ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు! | College managements denied to give Student certificates after fee payment | Sakshi
Sakshi News home page

ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు!

Published Tue, Jul 15 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 10:17 AM

ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు!

ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు!

* రీయింబర్స్‌మెంట్ జాప్యంతో విద్యార్థులకు తిప్పలు
* ‘స్థానికత నిర్ధారణ’ నేపథ్యంలో గందరగోళం
* సర్టిఫికెట్ల కోసం కాలేజీల చుట్టూ ప్రదక్షిణలు

 
 సాక్షి, హైదరాబాద్: ఒక విద్యార్థి ఓ ప్రముఖ కాలేజీలో ఇటీవలే ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఎంటెక్‌లో చేరేందుకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ కాలేజీ యాజమాన్యాన్ని కోరాడు. కానీ ఆ విద్యార్థికి సంబంధించి గత ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇంకా రాలేదంటూ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి ఎలాగూ వస్తుంది కనుక ఇవ్వాలంటూ విద్యార్థి మళ్లీ కాలేజీకి వెళ్లినా.. యాజమాన్యం ఒప్పుకోలేదు. అంతగా కావాలంటే బకాయి పడిన ఫీజును చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని సూచించింది. ఫీజు చెల్లించలేక, పైకోర్సులో చేరే మార్గం లేక ఆ విద్యార్థి ఆందోళనలో మునిగిపోయాడు... రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసుకున్న లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితి ఇది.
 
 ‘స్థానికులకే ఫీజు’ అన్న తెలంగాణ ప్రభుత్వ విధానం నేపథ్యంలో.. ఇటు విద్యార్థులు, అటు కాలేజీల నిర్వాహకులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రభుత్వం ఎవరిని స్థానికులుగా గుర్తిస్తుందో తెలియని పరిస్థితుల్లో తామేమీ చేయలేమంటూ కాలేజీల యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదల కానందున మీరే ఫీజు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, బకాయిల వ్యవహారం తేలేవరకు సర్టిఫికెట్లను ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
 
 స్పష్టత ఇవ్వని ఆంధ్రప్రదేశ్!..
 ఏటా సీమాంధ్రకు చెందిన దాదాపు 40 వేల మంది విద్యార్థులు తెలంగాణ జిల్లాల్లోని కాలేజీల్లో వృత్తి విద్యా కోర్సులను చదువుతున్నారు. అటు సీమాంధ్ర జిల్లాల్లోని కాలేజీల్లో తెలంగాణకు చెందిన 11 వేల మంది విద్యార్థులు చదువుతున్నట్లు అంచనా. మొత్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చదువుతున్న వారు మరో 12 లక్షల మంది వరకూ ఉంటారు. అయితే ఈసారి తెలంగాణ విద్యార్థులకే ఫీజు రీయింబర్స్‌మెంట్, బకాయిలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. స్థానికత నిర్ధారణపై కసరత్తు చేస్తోంది. మరోవైపు.. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో.. విద్యార్థులకు కష్టాలు వచ్చి పడ్డాయి. తెలంగాణ విద్యార్థులకు బకాయిలు రావాలంటే స్థానికతపై స్పష్టత వస్తే చాలు.. కానీ ఇక్కడ చదివిన ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారికి ఫీజు ఇస్తారా? లేదా అనేది ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయలేదు. బకాయిల విషయంలో ప్రభుత్వాలు హామీ ఇస్తే సర్టిఫికెట్లు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి.
 
 
 రీయింబర్స్‌మెంట్ ఎత్తి వేస్తే ఊరుకోం: కృష్ణయ్య
 ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నాన్చివేత ధోరణి విడనాడాలని, ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం తగదని బీసీ సంక్షేమ సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
 
 రీయింబర్స్‌మెంట్‌పై అంతా మౌనం
 సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంటు మార్గదర్శకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత గోప్యంగా వ్యవహరిస్తోంది. మంత్రివర్గసభ్యులకు కూడా ఈ అంశానికి సంబంధించిన సమాచారం ఉండడంలేదు. ఉన్నత స్థాయిలోని కొం దరు అధికారులకు, న్యాయ నిపుణులకు తప్ప ఎవరికీ మార్గదర్శకాల గురించి గానీ, కటాఫ్ సంవత్సరం గురించి కానీ వివరాలు తెలియనివ్వడంలేదు. అధికారికంగా ప్రకటించేవరకు ఫీజు రీయింబర్స్‌మెంటు మీద ఎలాంటి సమాచారం బయటకు పొక్కడానికి వీల్లేదని ముఖ్యమంత్రి కార్యాలయం గట్టిగా హెచ్చరించినట్టు తెలిసింది. అధికారులంతా మౌనం వహించడంతో ఈ వ్యవహారం ఉత్కంఠగా మారింది.  
 
 రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న ఒక ఉన్నతాధికారి ఆధ్వర్యంలోనే ఫీజు రీయింబర్స్‌మెంటు విషయంలో మొదటినుంచి కసరత్తు జరుగుతోంది. తెలంగాణలో చదువుకుంటున్న ఆంధ్ర విద్యార్థులకు కూడా ఫీజులు చెల్లించాల్సిందేనని, లేదంటే కోర్టుకెళ్లడానికి సిద్ధమని ఏపీ ప్రభుత్వం వాదిస్తుండడం కూడా గోప్యతకు కారణమని తెలుస్తోంది. ఈ అంశాలన్ని పరిగణనలోకి తీసుకుంటూ పలువురు సీనియర్ అధికారులు మార్గదర్శకాలను సిద్ధం చేసినట్టు తెలిసింది. బుధవారం జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిని చర్చకు పెట్టనున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement