సివిల్ సాధ్యమే | Union Public Service Commission | Sakshi
Sakshi News home page

సివిల్ సాధ్యమే

Published Thu, Jun 26 2014 2:56 AM | Last Updated on Tue, Aug 28 2018 8:09 PM

సివిల్ సాధ్యమే - Sakshi

సివిల్ సాధ్యమే

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(యూపీఎస్సీ).. సివిల్ సర్వీసెస్ ప్రకటన విడుదలైంది. మీరూ ఐఏఎస్, ఐపీఎస్ కావొచ్చు. నిండైన ఆత్మవిశ్వాసం, సాధించగలమనే తపన, ఓటమికి బెదరని వ్యక్తిత్వం, పరిపూర్ణ విషయ పరిజ్ఞానం ఉంటే లక్ష్య సాధన పెద్ద సమస్యే కాదంటున్నారు సివిల్స్‌లో విజయం సాధించిన పలువురు. మరి ఎందుకాలస్యం.. దరఖాస్తు నింపేయండి.. పరీక్షకు సిద్ధం కండి.. కొలువు కొట్టేయండి..
 
యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహణ
జాతీయస్థాయిలో హోదాపరంగా ఉన్నతమైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి  20కిపైగా సర్వీసుల్లో నియామకానికి ఏటా సివిల్ సర్వీసెస్ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహిస్తోంది. ఈ ఏడాది ప్రకటన మే 31న వెలువడింది.     దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 30. ఆగస్టు 24న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తారు.

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా ఎస్‌బీఐ శాఖలో రూ.100 ఫీజు చెల్లించాలి     లేదా ఎస్‌బీh/ఎస్‌బీఐ గ్రూప్ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్)ల్లో నెట్ బ్యాంకింగ్ /డెబిట్ కార్డ్ ద్వారా కూడా ఫీజు చెల్లించొచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, శారీరక వికలాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు. ఈ ఏడాది మొత్తం     పోస్టుల సంఖ్య 1291.
 
అర్హతలివీ..
ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసినవారు సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసేందుకు అర్హులు.         డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులూ అర్హులే. వీరు మెయిన్స్ నాటికి తమ ఉత్తీర్ణతా సర్టిఫికెట్లు చూపాలి. వివిధ యూనివర్సిటీలు దూరవిద్యా విధానం ద్వారా అందించే బ్యాచిలర్స్         డిగ్రీ కోర్సులు ఉత్తీర్ణులైనవారు సివిల్స్ రాసేందుకు అర్హులే.

అయితే ఆ కోర్సుకు సంబంధిత అధీకృత సంస్థల (యూజీసీ/డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో/ఏఐసీటీఈ తదితర) గుర్తింపు ఉండాలి. వయోపరిమితి నిబంధన కూడా ఉంది. ఆగస్టు 1, 2014 నాటికి         అన్ని వర్గాల అభ్యర్థులకు కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 32 ఏళ్లు.. ఓబీసీలకు 35 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 37 ఏళ్లు. అంధులు, బధిరులు, శారీరక వికలాంగులకు గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు.
 
ఎన్నిసార్లు రాయొచ్చు..
గతేడాది వరకు సివిల్స్ పరీక్షలను జనరల్ కేటగిరీ     అభ్యర్థులు గరిష్టంగా నాలుగుసార్లు మాత్రమే రాసుకునే వీలుండేది. ఈ ఏడాది నుంచి దాన్ని ఆరుసార్లకు పెంచారు. ఓబీసీలకు ఇప్పటివరకు     ఏడుసార్లు సివిల్స్ రాసుకునే అవకాశం ఉండేది. ఈ ఏడాది నుంచి తొమ్మిదిసార్లు రాసుకునే వీలు కల్పించారు. ఎస్సీ, ఎస్టీలు, పీహెచ్ (అంధ, బధిర, వికలాంగులు) గరిష్ట వయోపరిమితికి లోబడి ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. జనరల్ కేటగిరీకి చెందిన పీహెచ్ అభ్యర్థులు తొమ్మిదిసార్లు మాత్రమే రాసుకునే వీలుంది.
 
దరఖాస్తు చేయండిలా..
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా ఠీఠీఠీ.ఠఞటఛిౌజ్ఛీ.జీఛి.జీ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అందులో ‘ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ వేరియస్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ యూపీఎస్సీ’ అనే లింక్  కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్, చివరి తేదీ, పార్ట్-1, పార్ట్-2 రిజిస్ట్రేషన్స్ కనిపిస్తాయి. ముందుగా పార్ ్ట-1 రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. ఇందులో పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు, తల్లి పేరు, జాతీయత, వివాహ స్థితి, విద్యార్హతలు, చిరునామా వంటివి ఉంటాయి.

వీటిని జాగ్రత్తగా పూర్తి చేయాలి. మీ పేరు, పుట్టిన తేదీ పదోతరగతి సర్టిఫికెట్‌లో ఎలా ఉందో అలానే రాయాలి. తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తే మరిన్ని వివరాలు వస్తాయి. వీటిని కూడా పూర్తి చేస్తే పార్ట్-1 రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీ వివరాలు అన్నీ సరిచూసుకున్నాక ‘యూ అగ్రి’ బటన్ క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఐడీ వస్తుంది. ఈ ఐడీ, పుట్టిన తేదీతో పార్ట్-2 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందులో ముందుగా నిర్దేశించిన సైజ్‌లో మీ ఫొటో, సంతకం స్కాన్ చేసి ఉంచుకోవాలి. ఫొటో, సంతకం అప్‌లోడ్ చేశాక మిగిలిన వివరాలు నింపాలి.
 
సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా భర్తీ చేసే పోస్టులివీ..

 1.    ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
 2.    ఇండియన్ ఫారెన్ సర్వీస్
 3.    ఇండియన్ పోలీస్ సర్వీస్
 4.    ఇండియన్ పీ అండ్ టీ అకౌంట్స్ అండ్
     ఫైనాన్స్ సర్వీస్- గ్రూప్-ఏ
 5.    ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ - గ్రూప్-ఏ
 6.    ఇండియన్ రెవెన్యూ సర్వీస్
     (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్)- గ్రూప్-ఏ
 7.    ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, గ్రూప్-ఏ
 8.    ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐటీ), గ్రూప్-ఏ
 9.    ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీసెస్, గ్రూప్-ఏ
     (అసిస్టెంట్ వర్క్స్ మేనేజర్, అడ్మినిస్ట్రేషన్)
 10.    ఇండియన్ పోస్టల్ సర్వీస్, గ్రూప్-ఏ
 1 1.    ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్, గ్రూప్-ఏ
 12.    ఇండియన్ ైరె ల్వే ట్రాఫిక్ సర్వీస్, గ్రూప్-ఏ
 13.    ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్, గ్రూప్-ఏ
 14.    ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ - గ్రూప్-ఏ
 15.    పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్
     ఇన్ రైల్వే ప్రొటెక్షన్ సర్వీస్ - గ్రూప్-ఏ
 16.    ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్, గ్రూప్-ఏ
 17.    ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్
     (జూనియర్ గ్రేడ్), గ్రూప్-ఏ
 18.    ఇండియన్ ట్రేడ్ సర్వీస్, గ్రూప్-ఏ, (గ్రేడ్-3)
 19.    ఇండియన్ కా్ఘూరేట్ లా సర్వీస్, గ్రూప్-ఏ,
 20.    ఆర్మ్‌డ్‌ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ సివిల్ సర్వీస్,
      (సెక్షన్ ఆఫీసర్స్ గ్రేడ్)
 21.    ఢిల్లీ, అండమాన్-నికోబార్ ఐస్‌లాండ్స్,
     లక్షద్వీప్, డామన్-డయ్యూ, దాద్రానగర్
     హవేలి సివిల్ సర్వీస్-గ్రూప్-బి
 22.    ఢిల్లీ, అండమాన్-నికోబార్,
     లక్షద్వీప్, డామన్-డయ్యూ,
     దాద్రానగర్ హవేలి పోలీస్ సర్వీస్-గ్రూప్-బి
 23.    పాండిచ్చేరి సివిల్ సర్వీస్ - గ్రూప్-బి
 
పరీక్షలు ఇలా...
 సివిల్స్ ఎంపిక మూడు దశలుగా ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ. సివిల్స్‌కు     దరఖాస్తు చేసుకున్నవారికి ముందుగా ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. ఇది ఇంగ్లిష్ లేదా హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులుంటాయి. పేపర్-1లో 100 ప్రశ్నలు, పేపర్-2లో 85 ప్రశ్నలు ఉంటాయి.

ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కుల కోత విధిస్తారు. ఒక్కో పేపర్ పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు (120 నిమిషాలు). ప్రిలిమ్స్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో ఉత్తీర్ణులైనవారిని అందుబాటులో ఉన్న పోస్టులు, రిజర్వేషన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రతిభ ఆధారంగా మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.
 
మెయిన్స్ పరీక్ష ఇలా..
మెయిన్‌‌సలో ఆప్షనల్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కులుంటాయి. ఒక్కో పరీక్ష వ్యవధి మూడు గంటలు. అభ్యర్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు. ఆప్షనల్‌లో అత్యధిక మార్కులు సాధించాలంటే అన్ని అంశాలపై పట్టుండాలి. దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నలో అనేక ఉప ప్రశ్నలు ఉంటున్నాయి.

ప్రశ్నలు కూడా పరోక్షంగా ఉంటున్నాయి. థియరీ కంటే కూడా అప్లికేషన్ ఓరియెంటేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. సమకాలీన అంశాలు, సమస్యలపై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. సివిల్స్ సాధనలో కోచింగ్ పాత్ర కీలకం.మన రాష్ట్రంలో హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. పలువురు అభ్యర్థులు ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లలో సైతం శిక్షణ తీసుకుంటున్నారు. మన రాష్ట్రంలో ప్రధాన కోచింగ్ సెంటర్లలో లక్ష రూపాయల వరకు ఫీజు ఉంటుంది.

ఢిల్లీ లాంటి నగరాల్లో లక్షన్నర రూపాయల వరకు ఉంటుంది. కోచింగ్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్‌లకు శిక్షణనిస్తారు. కోచింగ్ వ్యవధి దాదాపు పది నెలలు. హాస్టల్ వసతి, భోజన ఖర్చుల కింద నెలకు మరో రూ.5000 వ రకు అవుతాయి. పుస్తకాలు, ఇతర ఖర్చులు అదనం. సివిల్స్‌లో ఇంటర్వ్యూ కీలకమైన ఘట్టం. ఇందులో నిజాయతీగా ఉండాలి. తెలియని విషయాలను తెలియదని చెప్పాలి. ఎక్కువ శాతం ప్రశ్నలు వర్తమాన వ్యవహారాలపై అడుగుతారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
 
మెయిన్స్ : అందుబాటులో ఉన్న పోస్టుల్లో.. ఒక్కో పోస్టుకు 12 లేదా 13 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో అన్ని పేపర్ల (ఇంగ్లిష్ మినహాయించి)ను తెలుగు మాధ్యమంలో కూడా రాసుకోవచ్చు. ప్రశ్నపత్రం మాత్రం ఇంగ్లిష్/హిందీల్లో ఉంటుంది. ప్రశ్నలన్నీ కన్వెన్షనల్ (వ్యాస రూప) విధానంలో ఉంటాయి. ఇందులో 300 మార్కులకు పేపర్-ఏ ఉంటుంది. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. మన రాష్ట్ర విద్యార్థులు తెలుగును ఎంచుకుని రాయొచ్చు.

ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. సంబంధిత మాతృభాషల్లో అభ్యర్థి సామర్థ్యాన్ని తెలుసుకునే ఉద్దేశంతో ఈ పరీక్షను నిర్వహిస్తారు. పేపర్-బి : ఇంగ్లిష్ (300 మార్కులు). ఇంగ్లిష్‌లో అభ్యర్థికి సాధారణ పరిజ్ఞానం ఉందో, లేదో పరిశీలించడం ఈ పరీక్ష ప్రధాన ఉద్దేశం. పేపర్-ఏ, పేపర్-బి రెండు పదో తరగతి/మెట్రిక్యులేషన్ స్థాయిలో ఉంటాయి. వీటి మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. అయితే అభ్యర్థులు పేపర్-ఏలో 30 శాతం, పేపర్-బిలో 25 శాతం మార్కులు సాధించాలి.
 
మౌఖిక పరీక్ష: మెయిన్స్‌లో ఉత్తీర్ణులైనవారిని అందుబాటులో ఉన్న పోస్టులు, రిజర్వేషన్స్‌ను దృష్టిలో ఉంచుకుని పోస్టుకు ఇద్దరు చొప్పున మౌఖిక పరీక్షకు ఎంపిక చేస్తారు. దీనికి 275 మార్కులుంటాయి. అంటే మెయిన్స్, ఇంటర్వ్యూల మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
 
ఎంపిక అవుతామనే నమ్మకం ఉండాలి..

డాక్టర్ గజరావు భూపాల్, జిల్లా ఎస్పీ

ఐపీఎస్‌కు ప్రిపేర్ అయ్యేవారు ఒక ప్రణాళిక రూపొందించుకొని చదవాలని సూచిస్తున్నారు జిల్లా ఎస్పీ గజరావు భూపాల్. సివిల్స్‌కు ప్రిపేర్‌పై ఆయన ఏమంటున్నారంటే.. నేను వారం రోజుల ప్రణాళికను ముందే తయారు చేసుకుని చదివాను. ఇతరులకు ఏదో సబ్జెక్టులో ఎక్కువ మార్కులువచ్చాయని ఆ సబ్జెక్టును చదవకుండా.. మనము దేనినైతే ఎక్కువగా ఇష్టాపడుతామో అదే సబ్జెక్టు చదవాలి. ముఖ్యంగా ఐపీఎస్‌కు ఎంపిక అవుతాననే నమ్మకం అందరిలోనూ ఉండాలి. చదివే సమయంలో అలసటగా ఉన్నప్పుడు కొంత విశ్రాంతి తీసుకోవాలి. ఆ సమయంలో మంచి వాతావరణంలో గడుపుతూ స్నేహితులతో ఉండేలా ప్రయత్నించాలి.

నేను ఏ వృత్తిలో ఉన్నా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా చదువుకున్నాను. మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. అమ్మానాన్నలు అనురాధ, సీతారామస్వామి ఇద్దరూ వైద్యులే. డిగ్రీ వరకు కాకినాడలోనే చదువుకున్నాను. మెడికల్ విద్య అభ్యసించాను. 2006లో ఐపీఎస్ కోసం ఢిల్లీలోని వాజిరాం ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాను. శిక్షణ సమయంలో ఒకసారి ఐపీఎస్ రాసినా ఎంపిక కాలేదు. శిక్షణ ముగిసిన అనంతరం 2007లో కాకినాడలోని శంకవరం పీహెచ్‌సీలో అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా పనిచేశాను.

అక్కడ విధులు నిర్వర్తిస్తూనే మళ్లీ ఐపీఎస్‌కు సిద్ధమయ్యాను. 2008లో ఎంపికయ్యాను. వైద్యుడిగా కాకుండా ఏ వృత్తిలోనైనా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా భావించాను. శిక్షణ అనంతరం 2010-13 వరకు భద్రచలం ఏఎస్పీగా, 2013-అక్టోబర్ వరకు మెదక్ అడిషనల్ ఎస్పీగా, ఆ తర్వాత ఆదిలాబాద్ ఎస్పీగా పదోన్నతిపై వచ్చాను. మొదటి నుంచీ నేను ఐపీఎస్ కావాలనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సంతోష పడ్డాను. వైద్యునిగా రోగులకు, ఎస్పీగా ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.
 - ఆదిలాబాద్ క్రైం
 
వారి ప్రోత్సాహం మరువలేనిది..

జోయేల్ డేవిస్, ఆదిలాబాద్ ఏఎస్పీ

ఎలాగైనా ఐపీఎస్‌కు ఎంపికవుతాననే లక్ష్యంతో చదవాలి. అప్పుడే మన ఆశయం నెరవేరుతుంది. నేను ఐపీఎస్ అయ్యేందుకు ఎంతో కష్టపడ్డాను. మాది తమిళనాడు రాష్ట్రం, జిల్లా కన్యాకుమారి గ్రామం కొట్టికోడు. వ్యవసాయ కుంటుంబం. మా అమ్మానాన్నలు డేవిడ్‌సన్, రీబీలు నా చదువు కోసం చాలా కష్టపడ్డారు. అప్పులు చేసి మరీ నన్ను ఐపీఎస్ చదివించారు. డిగ్రీ వరకు మా ఊళ్లోనే చదువుకున్నాను. డిగ్రీ చదివే సమయంలో ఉదయం, మధ్యాహ్నం మాకున్న అరటితోటలో నావంతుగా పనిచేసేవాన్ని. డిగ్రీ తర్వాత 8 నెలలు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాను. అసలు నేను ఐపీఎస్ చదువుతానని అనుకోలేదు.

అప్పటి వరకు మా గ్రామానికే పరిమితమైన నన్ను మా బావ డిస్పన్‌రాయ్ (ప్రధానోపాధ్యాయుడు) ఐపీఎస్ చదివేంచేందుకు సహాయపడ్డారు. ఆ తర్వాత చెన్నైలో మా అక్కాబావ ఇంట్లో ఉండి ఐపీఎస్‌కు ప్రిపేర్ అయ్యాను. చెన్నైలోని అకాడమిక్ ప్రభా ఇనిస్టిట్యూట్‌లో రెండేళ్లు శిక్షణ తీసుకున్నాను. 8 గంటలు నిర్విరామంగా చదివేవాన్ని. ఇంట్లో ఎలాంటి సమస్యలు వచ్చినా నా చదువుకు ఆటంకం రావొద్దని మా కుటుంబ సభ్యులు ఆ విషయం నాకు తెలియనీయకుండా దాచేవారు. అప్పు చేస్తూ చదివిస్తున్నారనే విషయం కూడా నాకు తెలీదు. ఎలాంటి ఆలోచనలు లేకుండా ఐపీఎస్ అవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగాను.

2010లో ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. ఐపీఎస్‌కు ఎంపిక కావడంపై మా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందించారు. వారి కష్టాన్ని వృథాగా పోనివ్వలేదనే సంతోషం కూడా నాలో కలిగింది. ఒక అర్థవంతమైన జీవితం లభించిందనుకున్నాను. నన్ను ప్రోత్సహించిన మా నాన్న, బావ, మా కోచింగ్ సెంటర్ డెరైక్టర్ ప్రభాకర్‌లో ప్రోత్సాహం చాలా వరకు ఉంది. మొదటగా వరంగల్‌లోని జనగంలో ఏఎస్పీగా, ఆ తర్వాత ఉట్నూర్, ఆదిలాబాద్ ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నాను.
 - ఆదిలాబాద్ క్రైం
 
 సివిల్ సర్వీసెస్ స్పెషల్ వెబ్ పోర్టల్ కోసం..  www.sakshieducation.com లాగిన్ అవ్వండి..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement