మన ఎంబీఏకు
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ).. వ్యాపార నిర్వహణ నైపుణ్యాలను అందించే కోర్సు! ఈ కోర్సు పూర్తిచేస్తే కార్పొరేట్ కొలువు అందినట్లే! ఎంబీఏ పట్టా ఉంటే మేనేజ్‌మెంట్ ట్రైనీ నుంచి మేనేజింగ్ డెరైక్టర్ స్థాయికి ఎదగొచ్చు. ఇంతటి ప్రాధాన్యమున్న కోర్సు ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగానే ఉందా? అభ్యర్థులకు పరిశ్రమ వర్గాలు కోరుకునే నైపుణ్యాలు లభిస్తున్నాయా? ఎంబీఏ కోర్సు పూర్తిచేసినా.. అరకొర జీతం అందడానికి కారణమేంటి?! మేనేజ్‌మెంట్ కోర్సుల ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్లు వెలువడుతున్న తరుణంలో ఎంబీఏ కోర్సు తీరుతెన్నులపై ఫోకస్..
బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థుల్లో అధిక శాతం మంది ఎంబీఏపైనే దృష్టిసారిస్తారు. జాతీయస్థాయిలో నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)తోపాటు ఐసెట్, మ్యాట్, సీమ్యాట్.. తదితర ప్రవేశ పరీక్షల గణాంకాలను చూస్తే వాటిని రాస్తున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంటోంది. ఎంబీఏ కోర్సు తమను బిజినెస్ లీడర్లుగా తీర్చిదిద్దుతుందని.. తద్వారా కళ్లు చెదిరే కార్పొరేట్ కెరీర్ సొంతమవుతుందనే భావనతో ఔత్సాహికులు ఎంబీఏ వైపు అడుగేస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉందనేది తాజా సర్వేల సారాంశం. ఎంబీఏ పూర్తిచేసిన చాలామంది రూ.10 వేల జీతానికి చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నారని, కేవలం 7 శాతం మంది ఎంబీఏ పట్టభద్రుల్లోనే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉన్నట్లు ఆసోచామ్ సర్వే వెల్లడించింది.
కరిక్యులం తీరుతెన్నులు
రెండేళ్ల వ్యవధిలో నాలుగు సెమిస్టర్ల విధానంలో ఉండే ఎంబీఏ కోర్సు ప్రధాన ఉద్దేశం.. విద్యార్థులకు భవిష్యత్తు కార్పొరేట్ కెరీర్‌కు అవసరమైన మల్టీటాస్కింగ్ స్కిల్స్‌ను అందించడం. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) విధానం ప్రకారం ఎంబీఏ పూర్తిచేసిన విద్యార్థికి వివిధ నైపుణ్యాలు అందేలా సిలబస్ ఉండాలి. క్రాస్ ఫంక్షనల్ మేనేజ్‌మెంట్ పర్‌స్పెక్టివ్, ఛేంజ్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, గ్లోబలైజేషన్ అవేర్‌నెస్, స్ట్రాటజిక్ ప్రాస్పెక్టివ్, ఎథిక్స్, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, డైవర్సిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ తదితర నైపుణ్యాలు పెంపొందించేలా సబ్జెక్టులను రూపొందించాలి. దీనికోసం కోర్సు స్వరూపం, బోధన పరంగా నిర్దిష్ట విధానాన్ని అమలు చేయాలి.
ఎంబీఏ విద్యార్థులందరికీ భవిష్యత్తులో వ్యాపార నిర్వహణ నైపుణ్యాలు అందించేందుకు అవసరమైన ఆర్గనైజేషనల్ బిహేవియర్, బిజినెస్ కమ్యూనికేషన్స్, అకౌంటింగ్ తదితర సబ్జెక్టుల బోధన ఉంటుంది. కెరీర్ పరంగా నిర్దిష్టంగా ఒక విభాగంలో రాణించాలనుకునే వారికి ఆయా విభాగంలో పూర్తిస్థాయి నైపుణ్యాలు అందించేందుకు స్పెషలైజేషన్ సబ్జెక్ట్ విధానం అమల్లో ఉంది. ఫైనాన్స్, హెచ్‌ఆర్, మార్కెటింగ్, ఆపరేషన్స్ రీసెర్చ్, ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని అభ్యర్థులు మూడో సెమిస్టర్ నుంచి (అంటే రెండో ఏడాదిలో) అభ్యసించాల్సి ఉంటుంది. నచ్చిన స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకున్న విద్యార్థులు క్షేత్ర నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రాజెక్ట్ వర్క్ పూర్తిచేయాలి.
నిరంతరం మారాలి
ఎంబీఏ కోర్సు లక్ష్యం బాగానే ఉన్నా.. కోర్సు స్వరూపంలో మార్కెట్ అవసరాలకు తగ్గట్లు నిరంతరం మార్పులు జరగడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సిలబస్, బోధన విధానం, స్కిల్స్ అందించే విషయంలో ప్రమాణాలు పెరగాలని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ పరిస్థితుల నేపథ్యంలో వేగంగా మారుతున్న మార్కెట్ పరిస్థితులు, కంపెనీల అవసరాలు, వ్యాపార నిర్వహణ తీరుతెన్నులపై ఎంబీఏ విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఆ మేరకు నైపుణ్యాలు అందించేలా ఎంబీఏ కోర్సు సిలబస్‌లో క్రమం తప్పకుండా మార్పులు చేర్పులు చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది. కానీ ప్రస్తుతం నాలుగేళ్లకోసారి మాత్రమే కరిక్యులంలో మార్పులు చేసే పరిస్థితి ఉంది.
సిలబస్ మార్పులో జాప్యం
సిలబస్‌లో మార్పులు చేయాలి.. కరిక్యులం మారాలి.. అనే అభిప్రాయాలు ఎంతగా వినిపిస్తున్నా.. యూనివర్సిటీల స్థాయిలో వాటికి సంబంధించి జాప్యం జరుగుతోంది. సిలబస్‌లో మార్పులు చేయాలంటే ముందుగా సంబంధిత ఫ్యాకల్టీ ఆ మార్పులను ప్రతిపాదిస్తూ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ముందుంచాలి. బీవోఎస్ నిపుణులు కూడా ఆయా మార్పులు అవసరమని భావిస్తేనే కొత్త సిలబస్ రూపొందుతుంది. ఈ ప్రక్రియ పూర్తికావడానికి చాలా సమయం పడుతోంది. దాంతో సిలబస్‌లో మార్పుల పరంగా జాప్యం జరుగుతోంది. ఇది విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. అదే ఐఐఎంలు, ఇతర అటానమస్ (స్వయం ప్రతిపత్తి) ఇన్‌స్టిట్యూట్స్‌లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. వీటిలో కనీసం రెండేళ్లకోసారైనా సిలబస్ మారుతోంది. ఐఐఎంలు సిలబస్ రూపకల్పనలో పరిశ్రమ వర్గాలకు భాగస్వామ్యం కల్పిస్తున్నాయి. ప్రాక్టికాలిటీకి పెద్దపీట వేస్తూ ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్న్‌షిప్‌లను తప్పనిసరి చే స్తున్నాయి.
ప్రాక్టికాలిటీకి ఆమడదూరం
యూనివర్సిటీల్లో ఎంబీఏ చదువుతున్న విద్యార్థులకు క్షేత్ర నైపుణ్యాలు అందడం లేదు. ప్రొఫెసర్లు స్వీయ ఆసక్తితో విద్యార్థులను ప్రోత్సహించి ఇంటర్న్‌షిప్, ఫీల్డ్ అసైన్‌మెంట్స్ అవకాశాలు కల్పిస్తే తప్ప.. ఒక కచ్చితమైన విధానంగా ప్రాక్టికాలిటీ అమలు కావడంలేదు. అలాగే మన దేశంలో మేనేజ్‌మెంట్ విద్య పరంగా ఎదురవుతున్న మరో ప్రధాన సమస్య ఫ్యాకల్టీ కొరత. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ - స్టూడెంట్ నిష్పత్తి 1:15గా ఉండాలి. ఫ్యాకల్టీ సభ్యుల్లో ప్రతి విభాగంలో ఇద్దరు పీహెచ్‌డీ పూర్తిచేసినవారు ఉండాలి. కళాశాలలు పీహెచ్‌డీ ఫ్యాకల్టీని నియమించుకుంటే భారీగా వేతనాలు ఇవ్వాల్సి వస్తుందని వెనుకంజ వేస్తున్నాయి.
ఉద్యోగ నైపుణ్యాలపై ప్రభావం
సిలబస్‌లో మార్పులు లేకపోవడం, ఫ్యాకల్టీ కొరత, క్షేత్రస్థాయి నైపుణ్యాలు అందకపోవడంతో ఎంబీఏల్లో ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ మెరుగవడం లేదు. ఓ వైపు జాబ్ మార్కెట్‌లో డిమాండ్ ఉంటున్నా.. నైపుణ్యాలు లేక అర్హతలకు తగిన ఉద్యోగాలు లభించడం లేదు. దాంతో అరకొర జీతాలతో ఏదో ఒక కొలువులో సర్దుకుపోతున్నారు. దీనికి ప్రధాన కారణం సిలబస్‌ను, కరిక్యులంను మార్చకపోవడమే! కాబట్టి మేనేజ్‌మెంట్ కోర్సుల్లో సిలబస్‌లో నిరంతరం మార్పులు తేవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎంబీఏ సిలబస్‌లో మార్పులు చేయడం చాలా అవసరం. ఈ విషయంలో యూనివర్సిటీల స్థాయిలో ఇటీవల కాలంలో కొంత వేగవంతమైన చర్యలు జరుగుతున్నాయి. విద్యార్థులు కూడా సెల్ఫ్ లెర్నింగ్ టూల్స్‌పై దృష్టిసారించాలి. జాబ్ మార్కెట్ అవసరాలు, అందుకు పొందాల్సిన నైపుణ్యాలపై అవగాహన పెంపొందించుకోవాలి. దీనికి ప్రొఫెసర్ల సలహాలు తీసుకోవాలి.
- ప్రొఫెసర్ కె.రామమోహన్ రావు, ఏయూ కాలేజ్ ఆఫ్ కామర్స్.