
ప్రకృతి ప్రకోపానికి సర్వం కోల్పోయింది ఆ కుటుంబం. ఉండేందుకు నీడ కూడా లేకుండా రోడ్డున పడిపోయాయి జీవితాలు. ఒక్క రోజులో కథే మారిపోయింది. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితి. అలాంటి గడ్డు పరిస్థితిలో చదువుపై ధ్యాస పెట్టి ఉన్నతాధికారి కావాలనే ఆలోచన వైపుకే వెళ్లనంతగా జీవితం కటికి చీకటిమయంగా ఉంటుంది. అయితే అంతటి కటిక దారిద్య్రంలో బతికీడుస్తూ కూడా అన్నింటిని ఓర్చుకుని కన్నెరజేసిన ప్రకృతికే సవాలు విసిరారు. కష్టతర సాధ్యమైన హోదాలని అందుకున్నారు ఈ అక్కా చెల్లెళ్లు. ఎవ్వరూ ఊహించని విధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారిణులై మనిషి సంకల్పానికి ఎలాంటి కష్టమైనా.. తోక ముడిచి తీరాల్సిందేనని చూపించారు. ఇంతకీ ఎవరా అక్కాచెల్లెళ్లు అంటే..
తమిళనాడులోని కడలూరు జిల్లాకి చెందిన రైతు కుమార్తెలు ఆ అక్కాచెల్లెళ్లు. వారి పేర్లు సుష్మిత రామనాథన్, ఐశ్వర్య రామనాథన్. ఆర్థికంగా వెనుకబడిన వ్యవసాయం కుటుంబం వారిది. కటిక పేదరికంలో పెరిగారు. కనీస వనురుల లేక అల్లాడిపోయారు.
అలాంటి కుటుంబం ప్రకృతి ప్రకోపానికి పూర్తిగా అల్లకల్లోలమైపోయింది. సరిగ్గా 2004 హిందూ మహాసముద్రం సునామీలో ఇల్లుతో సహా సర్వం కోల్పోయారు. అప్పటికీ అంతంత మాత్రంగా ఉన్నజీవితాలు పూర్తిగా రోడ్డున పడిపోయాయి. అయితే అక్కాచెల్లెళ్లు అంతటి భరించలేని పరిస్థితుల్లో కూడా చదువుని వదలలేదు.
అదే తమ జీవితాలను మార్చే ఆయుధమని పూర్తిగా నమ్మారు. దానికే కట్టుబడి ఇరవురు యూపీఎస్సీకి సన్నద్ధమై అనుకున్నది సాధించారు. మరీ అక్కాచెల్లెళ్ల విజయ ప్రస్థానం ఎలా సాగిందంటే..
ఐఏఎస్ ఐశ్వర్య రామనాథన్
2018లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో 628వ ర్యాంకు సాధించి రైల్వే అకౌంట్స్ సర్వీస్ (RAS)కి ఎంపికయ్యింది. కానీ ఆ పోస్టుతో సంతృప్తి చెందని ఐశ్వర్య మరోసారి 2019లో యూపీఎస్సీకి సన్నద్ధమైంది.
అప్పుడు మెరుగైన ర్యాంకు సాధించి 22 ఏళ్లకే తమిళనాడు కేడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారిణి అయ్యింది. ప్రస్తుతం ఆమె తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో అదనపు కలెక్టర్‌గా నియమితురాలైంది.
ఐపీఎస్ సుష్మితా రామనాథన్
చెల్లెలు ఐశ్వర్యలా సునాయాసంగా యూపీఎస్సీలో విజయం అందుకోలేకపోయింది. ఏకంగా ఐదు సార్లు విఫలమైంది. చెల్లలు కంటే ఎక్కువ కష్టపడి సివల్స్‌లో సక్సెస్ అయ్యింది.
ఆమె 2022లో ఆరవ ప్రయత్నంలో సివిల్స్ పరీక్షలో 528వ ర్యాంకు సాధించి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కి చెందిన ఐపీఎస్ అధికారిణి అయ్యింది. ఆమె ప్రస్తుతం దక్షిణ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ASP)గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది.
(చదవండి: ప్రపంచం అంతమయ్యేది అప్పుడే..! వెలుగులోకి న్యూటన్ లేఖ..)
Comments
Please login to add a commentAdd a comment