Professional Courses
-
కొత్త కాలేజీలు, కోర్సులపై మారటోరియం ఎత్తివేత
సాక్షి, అమరావతి: దేశంలో ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి కొత్త కాలేజీలు, కోర్సులపై ఉన్న మారటోరియాన్ని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఎత్తివేసింది. ఇంజనీరింగ్ సహా ప్రొఫెషనల్ కోర్సులను బోధించే కాలేజీలకు అనుమతులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు 2023 – 24 మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో కొత్తగా మరిన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు అందు బాటులోకి రానున్నాయి. నూతన విద్యావిధానం 2020ని దృష్టిలో పెట్టుకొని అనుమతులకు సంబంధించి కొన్ని సడలింపులతో పాటు కొత్త మార్పులను ప్రకటించారు. మూడేళ్ల తరువాత.. కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలు, కోర్సులకు అనుమతులపై ఏఐసీటీఈ 2020–21లో మారటోరియాన్ని విధించింది. కాలేజీలు, సీట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం, నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్న నేపథ్యంలో ప్రొఫెసర్ మోహన్‌రెడ్డి (ఐఐటీ– హైదరాబాద్) కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఏఐసీటీఈ ప్రాంతీయ కార్యాలయాల ద్వారా అనుమతుల మంజూరు ప్రక్రియ కొనసాగగా ఇప్పుడు దాన్ని రద్దుచేసి నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ పోర్టల్ ద్వారా నిర్వహించనున్నారు. ఏఐసీటీఈ అనుమతి ప్రక్రియలో ముఖ్యమైన నిపుణుల కమిటీ సందర్శనను రద్దు చేసింది. కాలేజీలపై ఒత్తిడి తగ్గించడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. అవసరమైనప్పుడు, ఫిర్యాదులు అందినప్పుడు మాత్రమే తనిఖీలు చేపడతారు. అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లలో (బీఈ, బీటెక్) గరిష్ట సీట్ల సంఖ్యను 300 నుంచి 360కి పెంచింది. కొత్త నిబంధనల ప్రకారం కంప్యూటర్ అప్లికేషన్ ప్రోగ్రామ్‌లలో ఇన్‌టేక్‌ను 180 నుంచి 300కి పెంచుకునే అవకాశం కల్పించారు. కొత్తగా ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీలకు ఆమోదం, అనుమతుల పొడిగింపు ఈ విద్యా సంవత్సరంలో చేపట్టే అవకాశం లేదు. ఇందుకు సంబంధించిన వ్యాజ్యం సుప్రీంకోర్టులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. నూతన మార్గదర్శకాల ప్రకారం అన్ని ఇంజనీరింగ్ కళాశాలలు మూడు విభాగాలకు మించకుండా డిగ్రీ, డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో కొత్త కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో మొదటి బ్యాచ్ పూర్తయ్యాకే కొత్త ప్రోగ్రాముకు దరఖాస్తుకు అవకాశం ఉంది. ఇప్పుడు బహుళ ప్రోగ్రాములకు ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు మూడు కోర్ బ్రాంచ్ కోర్సులను నిర్వహించి ఉండాలి. ఈ జాబితాలో ఎలక్ట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్స్‌తో సహా మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉన్నాయి. విద్యార్ధుల నమోదు శాతంతో సంబంధం లేకుండా అభివృద్ధి చెందుతున్న విభాగాలలో నూతన కోర్సు లను ప్రారంభించేందుకు అనుమతించనున్నారు. ూగ్లోబల్ ర్యాంకింగ్స్‌లో అగ్రశ్రేణి 1,000 సంస్థలను దేశీయ సంస్థలతో కలసి పని చేయడానికి అనుమతించనున్నారు. కనీసం 650 నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) స్కోర్‌తో ఏఐసీటీఈ ఆమోదించిన లేదా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో టాప్ 100లో ఉన్న దేశీయ విద్యా సంస్థలను విదేశీ సంస్థలతో కలిసి పనిచేయడానికి అనుమతించనున్నారు. నేషనల్ అక్రిడిటేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ (న్యాక్)లో 3.1 స్కోర్‌తో ఉన్న దేశీయ విశ్వవిద్యాల యాలు కూడా డ్యూయల్, జాయింట్ లేదా ట్వినింగ్ ప్రోగ్రామ్‌లను అందించడానికి వీలుంటుంది. అలాంటి సంస్థలకు కొత్త నిబంధనల ప్రకారం 60 సీట్లతో అదనపు బ్యాచ్‌ల ఏర్పాటుకు అనుమతిస్తారు. ూవిద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు వీలుగా ఏఐసీటీఈ వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త మైనర్ డిగ్రీలను ప్రవేశపెడుతోంది. వీఎల్ఎస్ఐ డిజైన్, 5జీ, అడ్వాన్సుడ్ టెక్నాలజీ సహా ఇంజనీరింగ్‌లో మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందించేలా కాలేజీలను అనుమతిస్తారు. విద్యార్థులు, అధ్యాపకుల్లో మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ఫోరమ్ లేదా కౌన్సెలర్‌ను నియమించుకోవాలి. మహిళల కోసం 24 గంటల పాటు పనిచేసేలా హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలి. విద్యార్థులతోపాటు బోధన, బోధనేతర మహిళా సిబ్బందికి భద్రతా వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. ూ2023లో కొత్త ఇంజనీరింగ్ కళాశాలలను ప్రారంభించడానికి తరగతి గదుల కనీస అవసరాన్ని కూడా ఏఐసీటీఈ సడలించింది. మొత్తం తరగతి గదుల సంఖ్య కళాశాలలోని డివిజన్ల సంఖ్య కంటే 0.5 రెట్లుంటే చాలు. గతంలో 15 తరగతి గదులు కలిగి ఉండాల్సిన కళాశాల ఈసారి పది గదులతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించవచ్చు. పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లలో పీఎం కేర్ సూపర్ న్యూమరీ సీట్లను ఇకపై కొనసాగించరాదని నిర్ణయించారు. (చదవండి: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు తేజాలు ) -
మే 15 నుంచి ఏపీఈఏపీసెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2023–24 విద్యా సంవత్సరంలో కీలకమైన ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఈఏపీసెట్ (ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్), లేటరల్ ఎంట్రీ (డిప్లమా విద్యార్థులు ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశం)కి సంబంధించిన ఈసెట్, ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం ఐసెట్ నోటిఫికేషన్, ఆన్లైన్లో దరఖాస్తు, పరీక్షల నిర్వహణ తేదీలను నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ వివరాలను ఉన్నత విద్యా మండలి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈఏపీసెట్ పరీక్షలను మే 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈసెట్ మే 5న, ఐసెట్ మే 24, 25 తేదీల్లో నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇలా... -
దేశంలో ఏకీకృత క్రెడిట్ విధానం
సాక్షి, అమరావతి : దేశంలోని ప్రొఫెషనల్, ఒకేషనల్ కోర్సులకు ఒకే క్రెడిట్ విధానాన్ని అమలుచేసేలా యూనిఫైడ్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌ను అఖిల భారత సాంకేతిక విద్యామండలి ప్రవేశపెట్టింది. పదో తరగతి నుంచి పీహెచ్డీ వరకు ఒకేషనల్, ప్రొఫెషనల్ కోర్సులను ఎక్కడ అభ్యసించినా క్రెడిట్లను ఒకే విధానంలో కేటాయించనున్నారు. ఈ మేరకు దేశంలోని అన్ని సాంకేతిక విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, గుర్తింపు పొందిన విద్యాసంస్థల డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లకు ఏఐసీటీఈ ఆదేశాలిచ్చింది. నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌హెచ్‌ఈక్యూఎఫ్), నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఎస్క్యూఎఫ్)లకు సంబంధించి జాతీయ నూతన విద్యా విధానం–2020లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఏఐసీటీఈ శుక్రవారం విడుదల చేసిన సర్క్యులర్‌లో వివరించింది. ఈ విధానాన్ని అన్ని యూనివర్సిటీలు, విద్యా సంస్థలు అమలు చేయాలని నిర్దేశించింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా.. విద్యార్థులు ఒక తరగతి నుంచి పైతరగతుల్లో ప్రవేశించే సమయంలో ఈ క్రెడిట్ల ఆధారంగా ప్రొఫెషనల్, ఒకేషనల్ స్కిల్ గ్యాప్లుంటే గనుక వారి కోసం ఆయా విద్యాసంస్థలు ప్రత్యేక బ్రిడ్జి కోర్సులు నిర్వహించాలని సూచించింది. ప్రతి విద్యార్థీ తాను అభ్యసించిన కోర్సును పూర్తి చేసి బయటకు రాగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా ఆయా కోర్సుల నైపుణ్యాలను మెరుగుపర్చాలని, ఆయా కోర్సుల మొదటి సంవత్సరం నుంచే ఇందుకు అనుగుణంగా కరిక్యులమ్‌ను ప్రవేశపెట్టాలని పేర్కొంది. ప్రస్తుతం రూపొందించిన ఏకీకృత క్రెడిట్ విధానానికి అనుగుణంగా ఆయా సంస్థలు తమ నిబంధనలను సవరించుకోవాలని ఏఐసీటీఈ సూచించింది. వివిధ తరగతుల్లో ఏకీకృత క్రెడిట్ విధానం ఇలా అకడమిక్ లెవల్ యూనిఫైడ్ క్రెడిట్లు 10వ తరగతి 3.0 11వ తరగతి 3.5 12వ తరగతి/డిప్లొమా సెకండియర్ 4.0 ఫైనలియర్ డిప్లొమా 4.5 డిగ్రీ(యూజీ) ఫస్టియర్ 4.5 యూజీ సెకండియర్ 5.0 యూజీ థర్డ్ ఇయర్ 5.5 ఫైనలియర్ యూజీ డిగ్రీ 6.0 ఫస్టియర్ పీజీ 6.5 ఫైనలియర్ పీజీ 7.0 పీహెచ్డీ 8.0 -
కెరీర్‌పైనే గురి!
పెళ్లా...? కెరీరా...? గతంలో అమ్మాయిలంతా ఎటూ తేల్చుకోలేకపోయేవారు. కానీ ఇప్పుడు క్షణం కూడా ఆలోచించకుండా కెరీర్‌కే మొగ్గు చూపుతున్నారు. జీవితంలో నిలదొక్కుకున్న తర్వాతే ఏడడుగులు నడవాలని నిర్ణయించుకుంటున్నారు. తద్వారా ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుందని...జీవితం హాయిగా సాగుతుందని భావిస్తున్నారు. అందువల్లే విదేశాల్లో చదువులు, ఉద్యోగాలు చేస్తున్న అనంతపురంజిల్లా అమ్మాయిల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇరవై ఏళ్లకు పెళ్లి, పాతికేళ్లకు పిల్లలు, ఇరవై ఎనిమిదేళ్లకు కెరీర్ ముగించి గృహిణిగా స్థిరపడడం...ఇది గతం. కానీ ఇప్పుడు అమ్మాయిలు కెరీర్‌ను సవాల్‌గా తీసుకుంటున్నారు. చదువు పూర్తికావాలి, ఆ తర్వాత ఉద్యోగం.. అప్పుడే పెళ్లి.. 90 శాతం మంది అమ్మాయిల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. భర్త సంపాదన మీద నేను ఆధారపడటం కాదు తన సంపాదన కూడా కుటుంబానికి ముఖ్యం కావాలి అంటున్నారు. 24 ఏళ్ల వరకూ చదువులు, ఉద్యోగాలే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్న తీరు వారిలో నిండిన ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోంది. పెళ్లిచేసుకుని భర్త వెంట అమెరికా, కెనడా వంటి దేశాలకు డిపెండెంట్ వీసాకింద వెళ్లడం కంటే...తానే అమెరికాలో ఉద్యోగం సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుని వెళితే.. మంచిది కదా అనే ఆలోచనతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది ప్రొఫెషనల్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. కెరీర్ సవాల్‌గా తీసుకుని.. అనంతపురం జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు అమెరికా వెళ్తున్న అమ్మాయిలు కనిపిస్తున్నారు. ఎంబీబీఎస్ కోర్సులో గతంలో ఓపెన్ కేటగిరీలో 30 శాతం కంటే మించని అమ్మాయిల సీట్లు... ఇప్పుడు 60 శాతానికి వెళ్లాయి. అమెరికాలో రమారమి 30కిపైన ప్రధాన యూనివర్సిటీల్లో అనంతపురం జిల్లా అమ్మాయిలు చదువుతున్నట్టు తేలింది. ఇక ఏటా విదేశాలకు విద్యా, ఉద్యోగావకాశాలకోసం వెళ్తున్న వారిలో దాదాపు 40 శాతం మంది అమ్మాయిలే ఉన్నారు. ఒకప్పుడు ఇంజినీరింగ్, ఎంటెక్ కోర్సులకు జిల్లా దాటి వెళ్లని వారు... ఇప్పుడు దేశంలోని ప్రతిష్టాత్మక నిట్లు, ఐఐటీల్లో ప్రవేశాల కోసం పోటీపడుతున్నారు. దీన్ని బట్టి కెరీర్‌ను ఎంత సవాల్‌గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రుల ఆలోచనా విధానంలోనూ ఇప్పుడు మార్పు వచ్చింది. ఇరవై ఏళ్లకే పెళ్లి చేసి బాధ్యతలు దించుకోవాలన్న ఆలోచన ఇప్పుడు ఎవరికీ లేదు. అమ్మాయిల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు స్వేచ్ఛనిస్తున్నారు. ముందు ఎదగాలి జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలన్నదే ఇప్పుడు అందరి లక్ష్యం. అందుకే నేను కూ డా బీఫార్మసీ... ఆ తర్వాత ఎంఫార్మసీ పూర్తి చేశా. పీహెచ్డీ చేయాలని నిర్ణయించుకున్నా. ఉన్నత చదువుతో సమాజంలో ప్రతిష్ట, గౌరవం పెరుగుతుంది. ఆర్థిక భద్రత లభిస్తుంది. ఎవరిపై ఆధారపడాల్సిన పని ఉండదు. మా నాన్న కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తూ చదివిస్తున్నా రు. –ఎన్. సుశీల, ఎంఫార్మసీ, ఎస్కేయూ. స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలి సమాజం పురోగతి చెందాలంటే లింగ వివక్ష, అసమానతలు ఉండకూడదు. మహిళలు మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఆర్థిక, సమాజ, రాజకీయ సాధికారిత సాధిస్తున్నారు. జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలనే అంశంపై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నాం. జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలోనూ ఇలాంటి అంశాలపై ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను. – డాక్టర్ వరలక్ష్మి దేవి, పరీక్షల విభాగం సమన్వయకర్త, ఎస్కేయూ మంచి ఉద్యోగంతో గుర్తింపు అమ్మాయిలు గతంలో మాదిరిగా ఒకరిపై ఆధారపడకూడదు. తల్లిదండ్రులకు భారం అనిపించకూడదు. ఉన్నత చదువులు అభ్యసించి మంచి ఉద్యోగం సాధిస్తే మనకంటూ ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఎప్పుడైతే స్వతంత్రంగా స్థిరపడతామో అప్పు డు మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. – బి.హిమవర్షిణి, సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్, మైక్రాన్ టెక్నాలజీ -
ఈఏపీసెట్‌లో 80,935 సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్–2021లో 80,935 మంది విద్యార్థులకు తొలివిడత సీట్లు కేటాయించారు. అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ పోలా భాస్కర్ ఈ వివరాలు విడుదల చేశారు. మొత్తం 437 కాలేజీల్లో కన్వీనర్ కోటాకు 1,11,304 సీట్లు ఉండగా 80,935 మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 30,369 సీట్లు ఉన్నాయి. స్పోర్ట్స్ కేటగిరీలో 488, ఎన్సీసీలో 976 మందికి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్టు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్), ఎన్సీసీ డైరెక్టరేట్ల నుంచి ఇంకా అందనందున కేటాయించలేదని తెలిపారు. ఆప్షన్లు ఇచ్చింది 89,898 మంది ఏపీ ఈఏపీసెట్–2021కు మొత్తం 2,59,564 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,75,796 మంది ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు, 83,051 మంది అగ్రికల్చర్, ఫార్మా స్ట్రీమ్‌కు దరఖాస్తు చేశారు. అర్హత సాధించిన 1,34,205 మందిలో 90,606 మంది తొలివిడత అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో 90,506 మంది ఆప్షన్ల నమోదుకు అర్హులుకాగా 89,898 మంది ఆప్షన్లను నమోదు చేశారు. వీరిలో 80,935 మందికి తొలివిడతలో సీట్లు కేటాయించారు. సీట్లు కేటాయించని కాలేజీ లేదు 254 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,06,236 సీట్లకుగాను 80,520 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 25,716 సీట్లున్నాయి. 121 బీఫార్మసీ కాలేజీల్లో 4,386 సీట్లుండగా 352 భర్తీ అయ్యాయి. ఇంకా 4,034 సీట్లున్నాయి. 62 ఫార్మా–డీ కాలేజీల్లో 682 సీట్లుండగా 63 భర్తీ అయ్యాయి. ఇంకా 619 సీట్లున్నాయి. తొలివిడతలోనే 37 కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఉన్నత ప్రమాణాల దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈసారి జీరో కేటాయింపు కాలేజీ ఒక్కటీ లేకపోవడం విశేషం. గతంలో ఒక్కసీటు కూడా భర్తీకానివి 10 వరకు ఉండేవి. ప్రమాణాలు లేని కాలేజీలను ప్రభుత్వం కౌన్సెలింగ్‌కు అనుమతించలేదు. తొలిసారి ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్ కోటా తొలిసారిగా ప్రైవేటు వర్సిటీలు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – అమరావతి, ఎస్ఆర్ఎం, బెస్ట్ యూనివర్సిటీ, సెంచూరియన్ యూనివర్సిటీల్లోని ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద 2,012 సీట్లను పేద మెరిట్ విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రాతిపదికన కేటాయించారు. వీరికి ఇతర విద్యార్థులకు మాదిరిగానే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లబ్ధి చేకూరనుంది. -
ప్రొఫెషనల్ కోర్సులు మరింత చేరువ
సాక్షి, అమరావతి: ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలోనూ వినూత్న విధానాలకు కేంద్రం శ్రీకారం చుడుతోంది. దేశంలో ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంటు రేషియో (జీఈఆర్)ను పెంచేందుకు వీలుగా జాతీయ నూతన విద్యావిధానం–2020లో అనేక అంశాలను చేర్చింది. ఈ లక్ష్యాలు నెరవేరేందుకు వీలుగా ఆయా విద్యా విభాగాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులలో చేరికలు పెరిగేందుకు ఆన్లైన్, ఓపెన్ డిస్టెన్స్ లెరి్నంగ్ (ఓడీఎల్) విధానాలను మరింత విస్తృతం చేస్తోంది. ఆన్లైన్, ఓడీఎల్ విధానంలో నాన్ ప్రొఫెషనల్ కోర్సులే ఎక్కువగా అందుబాటులో ఉండగా ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్సులనూ క్రమేణా విద్యార్థులకు చేరువ చేయాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కొత్త విధివిధానాలతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018 యూజీసీ రెగ్యులేషన్ల ప్రకారం ఆన్లైన్, ఓడీఎల్ నాన్ ప్రొఫెషనల్ కోర్సులను పలు విద్యాసంస్థలు అమల్లోకి తీసుకురాగా.. ఇప్పుడు ఏఐసీటీఈ నిర్ణయంతో ప్రొఫెషనల్ కోర్సులనూ ఆయా విద్యాసంస్థలు విద్యార్థులకు అందించనున్నాయి. రెగ్యులర్ కోర్సులతో సమానంగా.. ఈ కోర్సులను రెగ్యులర్ కోర్సులతో సమానమైన ప్రాధాన్యతతో విద్యార్థులకు అందనున్నాయి. ఏఐసీటీఈ చట్టం–1987 ప్రకారం డిప్లొమో, పీజీ డిప్లొమో సర్టిఫికెట్, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమో, పోస్టు గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ డిగ్రీలను ఆన్లైన్, ఓడీఎల్ ద్వారా అమలుచేస్తారు. విద్యా సంవత్సరంగా జనవరి/ఫిబ్రవరి లేదా జులై/ఆగస్టుల మధ్య 12 నెలల కాలవ్యవధిలో ఇవి అమలవుతాయి. ఈ కోర్సులను నాణ్యతా ప్రమాణాలతో విద్యార్థులకు అందించేలా ప్రతి సంస్థ ‘సెంటర్ ఫర్ క్వాలిటీ అస్యూరెన్సు (సీఐక్యుఏ) ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలి. ఆన్లైన్, డిస్టెన్స్ విధానంలో ఈ కోర్సులు అమలుచేస్తున్నా విద్యార్థులు టీచర్ల మధ్య ముఖాముఖి అభ్యసనం ఉండేలా కొంతకాలం సంప్రదాయ అభ్యసన విధానాన్నీ అమలుచేయాల్సి ఉంటుంది. ఆన్లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలోని కోర్సులకు కూడా రెగ్యులర్ కోర్సులతో సమానంగా క్రెడిట్ సిస్టమ్ అమలవుతుంది. విద్యార్థి ఆయా కోర్సులను యూనిట్ల వారీగా విద్యార్థి అభ్యసించిన గంటలు, అసెస్మెంటులో తేలిన ప్రమాణాలను అనుసరించి ఈ క్రెడిట్లు ఇస్తారు. డ్యూయెల్ విధానంలో అమలుకు అవకాశం ►విద్యాసంస్థలు డ్యూయెల్ (ద్వంద్వ) విధానంలో అంటే సంప్రదాయ కోర్సులను అమలుచేస్తూనే ఆన్లైన్, ఆన్లైన్ డిస్టెన్స్ కోర్సులను అమలుచేయడానికి అవకాశం కల్పించనున్నారు. ►రెగ్యులర్ కోర్సులతో సమానంగా వీటిని గుర్తిస్తున్నందున ఆ కోర్సుల్లోని లెరి్నంగ్ మెటీరియల్ మాదిరిగానే ‘ఈ లెరి్నంగ్ మెటీరియల్’ను డిజిటల్ ఫార్మాట్లో విద్యార్థులకు అందిస్తారు. ►విద్యార్థులు తమంతట తాము అభ్యసించడం, పరిజ్ఞానాన్ని స్వయంగా పెంచుకోవడం, ఎప్పటికప్పుడు స్వయం మూల్యాంకనం (సెల్ఫ్ ఎవాల్యుయేషన్) ద్వారా స్వయం మార్గదర్శకత్వం వంటివి పెంపొందించుకోగలుగుతారు. ►రెగ్యులర్ కోర్సులకు మాదిరిగానే ఈ పరీక్షలను కూడా నిరీ్ణత కేంద్రాల్లో ఆన్లైన్లో నిర్వహించాల్సి ఉంటుంది. ►పెన్, పేపర్ లేదా కంప్యూటరాధారిత, లేదా పూర్తిస్థాయి ఆన్లైన్ విధానంలో విద్యార్థులను నిపుణులైన వారితో పరీక్షింపజేయాలి. కోర్సులు అందించే సంస్థల అర్హతలు.. ♦యూజీసీ గుర్తింపు, స్వయంప్రతిపత్తి ఉన్న ఉన్నత విద్యాసంస్థలు, డీమ్డ్ వర్సిటీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యూనివర్సిటీలు మాత్రమే ఈ కోర్సులు అందించేందుకు అర్హమైనవి. ♦ఈ ఆన్లైన్ కోర్సులు అమలుచేసే సంస్థలకు నాక్ 4 పాయింట్ల స్కేలులో 3.26 పాయింట్లు, లేదా ఎన్బీఏ స్కోరు 1000 స్కేల్లో 700 వచ్చి ఉండడం తదితర నిబంధనలను ఏఐసీటీఈ అమలుచేస్తుంది. ♦నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్కులో ఆ సంస్థలు టాప్ 100లో ఉండాలి. ♦ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలను కలిగి ఉండాలి. ♦ఆయా సంస్థల్లోని ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కోర్సులను కూడా ఆన్లైన్, ఓడీఎల్ విధానంలో అందించవచ్చు. ♦ఈ కోర్సులను అమలుచేసేటప్పుడు విద్యార్థులకు సహకారం కోసం నిపుణులైన బోధకులతో ‘లెరి్నంగ్ సపోర్టు సెంటర్ల’ను ఏర్పాటుచేయాలి. ♦ఆన్లైన్ విధానంలో ఏఐసీటీఈ నిషేధించిన ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులను ఆన్లైన్, ఓడీఎల్ విధానంలో అమలుకు వీల్లేదు. వీటితో పాటు ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్, అప్లయిడ్ ఆర్ట్స్, క్రాఫ్టŠస్, డిజైన్ వంటి కోర్సులను ఆన్లైన్, ఓడీఎల్ విధానంలో అమలుచేయరాదు. ♦విద్యార్థులను రెగ్యులర్ కోర్సులకు నిర్దేశించిన పరిమితికి మూడు రెట్లు అదనంగా చేర్చుకోవడానికి అవకాశమిస్తారు. ♦నిబంధనలు ఉల్లంఘించే సంస్థల అనుమతుల రద్దుకు ఏఐసీటీఈ యూజీసీకి సిఫార్సు చేస్తుంది. అవసరమైన చట్టపరమైన చర్యలనూ చేపడుతుంది. చదవండి: అగ్రవర్ణ పేదలకూ నవరత్నాలతో భారీ లబ్ధి టీడీపీ అడ్డదారులు: పైకి కత్తులు.. లోన పొత్తులు -
ఉద్యోగ నైపుణ్యాలపై కోవిడ్ దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: విద్యా, ఉద్యోగ అవకాశాలపై కరోనా దెబ్బ తీవ్రంగా పడింది. ముఖ్యంగా ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలు, సామర్థ్యాలపై ప్రభావం చూపనుంది. దీంతో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 2.18 శాతం మేరకు ఉద్యోగ సామర్థ్యాలు తగ్గినట్లు వీబాక్స్ సర్వే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, టాగ్డ్ సంస్థ రూపొందించిన ‘ఇండియా స్కిల్స్ రిపోర్ట్–2021’లో వెల్లడించింది. కోవిడ్ తర్వాత దేశవ్యాప్తంగా పరిశ్రమల అవసరాలు, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల్లో అందుకు అవసరమైన సామర్థ్యా లు, వాటిపై కరోనా ప్రభావం వంటి అంశాలపై వీబాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్‌ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 65 వేల మంది విద్యార్థులు, 15 పరిశ్రమలను, 150కి పైగా కార్పొరేట్ సంస్థలను సంప్రదించింది. పలు అంశాలపై అధ్యయనం చేసి ఐఎస్ఆర్–2021ను రూపొందించింది. కరోనా ప్రభావం, ఇతరత్రా కారణాలతో 2020 కంటే 2021లో ఉద్యోగ అర్హత ఉన్నవారు దేశ వ్యాప్తంగా 0.31 శాతం తగ్గనున్నట్లు పేర్కొంది. 2019లో 47.38 శాతం ఉద్యోగ అర్హులున్నట్లు అంచనా వేయగా, 2020లో ఉద్యోగార్హత ఉన్నవారు 46.21 శాతం ఉండగా, 2021లో 45.9 శాతం ఉంటారని పేర్కొంది. ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు దెబ్బ.. కరోనా ప్రభావం ఎంబీఏ గ్రాడ్యుయేట్లపైనా తీవ్రంగా పడింది. ఉద్యోగ సామర్థ్యాలు ఎంబీఏ విద్యార్థుల్లో 2020లో 54 శాతం ఉంటే 2021లో 46.59 శాతానికి తగ్గిపోతాయని అంచనా వేసింది. ఆ తర్వాత బీకాం గ్రాడ్యుయేట్లపైనా అధిక ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 2.18 శాతం ఉద్యోగ నైపుణ్యాలు తగ్గిపోనున్నట్లు వెల్లడించింది. 2020లో 49 శాతం మంది బీఈ/బీటెక్ విద్యార్థుల్లో ఉద్యోగ సామర్థ్యాలు ఉండగా, 2021లో 46.82 శాతం మంది విద్యార్థుల్లోనే ఉద్యోగ సామర్థ్యాలు ఉంటాయని అంచనా వేసింది. ముందు వరుసలో హైదరాబాద్.. అత్యధిక ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన విద్యార్థులున్న పట్టణాల్లో హైదరాబాద్ ముందంజలో ఉంది. ఆ తర్వాత బెంగళూరు, పుణే, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో, కోయంబత్తూరు, నెల్లూరు, గుర్గావ్, మంగళూరు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ముందంజలో ఉన్నాయి. తెలంగాణ 7వ స్థానంలో ఉంది. ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న పట్టణాల జాబితాలో మొదటి స్థానంలో మహారాష్ట్ర, కర్ణాటక ఉండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ కల్పన అవకాశాలను పెంచుకున్నట్లు వెల్లడించింది. ఉద్యోగ, ఉపాధి వనరులు ఎక్కువ కలిగిన నగరాల్లో ముంబై ముందు వరుసలో ఉండ గా, 60 శాతానికిపైగా స్కోర్‌తో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. అధిక ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులున్న రాష్ట్రాలు రాష్ట్రం ఉద్యోగ నైపుణ్యాలున్న వారి శాతం మహారాష్ట్ర 64.17 తమిళనాడు 60.97 ఉత్తరప్రదేశ్ 56.55 కర్ణాటక 51.21 ఆంధ్రప్రదేశ్ 48.18 ఢిల్లీ 42.57 తెలంగాణ 41.31 గుజరాత్ 36.68 పశ్చిమబెంగాల్ 35.72 రాజస్తాన్ 31.87 కోర్సుల వారీగా ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులు (శాతం) కోర్సు 2019 2020 2021 బీఈ/బీటెక్ 57.09 49 46.82 ఎంబీఏ 36.44 54 46.59 బీఏ 29.3 48 42.72 బీకాం 30.06 47 40.3 బీఎస్సీ 47.37 34 30.34 ఎంసీఏ 43.19 25 22.42 పాలిటెక్నిక్ 18.05 32 25.02 బీఫార్మసీ 36.29 45 37.24 -
వృత్తివిద్యా కోర్సుల్లో.. సీట్లకు గరిష్ట పరిమితి
సాక్షి, అమరావతి :ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తివిద్యా కోర్సులు నిర్వహించే కాలేజీల్లో గరిష్ట సీట్ల సంఖ్య ఇక నుంచి పరిమితం కానుంది. కోర్సుల వారీగా గరిష్ట సీట్ల సంఖ్యను నిర్ణయించిన జాతీయ సాంకేతిక విద్యా మండలి.. 2020–21 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానుంది. ప్రొఫెషనల్ కాలేజీలు కొన్ని డిమాండ్ ఉన్న కోర్సుల్లో అత్యధిక సీట్లకు అనుమతులు తీసుకుంటున్నాయి. ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలు పరిమితంగానే ఉన్నా అదనపు సెక్షన్లను కొనసాగిస్తూ విద్యార్థులకు బోధనను వాటితోనే సరిపెడుతున్నాయి. కానీ, మిగతా కాలేజీల్లో ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలున్నా వాటిలోని సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. డిమాండ్ ఉన్న కోర్సులపై తప్ప ఇతర కోర్సులపై ఆయా కాలేజీల యాజమాన్యాలు కూడా పెద్దగా శ్రద్ధ చూపడంలేదు. దీంతో కొన్ని కాలేజీల్లో సీట్లు 1,200 వరకు ఉండగా మరికొన్నిటిలో 200 నుంచి 300 వరకు మించి ఉండడంలేదు. ఈ నేపథ్యంలో 2020–21 విద్యా సంవత్సరం నుంచి కాలేజీల్లో కోర్సుల వారీగా సీట్ల సంఖ్యను నిర్దిష్ట గరిష్ట పరిమితిని విధించి ఆ మేరకు మాత్రమే అనుమతులు మంజూరు చేయాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన హేండ్‌బుక్–2020–21లో దీన్ని పొందుపరిచింది. కొత్త కోర్సులకు పెద్దపీట కాగా, విద్యార్థుల్లో నూతన సాంకేతిక అంశాలను పెంపొందించడానికి కొత్త కోర్సులను కూడా కాలేజీల్లో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని ఏఐసీటీఈ అభిప్రాయపడుతోంది. నేటి అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థుల్లో సామర్థ్యాలు సంప్రదాయ కోర్సులతో కన్నా కొత్త కోర్సుల ద్వారానే సాధ్యమని ఏఐసీటీఈ స్పష్టంచేసింది. ఈ కారణంగానే సంప్రదాయ కోర్సుల్లో అదనపు సీట్లను ఇక నుంచి కేటాయించరాదని నిర్ణయించింది. వాటి స్థానంలో కొత్త సాంకేతిక కోర్సుల వైపు విద్యా సంస్థలను మళ్లించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ సాఫ్ట్వేర్, మొబిలిటీ, అనలైటిక్స్, క్లౌడ్ వంటి అంశాలు అత్యధిక డిమాండ్‌తో పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే నాస్కామ్, ఫిక్కి, బీసీజీ అధ్యయనాల్లో ఈ విషయం తేలింది. దీంతో యూజీ, పీజీ కోర్సులు నిర్వహించే విద్యా సంస్థలు ముఖ్యంగా కంప్యూటర్ సైన్సు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్‌చైన్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డాటా సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ 3డీ ప్రింటింగ్, డిజైన్, అగ్యుమెంటెడ్ రియాలిటీ, వరŠుచ్యవల్ రియాలిటీ అంశాలకు ప్రాధాన్యమివ్వాలని ఏఐసీటీఈ సూచిస్తోంది. -
భవిష్యత్ అంధకారం..!
ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), ఎంఎల్టీ కోర్సులు చేసినా పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్లు చేసుకోలేక.. ఉద్యోగాలకు అనర్హులైన వారు జిల్లాలో చాలామంది ఉన్నారు. వాస్తవానికి కోర్సు పూర్తికాగానే వీరంతా ఆరు నెలల పాటు అప్రెంటిషిప్ పూర్తి చేయాల్సి ఉండగా.. జిల్లాలో అప్రెంట్‌షిప్ చేసే అవకాశం లేకపోవడంతో విద్యార్థులకు దీని గురించి ఎవరూ చెప్పడం లేదు. ఫలితంగా వారంతా ఉద్యోగాలకు అనర్హులవుతున్నారు. సాక్షి, కళ్యాణదుర్గం: వృత్తి విద్యా కోర్సులు చదివితే వెంటనే ఉపాధి అవకాశాలు దక్కడంతో పాటు ఉద్యోగాలకు అర్హత ఉంటుందని చాలా మంది ఈ కోర్సుల్లో చేరుతున్నారు. అక్కడి అధ్యాపకులు కూడా భవిష్యత్ బాగుంటుందని చెబుతుండటంతో ఎక్కువ మంది ఈ కోర్సుల్లో చేరారు. ఇలా అధ్యాపకులు, ఇతరుల మాటలు నమ్మి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్(ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్(ఎంఎల్టీ) చేసిన విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకోలేక.. ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), ఎంఎల్టీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఆరు నెలల పాటు అప్రెంట్‌షిప్ పూర్తి చేస్తేనే పారా మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే వీరు తప్పనిసరిగా పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఈ కోర్సులు పూర్తి చేసిన చాలా మంది విద్యార్థులు అప్రెంట్‌షిప్ పూర్తి చేయలేదు. అలా చేయాలని ఇంతవరకూ వీరిలో చాలామందికి తెలియదు. తెలిసినా జిల్లాలో అలాంటి అవకాశం లేదు. దీంతో చాలా మంది బోర్డులో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేకపోయారు. అప్రెంట్‌షిప్ పూర్తి చేస్తేనే రిజిస్ట్రేషన్ జిల్లాలో 29 ఒకేషనల్ గ్రూపులున్న కళాశాలలుండగా ప్రత్యేకించి ఆరు కళాశాలల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), ఎంఎల్టీ గ్రూపులు ఉన్నాయి. పదేళ్లుగా ఈ కళాశాలల్లో ఎంఎల్టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్) పూర్తి చేసిన వారు 550 మంది ఉంటారు. వీరిలో కేవలం 50 మంది మాత్రమే అప్రెంట్‌షిప్ చేశారు. ఏ ఒక్కరూ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ కాలేదు. ఇక మిగిలిన ఆరు కళాశాలల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), ఎంఎల్టీ చదివిన వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ ఇలాగే ఉంది. వాస్తవానికి ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), ఎంఎల్టీ కోర్సులు పూర్తి చేసిన వారు రూ.1000 చెల్లించి ఆంధ్ర వైద్య విధాన పరిషత్ ట్రైనింగ్ అప్రెంట్‌షిప్ పూర్తి చేసుకోవాలి. అనంతరం పారా మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అప్రెంట్షిప్కు అవకాశం అంతంతే.. కళ్యాణదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), ఎంఎల్టీ విద్యార్థులు అప్రెంట్‌షిప్ చేయడానికి అంతం త మాత్రమే అవకాశాలున్నాయి. 2014 వరకు చెన్నైకి చెందిన బోర్డు అప్రెంట్‌షిప్ ట్రైనింగ్ సంస్థతో కళాశాల ఒప్పందం కుదుర్చుకుని అప్రెంట్‌షిప్ చేయించేవారు. ప్రస్తుతం ఆ సంస్థతో ఒప్పందాలు లేవు. అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే కొంతవరకు అవకాశం ఉంది. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో అప్రెంట్‌షిప్ చేస్తున్న వారికీ పారా మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో విద్యార్థులకు నష్టం జరుగుతోంది. ఇంటర్ బోర్డు, పారా మెడికల్ బోర్డు సమన్వయ లోపం ఇంటర్మీడియట్ బోర్డు, పారా మెడికల్ బోర్డు అధికారుల సమన్వయ లోపంతో ఒకేషనల్ కోర్సులు చదివిన విద్యార్థులు సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. కోర్సు పూర్తయిన అనంతరం అప్రెంట్‌షిప్ చేసి పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకోవాలి. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు విజయవాడలోని పారా మెడికల్ బోర్డుకు వెళ్లి రిజిస్టర్ చేయాలని అభ్యర్థించగా ఇది తమకు సంబంధం లేదని.. కళాశాలల వారే చూసుకుంటారని చెబుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. దీంతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉద్యోగావకాశాలను కూడా కోల్పోతున్నారు. సచివాలయ ఉద్యోగాలకు అనర్హులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంఎల్టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్) కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు అనర్హలుగా మిగిలిపోయారు. అప్రెంటిషిప్ లేక పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ కాక... దరఖాస్తు చేయడానికి వెళ్లిన అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పాలకులు దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని బాధిత విద్యార్థులు కోరుతున్నారు. సమస్య వాస్తవమే.. ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), ఎంఎల్టీ చదివిన విద్యార్థులు అప్రెంట్‌షిప్ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పారా మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ విషయ మై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. ఈ సమస్య పరిష్కారమైతే విద్యార్థులకు అన్ని విధాలా న్యాయం జరుగుతుంది. ఒకేషనల్ గ్రూపులు చదివే విద్యార్థులకు ఈ విషయమై అవగాహన కల్పిస్తున్నాం. – రాజారాం, వృత్తి విద్యా కోర్సుల జిల్లా అధికారి -
‘మెడికల్ అడ్మిషన్లలో సామాజికన్యాయమేదీ’
సాక్షి, హైదరాబాద్: మెడికల్, ఇంజనీరింగ్ తదితర వృత్తివిద్యా కోర్సుల్లో చట్టబద్ధమైన రిజర్వేషన్లు అమలుచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. సామాజికవర్గాల వారీగా రిజర్వేషన్లను అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు గురువారం ఆయన లేఖ రాశారు. వృత్తి విద్యాకోర్సుల్లో రిజర్వేషన్లను అమలుచేయడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన జీవో 550 అమలుపై హైకోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. దీనివల్ల మెరిట్ ఆధారంగా ఓపెన్ కోటాలో సీట్లు పొందగలిగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఆ అవకాశాన్ని కోల్పోతున్నారన్నారు. ఓపెన్ కేటగిరిలో పోటీపడే సామర్థ్యమున్న విద్యార్థులకూ రిజర్వేషన్ కోటాలోనే సీట్లు ఇస్తున్నారని, ఈ అన్యాయాన్ని సరిదిద్దడంలో ప్రభుత్వం తగిన శ్రద్ధను చూపడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా సామాజికన్యాయాన్ని పరిరక్షించే విధంగా సుప్రీంకోర్టులో వాదనలు చేయాలని తమ్మినేని కోరారు. -
మే నెలాఖరులోగా అన్ని సెట్స్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలను (సెట్స్) ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభించి మే నెలాఖరులోగా పూర్తి చేసేలా ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. జూన్‌లో ప్రవేశాలను చేపట్టి ఎట్టి పరిస్థితుల్లో జూలైలోగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో సెట్స్ కన్వీనర్ల ఎంపికపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఏయే ప్రవేశ పరీక్షను ఏయే యూనివర్సిటీ నిర్వహించాలో ఖరారు చేసింది. సెట్స్‌కు కన్వీనర్లుగా నియమించేందుకు పేర్లను పంపించాలని రెండు రోజుల కిందట ఆయా యూనివర్సిటీలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి లేఖలు రాశారు. ఈ మేరకు వర్సిటీల నుంచి పేర్ల జాబితా రెండు మూడు రోజుల్లో రానుంది. యూనివర్సిటీలు పంపే మూడు పేర్లలో ఒకరిని కన్వీనర్‌గా నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడనుంది. పాత కన్వీనర్లే మేలు! 2017 విద్యా సంవత్సరంలో ప్రవేశ పరీక్షలను నిర్వహించిన కన్వీనర్లనే 2018లోనూ నియమించాలని యూనివర్సిటీలు భావిస్తున్నాయి. తద్వారా ఎలాంటి సమస్యలు లేకుండా ప్రవేశ పరీక్షలను నిర్వహించవచ్చని భావిస్తున్నాయి. ఈ మేరకు ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీఈ) సెట్ కన్వీనర్‌కు ప్రతిపాదించిన పేర్ల జాబితా ఉన్నత విద్యా మండలికి మంగళవారమే అందింది. 2017లో పీఈసెట్‌ను విజయవంతంగా నిర్వహించిన ప్రొఫెసర్ సత్యనారాయణను 2018లోనూ కన్వీనర్‌గా నియమించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇక అగ్రికల్చర్, ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఎంసెట్ నిర్వహణ బాధ్యతలను ఈసారి కూడా ప్రొఫెసర్ యాదయ్యకే అప్పగించేలా జేఎన్టీయూ ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. ఉన్నత విద్యా మండలి కూడా ఇదే అభి ప్రాయంతో ఉండటంతో మిగతా సెట్స్‌కు దాదాపు పాత కన్వీనర్లే ఖరారయ్యే అవకాశం ఉంది. రెండింటికి కొత్త వారు.. న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్, ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌ను 2017లో నిర్వహించిన కన్వీనర్లు పదవీ విరమణ పొందారు. దీంతో ఈసారి ఆ రెండింటికి కన్వీనర్లు మారనున్నారు. మరోవైపు 2017లో లాసెట్‌ను కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించగా, 2018లో నిర్వహణ బాధ్యతలను ఓయూకు అప్పగిస్తూ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. సెట్స్ వారీగా నిర్వహణ యూనివర్సిటీలు, కన్వీనర్లు సెట్ యూనివర్సిటీ కన్వీనర్ ఎంసెట్ జేఎన్టీయూ యాదయ్య ఈసెట్ జేఎన్టీయూ గోవర్ధన్ పీజీఈసెట్ ఉస్మానియా సమీన్ ఫాతిమా ఐసెట్ కాకతీయ కొత్తవారు లాసెట్ ఉస్మానియా కొత్తవారు ఎడ్‌సెట్ ఉస్మానియా దమయంతి పీఈసెట్ మహాత్మాగాంధీ సత్యనారాయణ -
ర్యాంకుతో నిమిత్తం లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్!
సాక్షి, హైదరాబాద్: బీసీ విద్యార్థులకు శుభవార్త. ఇంజనీరింగ్, వృత్తివిద్యా కోర్సులు అభ్యసించే విద్యార్థులకు సర్కారు ఊరట ఇవ్వబోతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిబంధనల్లో మార్పులు చేపట్టనున్నట్లు తెలిసింది. కాలేజీ ఫీజును పూర్తిస్థాయిలో పొందాలంటే సదరు విద్యార్థికి సెట్(కామన్ ఎంట్రన్స్ టెస్ట్)లో పదివేలలోపు ర్యాంకు రావాల్సి ఉంది. పదివేల కంటే పైబడి ర్యాంకు వస్తే కేవలం రూ.35 వేలను మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుండగా, మిగతా మొత్తాన్ని విద్యార్థి భరించాల్సి వచ్చేది. ఈ నిబంధనపై బీసీ, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థుల్లో పోటీతత్వం పెంచేందుకే ఈ నిబంధన పెట్టినట్లు అప్పట్లో ప్రభుత్వం చెప్పుకొచ్చింది. బీసీ ‘ఈ’లో ఉన్న మైనార్టీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజులిస్తూ ఏ, బీ, సీ, డీ కేటగిరీల్లోని ఇతర బీసీ విద్యార్థులపై ఆంక్షలు పెట్టడం సమంజసం కాదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో పూర్తిస్థాయి ఫీజు చెల్లింపునకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని బీసీ సంక్షేమ శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. భారం రూ.310 కోట్లు... ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ఈ ఏడాది 13.06 లక్షల దరఖాస్తులు రాగా, అందులో బీసీ విద్యార్థుల దరఖాస్తులు 7.22 లక్షలు. ఇంజనీరింగ్ కోర్సుకు సంబంధించి పదివేల ర్యాంకు దాటిన విద్యార్థులకు ఫీజు కింద రూ.35 వేలను మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు సగటున 45 వేలకుపైగా ఉంది. పదివేల ర్యాంకు నిబంధనను ఎత్తేస్తే గరిష్టంగా రూ.310 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఏటా రూ.2,810 కోట్ల మేర ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిబంధనలపై సమీక్ష నిర్వహిస్తున్న సర్కారు ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. -
ఆస్పత్రి సిబ్బందికి నైపుణ్య కోర్సులు
సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రుల్లోని పలు రకాల సేవలకుగాను సిబ్బందికి నైపుణ్య కోర్సులను నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ భావిస్తోంది. వైద్యులుగా, నర్సులుగా, టెక్నీషియన్లుగా పనిచేయాలంటే తప్పనిసరిగా ఆయా కోర్సులు చదవాలి. వైద్య, ఆరోగ్యశాఖలోని సంబంధిత విభాగాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కానీ వీరి కంటే రెట్టింపు స్థాయిలో కింది స్థాయి సిబ్బంది పనిచేస్తుంటారు. ఆపరేషన్ థియేటర్ బాయ్‌లుగా, రోగులను వీల్‌చైర్‌పై తరలించే వర్కర్లుగా, వార్డుల్లో రోగులకు సహాయకులుగా, మరుగుదొడ్లు క్లీనర్లుగా రకరకాల పనిచేసే వారెవరికీ కోర్సులు, శిక్షణ, రిజిస్ట్రేషన్ ఉండటం లేదు. వారి ప్రవర్తన ఒక్కోసారి రోగులకు అశనిపాతంగా మారుతోంది. ఈ పరిస్థితిని సరిదిద్దాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఆస్పత్రుల్లోని ఇటువంటి సిబ్బందికి, ఏడో తరగతి పాసైన నిరుద్యోగులక ు6 నెలల ఆస్పత్రి నిర్వహణపై శిక్షణ, సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. కొన్ని కోర్సులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, మరికొన్నింటికి పారామెడికల్ అనుమతితో ప్రైవేటు సంస్థల ద్వారా శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. శిక్షణ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికే ఆస్ప త్రుల్లో ఆయా విభాగాల్లో పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారికి కూడా దీనిని తప్పనిసరి చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు వెయ్యి చొప్పున ఉంటాయి. వాటిల్లోని కిందిస్థాయి సిబ్బంది ఎవరూ నిర్ణీత కోర్సుతో శిక్షణ పొంద లేదు. ఆస్పత్రుల్లోని పనులు, అక్కడి వ్యవహారాలపై సిలబస్ తయారు చేసి ఆరు నెలలపాటు శిక్షణ కల్పించాలని వైద్య, ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఈ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తే రాష్ట్రం నుంచి లక్ష మందికి దేశ విదేశాల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ఆస్పత్రి రంగంపై శిక్షణ పొందినవారికి దేశ, విదేశాల్లో డిమాండ్ బాగానే ఉంది. కాస్త ఇంగ్గిష్ మాట్లాడగలిగితే దుబాయ్, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లోనూ ఉపాధి అవకాశాలుంటాయని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం నిర్ణయం తర్వాత పారామెడికల్ విభాగం ద్వారా శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. -
ప్రొఫెషనల్ కోర్సులకు.. ఫీజుల సెగ!
ఇంజనీరింగ్, ఎంబీఏ, బీఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ఫీజుల భారం పెరగనుంది. జాతీయ స్థాయిలో ఇప్పటికే ఐఐటీల్లో ఫీజుల మోత మోగింది. ఇప్పుడిక రాష్ట్రాల స్థాయి కళాశాలల్లో సైతం భారీగా ఫీజుల పెంపు దిశగా రంగం సిద్ధమైంది. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరాలనుకుంటే లక్షలు కుమ్మరించాల్సిందే! * పెను భారం కానున్న వృత్తివిద్యా చదువులు * ఏకీకృత ఫీజులను నిర్ధారించిన ఏఐసీటీఈ * ఫీజులు పెంచేందుకు సిద్ధమవుతున్న ఏఎఫ్ఆర్సీ ఇంతకీ ఏ ఫీజు జాతీయ స్థాయిలో ఏకీకృత ఫీజు ఉండేలా ఏఐసీటీఈ నియమించిన నేషనల్ ఫీ ఫిక్సేషన్ కమిటీ ఫీజులు ఖరారు చేసింది. ఈ కమిటీ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం కూడా లభించింది. మరోవైపు తెలుగు రాష్ట్రాలో అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేషన్ అథారిటీ(ఏఎఫ్ఆర్సీ)లు 2016-19 బ్లాక్ పీరియడ్‌కు ఫీజులు పెంచే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దాంతో ఫీజు ఎంత పెరుగుతుందో.. అసలు ఈ విద్యా సంవత్సరంలో ఏకీకృత, ఏఎఫ్ఆర్సీ ఫీజుల్లో ఏది అమల్లోకి వస్తుందో అనే ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. భారీగా ఫీజుల సిఫార్సు బీటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఫార్మా-డి తదితర కోర్సుల్లో జాతీయ స్థాయిలో ఒకే విధమైన ఫీజు విధానాన్ని అమలు చేయాలని 2014లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం పది మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ దేశ వ్యాప్తంగా పలు కళాశాలల యాజమాన్యాలు, విద్యావేత్తలు, ఇతర వర్గాలతో పలు సంప్రదింపులు చేసింది. చివరకు గత నవంబర్‌లో ఆయా కోర్సులకు ఫీజులు నిర్ధారిస్తూ నివేదిక అందించింది. దీనికి ఏఐసీటీఈ ఆమోదం కూడా లభించింది. ఇంజనీరింగ్ కనీసం 1.44 లక్షలు.. నేషనల్ ఫీ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సు చేసిన ఫీజుల మొత్తాలు విద్యార్థుల గుండెలను గుభేల్‌మనిపిస్తున్నాయి. ఒక్క ఇంజనీరింగ్ కోర్సునే చూస్తే ఏడాదికి కనిష్టంగా 1.44 లక్షలు, గరిష్టంగా 1,58,300గా నిర్ధారించింది. నగరాలు/పట్టణాలను మూడు కేటగిరీలుగా (టైప్-ఎక్స్, టైప్-వై, టైప్-జెడ్) వర్గీకరించి ఫీజులు నిర్ధారించింది. ఇందుకోసం ఆరో వేతన సంఘం సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవడం విశేషం! తుదిదశకు చేరుకున్న ఏఎఫ్ఆర్సీల కసరత్తు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ, సమీక్ష, నిర్ధారణకు ఏర్పాటైన అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేషన్ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) 2016-19 బ్లాక్ పీరియడ్‌కు కొత్త ఫీజుల ఖరారు దిశగా కసరత్తు తుది దశలో ఉంది. ఇప్పటికే 2013-16 బ్లాక్ పిరియడ్‌కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ వార్షిక ఫీజులు రూ. 30 వేల నుంచి రూ. 1.09 లక్షల వరకు ఉంది. 2013-16 బ్లాక్ పిరియడ్ వ్యవధి ముగియడంతో మరో మూడేళ్ల బ్లాక్ పిరియడ్‌కు సంబంధించి 2016-19 విద్యా సంవత్సరాల్లో ఫీజులు నిర్ధారించేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఫీజులు 20 నుంచి 30 శాతం మధ్యలో పెరగనున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో టైప్-ఎక్స్ పరిధిలో హైదరాబాద్, టైప్-వై పరిధిలో విజయవాడ, వరంగల్, విశాఖపట్నం, గుంటూరు... మిగిలిన అన్నీ టైప్ -జడ్ పరిధిలోనే ఉన్నాయి. ఈ విషయంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. ఒకవేళ జాతీయ స్థాయిలో ఏకీకృత ఫీజుల విధానాన్నే అమలు చేస్తే అధిక సంఖ్యలో ఉన్న టైప్-జడ్ పట్టణాలు/ నగరాల్లో బీటెక్ చదవాలంటే.. ఏడాదికి రూ.1,44,900 చెల్లించాల్సి ఉంటుంది. అత్యున్నత ప్రమాణాలు ఉన్న ఇన్స్టిట్యూట్లు అదనంగా 20 శాతం, అటానమస్ కళాశాలలు అదనంగా పది శాతం వసూలు చేసుకోవచ్చనే కమిషన్ సిఫార్సు మరింత భారం పెంచనుంది. జాతీయ స్థాయిలో ఏకీకృత ఫీజుల అమలు దిశగా యోచిస్తున్న ఏఐసీటీఈ.. వాటిని అమలు చేసే ముందు ఆయా కళాశాలలు పాటిస్తున్న ప్రమాణాల విషయంలో అత్యంత పకడ్బందీగా వ్యవహరించాలి. అలా కాకుండా కేవలం కమిటీ సిఫార్సులపైనే ప్రాంతాల వారీగా ఫీజులు నిర్ధారించడం వల్ల విద్యార్థులకు చదవులు భారం అవుతాయే తప్ప నైపుణ్యాలు లభిస్తాయన్న గ్యారెంటీ లేదు. - ప్రొఫెసర్. వి.ఎస్. ప్రసాద్, న్యాక్ మాజీ డెరైక్టర్ -
అమ్మాయిలదే హవా
► ఇంటర్ ఫలితాల్లో నాలుగో స్థానం ► మళ్లీ విద్యార్థినులదే పై చేయి ... 79 శాతం పాస్ ► ఫస్టియర్‌లో 70 శాతం, సెకండియర్‌లో 76 శాతం ఉత్తీర్ణత గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు విజయదుందుభి మోగించారు. ఆరేళ్లుగా బాలురను అధిగమించి అగ్రస్థానంలో నిలుస్తున్న బాలికలు మరోసారి పై చేయి సాధించారు. మంగళవారం ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు విడుదల చేసిన ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో బాలికలు ముందంజలో నిలిచారు.జిల్లాలో ప్రథమ సంవత్సర ఫలితాల్లో 70 శాతం, ద్వితీయ సంవత్సరంలో 76 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. జూనియర్, సీనియర్ ఇంటర్ ఫలితాలు ఒకే సారి విడుదల కావడం ఇదే తొలిసారి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ విభాగాల వారీగా అధిక మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయి టాప్-10లో చోటు సంపాదించారు. ఫలితాలను ఏబీసీడీ గ్రేడ్లుగా విభజించిన ఇంటర్మీడియెట్ బోర్డు మార్కుల రూపంలోనూ ప్రకటించింది. ప్రథమ సంవత్సరంలో 70 శాతం ... మార్చి నెలలో జరిగిన ప్రథమ సంవత్సర పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా హాజరైన 47,116 మంది విద్యార్థుల్లో 32,991 మంది ఉత్తీర్ణులయ్యారు. 70 శాతంఉత్తీర్ణత నమోదయ్యింది. వీరిలో బాలికలు 74 శాతం, బాలురు 66 శాతం ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా వృత్తి విద్యాకోర్సుల నుంచి ప్రథమ సంవత్సరంలో 52 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. 1,198 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 624 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 66 శాతం ఉత్తీర్ణత నమోదై, ఐదో స్థానంలో నిలిచిన జిల్లా ప్రస్తుతం 70 శాతంతో 4వ స్థానానికి జారింది. ద్వితీయ సంవత్సరంలో 76 శాతం ... ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరైన 41,927 మంది విద్యార్థులలో 31,864 మంది ఉత్తీర్ణులయ్యారు. 76 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 79 శాతం, బాలురు 73 శాతం ఉత్తీర్ణ నమోదు చేశారు. వృత్తి విద్యాకోర్సులలో 76 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. పరీక్ష రాసిన 524 మందిలో 396 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 76 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 3వ స్థానంలో నిలిచిన జిల్లా ప్రస్తుతం అదే ఉత్తీర్ణత శాతం నమోదైనప్పటికీ 4వ స్థానానికి దిగజారింది. మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్మీడియెట్ ఫలితాల్లో తప్పిన విద్యార్థులకు మే 24వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నా యి. సప్లిమెంటరీ పరీక్షలకు ఈనెల 26 లోపు దరఖాస్తు చేసుకోవాలి. -
ఉద్యోగ ఆధారిత కోర్సులకు శ్రీకారం
వచ్చే జూన్ కల్లా 250 కొత్త గురుకులాల ప్రారంభం వీటి ఏర్పాటుకు మొత్తం రూ.5,500 కోట్ల వ్యయం డిగ్రీ నుంచే పోటీ పరీక్షలకు శిక్షణ: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ బీఏ, బీఎస్సీ, బీకాం వంటి డిగ్రీ కోర్సులకు భిన్నంగా కాలేజీల నుంచి విద్యార్థులు బయటకు రాగానే ఏదో ఒక ఉద్యోగం, ఉపాధి లభించేలా సంక్షేమ గురుకుల డిగ్రీ కోర్సుల సిలబస్‌కు తుదిరూపునిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్, పరిశ్రమల్లో సిబ్బంది, ఉద్యోగులు, సదుపాయాల కల్పనకు ఉత్పన్నమయ్యే అవసరాలకు తగ్గట్లుగా సిలబస్‌ను రూపొందిస్తున్నారు. వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో అనుసంధానం చేయనున్నారు. దీనికి సంబంధించి ఆయా పరిశ్రమల ప్రతినిధులతో చర్చలప్రక్రియను ప్రారంభించారు. ఆంగ్లం, కంప్యూటర్ వినియోగంలో విద్యార్థులు పైచేయిని సాధించేలా శిక్షణను ఇవ్వనున్నారు. ప్రవేశ పరీక్షను నిర్వహించడం ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కాలేజీలను పెద్ద పట్టణాలు, నగరాలకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జూన్‌కల్లా కొత్త గురుకుల పాఠశాలలు ఏర్పాటు.. వచ్చే జూన్ చివరికల్లా రాష్ర్టంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల కోసం కొత్త గురుకుల పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అవసరమైన బడ్జెట్, మౌలిక సదుపాయాలు, టీచర్లు, సిబ్బంది, భవనాల ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన వెంటనే పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయా శాఖలు వెల్లడించాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల సొసైటీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. 250 గురుకులాల ఏర్పాటుకు రూ.5,500 కోట్లు.. కొత్తగా ఏర్పాటు చేయనున్న 250 గురుకుల విద్యాలయాల ద్వారా 1.6 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వీటి ఏర్పాటుకు రూ. 5,500 కోట్లు వ్యయం అవుతుందని అంచనావేస్తున్నారు. ఒక్కో రె సిడెన్షియల్ స్కూల్‌కు 7 ఎకరాల స్థలంతో పాటు రూ.22 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారులు తేల్చారు. ఈ విద్యాసంవత్సరం (2016-17) నుంచే ఎస్సీ విద్యార్థుల కోసం వంద రెసిడెన్షియల్ పాఠశాలలు, మైనారిటీ విద్యార్థుల కోసం 70 గురుకులాలు, ఎస్టీ విద్యార్థులకు 50 రెసిడెన్షియల్ స్కూళ్లు, మహిళల కోసం 25, అబ్బాయిల కోసం 5 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్రెంచ్, స్పానిష్నూ బోధిస్తాం.. ‘‘ డిగ్రీ నుంచే సివిల్స్, కేంద్ర, రాష్ట్ర, కార్పొరేట్ రంగాల్లోని పోటీ పరీక్షలకు అవసరమైన లాంగ్‌టర్మ్ శిక్షణను అందిస్తాం. దేశంలో ఎక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చినా వాటిలో సింహభాగం తెలంగాణ వారికే దక్కేలా చూడాలన్నది ప్రభుత్వ ధ్యేయం. డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లిష్ మీడియంలోనే. ఫ్రెంచ్, స్పానిష్ వంటి భాషలను బోధిస్తాం. సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, ఫ్రీలాన్సింగ్‌లో విద్యార్థులు ఆరితేరేలా తరగతులుంటాయి. బయట జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందిస్తున్నాం. వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణనిచ్చి, స్కూల్ నుంచి బయటకు రాగానే ఉపాధి దొరికేలా సశక్తులను చేస్తాం. మ్యూజిక్, ఆర్ట్, డాన్స్‌లలో శిక్షణనిచ్చేలా రూపొందిస్తున్నాం.’’ - ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి -
‘ఉమ్మడి’ పరీక్షలు నిర్వహించే వర్సిటీల ఖరారు
ఎంసెట్, ఈసెట్ జేఎన్టీయూ(హెచ్)కే..కాకతీయకు ఐసెట్, లాసెట్ ఉస్మానియాకు ఎడ్‌సెట్, పీజీఈసెట్ సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది మే నెలలో వృత్తి విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్న వర్సిటీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఎప్పటిలాగే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంసెట్)తో పాటు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలోకి నేరుగా ప్రవేశించేందుకు పాలిటెక్నిక్ విద్యార్థులకు నిర్వహించే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష (ఈసెట్)ను జేఎన్టీయూ(హెచ్) నిర్వహిస్తుంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్‌ను కాకతీయ వర్సిటీ నిర్వహిస్తుంది. -
కేజీ టు పీజీలోనూ వృత్తి విద్య!
- అనుసంధానించాలనే యోచనలో విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న కేజీ టు పీజీ ఉచిత నిర్భంద విద్యలో వృత్తి విద్య కోర్సులను ప్రవేశపెట్టే అంశంపైనా విద్యాశాఖ ఆలోచనలు చేస్తోంది. నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను (ఎన్ఎస్క్యూఎఫ్) రూపొందించిన కేంద్ర ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్యా కోర్సులను ప్రవేశ పెట్టాలని స్పష్టం చేసింది. తద్వారా విద్యార్థులు వివిధ దశల్లోని ఆయా కోర్సులను చదువుకోవడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్న కేజీ టు పీజీలో వృత్తి విద్యా కోర్సుల ప్రవేశంపైనా ప్రభుత్వం ఆలోచిస్తోంది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో దీనిపై చర్చించినట్లు తెలిసింది. కేజీ టు పీజీపై విధాన పత్రం రూపొందించేందుకు నిర్వహించిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, విద్యావేత్త చుక్కా రామయ్య, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు, అదనపు డెరైక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివి ద అంశాలపై చర్చించారు. ఇప్పటివరకు రాష్ట్ర విద్యా విధానంలో గురుకుల విద్య మాత్రమే పక్కాగా సత్ఫలితాలు ఇస్తోందన్న భావనకు ప్రభుత్వం వచ్చిం ది. అందుకే కేజీ టు పీజీ విద్యా సంస్థల్లో గురుకుల విద్య, ఇంగ్లిషు మీడియం విద్యను ప్రవేశపెట్టాలని సమావేశంలో ప్రాథమికంగా ఓ అవగాహనకు వచ్చారు. అయితే ఏ తరగతి నుంచి ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టాలి? ఏ తరగతి నుంచి గురుకుల విద్యను అమలు చేయాలన్న ఆంశాలపై వివిధ కోణాల్లో ఆలోచనలు చేశారు. కొంత మంది కిండర్‌గార్టెన్ (కేజీ) నుంచే ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెట్టాలని పేర్కొనగా మరికొంత మంది 4వ తరగతి నుంచి ఇంగ్లిషు మీడియం ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలని కొందరు పేర్కొనగా, తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు కేజీ నుంచే ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెట్టాలని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ప్రాథమిక స్థాయిలో తెలుగుతోపాటు ఇంగ్లిషు మీడియంను కూడా కొనసాగించడానికి వీలు అవుతుందా? ఇంగ్లిషును ఒక సబ్జెక్టుగా కొనసాగిస్తే ఎలా ఉంటుందన్న ఆంశాలపై చర్చించారు. ఇప్పటివరకు అంతర్జాతీయంగా ఎక్కడా లేని కొత్త విధానం అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ, జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయని, ఎలా ముందుకు సాగాలన్న అంశాలపై చర్చ జరి గింది. మొత్తానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాలకు చెందిన నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్న ముఖ్య లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలా ముందుకు సాగాలన్న అంశాలపై ఈనెల 18 లేదా 19 తేదీల్లో మరోసారి సమావేశమై విధాన పత్రాన్ని ఖరారు చేయాలని నిర్ణయించారు. ఆ తరువాత ఆ విధానపత్రాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదానికి పంపించనున్నారు. సీఎం ఆమోదం తరువాత తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలతో చర్చించాలని, వెబ్సైట్లో పెట్టి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించారు. -
9వ తరగతి నుంచే వృత్తి విద్య!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 9వ తరగతి నుంచే వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రీయ మాధ్యమిక అభియాన్‌పై (ఆర్‌ఎంఎస్‌ఏ) బుధవారం డీఈఓలతో జరిగిన సమావేశంలో దీనిపై చర్చించింది. వివిధ రంగాల్లో 810 వరకు వృత్తి విద్యా కోర్సులు ఉండగా, అందులో రాష్ట్రంలో 9, 10, 11, 12 తరగతుల్లో ప్రవేశపెట్టేందుకు వీలైనవాటిని, అందుకు అనుగుణమైన సిలబస్ రూపకల్పన వంటి అంశాలపై దృష్టి సారించాలని విద్యాశాఖ భావిస్తోంది. అయితే వీటిపై ప్రభుత్వంతో మరోసారి చర్చించాక ప్రతిపాదనలను ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. -
సీఏ, సీఎస్, సీఎంఏ.. ప్రాక్టికల్ ట్రైనింగ్.. పరిపూర్ణతకు మార్గం
చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ); కంపెనీ సెక్రటరీ (సీఎస్); కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్ (సీఎంఏ).. కామర్స్ రంగంలో దశాబ్దాలుగా ఆదరణ పొందుతున్న ప్రొఫెషనల్ కోర్సులు. నేటి పారిశ్రామికీకరణ, గ్లోబలైజేషన్ యుగంలో వీటికి మరింత డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు వీటి విషయంలో ఎదురవుతున్న సమస్య... నైపుణ్య లేమి. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన నియంత్రణ సంస్థలు ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు ప్రాధాన్యమిచ్చాయి. మరే ఇతర కోర్సుల్లో లేని విధంగా ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను తప్పనిసరి చేశాయి. క్షేత్ర నైపుణ్యాలు పెంపొందించుకోవడం కరిక్యులంలో భాగం చేశాయి. ఈ నేపథ్యంలో సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సుల ప్రాక్టికల్ ట్రైనింగ్‌పై ఫోకస్.. సీఏ.. ఆర్టికల్‌షిప్‌కు అత్యంత ప్రాధాన్యం చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులో ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను ఆర్టికల్షిప్గా పేర్కొంటున్నారు. కోర్సు నియంత్రణ సంస్థ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్‌డ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఆర్టికల్‌షిప్‌నకు అత్యంత ప్రాధాన్యమిస్తూ నిబంధనలు అమలు చేస్తోంది. మూడేళ్ల ఆర్టికల్‌షిప్ పూర్తి చేసినవారిని మాత్రమే కోర్సు ఫైనల్ పరీక్షల్లో హాజరుకు అనుమతిస్తోంది. సీఏ విద్యార్థులు కోర్సు రెండో దశ ఐపీసీసీలో పేరు నమోదు చేసుకున్నప్పటి నుంచే గుర్తింపు పొందిన ఆడిటర్ లేదా ఆడిట్ సంస్థ వద్ద ఆర్టికల్ ట్రైనింగ్‌లో అడుగుపెట్టాలి. విద్యార్థులు తాము థియరిటికల్‌గా చదువుతున్న అంశాలను అప్పటికప్పుడు ప్రాక్టికల్‌గా అన్వయించే నైపుణ్యాలు సొంతం చేసుకునేలా చేయడమే ఈ నిబంధన ప్రధాన ఉద్దేశం. ఫలితంగా ఫైనల్ సర్టిఫికెట్ చేతికందేనాటికి విద్యార్థికి ఒక పూర్తిస్థాయి సీఏకు అవసరమైన అన్ని నైపుణ్యాలు లభిస్తాయి. ఆర్టికల్‌షిప్ సమయంలో ట్రైనీకి నిర్ణీత మొత్తంలో స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. అదే విధంగా విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా సెలవులు ఇవ్వాలని కూడా ఐసీఏఐ స్పష్టం చేసింది. సమస్యలివే ట్రైనీలు తమ ఆర్టికల్‌షిప్ సమయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమను సదరు సంస్థ లేదా సర్టిఫైడ్ ఆడిటర్ అన్ని విభాగాల్లో పాల్పంచుకోనీయడం లేదని, దీనివల్ల అన్ని అంశాలపై అవగాహన లభించట్లేదని ట్రైనీలు అంటున్నారు. అంతేకాకుండా సీఏ పరీక్షల ప్రిపరేషన్ కోణంలో ఐసీఏఐ నిర్దేశించిన విధంగా సెలవుల మంజూరు కూడా ఉండట్లేదని చెబుతున్నారు. దీనికి ప్రిన్సిపల్ ఆడిటర్స్ స్పందిస్తున్న తీరు భిన్నంగా ఉంటోంది. ఆర్టికల్ ట్రైనీలు ఒక సంస్థలోని అన్ని కార్యకలాపాల్లో పాల్పంచుకోవాలనే విషయంలో ఆ సంస్థ లేదా ఆడిటర్ దృక్పథం ప్రధాన పాత్ర పోషిస్తుందంటున్నారు. క్లయింట్లు ఎక్కువగా ఉన్న సంస్థలో ఆడిటర్ తమ క్లయింట్లకు త్వరగా సేవలందించాలనే లక్ష్యంగా ఉంటారు. ఇలాంటి సంస్థల్లో ఆర్టికల్ ట్రైనీలకు అన్ని అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఎక్కువ సమయం కేటాయించే పరిస్థితి ఉండదు. కాబట్టి అభ్యర్థులే సహజ చొరవతో పరిశీలన నైపుణ్యాలను పెంచుకుని సంస్థలో జరుగుతున్న కార్యకలాపాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. సెలవుల మంజూరు కూడా సంస్థ లేదా ఆడిటర్పైనే ఆధార పడి ఉంటుంది. ‘చిన్న సంస్థల్లో సిబ్బంది తక్కువగా ఉంటారు. అలాంటి వారు విధుల పరంగా ఆర్టికల్ ట్రైనీలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతోవారికి సెలవులు మంజూరు చేయడంలో కొంత సమస్య ఎదురవుతోంది’ అంటున్నారు హైదరాబాద్‌లోని ప్రముఖ ఆడిట్ సంస్థ నిర్వాహకులు. ఆర్టికల్షిప్తోపాటు అదనంగా.. నిర్దేశించిన ఆర్టికల్‌షిప్ పూర్తయిన తర్వాత మూడు నెలలపాటు జనరల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్(జీఎంటీ) కూడా చేయాలి. అకౌంటింగ్ నైపుణ్యాలతోపాటు నిర్వహణ పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో ఐసీఏఐ ఈ జీఎంటీకి రూపకల్పన చేసింది. కానీ.. చాలామంది విద్యార్థులు సిలబస్ విస్తృతంగా ఉండే సీఏ కోర్సు పరీక్షలో ఉత్తీర్ణతకే ప్రాధాన్యమిస్తున్నారు. థియరిటికల్ ప్రిపరేషన్‌కే ఎక్కువ సమయం కేటాయిస్తూ డమ్మీ ఆర్టికల్స్‌ను అన్వేషిస్తున్నారనే అభిప్రాయముంది. తప్పనిసరిగా ప్రత్యక్షంగా ఆర్టికల్‌షిప్ పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్టికల్స్, థియరీ రెండింటికీ ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగితే ప్రాక్టికల్ నైపుణ్యాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి. ఆర్టికల్‌షిప్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారం కోసం ఐసీఏఐను సంప్రదించవచ్చు. సీఎంఏలోనూ మూడున్నరేళ్లు.. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ).. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించే కోర్సు. మారిన నిబంధనలతో సర్వీసెస్ నుంచి సాఫ్ట్వేర్ వరకు అన్ని రంగాల్లోనూ ఇప్పుడు కాస్ట్ అకౌంటెంట్ల అవసరం ఏర్పడింది. ప్రధానంగా ఉత్పత్తి సంస్థల్లో కాస్ట్ అకౌంటెంట్ల డిమాండ్ ఎక్కువ. సీఏంఏ కోర్సు నిర్వహణ సంస్థ ఐసీఎంఏఐ విద్యార్థుల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలకు పెద్దపీట వేస్తోంది. సీఏ మాదిరిగానే మూడున్నరేళ్ల ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను తప్పనిసరి చేసింది. అయితే సీఎంఏ కోర్సు విషయంలో విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ పరంగా కొంత వెసులుబాటు ఉంది. సీఏలో మాదిరిగా మూడేళ్లు ఆర్టికల్ చేస్తేనే ఫైనల్ పరీక్షకు అర్హత అనే నిబంధన సీఎంఏలో లేదు. కోర్సు రెండోదశగా పేర్కొనే ఇంటర్మీడియెట్ తర్వాత ఆరు నెలలు తొలి దశ ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను పూర్తి చేసుకుంటే.. ఫైనల్ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతి లభిస్తుంది. తర్వాత ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాక తప్పనిసరిగా మూడేళ్లపాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేయాలి. అప్పుడే సంస్థ నుంచి స్టూడెంట్‌షిప్ లభిస్తుంది. అంతేకాకుండా సీఎంఏ విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు సీఏతో పోల్చితే ఎక్కువ మార్గాలు ఉన్నాయనేది నిపుణుల అభిప్రాయం. కేవలం ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ల వద్దే కాకుండా సంస్థల్లోనూ ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేసుకునే వీలుంది. సీఎంఏ ప్రాక్టికల్ ట్రైనింగ్ విషయంలో విద్యార్థులు పేర్కొంటున్న సమస్యలు.. అన్ని విభాగాలపై అవగాహన కల్పించకపోవడం, పరీక్షలకు సెలవులు ఇవ్వకపోవడం. అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చే సంస్థ ఏదో ఒక విభాగంలో వారిని నియమిస్తోంది. దాంతో అన్ని అంశాలపై అవగాహన లభించడం లేదు. విద్యార్థులు చొరవగా ఆయా విభాగాల్లోని వారితో మాట్లాడం ద్వారా అక్కడి పనితీరును తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సీఎస్.. ట్రైనింగ్ తప్పనిసరి.. కానీ.. కంపెనీ సెక్రటరీ కోర్సు... ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా మూడు దశలుగా నిర్వహించే ఈ కోర్సులోనూ ప్రాక్టికల్ ట్రైనింగ్ తప్పనిసరి. ప్రస్తుతం ఫౌండేషన్ కోర్సు, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అనే మూడు దశలుగా సీఎస్ కోర్సు స్వరూపం ఉంది. తాజా నిబంధనల ప్రకారం- ప్రాక్టికల్ ట్రైనింగ్ పరంగా ఫౌండేషన్ కోర్సు నుంచే దీన్ని ప్రారంభించొచ్చు. ఫౌండేషన్ కోర్సు నుంచి మూడేళ్లు; ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ తర్వాత రెండేళ్లు; ప్రొఫెషనల్ కోర్సు తర్వాత ఒక ఏడాది ప్రాక్టికల్ ట్రైనింగ్ (అప్రెంటీస్‌షిప్) పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ తాజా మార్పు విషయంలోనే ఈ రంగంలోని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎస్ తుది దశ అయిన ప్రొఫెషనల్ కోర్సు తర్వాత ఏడాది వ్యవధిలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేస్తే చాలు అనే వెసులుబాటు కారణంగా.. అత్యధిక శాతం మంది అభ్యర్థులు ప్రాక్టికల్స్‌కు అత్యల్ప ప్రాధాన్యమిస్తారని అంటున్నారు. ముందుగా పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా వ్యవహరిస్తారని పర్యవసానంగా క్షేత్ర నైపుణ్యాలు కొరవడతాయని చెబుతున్నారు. ఇది భవిష్యత్ కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఔత్సాహికులు వెసులుబాట్లు గురించి అన్వేషించకుండా.. క్షేత్ర నైపుణ్యాలు పెంచుకునే విధంగా వీలైనంత ఎక్కువ సమయం ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు కేటాయించాలి. అప్పుడే తాము అకడమిక్‌గా చదువుకున్న అంశాలకు సంబంధించి రియల్‌టైం అప్లికేషన్స్‌పై అవగాహన ఏర్పడుతుంది. కంపెనీల చట్టం, ఇతర న్యాయ పరమైన సబ్జెక్ట్‌ల ప్రాధాన్యం ఎక్కువగా ఉండే సీఎస్‌లో పరిపూర్ణత లభించాలంటే ప్రాక్టికల్ అప్రోచ్‌కు పెద్దపీట వేయాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాక్టికల్ ట్రైనింగ్ (అప్రెంటీస్‌షిప్) విషయంలో వ్యక్తిగతంగానైనా చొరవ చూపి ముందుకు సాగాలి. అప్పుడే కోర్సులో చేరిన లక్ష్యం నెరవేరడంతోపాటు సుస్థిర భవిష్యత్తు సొంతమవుతుంది. ప్రొఫెషనల్‌గా రూపొందాలంటే.. ప్రాక్టికల్ నాలెడ్జ్, స్కిల్ సెట్ల అవసరం సీఏ, సీఎంఏ, సీఎస్ కెరీర్‌కు చాలా ఎక్కువ. కారణం.. తాము చదివిన అంశాలను తక్షణమే అన్వయించాల్సిన విధంగా విధులు ఉంటాయి. దాంతో ఈ రంగంలో మంచి ప్రొఫెషనల్‌గా పేరు గడించాలంటే తప్పనిసరిగా ప్రాక్టికల్ అప్రోచ్ పెంపొందించుకోవాలి. పరీక్షల్లో ఉత్తీర్ణత గురించి ఆందోళన చెందకుండా అకడమిక్ సిలబస్ ప్రిపరేషన్ సాగిస్తూనే ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో వాటిని అన్వయించే నైపుణ్యాలు పెంచుకుంటే సర్టిఫికెట్ సొంతం చేసుకోవడం ఎంతో సులభం. చేయూతనిస్తున్న ఇన్స్టిట్యూట్లు.. సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సుల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ పరంగా విద్యార్థులకు సదరు నిర్వహణ ఇన్స్టిట్యూట్లు చేయూతనిస్తున్నాయి. ట్రైనింగ్ మార్గాలు అన్వేషిస్తున్న అభ్యర్థులకు సహకరిస్తున్నాయి. ఆయా ఇన్స్టిట్యూట్ల చాప్టర్లను సంప్రదిస్తే ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు అవకాశం కల్పిస్తున్న సంస్థలు, ప్రాక్టీసింగ్ ఆడిటర్స్/సెక్రటరీస్ సమాచారం తెలియజేస్తున్నాయి. పోస్టల్ కోచింగ్ ద్వారా కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులు; నాన్-మెట్రోస్లోని విద్యార్థులకు ఈ సదుపాయం ఎంతో మేలు చేస్తోంది. ప్రాక్టికల్ థింకింగ్ ఉంటేనే... సీఏ కెరీర్లో అడుగుపెట్టే విద్యార్థులు ముందుగా తమలో ప్రాక్టికల్ థింకింగ్ లెవెల్స్‌పై స్పష్టతకు రావాలి. ఎందుకంటే.. సీఏ కోర్సులో ప్రాక్టికాలిటీ ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఈ రంగంలోని సీనియర్లను, సంస్థలను, ప్రాక్టీసింగ్ సీఏలను సంప్రదించి తమ అవగాహన స్థాయి తెలుసుకోవాలి. ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఆర్టికల్ షిప్) విషయానికొస్తే.. పకడ్బందీ అన్వేషణ సాగించాలి. సదరు సంస్థ లేదా ఆడిటర్‌కు ఉన్న గుర్తింపు, క్లయింట్ల సంఖ్య-స్థాయి ఆధారంగా ఆర్టికల్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఆర్టికల్‌షిప్ సమయంలో సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకునే కోణంలో కృషి చేస్తే పరిపూర్ణ అవగాహన లభిస్తుంది. ‘పరీక్షలో ఉత్తీర్ణతకే ప్రాధాన్యమిద్దాం. తర్వాత విధుల్లో చేరి ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతం చేసుకోవచ్చు’ అనే ఆలోచన సరికాదు. - ఎం.దేవరాజ రెడ్డి, చైర్మన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్,ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సీఎంఏ.. క్షేత్ర నైపుణ్యాలు ఎంతో ముఖ్యం సీఎంఏ కోర్సు విషయంలో క్షేత్ర నైపుణ్యాలు ఎంతో ముఖ్యం. అందుకే మూడున్నరేళ్ల ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను తప్పనిసరి చేశాం. ఇదే సమయంలో విద్యార్థుల కోణంలోనూ ఆలోచించి వెసులుబాటు కల్పించాం. దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. వీలైనంత వరకు ఫైనల్ పరీక్ష నాటికి అధిక శాతం ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను పూర్తి చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రాక్టికల్ ట్రైనింగ్ సమయంలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాటు చేశాం. కాబట్టి ఒకటిరెండు సంఘటనలు చూసి ఆందోళన చెందకుండా.. నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేయాలి. - ఎ.ఎస్. దుర్గా ప్రసాద్, చైర్మన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిరంతర అవగాహనతోనే సీఎస్‌లో రాణింపు సీఎస్ కోర్సులో రాణించాలంటే నిరంతర అవగాహనే ప్రధానం. ఇందుకు సాధనం ప్రాక్టికల్ ట్రైనింగ్(అప్రెంటీస్‌షిప్). దీని విషయంలో ప్రస్తుతం పలు వెసులుబాట్లు ఉన్నాయి. ఔత్సాహిక విద్యార్థులు వాటి గురించి పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందే విధంగా అడుగులు వేయాలి. ముఖ్యంగా లీగల్ నాలెడ్జ్ ఆవశ్యకత ఎక్కువగా ఉండే సీఎస్ కోర్సులో రియల్‌టైం ఎక్స్పోజర్ ఎంతో అవసరం. దీన్ని గుర్తించి ఎగ్జిక్యూటివ్ దశ నుంచే ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రారంభించడం మంచిది. - డి. వాసుదేవరావు, చైర్మన్, ఐసీఎస్ఐ-హైదరాబాద్ చాప్టర్ ఎడ్యూ ఇన్ఫో విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు ఏఐసీటీఈ చర్యలు భారతదేశంలోని ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్స్‌లో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను పెంచే దిశగా ఏఐసీటీఈ చర్యలు తీసుకుంటోంది. ఉన్నత విద్యను అంతర్జాతీయీకరణ చేయాలనే ఉద్దేశంతోపాటు, అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరిగితే ఇన్స్టిట్యూట్లలో సాంస్కృతిక వైవిధ్యం కూడా పెరుగుతుందని, ఫలితంగా మన విద్యార్థులు భవిష్యత్తులో విదేశాల్లోనూ రాణించేందుకు ఆస్కారం లభిస్తుందని ఏఐసీటీఈ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో చదవాలనుకుంటున్న ఔత్సాహిక విదేశీ విద్యార్థుల కోసం అమెరికాలో నిర్వహిస్తున్న స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మాదిరిగా ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేసే దిశగా ఏఐసీటీఈ వేగంగా అడుగులు వేస్తోంది. విదేశాల నుంచి భారత్‌కు ఉన్నత విద్య కోసం వస్తున్న విద్యార్థుల సంఖ్య 2013 నాటికి 1.3 లక్షలు ఉండగా ప్రతి ఏటా వస్తున్న సంఖ్యను పరిగణిస్తే అది 15 శాతంలోపే ఉంటోంది. తాజాగా తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
బడి నుంచే బతుకు విద్య
* 9వ తరగతి నుంచే ప్రత్యేకంగా కోర్సులు ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయం * పీజీ వరకు తొమ్మిది స్థాయిల్లో ఏర్పాటు * రాష్ట్రంలోనూ ఆ దిశగానే అడుగులు సాక్షి, హైదరాబాద్: చదువు పూర్తయిన వెంటనే ఉపాధి పొందేందుకు తోడ్పడేలా... పాఠశాల స్థాయి నుంచే వృత్తివిద్యా కోర్సులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యువతలో నైపుణ్యాల పెంపు, వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టేందుకు ‘నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఎస్క్యూఎఫ్)’ను కేంద్రం రూపొందించింది. ఇందులో భాగంగా 9వ తరగతి నుంచి ప్రారంభించి పీజీ వరకు తొమ్మిది స్థాయి (లెవల్)ల కోర్సులను బోధిస్తారు. మొత్తం 32 రంగాల్లో 879 వృత్తి విద్యా కోర్సులను ఏర్పాటు చేస్తారు. సాధారణ విద్యతోపాటే ఈ కోర్సులను నడిపేలా చర్యలు చేపడతారు. ఇక రాష్ట్ర ప్రభుత్వమూ ఆ దిశగానే కసరత్తు చేస్తోంది. కేజీ టు పీజీ స్కూళ్లలో విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకే ప్రాధాన్యం ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇంజనీరింగ్ కోర్సుల సిలబస్‌నూ మార్పు చేయనుంది. కోర్సుల అనుసంధానం ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌లో పేర్కొన్న ప్రకారం... వృత్తి విద్యా కోర్సులను ఏడాదికో, రెండేళ్లకో పరిమితం చేయకుండా అనుసంధాన వ్యవస్థను రూపొందించారు. అందులో భాగంగా ఏడు స్థాయిల్లో ఈ కోర్సులుంటాయి. ఒక్కో స్థాయిలో ఒక్కో కోర్సు పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు ఇవ్వనుంది. ఏడాది కోర్సులో వృత్తి విద్యకు, సాధారణ విద్యకు వెచ్చించాల్సిన పని గంటలను కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 9వ తరగతికి సమానమైన కోర్సును సర్టిఫికెట్ లెవల్-1గా పేర్కొంటారు. నిబంధన లివీ ఈ వృత్తివిద్య బోధించే విద్యా, శిక్షణ సంస్థల స్థాయిలో నైపుణ్యాల సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. కోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను స్కూల్ / కాలేజీ / బోర్డు / యూనివర్సిటీలు ఇచ్చుకోవచ్చు. ప్రతి సర్టిఫికెట్ కోర్సులో ఏడాదికి వెయ్యి పని గంటలుండాలి. ఇందులో నైపుణ్యాలు, విద్యకు పని గంటలను విభజించాలి. 1, 2, 3, 4 స్థాయిల సర్టిఫికెట్ కోర్సుల్లో విద్యా సంబంధ అంశాలు సీబీఎస్ఈ లేదా స్టేట్ బోర్డుకు సంబంధించినవి ఉండొచ్చు. సైన్స్, ఆర్ట్స్, కామర్స్ విభాగాల్లో ఈ కోర్సులను ప్రవేశపెట్టవచ్చు. 5, 6, 7 స్థాయి కోర్సుల్లో ప్రవేశపెట్టబోయే సిలబస్ అన్ని యూనివర్సిటీల్లో ఒకేలా ఉండాలి. ఉదాహరణకు డిగ్రీ స్థాయిలో ప్రవేశపెట్టే కోర్సును బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ (అగ్రికల్చర్ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ తరహాలో..) అని పేర్కొంటారు. అలాగే డిప్లొమా స్థాయిలో డిప్లొమా (వొకేషనల్)గా పేర్కొంటారు. వివిధ రంగాల్లో కమ్యూనిటీ స్కిల్ డిప్లొమాను ప్రవేశపెడతారు. దీనిని కమ్యూనిటీ స్కిల్ డిప్లొమా (వొకేషనల్)గా పేర్కొన్నారు. ఇక పాఠశాల స్థాయిలో స్కూల్ లెవల్ వొకేషనల్ ఎడ్యుకేషన్ కోర్సును ప్రవేశపెడతారు. స్కూల్ బోర్డు నిర్వహించే వృత్తి విద్యా కోర్సుల ఆధారంగా ఇవి ఉంటాయి. ఏయే రంగాల్లో ఎన్ని..? మానవ వనరులు ఎక్కువగా అవసరమైన 32 రంగాలను గుర్తించిన ప్రభుత్వం.. వాటిల్లో 879 రకాల కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. తద్వారా ఈ కోర్సులను పూర్తి చేసే విద్యార్థులు వెంటనే ఆయా రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా ప్రణాళికలు రూపొందించింది. వ్యవసాయ రంగంలో 42 రకాల కోర్సులను.. అపెరల్ 6, ఆటోమోటివ్ 189, బ్యూటీ-వెల్నెస్ 3, బీఎఫ్ఎస్ఐ 6, కేపిటల్ గూడ్స్ 56, కన్స్ట్రక్షన్ 12, ఎలక్ట్రానిక్స్ 139, జెమ్స్-జ్యువెలరీ 87, ఆరోగ్య రంగం 28, ఐటీ-ఐటీఈఎస్ 75, లెదర్ 22, లాజిస్టిక్స్ 4, లైఫ్‌సెన్సైస్ 5, మీడియా-ఎంటర్టైన్మెంట్ 48, మైనింగ్ 10, ప్లంబింగ్ 26, రిటైల్ 4, రబ్బర్ 70, సెక్యూరిటీ 9, టెలికం రంగంలో 33 రకాలు, టూరిజం-హాస్పిటాలిటీ రంగంలో 5 రకాల కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. -
డమ్మీ ప్రాజెక్టు వర్కులకు చెక్!
సాక్షి, హైదరాబాద్: వృత్తి విద్యా కోర్సుల సిలబస్‌లో మార్పులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులోభాగంగా విద్యార్థుల ప్రాజెక్టు వర్క్‌లను పరిశ్రమల నేతృత్వంలోనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఎక్కువ శాతం విద్యార్థులు నామమాత్రంగానే ప్రాజెక్టు వర్క్ పూర్తి చేసి కోర్సును ముగిస్తున్నారు. ఇకపై ప్రాజెక్టు వర్క్ అనేది పరిశ్రమల అవసరాలకు, విద్యార్థి ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడేలా ఉండాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల పారిశ్రామికవర్గాలు, విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించింది. ఈ నెల 18న మరోసారి సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పరిశ్రమల నేతృత్వంలోనే ప్రాజెక్టులు చేసేలా మార్పు తీసుకురావడంపై తుది నిర్ణయం తీసుకోనుంది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా వృత్తి విద్యా కోర్సులు ఉం డేలా, కోర్సు పూర్తి చేయగానే ఉపాధి అవకాశాలు లభించేలా సిలబస్‌లో మార్పులపైనా దృష్టి సారించనుంది. ఐటీ రంగాల్లో మారే టెక్నాలజీలకు అనుగుణంగా విద్యా విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే ఏటా డిగ్రీ పూర్తి చేసుకుంటున్న 90వేల మందికి ఉద్యోగాలు లభించేలా శిక్షణ ఇచ్చేందుకు ‘హైక్వాలిటీ ఫినిషింగ్ స్కూల్’ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది. -
ఇంజనీరింగ్ సిలబస్ మారుస్తాం
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్ హైదరాబాద్: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ సిలబ స్ను మారుస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. దీని పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేపట్టిందని తెలిపారు. ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్‌పై శిక్షణనివ్వడం కోసం ‘తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్-టాస్క్’ పేరిట కొత్త ప్రాజెక్టు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు విద్యాసంస్థలకు, పరిశ్రమలకు టాస్క్ ఒక వారధిగా వ్యవహరిస్తుందన్నారు. ఐటీ పరిశ్రమకు చెందిన ప్రతినిధులతో బుధవారం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణాలో జరిగిన చర్చాగోష్టిలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో 300 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ప్రతి ఏడాది దాదాపు 70 వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తిచేస్తున్నారు. కానీ 20 వేల మందికే ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రభుత్వంతో పాటు ఐటీ పరిశ్రమ తమ వంతు చేయూత అందిస్తే మిగతావారు సైతం వివిధ రంగాల్లో ఉద్యోగాలను సాధించే అవకాశముంది..’’ అని ఆయన పేర్కొన్నారు. -
అధ్యాపకుల పాత్ర ఎంతో కీలకం
మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు ఎంప్లాయబిలిటీ, జాబ్ రెడీ స్కిల్స్ అందించడంలో అధ్యాపకుల పాత్ర ఎంతో కీలకం. ఫ్యాకల్టీ మార్గనిర్దేశానికి తోడు విద్యార్థులు కూడా అంకిత భావంతో శ్రమిస్తే విజయాలు సొంతమవుతాయి. అకడమిక్ కోర్సులనేవి అవకాశాలకు ఒక ప్లాట్‌ఫామ్ లాంటివి. ఆ సర్టిఫికెట్‌తోనే కెరీర్ సొంతమవ్వాలనే భావన వీడాలి అంటున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్- తిరుచిరాపల్లి (త్రిచీ) డెరైక్టర్ ప్రొఫెసర్ వై.ప్రఫుల్ల అగ్నిహోత్రి. మేనేజ్మెంట్ విభాగంలో పీజీ, పీహెచ్డీ పూర్తి చేసిన ఆయనకు పరిశ్రమలో, అకడమిక్స్‌లో 26 ఏళ్లకు పైగా అనుభవముంది. 2011 నుంచి ఐఐఎం- త్రిచీ డెరైక్టర్‌గా కొనసాగుతున్న ప్రొఫెసర్ అగ్నిహోత్రితో ప్రత్యేక ఇంటర్వ్యూ.. గెస్ట్ కాలమ్ ఇంటరాక్టివ్ మెథడ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి ప్రస్తుతం మన మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అధిక శాతం థియరీ బేస్డ్గా ఉంది. దీనికి బదులుగా ఇంటరాక్టివ్ మెథడ్స్‌ను అమలు చేయాలి. తద్వారా విద్యార్థులకు పుస్తకాల్లోని సిద్ధాంతాల పరిజ్ఞానంతోపాటు వాటిని ప్రాక్టికల్‌గా అన్వయించే స్కిల్స్ సొంతమవుతాయి. నేటి కార్పొరేట్ ప్రపంచంలో రాణించాలంటే.. విద్యార్థులకు జీవితంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదురయ్యే క్లిష్టమైన సంఘటనలకు ఎలాంటి పరిష్కారాలు కనుగొనాలనే విషయంలో అవగాహన అవసరం. విదేశాలకు.. మనకు తేడా ఇదే మనదేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్ సహా పలు బి-స్కూల్స్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తోంది. ఇవి విదేశాల్లోని ఇన్స్టిట్యూట్లకు దీటుగా పోటీపడుతున్నాయి. కానీ వీటి సంఖ్య వేళ్ల మీద లెక్కించదగ్గ స్థాయిలోనే ఉంది. దేశంలో వందల సంఖ్యలో ఉన్న బి-స్కూల్స్ సైతం అంతర్జాతీయ స్థాయిలో పోటీపడాలంటే.. ఇటు అధ్యాపకుల్లో, అటు విద్యార్థుల్లో రీసెర్చ్ ఓరియెంటేషన్ పెరగాలి. విదేశాల్లోని బి-స్కూల్స్‌కు, మన బి-స్కూల్స్‌కు మధ్య ప్రధాన తేడా రీసెర్చ విషయంలోనే! కాబట్టి మనం కూడా రీసెర్చ్ ఓరియెంటేషన్‌కు పెద్దపీట వేస్తే మన బిజినెస్ స్కూల్స్ నాణ్యత కూడా మెరుగవుతుంది. ఫ్యాకల్టీ సభ్యుల దృక్పథమూ మారాలి నేటి మేనేజ్మెంట్ విద్యార్థులు భవిష్యత్తులో నాయకులుగా రాణించాలంటే తరగతి గది నుంచే మార్పులు తీసుకురావాలి. ఈ క్రమంలో ముందుగా ఫ్యాకల్టీ దృక్పథంలో మార్పు రావాలి. గంట లేదా గంటన్నర సమయంలో ఉండే లెక్చర్‌ను ముగించడంతోనే తమ బాధ్యత పూర్తయిందని అధ్యాపకులు భావించకూడదు. విద్యార్థులకు సిలబస్ అంశాలను బోధించడంతోపాటు వారికి ఆదర్శంగా ఉండాలి. మెంటార్‌గా వ్యవహరించాలి. తరగతిలో విద్యార్థులకు వారి బలాలు- బలహీనతల ఆధారంగా వారు రాణించాల్సిన అంశాలు, పొందాల్సిన నైపుణ్యాలపై అవగాహన కల్పించాలి. ఐఐఎంల విస్తరణ.. పరిగణించాల్సిన అంశాలు దేశంలో ఐఐఎంలు, ఐఐటీలను విస్తరించాలనే నిర్ణయం మంచిదే. కొత్త క్యాంపస్ ఏర్పాటు- మనుగడ విషయంలో అత్యంత ప్రధానమైన అంశం క్యాంపస్‌ను ఏర్పాటు చేయదలచుకున్న ప్రదేశం లేదా ప్రాంతం. ఆ ప్రాంతంలో లభించే మౌలిక సదుపాయాలు, సామాజిక పరిస్థితులు, ఆ ప్రాంతానికున్న గుర్తింపు వంటి అంశాలను కూడా పరిశీలించాలి. అప్పుడే అత్యున్నత స్థాయి ఇన్స్టిట్యూట్ రూపకల్పన సాధ్యమవుతుంది. కొత్త ఫ్యాకల్టీ ఆసక్తి చూపడంలోనూ క్యాంపస్ భౌగోళిక స్వరూపం ఎంతో కీలకం. కేవలం భౌగోళిక పరిస్థితుల కారణంగా ఎందరో ఫ్యాకల్టీ వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయి. బోధన విధానంలోనూ మార్పులు రావాలి బోధన పరంగానూ ఫ్యాకల్టీ సభ్యులు కొత్త మార్పులు, విధానాలు అమలు చేయాలి. ప్రస్తుత అవసరాలు, వాస్తవ పరిస్థితుల కోణంలో విశ్లేషిస్తే.. బోధనలో ఎంక్వైరీ మెథడాలజీని ప్రవేశ పెట్టాలి. దీనివల్ల విద్యార్థుల్లో గ్రాహణ శక్తి, విశ్లేషణ నైపుణ్యాలు మెరుగవుతాయి. దాంతోపాటు కేస్ స్టడీస్, సిమ్యులేషన్ గేమ్స్, ప్రాజెక్ట్స్ తదితర బోధన పద్ధతులు పాటిస్తే విద్యార్థులకు నిజమైన పరిజ్ఞానం లభిస్తుంది. ఇండస్ట్రీ- అకడమిక్ కొలాబరేషన్‌కు మార్గాలు ఇటీవల కాలంలో చాలామంది విద్యావేత్తలు అత్యంత ఆవశ్యకంగా పేర్కొంటున్న అంశం.. ఇండస్ట్రీ- అకడమిక్ కొలాబరేషన్. దీనివల్ల విద్యార్థులకు మరింత నైపుణ్యం లభిస్తుందనే మాట వాస్తవం. అయితే, వీటిపై ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌కు అవగాహన ఉన్నప్ప టికీ.. మరెన్నో విద్యాసంస్థలకు సరైన మార్గం తెలియడం లేదు. పరిశ్రమ నిపుణులను గెస్ట్ ఫ్యాకల్టీగా పిలవడం.. కరిక్యులం రూపకల్పనలో వారిని సంప్రదించడం.. సంయుక్తంగా రీసెర్చ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం.. తదితర మార్గాల ద్వారా ఇండస్ట్రీ- అకడమిక్ కొలాబరేషన్‌ను బలోపేతం చేసుకోవచ్చు. అదే విధంగా అకడమిక్ కోణంలో ఇతర ఇన్స్టిట్యూట్లతో ఎక్స్ఛేంజ్ ఒప్పందా లు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ల ద్వారా విద్యార్థులతోపాటు ఫ్యాకల్టీకి కూడా తాజా పరిణామాలపై విస్తృత అవగాహన లభిస్తుంది. ఆలోచనలతోపాటు.. తపన కూడా ఉండాలి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. ఇటీవల కాలంలో విస్తృత ప్రచారం పొందు తోంది. ఇది ఆహ్వానించదగిన పరిణామం. ఔత్సాహికులు లక్ష్యం చేరుకునేందుకు అకడమిక్ స్థాయి నుంచే ఎన్నో మార్గాలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిలదొక్కుకోవాలంటే.. మంచి బిజినెస్ ఐడియాతోపాటు సాధించాలనే తపన, సవాళ్లను స్వీకరించే మానసిక సంసిద్ధత అవసరం. ఇది ఒక ప్లాట్‌ఫామ్ అనే భావించాలి భవిష్యత్తు అవకాశాల కోణంలో మేనేజ్మెంట్ కోర్సులను.. కేవలం ప్లాట్‌ఫామ్‌లుగా, మార్గాలుగానే భావించాలి. కోర్సులో చేరగానే కార్పొరేట్ కొలువు సొంతం అవుతుందనుకోకూడదు. సబ్జెక్ట్ నాలెడ్జ్‌కు కష్టించేతత్వం, అంకితభావం, సానుకూల దృక్పథం వంటివి ఉంటే చక్కటి భవిష్యత్తు సొంతమవుతుంది. వృత్తి జీవితంలో వివిధ దశల్లో విజయాలు సాధించేందుకు అవకాశం లభిస్తుంది. అందుకే క్లాస్ రూం నుంచే వీటిని అందిపుచ్చుకునేలా కృషి చేయా లి. విద్యార్థులకైనా, ఔత్సాహికులకైనా ఇదే నా సలహా!! -
చదువులు సాగేనా?
►ఫలితాలు వెలువడి నెలలు గడుస్తున్నా.. ►ఊసేలేని వృత్తివిద్యా కోర్సుల కౌన్సెలింగ్ ►కోర్టుకు చేరిన ‘స్థానిక’ వివాదం ► ఫీజుల చెల్లింపుపై వీడని అయోమయం ►విద్యాసంవత్సరం నష్టపోయే ప్రమాదం ►విద్యార్థుల భవిత అగమ్యగోచరం కరీంనగర్ ఎడ్యుకేషన్: ఫీజులు, స్థానికత అంశాలపై నేటికీ స్పష్టత రాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు విద్యా సంస్థల నిర్వాహకులు ఆందోళనకు గురవుతున్నారు. వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం పరీక్షలు రాసిన విద్యార్థులు కౌన్సెలింగ్ ఎప్పుడు జరుగుతుందా, కాలేజీలో ఎప్పుడు చేరుతామా.. అని ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, ఈసెట్, ఎల్ఎల్బీ, డీఈడీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం పరీక్షలు జరిగి, ఫలితాలు వచ్చి నెలలు గడుస్తున్నాయి. కానీ.. ఇంతవరకు కౌన్సెలింగ్ తేదీలపై ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రవేశాలు కొంత ఆలస్యమవుతాయనుకున్నా ఇప్పటికీ ఎటూ తేలకపోవడంతో విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోంది. కౌన్సెలింగ్‌లు పూర్తయి ఇప్పటికే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా.. అసలు ఆ ఊసే కనిపించడం లేదు. ఎప్పుడు నిర్వహిస్తారనే విషయమై కనీసం ప్రభుత్వానికి కూడా స్పష్టత రావడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయంటూ ఆ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. దీని స్థానంలో కొత్తగా ‘ఫాస్ట్’ పథకానికి రూపకల్పన చేసింది. 1956కు ముందు తెలంగాణలో స్థిరపడినవారి పిల్లలకు మాత్రమే ఫీజు చెల్లిస్తామని ప్రకటించింది. ఇంతకుమించి పథకంపై స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి మార్గదర్శకాలు రాకపోవడంతో అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయొద్దని తహశీల్దార్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో చాలాచోట్ల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద చాలామేర పాతబకాయిలున్నాయి. వాటిని మంజూరు చేస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రకియ కోసం అక్టోబర్ వరకు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టును కోరడంతో ప్రవేశాలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఇవన్నీ పరిష్కారమయ్యేదెన్నడో? కౌన్సెలింగ్ జరిగి తాము కళాశాలలకు వెళ్లి చదువుకునేదెప్పుడో? అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గందరగోళం విద్యాసంవత్సరం వెనకబడుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ కోర్సు ఆలస్యమైతే తరువాత ఉన్నత విద్యకోసం ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులున్నాయి. తరగతులు ఆలస్యమై విద్యాసంవత్సరం పొడిగిస్తే ఓ విద్యాసంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదముంది. పాలిటెక్నిక్‌లో సీటు రాకపోతే ఇంటర్మీడియెట్‌లో చేరుదామని పదో తరగతి పూర్తయిన విద్యార్థులు, మెడిసిన్, ఇంజినీరింగ్‌లో సీటు రాకపోతే డిగ్రీలో చేరదామని అనుకుంటున్న విద్యార్థుల పరిస్థితి అయోమయంగా ఉంది. పాలిసెట్ కౌన్సెలింగ్ సర్టిఫికెట్ల తనిఖీ పూర్తయింది. సీట్ల కేటాయింపు చేయాల్సి ఉంది. పాలిటెక్నిక్ పూర్తి చేసుకుని నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈసెట్ పరీక్ష రాసిన వారి పరిస్థితి వింతగా తయారైంది. వీరికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కాగా సీట్ల కేటాయింపు నిలిచిపోయింది. ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ రెండో తరగతి పాఠ్యాంశాలు జూలై 1నే ప్రారంభం కాగా, ఈసెట్ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల విషయంలో స్పష్టతనిచ్చి, త్వరగా కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసి, విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. భయంగా ఉంది పాలిటెక్నిక్ పూర్తయి ఈసెట్ ఎంట్రెన్స్ రాసిన. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. సీటు కేటాయింపు కోసం ఎదురుచూస్తున్నా. ఇంజినీరింగ్ కాలేజీల్లో సెకండియర్ తరగతులు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రభుత్వం త్వరగా సీట్లు కేటాయిస్తే మేం తరగతులు నష్టపోకుండా ఉంటాం. మాకు విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాలి. - సాయిశ్రీ, పాల్టెక్నిక్ విద్యార్థి కౌన్సెలింగ్ నిర్వహించాలి ప్రభుత్వం లేట్ చేయకుండా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించాలి. ఎంసెట్ ఫలితాలు వెలువడి చాలా రోజులైంది. ఏటా ఆగస్టులో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయి తరగతులు మొదలయ్యేవి. ఈ సారి కౌన్సెలింగ్ ప్రస్తావనే రావడం లేదు. ఇక తరగతులు ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలవడం లేదు. ప్రభుత్వం స్పందించి స్పష్టత ఇవ్వాలి. - కాల్వ సుష్మితారెడ్డి, ఇంటర్ విద్యార్థిని