ఏఐసీటీఈకి రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల దరఖాస్తు
తెలంగాణలో ఇప్పటికే 1.45 లక్షల సీట్లు
దక్షిణాది రాష్ట్రాల నుంచే 50 వేల సీట్ల కోసం అప్లికేషన్లు
త్వరలో రాష్ట్రంలో ఏఐసీటీఈ బృందాల పర్యటన
సీట్లు పెంచే ముందు తమ అనుమతి తీసుకోవాలని ఏఐసీటీఈకి లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: అదనపు ఇంజనీరింగ్ సీట్ల కోసం దక్షిణాది రాష్ట్రాల నుంచి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)కి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ ఏడాది దాదాపు 50 వేల ఇంజనీరింగ్ సీట్లు అదనంగా కావాలని ఏఐసీటీఈకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కాలేజీలు దరఖాస్తులు చేశాయి.
తెలంగాణ నుంచి దాదాపు 20 వేల అదనపు సీట్ల కోసం దరఖాస్తులు అందాయి. అయితే సీట్లు పెంచే ముందు తమ అనుమతి తీసుకోవాలని, అప్పుడే అనుబంధ గుర్తింపు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ఏఐసీటీఈకి లేఖ రాసింది. మరోవైపు కారణాలు లేకుండా సీట్ల పెంపును తిరస్కరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కాలేజీలు అంటున్నాయి.
ఏఐసీటీఈ వర్గాలు మాత్రం సీట్ల పెంపుపై తమకు అభ్యంతరం లేదని తెలిపాయి. రాష్ట్రంలో ఇప్పటికే 58 శాతం ఇంజనీరింగ్ సీట్లు కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లోనే ఉన్నాయి. కొత్త సీట్లు కూడా ఇదే బ్రాంచీలో ఉండే అవకాశం ఉంది.
దక్షిణాదిలోనే బీటెక్ సీట్లు అధికం
దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక సంఖ్యలో ఇంజనీరింగ్ సీట్లున్నాయి. దేశంలోని మొత్తం సీట్లలో తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో 35 శాతం బీటెక్ సీట్లున్నాయి. దేశం మొత్తంలో 14.90 లక్షల బీటెక్ సీట్లుంటే.. తమిళనాడు 3.08 లక్షల సీట్లతో మొదటి స్థానంలో ఉంది. 1.83 లక్షల సీట్లతో ఏపీ రెండోస్థానంలో, తెలంగాణ 1.45 లక్షల సీట్లతో మూడోస్థానంలో ఉంది.
సీట్లు పెంచుకోవడంలోనూ ఈ మూడు రాష్ట్రాలే అగ్రస్థానంలో ఉన్నాయి. మూడేండ్లుగా దేశంలో బీటెక్ సీట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే 2014 –15తో పోల్చితే సీట్ల సంఖ్య తక్కువగానే ఉండటం గమనార్హం. 2014 –15లో దేశంలో 17.05 లక్షల ఇంజినీరింగ్ సీట్లుండగా, 2021–22 వరకు ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ పెరగడం ప్రారంభమైంది.
50% మూడు రాష్ట్రాల్లోనే..
2024–25 విద్యా సంవత్సరంలో పెరిగిన బీటెక్ సీట్లల్లో 50 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. దేశం మొత్తంగా చూస్తే 50 శాతం సీట్లు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనే పెరిగాయి. తమిళనాడులో 32,856 సీట్లు పెరగగా, ఆంధ్రప్రదేశ్‌లో 23,518, తెలంగాణలో 20,213 సీట్లు పెరిగాయి.
జాతీయంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ బీటెక్ (ఈవినింగ్ బీటెక్) కోర్సును నిర్వహించేందుకు 400 – 500 విద్యా సంస్థలకు ఏఐసీటీఈ అనుమతినిచ్చింది. ఈ కాలేజీల్లో దాదాపు 40 వేల నుంచి 50 వేల సీట్లు పెరిగాయి.
ఈ విద్యా సంవత్సరంలో 2,906 కాలేజీలకు ఏఐసీటీఈ గుర్తింపునిచ్చింది. 1,256 కాలేజీలు సీట్లు పెంచుకున్నాయి.
జాతీయంగా కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీల్లో ఆక్యుపెన్సీ రేషియో (సీట్ల భర్తీ నిష్పత్తి) 2021–22లో 72 శాతం ఉండగా, 2022 –23కు వచ్చేసరికి 81 శాతానికి పెరిగింది.
త్వరలో ఏఐసీటీఈ పరిశీలన
తెలంగాణలో 23 ప్రైవేటు కాలేజీలుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి కోర్సులను కోర్ గ్రూపుతో కాంబినేషన్‌గా అందించాలని ప్రతిపాదిస్తున్నాయి. అవసరమైన మౌలిక వసతులు తమకు ఉన్నాయని దరఖాస్తుల్లో పేర్కొన్నాయి. వీటిని స్వయంగా పరిశీలించేందుకు త్వరలో ఏఐసీటీఈ బృందాలు తెలంగాణలో పర్యటించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment