడలో ‘ఫ్రిస్కా’ పేరిట హోమ్‌హెల్త్‌కేర్ సంస్థను ఏర్పాటు చేసిన అసిఫ్ మొహమ్మద్ చెప్పారు. ‘‘మనమిపుడు క్లౌడ్ కంప్యూటింగ్ ప్రపంచంలో ఉన్నాం. క్లౌడ్ ఆటోమేషన్ ఇంకా పెరుగుతుంది. ఉద్యోగులు అత్యాధునిక సర్వర్‌లెస్ కంప్యూటింగ్ (లాంబ్డా), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) డేటా సైన్స్ వంటి టెక్నాలజీల్లో తమ నైపుణ్యాల్ని అప్‌గ్రేడ్ చేసుకోవటం తప్పనిసరి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యుగమని, ప్రతిదీ ఇంటర్నెట్తో కనెక్ట్ కావాల్సిందేనని చెబుతూ... అందుకే తాము టెక్నాలజీ ఆధారంగా విజయవాడలో తొలి హోమ్హెల్త్కేర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారాయన. -
మన ఎంబీఏకు
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ).. వ్యాపార నిర్వహణ నైపుణ్యాలను అందించే కోర్సు! ఈ కోర్సు పూర్తిచేస్తే కార్పొరేట్ కొలువు అందినట్లే! ఎంబీఏ పట్టా ఉంటే మేనేజ్మెంట్ ట్రైనీ నుంచి మేనేజింగ్ డెరైక్టర్ స్థాయికి ఎదగొచ్చు. ఇంతటి ప్రాధాన్యమున్న కోర్సు ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగానే ఉందా? అభ్యర్థులకు పరిశ్రమ వర్గాలు కోరుకునే నైపుణ్యాలు లభిస్తున్నాయా? ఎంబీఏ కోర్సు పూర్తిచేసినా.. అరకొర జీతం అందడానికి కారణమేంటి?! మేనేజ్మెంట్ కోర్సుల ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్లు వెలువడుతున్న తరుణంలో ఎంబీఏ కోర్సు తీరుతెన్నులపై ఫోకస్.. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థుల్లో అధిక శాతం మంది ఎంబీఏపైనే దృష్టిసారిస్తారు. జాతీయస్థాయిలో నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)తోపాటు ఐసెట్, మ్యాట్, సీమ్యాట్.. తదితర ప్రవేశ పరీక్షల గణాంకాలను చూస్తే వాటిని రాస్తున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంటోంది. ఎంబీఏ కోర్సు తమను బిజినెస్ లీడర్లుగా తీర్చిదిద్దుతుందని.. తద్వారా కళ్లు చెదిరే కార్పొరేట్ కెరీర్ సొంతమవుతుందనే భావనతో ఔత్సాహికులు ఎంబీఏ వైపు అడుగేస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉందనేది తాజా సర్వేల సారాంశం. ఎంబీఏ పూర్తిచేసిన చాలామంది రూ.10 వేల జీతానికి చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నారని, కేవలం 7 శాతం మంది ఎంబీఏ పట్టభద్రుల్లోనే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉన్నట్లు ఆసోచామ్ సర్వే వెల్లడించింది. కరిక్యులం తీరుతెన్నులు రెండేళ్ల వ్యవధిలో నాలుగు సెమిస్టర్ల విధానంలో ఉండే ఎంబీఏ కోర్సు ప్రధాన ఉద్దేశం.. విద్యార్థులకు భవిష్యత్తు కార్పొరేట్ కెరీర్‌కు అవసరమైన మల్టీటాస్కింగ్ స్కిల్స్‌ను అందించడం. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) విధానం ప్రకారం ఎంబీఏ పూర్తిచేసిన విద్యార్థికి వివిధ నైపుణ్యాలు అందేలా సిలబస్ ఉండాలి. క్రాస్ ఫంక్షనల్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్, ఛేంజ్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, గ్లోబలైజేషన్ అవేర్నెస్, స్ట్రాటజిక్ ప్రాస్పెక్టివ్, ఎథిక్స్, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, డైవర్సిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ తదితర నైపుణ్యాలు పెంపొందించేలా సబ్జెక్టులను రూపొందించాలి. దీనికోసం కోర్సు స్వరూపం, బోధన పరంగా నిర్దిష్ట విధానాన్ని అమలు చేయాలి. ఎంబీఏ విద్యార్థులందరికీ భవిష్యత్తులో వ్యాపార నిర్వహణ నైపుణ్యాలు అందించేందుకు అవసరమైన ఆర్గనైజేషనల్ బిహేవియర్, బిజినెస్ కమ్యూనికేషన్స్, అకౌంటింగ్ తదితర సబ్జెక్టుల బోధన ఉంటుంది. కెరీర్ పరంగా నిర్దిష్టంగా ఒక విభాగంలో రాణించాలనుకునే వారికి ఆయా విభాగంలో పూర్తిస్థాయి నైపుణ్యాలు అందించేందుకు స్పెషలైజేషన్ సబ్జెక్ట్ విధానం అమల్లో ఉంది. ఫైనాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఆపరేషన్స్ రీసెర్చ్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని అభ్యర్థులు మూడో సెమిస్టర్ నుంచి (అంటే రెండో ఏడాదిలో) అభ్యసించాల్సి ఉంటుంది. నచ్చిన స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకున్న విద్యార్థులు క్షేత్ర నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రాజెక్ట్ వర్క్ పూర్తిచేయాలి. నిరంతరం మారాలి ఎంబీఏ కోర్సు లక్ష్యం బాగానే ఉన్నా.. కోర్సు స్వరూపంలో మార్కెట్ అవసరాలకు తగ్గట్లు నిరంతరం మార్పులు జరగడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సిలబస్, బోధన విధానం, స్కిల్స్ అందించే విషయంలో ప్రమాణాలు పెరగాలని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ పరిస్థితుల నేపథ్యంలో వేగంగా మారుతున్న మార్కెట్ పరిస్థితులు, కంపెనీల అవసరాలు, వ్యాపార నిర్వహణ తీరుతెన్నులపై ఎంబీఏ విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఆ మేరకు నైపుణ్యాలు అందించేలా ఎంబీఏ కోర్సు సిలబస్‌లో క్రమం తప్పకుండా మార్పులు చేర్పులు చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది. కానీ ప్రస్తుతం నాలుగేళ్లకోసారి మాత్రమే కరిక్యులంలో మార్పులు చేసే పరిస్థితి ఉంది. సిలబస్ మార్పులో జాప్యం సిలబస్‌లో మార్పులు చేయాలి.. కరిక్యులం మారాలి.. అనే అభిప్రాయాలు ఎంతగా వినిపిస్తున్నా.. యూనివర్సిటీల స్థాయిలో వాటికి సంబంధించి జాప్యం జరుగుతోంది. సిలబస్‌లో మార్పులు చేయాలంటే ముందుగా సంబంధిత ఫ్యాకల్టీ ఆ మార్పులను ప్రతిపాదిస్తూ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ముందుంచాలి. బీవోఎస్ నిపుణులు కూడా ఆయా మార్పులు అవసరమని భావిస్తేనే కొత్త సిలబస్ రూపొందుతుంది. ఈ ప్రక్రియ పూర్తికావడానికి చాలా సమయం పడుతోంది. దాంతో సిలబస్‌లో మార్పుల పరంగా జాప్యం జరుగుతోంది. ఇది విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. అదే ఐఐఎంలు, ఇతర అటానమస్ (స్వయం ప్రతిపత్తి) ఇన్స్టిట్యూట్స్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. వీటిలో కనీసం రెండేళ్లకోసారైనా సిలబస్ మారుతోంది. ఐఐఎంలు సిలబస్ రూపకల్పనలో పరిశ్రమ వర్గాలకు భాగస్వామ్యం కల్పిస్తున్నాయి. ప్రాక్టికాలిటీకి పెద్దపీట వేస్తూ ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్న్‌షిప్‌లను తప్పనిసరి చే స్తున్నాయి. ప్రాక్టికాలిటీకి ఆమడదూరం యూనివర్సిటీల్లో ఎంబీఏ చదువుతున్న విద్యార్థులకు క్షేత్ర నైపుణ్యాలు అందడం లేదు. ప్రొఫెసర్లు స్వీయ ఆసక్తితో విద్యార్థులను ప్రోత్సహించి ఇంటర్న్‌షిప్, ఫీల్డ్ అసైన్మెంట్స్ అవకాశాలు కల్పిస్తే తప్ప.. ఒక కచ్చితమైన విధానంగా ప్రాక్టికాలిటీ అమలు కావడంలేదు. అలాగే మన దేశంలో మేనేజ్మెంట్ విద్య పరంగా ఎదురవుతున్న మరో ప్రధాన సమస్య ఫ్యాకల్టీ కొరత. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ - స్టూడెంట్ నిష్పత్తి 1:15గా ఉండాలి. ఫ్యాకల్టీ సభ్యుల్లో ప్రతి విభాగంలో ఇద్దరు పీహెచ్డీ పూర్తిచేసినవారు ఉండాలి. కళాశాలలు పీహెచ్డీ ఫ్యాకల్టీని నియమించుకుంటే భారీగా వేతనాలు ఇవ్వాల్సి వస్తుందని వెనుకంజ వేస్తున్నాయి. ఉద్యోగ నైపుణ్యాలపై ప్రభావం సిలబస్‌లో మార్పులు లేకపోవడం, ఫ్యాకల్టీ కొరత, క్షేత్రస్థాయి నైపుణ్యాలు అందకపోవడంతో ఎంబీఏల్లో ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ మెరుగవడం లేదు. ఓ వైపు జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉంటున్నా.. నైపుణ్యాలు లేక అర్హతలకు తగిన ఉద్యోగాలు లభించడం లేదు. దాంతో అరకొర జీతాలతో ఏదో ఒక కొలువులో సర్దుకుపోతున్నారు. దీనికి ప్రధాన కారణం సిలబస్‌ను, కరిక్యులంను మార్చకపోవడమే! కాబట్టి మేనేజ్మెంట్ కోర్సుల్లో సిలబస్‌లో నిరంతరం మార్పులు తేవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎంబీఏ సిలబస్‌లో మార్పులు చేయడం చాలా అవసరం. ఈ విషయంలో యూనివర్సిటీల స్థాయిలో ఇటీవల కాలంలో కొంత వేగవంతమైన చర్యలు జరుగుతున్నాయి. విద్యార్థులు కూడా సెల్ఫ్ లెర్నింగ్ టూల్స్‌పై దృష్టిసారించాలి. జాబ్ మార్కెట్ అవసరాలు, అందుకు పొందాల్సిన నైపుణ్యాలపై అవగాహన పెంపొందించుకోవాలి. దీనికి ప్రొఫెసర్ల సలహాలు తీసుకోవాలి. - ప్రొఫెసర్ కె.రామమోహన్ రావు, ఏయూ కాలేజ్ ఆఫ్ కామర్స్. -
బ్యాచిలర్ డిగ్రీతో బెటర్ ఫ్యూచర్!!
గ్రాడ్యుయేట్స్ స్పెషల్ తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ పూర్తయిన విద్యార్థుల్లో ఎక్కువ మంది చూపు.. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులవైపే! ప్రొఫెషనల్ కోర్సులవైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నా.. సంప్రదాయ బీఏ/బీఎస్సీ/బీకామ్ కోర్సులకూ జాబ్ మార్కెట్లో ఏమాత్రం వన్నె తగ్గలేదంటున్నారు నిపుణులు. కార్పొరేట్ రంగం విస్తరిస్తుండటం, కంపెనీలకు వివిధ నైపుణ్యాలున్న మానవ వనరుల అవసరం ఏర్పడుతుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో సంప్రదాయ డిగ్రీ కోర్సులతో కెరీర్ స్కోప్.. కాంపిటీషన్ కింగ్.. బీఏ పోటీ పరీక్షల ప్రపంచంలో బీఏ విద్యార్థులదే పైచేయి. సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీపరీక్షలకు ఉపయోగపడే పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, తెలుగు సాహిత్యం వంటి సబ్జెక్టులను డిగ్రీ స్థాయిలోనే చదివుండటం వల్ల ప్రిపరేషన్లో ఎంతో కలిసొస్తుంది. ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులు సైతం సివిల్స్‌లో సోషల్‌సెన్సైస్ సబ్జెక్టులు ఎంచుకుని విజయాలు సాధిస్తున్నారంటేనే ఆర్ట్స్ సబ్జెక్టుల ప్రాధాన్యత ఏమిటో తెలుస్తోంది. బీఏలో చేరిన మొదట్నుంచే సివిల్స్ లక్ష్యంగా కృషి చేస్తే తేలికగా విజయం సాధించొచ్చని నిపుణులు అంటున్నారు. వివిధ వర్సిటీలందించే పీజీ కోర్సుల్లో చేరి ఎంఏలో ఎకనామిక్స్, హిస్టరీ, ఇంగ్లిష్, సోషల్వర్క, ఫారెన్ లాంగ్వేజెస్, పాలిటీ వంటి కోర్సులు అభ్యసిస్తే మంచి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఎకనామిక్స్ చేసినవారికి ఉద్యోగాలెన్నో! హిస్టరీ విద్యార్థులు ఆర్కియాలజీ విభాగాల్లో పనిచేయొచ్చు. పాలిటీ చదివితే వివిధ పత్రికలు, న్యూస్ చానెళ్లు, పోటీ పరీక్షల కోచింగ్ కేంద్రాల్లో అవకాశాలు లభిస్తాయి. లాంగ్వేజెస్ చేసినవారు వివిధ రాయబార కార్యాలయాల్లో, కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేయొచ్చు. కెరీర్ షైనింగ్.. కామర్స్ ప్రస్తుత జాబ్ మార్కెట్ అవసరాలకనుగుణంగా బీకాంలో ఈ-కామర్స్; ఫైనాన్షియల్ మేనేజ్మెంట్; కార్పొరేట్ సెక్రటరీషిప్ వంటి వినూత్న స్పెషలైజేషన్లు ఉన్నాయి. కంపెనీలకు అవసరమైన అకౌంటింగ్ కార్యకలాపాల నిర్వహణకు కామర్స్ పట్టభద్రులు తప్పనిసరి. వివిధ దేశీయ, విదేశీ సంస్థలు ఒక మాదిరి పట్టణాల్లో సైతం తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిల్లో ఖాతాల నిర్వహణ వంటి విభాగాల్లో బీకాం విద్యార్థుల అవసరం ఎంతో ఉంది. కాబట్టి డిగ్రీలో బీకాం, బీకాం(కంప్యూటర్స్ విద్యార్థులు)లు అకౌంటింగ్ ప్యాకేజెస్, ట్యాలీ వంటి కోర్సులను నేర్చుకోవడంతోపాటు, స్పోకెన్ ఇంగ్లిష్‌పై దృష్టిపెడితే ప్రారంభంలోనే ఐదెంకెల వేతనాలు ఖాయం. ఇక చార్టర్‌డ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి కోర్సులు పూర్తి చేస్తే.. అవకాశాలు కోకొల్లలు. భావి శాస్త్రవేత్తలకు... బీఎస్సీ ‘దేశవ్యాప్తంగా పరిశోధనలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అభివృద్ధి కుంటుపడటం ఖాయం’. ఇది దేశంలోని మేధావులు, నిపుణులు తరచుగా వ్యక్తం చేస్తున్న ఆందోళన! ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే.. నిష్ణాతులైన శాస్త్రవేత్తల అవసరం ఎంతో. డిగ్రీలో కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్, మెరైన్ బయాలజీ, మైక్రోబయాలజీ, బోటనీ, జువాలజీ, మ్యాథ్స్, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, స్టాటిస్టిక్స్ వంటి కోర్సులను దీర్ఘకాలిక దృష్టితో చదవాలి. డిగ్రీ మొదటి ఏడాది నుంచే సబ్జెక్టులను క్షుణ్నంగా చదువుతూ.. ఇష్టమైన అంశంపై పీజీ చేస్తే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. సీఎస్ఐఆర్ నెట్లో జేఆర్ఎఫ్ సాధిస్తే ప్రతినెలా ఫెలోషిప్ పొందడంతోపాటు దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యా సంస్థల్లో పీహెచ్డీ కూడా చేయొచ్చు. తర్వాత పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా పనిచేస్తూ ఆకర్షణీయ జీతాలూ పొందొచ్చు. డిగ్రీ కోర్సులకు.. పూర్వ వైభవం మూడేళ్ల నుంచి సంప్రదాయ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారిని బీఏ బాగా ఆకర్షిస్తోంది. సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షల్లో బీఏ సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. బీకాంలో కూడా ఎక్కువ మంది చేరుతున్నారు. సీఏ, కాస్ట్ అకౌంటెంట్స్, సీఎస్ కోర్సుల్లో చేరాలనుకునేవారికి బీకాం సరైన మార్గం. కార్పొరేట్ సంస్థలు సైతం డిగ్రీ ఉత్తీర్ణులకే ప్రాధాన్యతనిస్తున్నాయి. కంపెనీలు క్యాంపస్ నియామకాల ద్వారా బీఎస్సీ ఫైనలియర్ విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. గత నెలలో 40 మందికి పైగా సైన్స్ విద్యార్థులను రూ.15 వేలతో కంపెనీలు నియమించుకున్నాయి. - ప్రొ. టీఎల్ఎన్ స్వామి, ప్రిన్సిపాల్, నిజాం కాలేజ్ -
‘విజ్ఞానశాస్త్రం’లో వెలుగులీనే కెరీర్..
ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశ్రమలు, సంస్థలు సైన్స్ నేపథ్యమున్న వృత్తి నిపుణుల కోసం ఎదురుచూస్తున్నాయి. సైన్స్‌కు సంబంధించి ప్రస్తుతం అనేక కెరీర్ ఎంపికలు ఉన్నాయి. కొన్నేళ్ల కిందటి వరకు 10+2 తర్వాత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీ-మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ; బీఎస్సీ- జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజక్స్; బీఎస్సీ- బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ వంటి సంప్రదాయ గ్రూపులుండేవి. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్‌ను అనుసరించి గ్రూపు సబ్జెక్టుల్లో ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, అప్లైడ్ న్యూట్రిషన్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, క్లినికల్ న్యూట్రిషన్ డైటీటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ వంటివి చోటు సంపాదించాయి. వీటిలో దేన్ని ఎంపిక చేసుకొని, భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనేది అభ్యర్థులు స్వీయ అభిరుచులు, సామర్థ్యం, ఆర్థిక వనరులు తదితరాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్మీడియెట్ అర్హతతో డిగ్రీ, పీజీ ఒకేచోట చదివే అవకాశాన్ని ఇంటిగ్రేటెడ్ కోర్సులు కల్పిస్తున్నాయి. సైన్స్‌లో ఉన్నత సంస్థ-ఐఐఎస్సీ 1909, మే 27న కేవలం రెండే విభాగాలు.. జనరల్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, ఎలక్ట్రో టెక్నాలజీతో ప్రారంభమై నేడు బయో కెమిస్ట్రీ, మెటీరియల్స్, నానో సైన్స్, ఆస్ట్రానమీ-ఆస్ట్రో ఫిజిక్స్ వంటి ఎన్నో విభాగాల్లో ఉన్నత విద్య పరంగా, పరిశోధన పరంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ-బెంగళూరు) ప్రముఖ స్థానం సంపాదించింది. ఇందులో కోర్సు చేసే అవకాశాన్ని చేజిక్కించుకొని, ఉన్నత కెరీర్ దిశగా పయనించొచ్చు. ఐఐఎస్సీ నాలుగేళ్ల కాల వ్యవధితో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. సైన్స్ ఔత్సాహిక అభ్యర్థులు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, బయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మెటీరియల్స్, కెమిస్ట్రీల్లోని ఏదో ఒక స్పెషలైజేషన్‌తో బీఎస్ చేయొచ్చు. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై), జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, ఏఐపీఎంటీ ఆధారంగా కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. 8 సెమిస్టర్లున్న ఈ కోర్సులో ఏడో సెమిస్టర్లో అడ్వాన్స్డ్ ఎలెక్టివ్ కోర్సుతో పాటు రీసెర్చ్ ప్రాజెక్టు ఉంటుంది. చివరి సెమిస్టర్ మొత్తం ప్రాజెక్ట్‌కే కేటాయించారు. నచ్చిన సబ్జెక్టులో రాణింపునకు పీజీ: ఇష్టమైన సబ్జెక్టుపై మాత్రమే దృష్టి సారించి, అందులోనే ఉన్నత కెరీర్‌కు బాటలు వేసుకునేందుకు పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) ఉపకరిస్తుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ వంటి సంప్రదాయ స్పెషలైజేషన్లతో పాటు ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, జియోఫిజిక్స్, ఆస్ట్రో ఫిజిక్స్, నానో సైన్స్ తదితర అధునాతన స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలోని సంస్థలు సంబంధిత అంశాల్లో పీజీ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఉదాహరణకు రసాయనాలు, ఎరువుల శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీఐపీఈటీ).. ఎంఎస్సీ బయోపాలిమర్ సైన్స్ కోర్సును అందిస్తోంది. కెమిస్ట్రీ సబ్జెక్టుతో గ్రాడ్యుయేషన్‌ను 50 శాతం మార్కులతో పూర్తిచేసిన వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అదే విధంగా ఎంఎస్సీ (పాలిమర్ సైన్స్)కు కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ/పాలిమర్ సైన్స్/అప్లైడ్ కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ పాలిమర్ కెమిస్ట్రీ మేజర్ సబ్జెక్టుగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు అర్హులు. ఐఐటీల్లో పీజీ: దేశంలో అత్యున్నత విద్యా సంస్థలుగా భాసిల్లుతున్న ఐఐటీలు, ఐఐఎస్సీలోనూ సైన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయొచ్చు. దీనికోసం జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ (జామ్)లో ప్రతిభకనబరచాలి. ఈ పరీక్షను ఐఐటీలు 2004-05 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులకు ఉన్నత విద్యను అందించి, సైన్స్ కెరీర్‌ను ఎంపిక చేసుకునే దిశగా ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. జామ్ ద్వారా ఎంఎస్సీ (రెండేళ్లు); జాయింట్ ఎంఎస్సీ-పీహెచ్డీ; ఎంఎస్సీ-పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ; ఎంఎస్సీ-ఎంటెక్; ఎంఎస్సీ-ఎంఎస్ (రీసెర్చ్)/పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ వంటి కోర్సుల్లో ప్రవేశించొచ్చు.సంప్రదాయ సబ్జెక్టులతో పాటు ఎర్త్ సైన్స్; అప్లైడ్ జియో ఫిజిక్స్; ఎనర్జీ వంటి ప్రత్యేక అంశాల్లో పీజీ చేసే అవకాశాలూ ఉన్నాయి. ఎంఎస్సీ+పీహెచ్డీ: ఎంఎస్సీతో పాటు పీహెచ్డీ పూర్తిచేసేలా కొన్ని సంస్థలు ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. పరిశోధనల దిశగా కెరీర్‌ను మలచుకోవాలనుకునే వారికి ఇవి అనువుగా ఉంటాయి. ఉదాహరణకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఏ-బెంగళూరు).. ఇగ్నో సహకారంతో ఫిజిక్స్ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-పీహెచ్డీ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. దీనికోసమే బెంగళూరు ప్రధాన ప్రాంగణంలో ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎలక్ట్రానిక్స్ లేబొరేటరీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎంఎస్సీలో నిర్దేశ మార్కులు పొందిన వారు పీహెచ్‌డీలో కొనసాగవచ్చు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ.. సైన్స్ కోర్సుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌తో ఫుల్స్టాప్ పెట్టేయకుండా పీహెచ్డీ చేయడం ద్వారా ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. పీజీలో నేర్చుకున్న అంశాల ఆధారంగా పరిశోధనలు చేపట్టేందుకు, కొత్త ఆవిష్కరణలకు పీహెచ్డీ వీలు కల్పిస్తుంది. యూజీసీ, డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ), డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ (డీబీటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (ఐఐసీబీ) తదితర సంస్థలు ప్రోత్సహిస్తుండటంతో గతంలో కంటే ఇప్పుడు వివిధ అంశాల్లో పీహెచ్డీ చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. బోధనా సిబ్బంది నియామకాలకు సంబంధించి యూనివర్సిటీల్లో పీహెచ్డీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెర్చ్ దిశగా వెళ్లడం మంచిది. ఇప్పుడు ప్రముఖ విశ్వవిద్యాలయాలన్నీ పీహెచ్డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఉన్నత చదువుకు ‘ఉపకారం’! ప్రాథమిక దశ నుంచే విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్కాలర్షిప్లు, ఫెలోషిప్లను అందజేస్తుంది. అవి.. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై), ఇన్స్పైర్ స్కాలర్షిప్స్/ఫెలోషిప్స్. యూజీసీ కూడా దాదాపు 13 రకాల ఫెలోషిప్స్/ స్కాలర్షిప్స్, స్వర్ణజయంతి ఫెలోషిప్స్, మహిళల కోసం ఉమెన్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ కింద ఎన్నో రకాల స్కాలర్‌షిప్స్‌ను అందజేస్తోంది. కేవలం బ్యాచిలర్ డిగ్రీకే పరిమితం కాకుండా, పీజీ/పీహెచ్డీ వంటి కోర్సులు చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. పరిశోధకులకు అండగా ఫెలోషిప్: దేశంలో ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థలతో పాటు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రతి నెలా ఫెలోషిప్ పొందుతూ పీహెచ్డీ చేయాలనుకునే విద్యార్థులకు, దేశ వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు/ ఐఐటీలు, నిట్‌లలో లెక్చరర్‌షిప్‌నకు అర్హత సాధించాలనుకునే వారికి నిర్వహించే పరీక్ష జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ఏటా రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహిస్తుంది. నెట్లో మంచి ర్యాంకు సాధిస్తే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) పొందడంతో పాటు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పీహెచ్డీ చేయడానికి మార్గం ఏర్పడుతుంది. జేఆర్ఎఫ్ సాధించిన అభ్యర్థులకు మొదటి రెండేళ్లు నెలకు రూ.16 వేలు చెల్లిస్తారు. ఏడాదికి ఒకసారి కాంటిన్జెన్సీ గ్రాంట్‌గా రూ.20 వేలు ఇస్తారు. ఆ తర్వాత పరిశోధనలో ప్రగతి, ఇంటర్వ్యూ ఆధారంగా మూడో సంవత్సరంలో సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎస్ఆర్ఎఫ్) హోదా కల్పించి నెలకు రూ.18 వేలు ఇస్తారు. జేఆర్ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు కలిసి గరిష్టంగా ఐదేళ్ల వరకు ఫెలోషిప్ లభిస్తుంది. సీఎస్ఐఆర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ఫెలోషిప్: సీఎస్ఐఆర్ నెట్లో మంచి మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ (ఎస్పీఎం) ఫెలోషిప్‌ను అందిస్తున్నారు. పరిశోధనలు చేసే విద్యార్థులను ప్రోత్సహించడం ఈ ఫెలోషిప్ ఉద్దేశం. దీనిద్వారా మొదటి రెండేళ్లకు నెలకు రూ.20 వేలు ఇస్తారు. విద్యార్థి ప్రతిభను బట్టి గరిష్టంగా ఐదేళ్ల వరకు ఫెలోషిప్ అందిస్తారు. జాయింట్ స్క్రీనింగ్ ఎంట్రన్స్ టెస్ట్ (జెస్ట్): సైన్స్‌కు సంబంధించిన అంశాల్లో ఐఐఎస్ఈఆర్ వంటి ప్రముఖ సంస్థల్లో పీహెచ్డీ చేయాలనుకుంటే దానికున్న చక్కని మార్గం జెస్ట్. ఏడాదికి ఒకసారి ఒక్కో ఇన్స్టిట్యూట్ ఈ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణులైనవారు ఫెలోషిప్ అందుకోవడంతోపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ), డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో ఉన్న వివిధ ప్రతిష్టాత్మక సంస్థల్లో ఫిజిక్స్ సంబంధిత అంశాల్లో పీహెచ్డీ చేయొచ్చు. ప్రాక్టికల్ నైపుణ్యాలు ప్రధానం ప్రస్తుతం సైన్స్‌లో అనేక సబ్జెక్టులు ఉన్నాయి. వీటిలో దేన్ని ఎంపిక చేసుకొని, జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనేది అభ్యర్థి స్వీయ అభిరుచి, సామర్థ్యం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. నచ్చిన సబ్జెక్టులో పీజీ, ఆపై పీహెచ్డీ దిశగా వెళ్తే సుస్థిర భవిష్యత్తు సొంతమవుతుంది. ఉదాహరణకు మ్యాక్రో మాలిక్యులర్ కెమిస్ట్రీ, పాలిమర్ ఫిజిక్స్, పాలిమర్ క్యారెక్టరైజేషన్ వంటి ఉప విభాగాల సమ్మిళితంగా ఉన్న పాలిమర్ సైన్స్‌లో మంచి అవకాశాలున్నాయి. అయితే సంబంధిత కోర్సులు చేసేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకొంటే సుస్థిర కెరీర్లో కుదురుకున్నట్లే! దేశంలో పాలిమర్, దాని అనుబంధ పరిశ్రమల అభివృద్ధిలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీఐపీఈటీ).. కీలకపాత్ర పోషిస్తోంది. పరిశ్రమకు నిపుణులైన మానవ వనరులను అందించేందుకు వివిధ కోర్సులు అందిస్తోంది. వీటిలో పీజీ డిప్లొమా, పోస్టు డిప్లొమా, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంఎస్సీ టెక్ తదితర ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు చేస్తున్నప్పుడు ప్రాక్టికల్స్ ఆధారంగా సబ్జెక్టును నేర్చుకోవడం, సంబంధిత సబ్జెక్టులతో ముడిపడిన వర్తమాన అంశాలపై పట్టు సాధించడం ప్రధానం. - ప్రొఫెసర్ టి. పార్థసారథి, ఉస్మానియా యూనివర్సిటీ, పీహెచ్డీ (పాలిమరైజేషన్). -
కెరీర్‌కు ఇంధనం..పెట్రోలియం ఇంజనీరింగ్
మారుతున్న ప్రాధమ్యాలు.. పెరుగుతున్న అవసరాలు వెరసి వివిధ రంగాల్లో కాలక్రమేణా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. అదే సమయంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని వాటిని సమర్థంగా నిర్వహించే మానవ వనరులు కూడా ఎంతో అవసరం.. అటువంటి మానవ వనరులను తీర్చిదిద్దడంలోశాస్త్ర సాంకేతిక విద్య ప్రాధాన్యత ఎంతో.. ఆ మేరకు ఎప్పటికప్పుడు కరిక్యులంను రూపొందించడంతోపాటు ఎన్నో నూతన కోర్సులను శాస్త్ర సాంకేతిక విద్యలో ప్రవేశ పెడుతున్నారు.. అటువంటి కోర్సుల్లో పెట్రోలియం/ఎనర్జీ స్టడీస్ ఒకటి. ద్విచక్ర వాహనం నుంచి విమానం వరకు ఏ వాహనం నడవాలన్నా.. ఇంట్లో వాడే గ్యాస్ స్టౌవ్ నుంచి ఏసీ వరకు ఇలా ఏది పని చేయాలన్నా కీలక పాత్ర పోషించేది ఇంధనం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఇంధనం లభించని రోజు ప్రపంచమే ఆగిపోతుందేమో? అనే అంతగా మానవ దైనందిన జీవితాన్ని ఇంధన రంగం ప్రభావితం చేస్తోంది. అటువంటి ఇంధన రంగం గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసే ఉద్దేశంతో పెట్రోలియం, ఎనర్జీ విభాగంలో పలు కోర్సులను ప్రవేశ పెట్టారు. బ్యాచిలర్ డిగ్రీ నుంచే అకడమిక్‌గా పెట్రోలియంకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్‌లో ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్‌గా పెట్రోలియం కోర్సులను అందిస్తున్నారు. వీటిని బీటెక్ (పెట్రోలియం ఇంజనీరింగ్/కెమికల్ అండ్ పెట్రోలియం)గా వ్యవహరిస్తున్నారు. ఇంటర్మీడియెట్/తత్సమానం (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) సబ్జెక్ట్లతో పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. డీప్‌వాటర్ ఇంజనీరింగ్, సబ్‌సీ టెక్నాలజీ వంటి కోర్సులను బీటెక్‌కు అనుబంధంగా చేయవచ్చు. బీటెక్ తర్వాత ఆసక్తి ఉంటే సంబంధిత లేదా అనుబంధ విభాగాల్లో ఎంటెక్/పీహెచ్డీ చేయవచ్చు. ఈ క్రమంలో ఎంటెక్ (పెట్రోలియం ఇంజనీరింగ్), ఎంటెక్ (గ్యాస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ), ఎంటెక్ (పైప్ లైన్ ఇంజనీరింగ్), ఎంబీఎ (పెట్రోలియం ఇంజనీరింగ్, గ్యాస్ మేనేజ్మెంట్) వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విధులు పెట్రోలియం ఇంజనీరింగ్ అభ్యర్థులు పెట్రోలియం ప్రొడక్షన్, ప్రాసెసింగ్ సంబంధిత విధులు నిర్వహిస్తుంటారు. చమురు అన్వేషణకు సంబంధించి ఒక ప్రదేశం/ వనరులు లభ్యమైనప్పుడు వీరి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో వీరు జియాలజిస్ట్‌లతో కలిసి సదరు నేల లేదా ఆయిల్ రిజర్వాయర్ భౌగోళిక లక్షణాలను విశ్లేషిస్తారు. వాటి ఆధారంగా పెట్రోలియం వెలికితీయడానికి అవసరమైన డ్రిల్లింగ్ పద్ధతులను రూపొందిస్తారు. అంతేకాకుండా సంబంధిత పరికరాలను కూడా తయారు చేస్తుంటారు. పెట్రోలియం ఇంజనీర్లకు అనుంబంధ అంశాలపై సమగ్ర అవగాహన ఉండాలి. ఈ క్రమంలో జియో ఫిజిక్స్, పెట్రోలియం జియాలజీ, డ్రిల్లింగ్, ఎకనామిక్స్, రిజర్వాయర్ ఇంజనీరింగ్, వెల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ లైఫ్ సిస్టమ్స్ వంటి అంశాలపై అవగాహన తప్పనిసరి. పెరుగుతున్న అవకాశాలు పెట్రోలియం ఇంజనీర్ అభ్యర్థులకు అవకాశాలు కొదవలేదని చెప్పొచ్చు. ఎందుకంటే పెట్రోలియం, సంబంధిత ఉత్పత్తులకు డిమాండ్ పెరగడమే తప్ప తగ్గడమే అనే మాట తలెత్తదు. డిమాండ్ పెరగడం అంటే తదనుగుణంగా నూతన ఉద్యోగాల సృష్టి జరుగుతుందనే భావించాలి. కాబట్టి ఈ కోర్సును పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం ఖాయమని చెప్పొచ్చు. వీరు ఆయిల్ కంపెనీలు, గ్యాస్ పరిశ్రమలు, మైనింగ్ కంపెనీలు తదితరాల్లో అవకాశాలను దక్కించుకోవచ్చు. ప్రైస్ వాటర్ కూపర్ కన్సల్టెన్సీ సంస్థ అంచనా మేరకు వచ్చే ఐదేళ్లలో ఈ రంగలో దాదాపు 36 వేల నిపుణుల అవసరం ఏర్పడనుంది. నైపుణ్యం, అనుభవం మేరకు ఈ రంగంలో వివిధ రకాల జాబ్ ప్రొఫైల్స్ ఉంటాయి. అవి..రిజర్వాయర్ ఇంజనీర్, టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్, సీనియర్ జియో సైంటిస్ట్, డ్రిల్ బిట్ సిస్టమ్ ఫీల్డ్ ఇంజనీర్, పెట్రోలియం టెక్నాలజిస్ట్, డ్రిల్లింగ్ ఇంజనీర్, అనలిస్ట్, ప్రాసెస్ ఇంజనీర్, రిజర్వాయర్ పెట్రో ఫిజిక్సిస్ట్, టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్ తదితరాలు. విదేశాల్లో పెట్రోలియంను బ్లాక్ గోల్డ్‌గా పేర్కొంటారు. పారిశ్రామికీకరణ, ఆర్థిక రంగం వృద్ధి బాటలో పయనించడంలో పెట్రోలియం పాత్ర ఎంతో కీలకం. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా చమురు అన్వేషణను పెద్ద ఎత్తున్న సాగిస్తున్న ప్రస్తుత తరుణంలో పెట్రోలియం ఇంజనీరింగ్ అభ్యర్థులకు విదేశీ అవకాశాలు కూడా పుష్కలం. భారతీయ కంపెనీలు కూడా విదేశాల్లో పెట్రోలియం అన్వేషణలో నిమగ్నమవ్వడం కూడా ఇందుకు కారణంగా పేర్కొనవచ్చు. రష్యా, గల్ఫ్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ (ఓపెక్) ఇందుకు చక్కని వేదికలుగా నిలుస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాలు, ఆఫ్రికా, సౌత్ అమెరికా దేశాల్లో అధిక పే ప్యాకేజ్‌లు లభిస్తున్నాయి. వేతనాలు వేతనాల విషయానికొస్తే..సాఫ్ట్వేర్ రంగానికి దీటుగా జీతా లు అందించే రంగాల్లో ఇది ఒకటి. ఫ్రెష్ గ్రాడ్యుయేట్‌కు కంపెనీని బట్టి వార్షిక సరాసరి వేతనం రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల మధ్య ఉంటోంది. కొన్ని సంస్థలు రూ. 6 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నాయి. అత్యధికంగా రూ. 30 లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసే సంస్థలు కూడా ఉన్నాయి. అదే అంతర్జాతీయ సంస్థల్లోనైతే సంవత్సరానికి లక్ష డాలర్లు కూడా అందుకునే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయం పెరుగుతున్న ఇంధన అవసరాలు ఒక వైపు, మరో వైపు తరుగుతున్న వనరుల ఫలితంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దాంతో జాబ్ మార్కెట్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల (రెన్యూవబుల్ ఎనర్జీ) పట్ల అవగాహన ఉన్న నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రెన్యూవబుల్ ఎనర్జీకి అకడమిక్ సబ్జెక్ట్‌లలో స్థానం కల్పించారు. కొన్ని యూనివర్సిటీలు ఎనర్జీ స్టడీస్-ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్‌లో భాగంగా ఈ సబ్జెక్ట్‌ను బోధిస్తున్నాయి. మరికొన్ని యూనివర్సిటీలు పీజీలో స్పెషలైజేషన్‌గా అందిస్తున్నాయి. ఇందులో సోలార్ ఎనర్జీ, బయోమాస్, విండ్ ఎనర్జీ, టైడ్ అండ్ వేవ్ ఎనర్జీ, ఫ్యూయల్ సెల్స్, హైడ్రోజన్ ఎనర్జీ, ఎనర్జీ మేనేజ్మెంట్, న్యూక్లియర్ ఎనర్జీ, ఎనర్జీ జనరేషన్, ఎనర్జీ పాలసీస్ వంటి అంశాలను బోధిస్తారు. సంబంధిత కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు సోలార్-విండ్-న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, బయోమాస్ కంపెనీలు, ఆర్కిటెక్చర్ ఫర్మ్స్, ఎన్జీవో, ఇంధనానికి సంబంధించిన ప్రభుత్వ శాఖల్లో అవకాశాలు ఉంటాయి. అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు: యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం ఎన ర్జీ అండ్ స్టడీస్- డెహ్రాడూన్; కోర్సు: ఎంటెక్ (పవర్ సిస్టమ్స్) వెబ్సైట్: www.upes.ac.in అమిటీ యూనివర్సిటీ-నోయిడా కోర్సు: ఎంటెక్ (సోలార్ అండ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ) వెబ్సైట్: www.amity.edu మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-భోపాల్; కోర్సు: ఎంటెక్ (రెన్యూవబుల్ ఎనర్జీ) వెబ్సైట్: www.manit.ac.in టెరీ యూనివర్సిటీ-ఢిల్లీ; కోర్సు: ఎంటెక్ (రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ మేనేజ్మెంట్) వెబ్సైట్: www.teriuniversity.ac.in కేజీ బేసిన్లో పెట్రోలియం, సహజవాయువు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఓఎన్జీసీ, ఆర్ఐఎల్, గెయిల్, ఆయిల్ ఇండియా, కేన్ ఇంజనీరింగ్ వంటి ప్రముఖ సంస్థలు సముద్రం డీప్‌వాటర్‌పోర్టు నుంచి ఆయిల్, గ్యాస్‌ను వెలికితీస్తున్నాయి. వీటికి అనుబంధంగా స్లమ్‌బర్గ్, హాలీబాటన్, వెదర్ఫర్డ్, యాసర్ సొల్యూషన్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు సంబంధిత పనుల్లో పాల్గొంటున్నాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అవసరమైన మానవ వనరులను అందించడం కోసం పెట్రోలియం ఇంజనీరింగ్‌ను ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్లపై పట్టు ఉండాలి. పెట్రోలియం, పెట్రోకెమికల్స్‌పై అవగాహన, ఆసక్తి అవసరం. సృజనాత్మకత, పరిశోధన పట్ల ఆసక్తి, కష్టపడే తత్వం కలిగి ఉండాలి. కోర్సు పూర్తి చేసిన తరువాత భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఆయిల్ ఇండియా లిమిటెడ్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వంటి ప్రభుత్వరంగ సంస్థల్లోను, రిలయన్స్, కేన్ ఇంజనీరింగ్, జిందాల్, టాటా పెట్రోల్, హిందుస్థాన్ పెట్రోల్, జాన్ ఇంజనీరింగ్, పెట్రోనెట్, మిచెల్ డ్రిల్లింగ్, టోటల్ ఆయిల్ ఇండియా లిమిటెడ్, డీప్ డ్రిల్లింగ్, స్లంబర్గ్, హాలీబాటన్, వెదర్పోర్డ్ వంటి ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో రూ. 6 నుంచి రూ. 12 లక్షలు వరకు అత్యధిక వేతనంగాను, రూ. 2 నుంచి రూ. 4 లక్షల వరకు అత్యల్ప వేతనంగా అందిస్తున్నాయి. రూ.30 లక్షల వరకు కూడా ఆఫర్ చేసే కంపెనీలు ఉన్నాయి. ఈ కోర్సులు చేసిన విద్యార్థులకు గల్ఫ్ దేశాల్లో విరివిగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. దేశీయంగా ఓఎన్జీసీ సంస్థ ఈ రంగానికి సంబంధించి టాప్ రిక్రూటర్‌గా నిలుస్తోంది. ఈ సంస్థ ఏడాదికి 800 నుంచి 1000 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ప్రొఫెసర్ కె.వి.రావు, ప్రోగ్రామ్ డెరైక్టర్, పెట్రోలియం కోర్సెస్, జేఎన్టీయూ-కాకినాడ. టాప్ రిక్రూటర్స్ ఓఎన్జీసీ, గెయిల్, ఐఓసీ, షెల్, రిలయన్స్, హెచ్‌పీసీఎల్ ఎస్సార్, కెయిర్న్ ఎనర్జీ, బ్రిటిష్ పెట్రోలియం -
సివిల్ సాధ్యమే
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. సివిల్ సర్వీసెస్ ప్రకటన విడుదలైంది. మీరూ ఐఏఎస్, ఐపీఎస్ కావొచ్చు. నిండైన ఆత్మవిశ్వాసం, సాధించగలమనే తపన, ఓటమికి బెదరని వ్యక్తిత్వం, పరిపూర్ణ విషయ పరిజ్ఞానం ఉంటే లక్ష్య సాధన పెద్ద సమస్యే కాదంటున్నారు సివిల్స్‌లో విజయం సాధించిన పలువురు. మరి ఎందుకాలస్యం.. దరఖాస్తు నింపేయండి.. పరీక్షకు సిద్ధం కండి.. కొలువు కొట్టేయండి.. యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహణ జాతీయస్థాయిలో హోదాపరంగా ఉన్నతమైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి 20కిపైగా సర్వీసుల్లో నియామకానికి ఏటా సివిల్ సర్వీసెస్ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహిస్తోంది. ఈ ఏడాది ప్రకటన మే 31న వెలువడింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 30. ఆగస్టు 24న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా ఎస్బీఐ శాఖలో రూ.100 ఫీజు చెల్లించాలి లేదా ఎస్బీh/ఎస్బీఐ గ్రూప్ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్)ల్లో నెట్ బ్యాంకింగ్ /డెబిట్ కార్డ్ ద్వారా కూడా ఫీజు చెల్లించొచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, శారీరక వికలాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు. ఈ ఏడాది మొత్తం పోస్టుల సంఖ్య 1291. అర్హతలివీ.. ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసినవారు సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసేందుకు అర్హులు. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులూ అర్హులే. వీరు మెయిన్స్ నాటికి తమ ఉత్తీర్ణతా సర్టిఫికెట్లు చూపాలి. వివిధ యూనివర్సిటీలు దూరవిద్యా విధానం ద్వారా అందించే బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులు ఉత్తీర్ణులైనవారు సివిల్స్ రాసేందుకు అర్హులే. అయితే ఆ కోర్సుకు సంబంధిత అధీకృత సంస్థల (యూజీసీ/డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో/ఏఐసీటీఈ తదితర) గుర్తింపు ఉండాలి. వయోపరిమితి నిబంధన కూడా ఉంది. ఆగస్టు 1, 2014 నాటికి అన్ని వర్గాల అభ్యర్థులకు కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 32 ఏళ్లు.. ఓబీసీలకు 35 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 37 ఏళ్లు. అంధులు, బధిరులు, శారీరక వికలాంగులకు గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు. ఎన్నిసార్లు రాయొచ్చు.. గతేడాది వరకు సివిల్స్ పరీక్షలను జనరల్ కేటగిరీ అభ్యర్థులు గరిష్టంగా నాలుగుసార్లు మాత్రమే రాసుకునే వీలుండేది. ఈ ఏడాది నుంచి దాన్ని ఆరుసార్లకు పెంచారు. ఓబీసీలకు ఇప్పటివరకు ఏడుసార్లు సివిల్స్ రాసుకునే అవకాశం ఉండేది. ఈ ఏడాది నుంచి తొమ్మిదిసార్లు రాసుకునే వీలు కల్పించారు. ఎస్సీ, ఎస్టీలు, పీహెచ్ (అంధ, బధిర, వికలాంగులు) గరిష్ట వయోపరిమితికి లోబడి ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. జనరల్ కేటగిరీకి చెందిన పీహెచ్ అభ్యర్థులు తొమ్మిదిసార్లు మాత్రమే రాసుకునే వీలుంది. దరఖాస్తు చేయండిలా.. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా ఠీఠీఠీ.ఠఞటఛిౌజ్ఛీ.జీఛి.జీ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో ‘ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ వేరియస్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ యూపీఎస్సీ’ అనే లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్, చివరి తేదీ, పార్ట్-1, పార్ట్-2 రిజిస్ట్రేషన్స్ కనిపిస్తాయి. ముందుగా పార్ ్ట-1 రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. ఇందులో పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు, తల్లి పేరు, జాతీయత, వివాహ స్థితి, విద్యార్హతలు, చిరునామా వంటివి ఉంటాయి. వీటిని జాగ్రత్తగా పూర్తి చేయాలి. మీ పేరు, పుట్టిన తేదీ పదోతరగతి సర్టిఫికెట్లో ఎలా ఉందో అలానే రాయాలి. తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తే మరిన్ని వివరాలు వస్తాయి. వీటిని కూడా పూర్తి చేస్తే పార్ట్-1 రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీ వివరాలు అన్నీ సరిచూసుకున్నాక ‘యూ అగ్రి’ బటన్ క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఐడీ వస్తుంది. ఈ ఐడీ, పుట్టిన తేదీతో పార్ట్-2 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందులో ముందుగా నిర్దేశించిన సైజ్‌లో మీ ఫొటో, సంతకం స్కాన్ చేసి ఉంచుకోవాలి. ఫొటో, సంతకం అప్లోడ్ చేశాక మిగిలిన వివరాలు నింపాలి. సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా భర్తీ చేసే పోస్టులివీ.. 1. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ 2. ఇండియన్ ఫారెన్ సర్వీస్ 3. ఇండియన్ పోలీస్ సర్వీస్ 4. ఇండియన్ పీ అండ్ టీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్- గ్రూప్-ఏ 5. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ - గ్రూప్-ఏ 6. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్)- గ్రూప్-ఏ 7. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, గ్రూప్-ఏ 8. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐటీ), గ్రూప్-ఏ 9. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీసెస్, గ్రూప్-ఏ (అసిస్టెంట్ వర్క్స్ మేనేజర్, అడ్మినిస్ట్రేషన్) 10. ఇండియన్ పోస్టల్ సర్వీస్, గ్రూప్-ఏ 1 1. ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్, గ్రూప్-ఏ 12. ఇండియన్ ైరె ల్వే ట్రాఫిక్ సర్వీస్, గ్రూప్-ఏ 13. ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్, గ్రూప్-ఏ 14. ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ - గ్రూప్-ఏ 15. పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ సర్వీస్ - గ్రూప్-ఏ 16. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్, గ్రూప్-ఏ 17. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (జూనియర్ గ్రేడ్), గ్రూప్-ఏ 18. ఇండియన్ ట్రేడ్ సర్వీస్, గ్రూప్-ఏ, (గ్రేడ్-3) 19. ఇండియన్ కా్ఘూరేట్ లా సర్వీస్, గ్రూప్-ఏ, 20. ఆర్మ్డ్ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ సివిల్ సర్వీస్, (సెక్షన్ ఆఫీసర్స్ గ్రేడ్) 21. ఢిల్లీ, అండమాన్-నికోబార్ ఐస్లాండ్స్, లక్షద్వీప్, డామన్-డయ్యూ, దాద్రానగర్ హవేలి సివిల్ సర్వీస్-గ్రూప్-బి 22. ఢిల్లీ, అండమాన్-నికోబార్, లక్షద్వీప్, డామన్-డయ్యూ, దాద్రానగర్ హవేలి పోలీస్ సర్వీస్-గ్రూప్-బి 23. పాండిచ్చేరి సివిల్ సర్వీస్ - గ్రూప్-బి పరీక్షలు ఇలా... సివిల్స్ ఎంపిక మూడు దశలుగా ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ. సివిల్స్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి ముందుగా ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. ఇది ఇంగ్లిష్ లేదా హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులుంటాయి. పేపర్-1లో 100 ప్రశ్నలు, పేపర్-2లో 85 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కుల కోత విధిస్తారు. ఒక్కో పేపర్ పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు (120 నిమిషాలు). ప్రిలిమ్స్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో ఉత్తీర్ణులైనవారిని అందుబాటులో ఉన్న పోస్టులు, రిజర్వేషన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రతిభ ఆధారంగా మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్ పరీక్ష ఇలా.. మెయిన్సలో ఆప్షనల్లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కులుంటాయి. ఒక్కో పరీక్ష వ్యవధి మూడు గంటలు. అభ్యర్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు. ఆప్షనల్లో అత్యధిక మార్కులు సాధించాలంటే అన్ని అంశాలపై పట్టుండాలి. దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నలో అనేక ఉప ప్రశ్నలు ఉంటున్నాయి. ప్రశ్నలు కూడా పరోక్షంగా ఉంటున్నాయి. థియరీ కంటే కూడా అప్లికేషన్ ఓరియెంటేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. సమకాలీన అంశాలు, సమస్యలపై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. సివిల్స్ సాధనలో కోచింగ్ పాత్ర కీలకం.మన రాష్ట్రంలో హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. పలువురు అభ్యర్థులు ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లలో సైతం శిక్షణ తీసుకుంటున్నారు. మన రాష్ట్రంలో ప్రధాన కోచింగ్ సెంటర్లలో లక్ష రూపాయల వరకు ఫీజు ఉంటుంది. ఢిల్లీ లాంటి నగరాల్లో లక్షన్నర రూపాయల వరకు ఉంటుంది. కోచింగ్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్‌లకు శిక్షణనిస్తారు. కోచింగ్ వ్యవధి దాదాపు పది నెలలు. హాస్టల్ వసతి, భోజన ఖర్చుల కింద నెలకు మరో రూ.5000 వ రకు అవుతాయి. పుస్తకాలు, ఇతర ఖర్చులు అదనం. సివిల్స్‌లో ఇంటర్వ్యూ కీలకమైన ఘట్టం. ఇందులో నిజాయతీగా ఉండాలి. తెలియని విషయాలను తెలియదని చెప్పాలి. ఎక్కువ శాతం ప్రశ్నలు వర్తమాన వ్యవహారాలపై అడుగుతారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మెయిన్స్ : అందుబాటులో ఉన్న పోస్టుల్లో.. ఒక్కో పోస్టుకు 12 లేదా 13 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో అన్ని పేపర్ల (ఇంగ్లిష్ మినహాయించి)ను తెలుగు మాధ్యమంలో కూడా రాసుకోవచ్చు. ప్రశ్నపత్రం మాత్రం ఇంగ్లిష్/హిందీల్లో ఉంటుంది. ప్రశ్నలన్నీ కన్వెన్షనల్ (వ్యాస రూప) విధానంలో ఉంటాయి. ఇందులో 300 మార్కులకు పేపర్-ఏ ఉంటుంది. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. మన రాష్ట్ర విద్యార్థులు తెలుగును ఎంచుకుని రాయొచ్చు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. సంబంధిత మాతృభాషల్లో అభ్యర్థి సామర్థ్యాన్ని తెలుసుకునే ఉద్దేశంతో ఈ పరీక్షను నిర్వహిస్తారు. పేపర్-బి : ఇంగ్లిష్ (300 మార్కులు). ఇంగ్లిష్‌లో అభ్యర్థికి సాధారణ పరిజ్ఞానం ఉందో, లేదో పరిశీలించడం ఈ పరీక్ష ప్రధాన ఉద్దేశం. పేపర్-ఏ, పేపర్-బి రెండు పదో తరగతి/మెట్రిక్యులేషన్ స్థాయిలో ఉంటాయి. వీటి మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. అయితే అభ్యర్థులు పేపర్-ఏలో 30 శాతం, పేపర్-బిలో 25 శాతం మార్కులు సాధించాలి. మౌఖిక పరీక్ష: మెయిన్స్‌లో ఉత్తీర్ణులైనవారిని అందుబాటులో ఉన్న పోస్టులు, రిజర్వేషన్స్‌ను దృష్టిలో ఉంచుకుని పోస్టుకు ఇద్దరు చొప్పున మౌఖిక పరీక్షకు ఎంపిక చేస్తారు. దీనికి 275 మార్కులుంటాయి. అంటే మెయిన్స్, ఇంటర్వ్యూల మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపిక అవుతామనే నమ్మకం ఉండాలి.. డాక్టర్ గజరావు భూపాల్, జిల్లా ఎస్పీ ఐపీఎస్‌కు ప్రిపేర్ అయ్యేవారు ఒక ప్రణాళిక రూపొందించుకొని చదవాలని సూచిస్తున్నారు జిల్లా ఎస్పీ గజరావు భూపాల్. సివిల్స్‌కు ప్రిపేర్‌పై ఆయన ఏమంటున్నారంటే.. నేను వారం రోజుల ప్రణాళికను ముందే తయారు చేసుకుని చదివాను. ఇతరులకు ఏదో సబ్జెక్టులో ఎక్కువ మార్కులువచ్చాయని ఆ సబ్జెక్టును చదవకుండా.. మనము దేనినైతే ఎక్కువగా ఇష్టాపడుతామో అదే సబ్జెక్టు చదవాలి. ముఖ్యంగా ఐపీఎస్‌కు ఎంపిక అవుతాననే నమ్మకం అందరిలోనూ ఉండాలి. చదివే సమయంలో అలసటగా ఉన్నప్పుడు కొంత విశ్రాంతి తీసుకోవాలి. ఆ సమయంలో మంచి వాతావరణంలో గడుపుతూ స్నేహితులతో ఉండేలా ప్రయత్నించాలి. నేను ఏ వృత్తిలో ఉన్నా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా చదువుకున్నాను. మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. అమ్మానాన్నలు అనురాధ, సీతారామస్వామి ఇద్దరూ వైద్యులే. డిగ్రీ వరకు కాకినాడలోనే చదువుకున్నాను. మెడికల్ విద్య అభ్యసించాను. 2006లో ఐపీఎస్ కోసం ఢిల్లీలోని వాజిరాం ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాను. శిక్షణ సమయంలో ఒకసారి ఐపీఎస్ రాసినా ఎంపిక కాలేదు. శిక్షణ ముగిసిన అనంతరం 2007లో కాకినాడలోని శంకవరం పీహెచ్సీలో అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా పనిచేశాను. అక్కడ విధులు నిర్వర్తిస్తూనే మళ్లీ ఐపీఎస్‌కు సిద్ధమయ్యాను. 2008లో ఎంపికయ్యాను. వైద్యుడిగా కాకుండా ఏ వృత్తిలోనైనా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా భావించాను. శిక్షణ అనంతరం 2010-13 వరకు భద్రచలం ఏఎస్పీగా, 2013-అక్టోబర్ వరకు మెదక్ అడిషనల్ ఎస్పీగా, ఆ తర్వాత ఆదిలాబాద్ ఎస్పీగా పదోన్నతిపై వచ్చాను. మొదటి నుంచీ నేను ఐపీఎస్ కావాలనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సంతోష పడ్డాను. వైద్యునిగా రోగులకు, ఎస్పీగా ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. - ఆదిలాబాద్ క్రైం వారి ప్రోత్సాహం మరువలేనిది.. జోయేల్ డేవిస్, ఆదిలాబాద్ ఏఎస్పీ ఎలాగైనా ఐపీఎస్‌కు ఎంపికవుతాననే లక్ష్యంతో చదవాలి. అప్పుడే మన ఆశయం నెరవేరుతుంది. నేను ఐపీఎస్ అయ్యేందుకు ఎంతో కష్టపడ్డాను. మాది తమిళనాడు రాష్ట్రం, జిల్లా కన్యాకుమారి గ్రామం కొట్టికోడు. వ్యవసాయ కుంటుంబం. మా అమ్మానాన్నలు డేవిడ్సన్, రీబీలు నా చదువు కోసం చాలా కష్టపడ్డారు. అప్పులు చేసి మరీ నన్ను ఐపీఎస్ చదివించారు. డిగ్రీ వరకు మా ఊళ్లోనే చదువుకున్నాను. డిగ్రీ చదివే సమయంలో ఉదయం, మధ్యాహ్నం మాకున్న అరటితోటలో నావంతుగా పనిచేసేవాన్ని. డిగ్రీ తర్వాత 8 నెలలు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాను. అసలు నేను ఐపీఎస్ చదువుతానని అనుకోలేదు. అప్పటి వరకు మా గ్రామానికే పరిమితమైన నన్ను మా బావ డిస్పన్రాయ్ (ప్రధానోపాధ్యాయుడు) ఐపీఎస్ చదివేంచేందుకు సహాయపడ్డారు. ఆ తర్వాత చెన్నైలో మా అక్కాబావ ఇంట్లో ఉండి ఐపీఎస్‌కు ప్రిపేర్ అయ్యాను. చెన్నైలోని అకాడమిక్ ప్రభా ఇనిస్టిట్యూట్‌లో రెండేళ్లు శిక్షణ తీసుకున్నాను. 8 గంటలు నిర్విరామంగా చదివేవాన్ని. ఇంట్లో ఎలాంటి సమస్యలు వచ్చినా నా చదువుకు ఆటంకం రావొద్దని మా కుటుంబ సభ్యులు ఆ విషయం నాకు తెలియనీయకుండా దాచేవారు. అప్పు చేస్తూ చదివిస్తున్నారనే విషయం కూడా నాకు తెలీదు. ఎలాంటి ఆలోచనలు లేకుండా ఐపీఎస్ అవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగాను. 2010లో ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. ఐపీఎస్‌కు ఎంపిక కావడంపై మా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందించారు. వారి కష్టాన్ని వృథాగా పోనివ్వలేదనే సంతోషం కూడా నాలో కలిగింది. ఒక అర్థవంతమైన జీవితం లభించిందనుకున్నాను. నన్ను ప్రోత్సహించిన మా నాన్న, బావ, మా కోచింగ్ సెంటర్ డెరైక్టర్ ప్రభాకర్‌లో ప్రోత్సాహం చాలా వరకు ఉంది. మొదటగా వరంగల్‌లోని జనగంలో ఏఎస్పీగా, ఆ తర్వాత ఉట్నూర్, ఆదిలాబాద్ ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నాను. - ఆదిలాబాద్ క్రైం సివిల్ సర్వీసెస్ స్పెషల్ వెబ్ పోర్టల్ కోసం.. www.sakshieducation.com లాగిన్ అవ్వండి.. -
ఈ ‘పీజీ’లతో.. జాబ్ ‘ఈజీ’
పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ).. బ్యాచిలర్ డిగ్రీ(బీఎస్సీ/బీకామ్/బీఏ) తర్వాత ఉన్నత విద్యకు మార్గం. పీజీ కోర్సుల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీలను సంప్రదాయ కోర్సులుగా పరిగణిస్తుండగా.. ఎంబీఏ, ఎంసీఏ ప్రొఫెషనల్ కోర్సులుగా గుర్తింపు పొందుతున్నాయి. ఇటీవల కాలంలో సంప్రదాయ కోర్సుల్లోనూ పరిశ్రమ అవసరాలకు, జాబ్ మార్కెట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా సరికొత్త స్పెషలైజేషన్లు ఆవిష్కృతమవుతున్నాయి. మరోవైపు ప్రొఫెషనల్ కోర్సులు సైతం క్రేజీ కాంబినేషన్ల కలయికతో వినూత్న అవకాశాలకు మార్గం వేస్తున్నాయి. ‘పీజీలో ఏ కోర్సులో ప్రవేశించినా.. ఎంచుకున్న స్పెషలైజేషన్‌తోనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని.. అందుకే ఈ విషయంలో ముందుగానే ఒక అంచనాకు రావాలని సూచిస్తున్నారు’ నిపుణులు. త్వరలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు పూర్తిచేసుకొని వచ్చే విద్యా సంవత్సరంలో ఉన్నత విద్య దిశగా అడుగులు వేయాలనుకుంటున్న విద్యార్థుల ముందున్న జాబ్ ఓరియెంటెడ్ పీజీ కోర్సులపై ప్రత్యేక ఫోకస్ ఈ వారం చుక్కాని.. మాస్టర్ ఆఫ్ కామర్స్.. కలర్ ఫుల్ కెరీర్స్ ఎంకాం అంటే.. కామర్స్ మాత్రమే అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ఆఫ్ కామర్స్‌లో.. కార్పొరేట్ సెక్రటరీషిప్, మార్కెటింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఫైనాన్స్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని పూర్తి చేయడం ద్వారా బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ, ఇతర కార్పొరేట్ సంస్థల్లో ఫైనాన్స్ మేనేజర్లుగా, ఇంటర్నల్ ఆడిటర్స్‌గా కొలువులు సొంతం చేసుకోవచ్చు. కార్పొరేట్ సెక్రటరీషిప్ పూర్తి చేసిన అభ్యర్థులు.. సదరు కంపెనీ సెక్రటరీకి సహాయకులుగా వైట్ కాలర్ జాబ్స్అందుకోవచ్చు. కార్పొరేట్ సెక్రటరీషిప్ పూర్తి చేసిన వారికి కంపెనీ సెక్రటరీ కోర్సులో కొన్ని పేపర్ల నుంచి మినహాయింపు కూడా లభిస్తుంది. ఫలితంగా వీరు భవిష్యత్తులో సులువుగా కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తి చేసుకుని కెరీర్‌ను మరింత ఉన్నతంగా మలచుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఎంఏ.. ఎన్నో స్పెషలైజేషన్స్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్(ఎంఏ) అనగానే.. హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్.. సాధారణంగా మనందరికీ గుర్తొచ్చే కోర్సులు. కానీ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంఏలోనూ ఎన్నో వినూత్న స్పెషలైజేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ వర్క్, డెవలప్మెంట్ స్టడీస్, సైకాలజీ, పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్, సోషియాలజీ వంటివి. ఇందుకు ప్రధాన కారణం.. అటు ప్రభుత్వ రంగంతోపాటు, ఇటు ప్రైవేట్ రంగంలోనూ సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం పెరగడం.. వాటిని క్షేత్ర స్థాయిలో సమర్థంగా అమలు చేసేందుకు నిపుణుల అవసరం ఏర్పడటమే! సోషల్ వర్క్, సోషియాలజీ వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి స్వచ్ఛంద సంస్థలు, బహుళ జాతి సంస్థల సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) విభాగాల్లో కొలువులు ఖాయం. ఇవే కాకుండా.. మానవ వనరుల డిమాండ్ ఎక్కువగా ఉన్న రిటైల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, టూరిజం మేనేజ్మెంట్ వంటి కోర్సులను కూడా కొన్ని యూనివర్సిటీలు పూర్తి స్థాయి కోర్సులుగా అందిస్తున్నాయి. సోషల్ సెన్సైస్తో సమున్నత స్థానాలు.. ఆత్మసంతృప్తి, సంపాదనకు అవకాశం కల్పించే కోర్సులు.. సోషల్ సెన్సైస్. సామాజిక అభివృద్ధికి దోహదం చేసే పలు అంశాలపై నైపుణ్యాలు అందించే కోర్సులివి. ఈ విభాగంలో పీజీ స్థాయిలో సోషల్ వర్క్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తదితర కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని పూర్తి చేయడం వల్ల ప్రభుత్వ పథకాల అమలు విభాగాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల్లోని సీఎస్ఆర్ విభాగాల్లోనూ వేల రూపాయల వేతనంతో కెరీర్ ప్రారంభించొచ్చు. ఈ కోర్సు ఔత్సాహికులకు ప్రధానంగా సేవా దృక్పథం, క్షేత్ర స్థాయిలో భిన్న సంస్కృతుల ప్రజలతో మమేకం కాగల సహజ లక్షణాలు అవసరం. అప్పుడే ఈ విభాగంలో కెరీర్ పరంగా రాణించగలరు. - ప్రొఫెసర్॥లక్ష్మీ లింగం, డిప్యూటీ డెరైక్టర్, టిస్-హైదరాబాద్ క్యాంపస్ ఇంగ్లిష్.. ఫారిన్ లాంగ్వేజెస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఎంఏ ఇంగ్లిష్ కోర్సుకు బోధనా రంగంతోపాటు కార్పొరేట్ కంపెనీల్లోనూ భారీ డిమాండ్ నెలకొంది. కార్పొరేట్ సంస్థలు తమ సిబ్బందిలో కమ్యూనికేషన్, లాంగ్వేజ్ స్కిల్స్ పెంపొందించే దిశగా ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తూ పూర్తి స్థాయి శిక్షకులను నియమిస్తున్నాయి. కాబట్టి ఎంఏ ఇంగ్లిష్ కోర్సు పూర్తి చేసినవారు ఎంఎన్సీల్లో మెరుగైన అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ప్రారంభంలోనే రూ.30వేల జీతం అందుకోవచ్చు. అదేవిధంగా విదేశీ భాషల్లో ముఖ్యంగా జర్మన్, ఫ్రెంచ్, జపనీస్ల్లో పీజీ పూర్తిచేసిన వారికి విసృ్తత ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రపంచీకరణ, సరళీకరణల నేపథ్యంలో.. అనేక విదేశీ సంస్థలు మన దేశాన్ని ఔట్ సోర్సింగ్‌కు వేదికగా చేసుకొని ఇక్కడే తమ సెంటర్లను నెలకొల్పుతున్నాయి. దాంతో ఇటీవల కాలంలో ఫారిన్ లాంగ్వేజ్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఫార్మాస్యుటికల్ సంస్థలు, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ సంస్థల్లో అవకాశాలు లభిస్తున్నాయి. అవకాశాలకు వేదిక విదేశీ భాషలు.. ప్రపంచీకరణ యుగంలో విశ్వవ్యాప్తంగా ఉద్యోగావకాశాలకు మార్గం.. విదేశీ భాషల్లో నైపుణ్యం. సమీప భవిష్యత్తులో వేల సంఖ్యలో విదేశీ భాషలు నేర్చుకున్న వారి అవసరం ఏర్పడనుంది. ఔత్సాహిక విద్యార్థులు షార్ట్‌టర్మ్ కోర్సులకు పరిమితం కాకుండా.. పూర్తి స్థాయి పీజీ కోర్సులు అభ్యసిస్తే అద్భుత అవకాశాలు సొంతమవుతాయి. కోర్సులో చేరిన విద్యార్థులు యాంత్రికంగా కాకుండా.. నిజమైన ఆసక్తితో చదవడం ప్రధానం. అప్పుడే ఎలాంటి భాష అయినా సులువుగా నేర్చుకోవచ్చు. ప్రస్తుతం ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో సర్టిఫికెట్ నుంచి పీజీ, పీజీ డిప్లొమా వరకు పలు విదేశీ భాష కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమకు అభిరుచి ఉన్న భాషలో నిర్దిష్ట ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ద్వారా అడుగుపెట్టొచ్చు. - ప్రొఫెసర్॥సునయన సింగ్, వైస్ చాన్స్‌లర్, ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఎంబీఏ ఎంబీఏ.. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అయిదారేళ్ల క్రితం వరకు ఫైనాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్ వంటి స్పెషలైజేషన్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఎంబీఏలో ఎన్నో కొత్త స్పెషలైజేషన్లు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ క్రమంలో రిటైల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్మెంట్; బ్యాంకింగ్ రంగానికి సంబంధించి బ్యాంకింగ్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వంటి స్పెషలైజేషన్స్‌ను పలు ఇన్స్టిట్యూట్లు అందిస్తున్నాయి. వీటిని పూర్తి చేసిన అభ్యర్థులు తమ స్పెషలైజేషన్‌కు సంబంధించిన రంగంలో ఎంట్రీలెవల్లో ఎగ్జిక్యూటివ్స్‌గా కెరీర్ ప్రారంభించి.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయి వరకు చేరుకోవచ్చు. వినూత్న స్పెషలైజేషన్స్‌తో విభిన్న అవకాశాలు.. ఎంబీఏ ఔత్సాహిక విద్యార్థులు.. ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ వంటి సంప్రదాయ స్పెషలైజేషన్స్‌కే పరిమితం కాకుండా.. కొత్తగా వస్తున్న జాబ్మార్కెట్లో డిమాండ్ ఉన్న స్పెషలైజేషన్స్‌పై దృష్టిసారించాలి. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా అందుబాటులోకి వచ్చిన స్పెషలైజేషన్స్ ఎన్నో ఉద్యోగావకాశాలకు మార్గం వేస్తున్నాయి. దాంతోపాటు డ్యూయల్ స్పెషలైజేషన్ చేస్తే మరిన్ని అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. దేశ సమకాలీన పరిస్థితులను విశ్లేషిస్తే.. సర్వీస్ రంగం వాటా దినదిన ప్రవర్థమానం అవుతోంది. దాంతో హాస్పిటాలిటీ, రిటైల్, హోటల్ మేనేజ్మెంట్ వంటివి క్రేజీ స్పెషలైజేషన్లుగా నిలుస్తున్నాయి. -ప్రొఫెసర్॥ఎ.వెంకటరామన్, అసోసియేట్ ప్రొఫెసర్, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఢిల్లీ యూనివర్సిటీ ఎవర్గ్రీన్.. ఎమ్మెస్సీ ఎమ్మెస్సీ.. మాస్టర్ ఆఫ్ సైన్స్. ఎవర్గ్రీన్ కోర్సుగా పేర్కొనదగిన పీజీ ఇది. మానవ పరిణామ క్రమం మొదలు అంగారక గ్రహంపై అన్వేషణల వరకూ.. ఎన్నో పరిశోధనలు, ఆవిష్కరణలకు ఊతమిచ్చే కోర్సు. ఎమ్మెస్సీలో సంప్రదాయ సబ్జెక్టులుగా గుర్తింపు పొందిన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలకు దీటుగా ఇప్పుడు మరెన్నో వి నూత్న స్పెషలైజేషన్లు అందు బాటులోకి వచ్చాయి. ముఖ్యంగా లైఫ్ సెన్సైస్ విభాగంలో పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా.. కోర్ సబ్జెక్ట్‌ను, టెక్నాలజీతో అనుసంధానం చేస్తూ బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌సైన్స్ వంటి ఆధునిక కోర్సులు లభిస్తున్నాయి. వీటిని పూర్తి చేయడం ద్వారా రీసెర్చ్ సంస్థలు, ఫార్మాస్యూటికల్ సంస్థలు, వైద్య పరికరాల ఉత్పత్తి సంస్థల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ప్యూర్ సెన్సైస్తో ఫ్యూచర్ వెల్.. ఎమ్మెస్సీలో సైన్స్ విభాగాలతో అద్భుత భవిష్యత్తుకు మార్గం వేసుకోవచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో దేశంలో ఆర్ అండ్ డీకి ప్రాధాన్యం పెరుగుతోంది. కెమికల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్ విభాగాల్లో నైపుణ్యం సాధించడం ద్వారా ఐఐఎస్సీ, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, డీఆర్డీఓ, డీఆర్డీఎల్ తదితర ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ప్రైవేటు రంగంలోనూ ఫార్మాస్యుటికల్ సంస్థలు, డ్రగ్ఫార్ములేషన్ విభాగాల్లో చక్కటి కెరీర్స్ ఖాయం. అటు లైఫ్ సెన్సైస్ విభాగాల్లోనూ ఒకప్పుడు కోర్ స్పెషలైజేషన్‌లో ఒక కోర్స్‌గా బోధించే సబ్జెక్ట్‌లు ఇప్పుడు క్షేత్ర స్థాయి అవసరాలకు అనుగుణంగా పూర్తిస్థాయి స్పెషలైజేషన్స్‌గా అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి విద్యార్థులు తమ భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా.. మార్కెట్ అవసరాలను బేరీజు వేస్తూ మేజర్సను ఎంచుకోవాలి. - నళిన్ పంత్, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ,ఐఐటీ-ఢిల్లీ న్యాయ శాస్త్రంలో నవీన స్పెషలైజేషన్లు న్యాయ శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్(ఎల్ఎల్ఎం)లోనూ ఆధునిక స్పెషలైజేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. గతంలో పీజీ ‘లా’ స్పెషలైజేషన్స్ అంటే.. కాన్స్టిట్యూషనల్ లా, ఫ్యామిలీ లా వంటి స్పెషలైజేషన్స్ మాత్రమే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ఈ విభాగంలోనూ మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో.. నవీన స్పెషలైజేషన్స్ తెరపైకి వచ్చాయి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా, ఇంటర్నేషనల్ ట్రేడ్, కార్పొరేట్ లా వంటివి ఈ కోవకే చెందుతాయి. ఈ స్పెషలైజేషన్స్ పూర్తి చేయడం ద్వారా బహుళ జాతి సంస్థల్లో, పేటెంట్ ఆర్గనై జేషన్స్‌లో లీగల్ అడ్వైజర్స్‌గా, మేనేజర్స్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు. అంతేకాకుండా నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ (కేపీఓ)లలోనూ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. జర్నలిజంలో పీజీ.. దేశంలో మీడియా రంగం రోజురోజుకూ విస్తరిస్తోంది. దాంతో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ కోర్సులు పూర్తిచేసిన ప్రతిభావంతులకు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో అవకాశాలు పుష్కలం. ప్రింట్ మీడియాలో ట్రైనీ సబ్ ఎడిటర్/ రిపోర్టర్‌గా.. ఎలక్ట్రానిక్ మీడియాలో కాపీ రైటర్/రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించి.. అనుభవం, పనితీరు ఆధారంగా న్యూస్ ఎడిటర్, బ్యూరో చీఫ్, అసోసియేట్ ఎడిటర్, ఎడిటర్, చీఫ్ ఎడిటర్, మేనేజింగ్ ఎడిటర్ వంటి ఉన్నత స్థానాలు అధిరోహించొచ్చు. ప్రారంభంలోనే నెలకు రూ. 20 వేల జీతంతో కెరీర్ ప్రారంభించొచ్చు. కొత్త పుంతలు.. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అంటే వార్తల సేకరణ, సంపాదకీయం మాత్రమే కాదు. నేటి కార్పొరేట్ సంస్కృతిలో ఈ విభాగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి రిపోర్టింగ్, ఎడిటింగ్‌తోపాటు అడ్వర్టయిజింగ్, పబ్లిక్ రిలేషన్స్, మీడియా మేనేజ్మెంట్ వంటి అంశాల్లో కూడా నైపుణ్యం లభిస్తుంది. అంతేకాకుండా మీడియా రంగంలో అవసరమయ్యే సాఫ్ట్వేర్ టూల్స్‌పైనా అవగాహన లభించేలా కోర్సుల కరిక్యులం నిరంతరం మారుతోంది. ఫలితంగా ఇప్పుడు ఈ కోర్సు ద్వారా అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఔత్సాహిక అభ్యర్థులకు అకడెమిక్ నైపుణ్యాలతోపాటు సహనం, ఓర్పు, సమయం విషయంలో పరిమితులు లేకుండా పనిచేయగల తత్వం ఉండాలి. ఇవి ఉంటే సమున్నత భవిష్యత్తు సొంతమవుతుంది. - ప్రొఫెసర్. చందన్ ఛటర్జీ, డెరైక్టర్, సింబయాసిస్స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్