సాక్షి, అమరావతి : దేశంలోని ప్రొఫెషనల్, ఒకేషనల్ కోర్సులకు ఒకే క్రెడిట్ విధానాన్ని అమలుచేసేలా యూనిఫైడ్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌ను అఖిల భారత సాంకేతిక విద్యామండలి ప్రవేశపెట్టింది. పదో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు ఒకేషనల్, ప్రొఫెషనల్ కోర్సులను ఎక్కడ అభ్యసించినా క్రెడిట్లను ఒకే విధానంలో కేటాయించనున్నారు. ఈ మేరకు దేశంలోని అన్ని సాంకేతిక విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, గుర్తింపు పొందిన విద్యాసంస్థల డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లకు ఏఐసీటీఈ ఆదేశాలిచ్చింది.
నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌హెచ్‌ఈక్యూఎఫ్), నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఎస్‌క్యూఎఫ్)లకు సంబంధించి జాతీయ నూతన విద్యా విధానం–2020లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఏఐసీటీఈ శుక్రవారం విడుదల చేసిన సర్క్యులర్లో వివరించింది. ఈ విధానాన్ని అన్ని యూనివర్సిటీలు, విద్యా సంస్థలు అమలు చేయాలని నిర్దేశించింది.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా..
విద్యార్థులు ఒక తరగతి నుంచి పైతరగతుల్లో ప్రవేశించే సమయంలో ఈ క్రెడిట్ల ఆధారంగా ప్రొఫెషనల్, ఒకేషనల్ స్కిల్ గ్యాప్‌లుంటే గనుక వారి కోసం ఆయా విద్యాసంస్థలు ప్రత్యేక బ్రిడ్జి కోర్సులు నిర్వహించాలని సూచించింది. ప్రతి విద్యార్థీ తాను అభ్యసించిన కోర్సును పూర్తి చేసి బయటకు రాగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా ఆయా కోర్సుల నైపుణ్యాలను మెరుగుపర్చాలని, ఆయా కోర్సుల మొదటి సంవత్సరం నుంచే ఇందుకు అనుగుణంగా కరిక్యులమ్‌ను ప్రవేశపెట్టాలని పేర్కొంది. ప్రస్తుతం రూపొందించిన ఏకీకృత క్రెడిట్ విధానానికి అనుగుణంగా ఆయా సంస్థలు తమ నిబంధనలను సవరించుకోవాలని ఏఐసీటీఈ సూచించింది.
వివిధ తరగతుల్లో ఏకీకృత క్రెడిట్ విధానం ఇలా
అకడమిక్ లెవల్ యూనిఫైడ్ క్రెడిట్లు
10వ తరగతి 3.0
11వ తరగతి 3.5
12వ తరగతి/డిప్లొమా సెకండియర్ 4.0
ఫైనలియర్ డిప్లొమా 4.5
డిగ్రీ(యూజీ) ఫస్టియర్ 4.5
యూజీ సెకండియర్ 5.0
యూజీ థర్డ్ ఇయర్ 5.5
ఫైనలియర్ యూజీ డిగ్రీ 6.0
ఫస్టియర్ పీజీ 6.5
ఫైనలియర్ పీజీ 7.0
పీహెచ్‌డీ 8.0
Comments
Please login to add a commentAdd a comment