ఈ ‘పీజీ’లతో.. జాబ్ ‘ఈజీ’ | The 'PG' .. job with the 'easy' | Sakshi
Sakshi News home page

ఈ ‘పీజీ’లతో.. జాబ్ ‘ఈజీ’

Published Sun, Mar 23 2014 10:47 PM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM

The 'PG' .. job with the 'easy'

పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ).. బ్యాచిలర్ డిగ్రీ(బీఎస్సీ/బీకామ్/బీఏ) తర్వాత ఉన్నత విద్యకు మార్గం. పీజీ కోర్సుల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీలను సంప్రదాయ కోర్సులుగా పరిగణిస్తుండగా.. ఎంబీఏ, ఎంసీఏ ప్రొఫెషనల్ కోర్సులుగా గుర్తింపు పొందుతున్నాయి. ఇటీవల కాలంలో సంప్రదాయ కోర్సుల్లోనూ పరిశ్రమ అవసరాలకు, జాబ్ మార్కెట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా సరికొత్త స్పెషలైజేషన్లు ఆవిష్కృతమవుతున్నాయి. మరోవైపు ప్రొఫెషనల్ కోర్సులు సైతం క్రేజీ కాంబినేషన్ల కలయికతో వినూత్న అవకాశాలకు మార్గం వేస్తున్నాయి. ‘పీజీలో ఏ కోర్సులో ప్రవేశించినా.. ఎంచుకున్న స్పెషలైజేషన్‌తోనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని.. అందుకే ఈ విషయంలో ముందుగానే ఒక అంచనాకు రావాలని సూచిస్తున్నారు’ నిపుణులు. త్వరలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు పూర్తిచేసుకొని వచ్చే విద్యా సంవత్సరంలో ఉన్నత విద్య దిశగా అడుగులు వేయాలనుకుంటున్న విద్యార్థుల ముందున్న జాబ్ ఓరియెంటెడ్ పీజీ కోర్సులపై ప్రత్యేక ఫోకస్ ఈ వారం చుక్కాని..
 
 మాస్టర్ ఆఫ్ కామర్స్.. కలర్ ఫుల్ కెరీర్స్
 
 ఎంకాం అంటే.. కామర్స్ మాత్రమే అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ఆఫ్ కామర్స్‌లో.. కార్పొరేట్ సెక్రటరీషిప్, మార్కెటింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఫైనాన్స్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని పూర్తి చేయడం ద్వారా బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ, ఇతర కార్పొరేట్ సంస్థల్లో ఫైనాన్స్ మేనేజర్లుగా, ఇంటర్నల్ ఆడిటర్స్‌గా కొలువులు సొంతం చేసుకోవచ్చు. కార్పొరేట్ సెక్రటరీషిప్ పూర్తి చేసిన అభ్యర్థులు.. సదరు కంపెనీ సెక్రటరీకి సహాయకులుగా వైట్ కాలర్ జాబ్స్‌అందుకోవచ్చు. కార్పొరేట్ సెక్రటరీషిప్ పూర్తి చేసిన వారికి కంపెనీ సెక్రటరీ కోర్సులో కొన్ని పేపర్ల నుంచి మినహాయింపు కూడా లభిస్తుంది. ఫలితంగా వీరు భవిష్యత్తులో సులువుగా కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తి చేసుకుని కెరీర్‌ను మరింత ఉన్నతంగా మలచుకునేందుకు అవకాశం లభిస్తుంది.
 
 ఎంఏ.. ఎన్నో స్పెషలైజేషన్స్
 
 మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్(ఎంఏ) అనగానే.. హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్.. సాధారణంగా మనందరికీ గుర్తొచ్చే కోర్సులు. కానీ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంఏలోనూ ఎన్నో వినూత్న స్పెషలైజేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ వర్క్, డెవలప్‌మెంట్ స్టడీస్, సైకాలజీ, పబ్లిక్ పాలసీ మేనేజ్‌మెంట్, సోషియాలజీ వంటివి. ఇందుకు ప్రధాన కారణం.. అటు ప్రభుత్వ రంగంతోపాటు, ఇటు ప్రైవేట్ రంగంలోనూ సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం పెరగడం.. వాటిని క్షేత్ర స్థాయిలో సమర్థంగా అమలు చేసేందుకు నిపుణుల అవసరం ఏర్పడటమే! సోషల్ వర్క్, సోషియాలజీ వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి స్వచ్ఛంద సంస్థలు, బహుళ జాతి సంస్థల సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) విభాగాల్లో కొలువులు ఖాయం. ఇవే కాకుండా.. మానవ వనరుల డిమాండ్ ఎక్కువగా ఉన్న రిటైల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, టూరిజం మేనేజ్‌మెంట్ వంటి కోర్సులను కూడా కొన్ని యూనివర్సిటీలు పూర్తి స్థాయి కోర్సులుగా అందిస్తున్నాయి.
 
 సోషల్ సెన్సైస్‌తో సమున్నత స్థానాలు..

 ఆత్మసంతృప్తి, సంపాదనకు అవకాశం కల్పించే కోర్సులు.. సోషల్ సెన్సైస్.  సామాజిక అభివృద్ధికి దోహదం చేసే పలు అంశాలపై నైపుణ్యాలు అందించే కోర్సులివి. ఈ విభాగంలో పీజీ స్థాయిలో సోషల్ వర్క్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తదితర కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని పూర్తి చేయడం వల్ల ప్రభుత్వ పథకాల అమలు విభాగాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల్లోని సీఎస్‌ఆర్ విభాగాల్లోనూ వేల రూపాయల వేతనంతో కెరీర్ ప్రారంభించొచ్చు. ఈ కోర్సు ఔత్సాహికులకు ప్రధానంగా సేవా దృక్పథం, క్షేత్ర స్థాయిలో భిన్న సంస్కృతుల ప్రజలతో మమేకం కాగల సహజ లక్షణాలు అవసరం. అప్పుడే ఈ విభాగంలో కెరీర్ పరంగా రాణించగలరు.
 - ప్రొఫెసర్‌॥లక్ష్మీ లింగం, డిప్యూటీ డెరైక్టర్,  టిస్-హైదరాబాద్ క్యాంపస్
 
 ఇంగ్లిష్.. ఫారిన్ లాంగ్వేజెస్
 
 పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఎంఏ ఇంగ్లిష్ కోర్సుకు బోధనా రంగంతోపాటు కార్పొరేట్ కంపెనీల్లోనూ భారీ డిమాండ్ నెలకొంది. కార్పొరేట్ సంస్థలు తమ సిబ్బందిలో కమ్యూనికేషన్, లాంగ్వేజ్ స్కిల్స్ పెంపొందించే దిశగా ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తూ పూర్తి స్థాయి శిక్షకులను నియమిస్తున్నాయి. కాబట్టి ఎంఏ ఇంగ్లిష్  కోర్సు పూర్తి చేసినవారు ఎంఎన్‌సీల్లో మెరుగైన అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.  ప్రారంభంలోనే రూ.30వేల జీతం అందుకోవచ్చు. అదేవిధంగా విదేశీ భాషల్లో ముఖ్యంగా జర్మన్, ఫ్రెంచ్, జపనీస్‌ల్లో పీజీ పూర్తిచేసిన వారికి విసృ్తత ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రపంచీకరణ, సరళీకరణల నేపథ్యంలో.. అనేక విదేశీ సంస్థలు మన దేశాన్ని ఔట్ సోర్సింగ్‌కు వేదికగా చేసుకొని ఇక్కడే తమ సెంటర్లను నెలకొల్పుతున్నాయి. దాంతో ఇటీవల కాలంలో ఫారిన్ లాంగ్వేజ్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఫార్మాస్యుటికల్ సంస్థలు, మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ సంస్థల్లో అవకాశాలు లభిస్తున్నాయి.
 
 అవకాశాలకు వేదిక విదేశీ భాషలు..
 ప్రపంచీకరణ యుగంలో విశ్వవ్యాప్తంగా ఉద్యోగావకాశాలకు మార్గం.. విదేశీ భాషల్లో నైపుణ్యం.  సమీప భవిష్యత్తులో వేల సంఖ్యలో విదేశీ భాషలు నేర్చుకున్న వారి అవసరం ఏర్పడనుంది. ఔత్సాహిక విద్యార్థులు షార్ట్‌టర్మ్ కోర్సులకు పరిమితం కాకుండా.. పూర్తి స్థాయి పీజీ కోర్సులు అభ్యసిస్తే అద్భుత అవకాశాలు సొంతమవుతాయి. కోర్సులో చేరిన విద్యార్థులు యాంత్రికంగా కాకుండా.. నిజమైన ఆసక్తితో చదవడం ప్రధానం. అప్పుడే ఎలాంటి భాష అయినా సులువుగా నేర్చుకోవచ్చు. ప్రస్తుతం ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో సర్టిఫికెట్ నుంచి పీజీ, పీజీ డిప్లొమా వరకు పలు విదేశీ భాష కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమకు అభిరుచి ఉన్న భాషలో నిర్దిష్ట ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ద్వారా అడుగుపెట్టొచ్చు.
 - ప్రొఫెసర్‌॥సునయన సింగ్, వైస్ చాన్స్‌లర్,  ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ
 
 ఎంబీఏ
 
 ఎంబీఏ.. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అయిదారేళ్ల క్రితం వరకు ఫైనాన్స్, హెచ్‌ఆర్, మార్కెటింగ్ వంటి స్పెషలైజేషన్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఎంబీఏలో ఎన్నో కొత్త స్పెషలైజేషన్లు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ క్రమంలో రిటైల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్‌మెంట్; బ్యాంకింగ్ రంగానికి సంబంధించి బ్యాంకింగ్ మేనేజ్‌మెంట్, ఇన్సూరెన్స్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ వంటి స్పెషలైజేషన్స్‌ను పలు ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్నాయి. వీటిని పూర్తి చేసిన అభ్యర్థులు తమ స్పెషలైజేషన్‌కు సంబంధించిన రంగంలో ఎంట్రీలెవల్‌లో ఎగ్జిక్యూటివ్స్‌గా కెరీర్ ప్రారంభించి.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయి వరకు చేరుకోవచ్చు.
 
 వినూత్న స్పెషలైజేషన్స్‌తో విభిన్న అవకాశాలు..
 ఎంబీఏ ఔత్సాహిక విద్యార్థులు.. ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్‌ఆర్ వంటి సంప్రదాయ స్పెషలైజేషన్స్‌కే పరిమితం కాకుండా.. కొత్తగా వస్తున్న జాబ్‌మార్కెట్‌లో డిమాండ్ ఉన్న స్పెషలైజేషన్స్‌పై దృష్టిసారించాలి. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా అందుబాటులోకి వచ్చిన స్పెషలైజేషన్స్ ఎన్నో ఉద్యోగావకాశాలకు మార్గం వేస్తున్నాయి. దాంతోపాటు డ్యూయల్ స్పెషలైజేషన్ చేస్తే మరిన్ని అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. దేశ సమకాలీన పరిస్థితులను విశ్లేషిస్తే.. సర్వీస్ రంగం వాటా దినదిన ప్రవర్థమానం అవుతోంది. దాంతో హాస్పిటాలిటీ, రిటైల్, హోటల్ మేనేజ్‌మెంట్ వంటివి క్రేజీ స్పెషలైజేషన్లుగా నిలుస్తున్నాయి.
 -ప్రొఫెసర్‌॥ఎ.వెంకటరామన్, అసోసియేట్ ప్రొఫెసర్, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఢిల్లీ యూనివర్సిటీ
 
 ఎవర్‌గ్రీన్.. ఎమ్మెస్సీ


 ఎమ్మెస్సీ.. మాస్టర్ ఆఫ్ సైన్స్. ఎవర్‌గ్రీన్ కోర్సుగా పేర్కొనదగిన పీజీ ఇది. మానవ పరిణామ క్రమం మొదలు అంగారక గ్రహంపై అన్వేషణల వరకూ.. ఎన్నో పరిశోధనలు, ఆవిష్కరణలకు ఊతమిచ్చే కోర్సు. ఎమ్మెస్సీలో సంప్రదాయ సబ్జెక్టులుగా గుర్తింపు పొందిన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలకు దీటుగా ఇప్పుడు మరెన్నో వి నూత్న స్పెషలైజేషన్లు అందు బాటులోకి వచ్చాయి. ముఖ్యంగా లైఫ్ సెన్సైస్ విభాగంలో పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా.. కోర్ సబ్జెక్ట్‌ను, టెక్నాలజీతో అనుసంధానం చేస్తూ బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌సైన్స్ వంటి ఆధునిక కోర్సులు లభిస్తున్నాయి. వీటిని పూర్తి చేయడం ద్వారా రీసెర్చ్ సంస్థలు, ఫార్మాస్యూటికల్ సంస్థలు, వైద్య పరికరాల ఉత్పత్తి సంస్థల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
 
 ప్యూర్ సెన్సైస్‌తో ఫ్యూచర్ వెల్..
 ఎమ్మెస్సీలో సైన్స్ విభాగాలతో అద్భుత భవిష్యత్తుకు మార్గం వేసుకోవచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో దేశంలో ఆర్ అండ్ డీకి ప్రాధాన్యం పెరుగుతోంది.  కెమికల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్ విభాగాల్లో నైపుణ్యం సాధించడం ద్వారా ఐఐఎస్‌సీ, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, డీఆర్‌డీఓ, డీఆర్‌డీఎల్ తదితర ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.  ప్రైవేటు రంగంలోనూ ఫార్మాస్యుటికల్ సంస్థలు, డ్రగ్‌ఫార్ములేషన్ విభాగాల్లో చక్కటి కెరీర్స్ ఖాయం. అటు లైఫ్ సెన్సైస్ విభాగాల్లోనూ ఒకప్పుడు కోర్ స్పెషలైజేషన్‌లో ఒక కోర్స్‌గా బోధించే సబ్జెక్ట్‌లు ఇప్పుడు క్షేత్ర స్థాయి అవసరాలకు అనుగుణంగా పూర్తిస్థాయి స్పెషలైజేషన్స్‌గా అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి విద్యార్థులు తమ భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా.. మార్కెట్ అవసరాలను బేరీజు వేస్తూ మేజర్‌‌సను ఎంచుకోవాలి.
 - నళిన్ పంత్, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ,ఐఐటీ-ఢిల్లీ
 
 న్యాయ శాస్త్రంలో నవీన స్పెషలైజేషన్లు

 న్యాయ శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్(ఎల్‌ఎల్‌ఎం)లోనూ ఆధునిక స్పెషలైజేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. గతంలో పీజీ ‘లా’ స్పెషలైజేషన్స్ అంటే.. కాన్‌స్టిట్యూషనల్ లా, ఫ్యామిలీ లా వంటి స్పెషలైజేషన్స్ మాత్రమే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ఈ విభాగంలోనూ మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో.. నవీన స్పెషలైజేషన్స్ తెరపైకి వచ్చాయి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా, ఇంటర్నేషనల్ ట్రేడ్, కార్పొరేట్ లా వంటివి ఈ కోవకే చెందుతాయి. ఈ స్పెషలైజేషన్స్ పూర్తి చేయడం ద్వారా బహుళ జాతి సంస్థల్లో, పేటెంట్ ఆర్గనై జేషన్స్‌లో లీగల్ అడ్వైజర్స్‌గా, మేనేజర్స్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు. అంతేకాకుండా నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ (కేపీఓ)లలోనూ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
 
 జర్నలిజంలో పీజీ..
 
 దేశంలో మీడియా రంగం రోజురోజుకూ విస్తరిస్తోంది. దాంతో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో పీజీ కోర్సులు పూర్తిచేసిన ప్రతిభావంతులకు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో అవకాశాలు పుష్కలం. ప్రింట్ మీడియాలో ట్రైనీ సబ్ ఎడిటర్/ రిపోర్టర్‌గా.. ఎలక్ట్రానిక్ మీడియాలో కాపీ రైటర్/రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించి.. అనుభవం, పనితీరు ఆధారంగా న్యూస్ ఎడిటర్, బ్యూరో చీఫ్, అసోసియేట్ ఎడిటర్, ఎడిటర్, చీఫ్ ఎడిటర్, మేనేజింగ్ ఎడిటర్ వంటి ఉన్నత స్థానాలు అధిరోహించొచ్చు. ప్రారంభంలోనే నెలకు రూ. 20 వేల జీతంతో కెరీర్ ప్రారంభించొచ్చు.
 
 కొత్త పుంతలు..

 జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అంటే వార్తల సేకరణ, సంపాదకీయం మాత్రమే కాదు. నేటి కార్పొరేట్ సంస్కృతిలో ఈ విభాగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి రిపోర్టింగ్, ఎడిటింగ్‌తోపాటు అడ్వర్టయిజింగ్, పబ్లిక్ రిలేషన్స్, మీడియా మేనేజ్‌మెంట్ వంటి అంశాల్లో కూడా నైపుణ్యం లభిస్తుంది. అంతేకాకుండా మీడియా రంగంలో అవసరమయ్యే సాఫ్ట్‌వేర్ టూల్స్‌పైనా అవగాహన లభించేలా కోర్సుల కరిక్యులం నిరంతరం మారుతోంది. ఫలితంగా ఇప్పుడు ఈ కోర్సు ద్వారా అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఔత్సాహిక అభ్యర్థులకు అకడెమిక్ నైపుణ్యాలతోపాటు సహనం, ఓర్పు, సమయం విషయంలో పరిమితులు లేకుండా పనిచేయగల తత్వం ఉండాలి. ఇవి ఉంటే సమున్నత భవిష్యత్తు సొంతమవుతుంది.
 - ప్రొఫెసర్. చందన్ ఛటర్జీ, డెరైక్టర్,
 సింబయాసిస్‌స్టిట్యూట్ ఆఫ్  మీడియా అండ్ కమ్యూనికేషన్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement