AICTE Lifts Moratorium On New Engineering Colleges And Courses, Details Inside - Sakshi
Sakshi News home page

కొత్త కాలేజీలు, కోర్సులపై మారటోరియం ఎత్తివేత

Published Sun, Apr 30 2023 10:51 AM | Last Updated on Sun, Apr 30 2023 12:55 PM

AICTE Lifts Moratorium On New Colleges And Courses - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో ప్రొఫెషనల్‌ కోర్సులకు సంబంధించి కొత్త కాలేజీలు, కోర్సులపై ఉన్న మారటోరియాన్ని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఎత్తివేసింది. ఇంజనీరింగ్‌ సహా ప్రొఫెషనల్‌ కోర్సులను బోధించే కాలేజీలకు అనుమతులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు 2023 – 24 మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో కొత్తగా మరిన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలు, సీట్లు అందు బాటులోకి రానున్నాయి. నూతన విద్యావిధానం 2020ని దృష్టిలో పెట్టుకొని అనుమతులకు సంబంధించి కొన్ని సడలింపులతో పాటు కొత్త మార్పులను ప్రకటించారు.

మూడేళ్ల తరువాత..

  • కొత్తగా ఇంజనీరింగ్‌ కాలేజీలు, కోర్సులకు అనుమతులపై ఏఐసీటీఈ 2020–21లో మారటోరియాన్ని విధించింది. కాలేజీలు, సీట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం, నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్న నేపథ్యంలో ప్రొఫెసర్‌ మోహన్‌రెడ్డి (ఐఐటీ– హైదరాబాద్‌) కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఏఐసీటీఈ ప్రాంతీయ కార్యాలయాల ద్వారా అనుమతుల మంజూరు ప్రక్రియ కొనసాగగా ఇప్పుడు దాన్ని రద్దుచేసి నేషనల్‌ సింగిల్‌ విండో సిస్టమ్‌ పోర్టల్‌ ద్వారా నిర్వహించనున్నారు.
  • ఏఐసీటీఈ అనుమతి ప్రక్రియలో ముఖ్యమైన నిపుణుల కమిటీ సందర్శనను రద్దు చేసింది. కాలేజీలపై ఒత్తిడి తగ్గించడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. అవసరమైనప్పుడు, ఫిర్యాదులు అందినప్పుడు మాత్రమే తనిఖీలు చేపడతారు.
  • అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ ప్రోగ్రామ్‌లలో (బీఈ, బీటెక్‌) గరిష్ట సీట్ల సంఖ్యను 300 నుంచి 360కి పెంచింది. కొత్త నిబంధనల ప్రకారం కంప్యూటర్‌ అప్లికేషన్‌ ప్రోగ్రామ్‌లలో ఇన్‌టేక్‌ను 180 నుంచి 300కి పెంచుకునే అవకాశం కల్పించారు.
  • కొత్తగా ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కాలేజీలకు ఆమోదం, అనుమతుల పొడిగింపు ఈ విద్యా సంవత్సరంలో చేపట్టే అవకాశం లేదు. ఇందుకు సంబంధించిన వ్యాజ్యం సుప్రీంకోర్టులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
  • నూతన మార్గదర్శకాల ప్రకారం అన్ని ఇంజనీరింగ్‌ కళాశాలలు మూడు విభాగాలకు మించకుండా డిగ్రీ, డిప్లొమా లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయిలలో కొత్త కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో మొదటి బ్యాచ్‌ పూర్తయ్యాకే కొత్త ప్రోగ్రాముకు దరఖాస్తుకు అవకాశం ఉంది. ఇప్పుడు బహుళ ప్రోగ్రాములకు ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు మూడు కోర్‌ బ్రాంచ్‌ కోర్సులను నిర్వహించి ఉండాలి. ఈ జాబితాలో ఎలక్ట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్స్‌తో సహా మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ ఉన్నాయి.
  • విద్యార్ధుల నమోదు శాతంతో సంబంధం లేకుండా అభివృద్ధి చెందుతున్న విభాగాలలో నూతన కోర్సు లను ప్రారంభించేందుకు అనుమతించనున్నారు. ూగ్లోబల్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రశ్రేణి 1,000 సంస్థలను దేశీయ సంస్థలతో కలసి పని చేయడానికి అనుమతించనున్నారు. కనీసం 650 నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ) స్కోర్‌తో ఏఐసీటీఈ ఆమోదించిన లేదా ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకుల్లో టాప్‌ 100లో ఉన్న దేశీయ విద్యా సంస్థలను విదేశీ సంస్థలతో కలిసి పనిచేయడానికి అనుమతించనున్నారు.
  • నేషనల్‌ అక్రిడిటేషన్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ కౌన్సిల్‌ (న్యాక్‌)లో 3.1 స్కోర్‌తో ఉన్న దేశీయ విశ్వవిద్యాల యాలు కూడా డ్యూయల్, జాయింట్‌ లేదా ట్వినింగ్‌ ప్రోగ్రామ్‌లను అందించడానికి వీలుంటుంది. అలాంటి సంస్థలకు కొత్త నిబంధనల ప్రకారం 60 సీట్లతో అదనపు బ్యాచ్‌ల ఏర్పాటుకు అనుమతిస్తారు. ూవిద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు వీలుగా ఏఐసీటీఈ వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త మైనర్‌ డిగ్రీలను ప్రవేశపెడుతోంది. వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, 5జీ, అడ్వాన్సుడ్‌ టెక్నాలజీ సహా ఇంజనీరింగ్‌లో మైనర్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందించేలా కాలేజీలను అనుమతిస్తారు.
  • విద్యార్థులు, అధ్యాపకుల్లో మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ఫోరమ్‌ లేదా కౌన్సెలర్‌ను నియమించుకోవాలి. మహిళల కోసం 24 గంటల పాటు పనిచేసేలా హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఏర్పాటు చేయాలి. విద్యార్థులతోపాటు బోధన, బోధనేతర మహిళా సిబ్బందికి భద్రతా వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. ూ2023లో కొత్త ఇంజనీరింగ్‌ కళాశాలలను ప్రారంభించడానికి తరగతి గదుల కనీస అవసరాన్ని కూడా ఏఐసీటీఈ సడలించింది. మొత్తం తరగతి గదుల సంఖ్య కళాశాలలోని డివిజన్ల సంఖ్య కంటే 0.5 రెట్లుంటే చాలు. గతంలో 15 తరగతి గదులు కలిగి ఉండాల్సిన కళాశాల ఈసారి పది గదులతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించవచ్చు.
  • పాలిటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో పీఎం కేర్‌ సూపర్‌ న్యూమరీ సీట్లను ఇకపై కొనసాగించరాదని నిర్ణయించారు.

(చదవండి: జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు తేజాలు )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement