సాక్షి, కృష్ణా జిల్లా: వేలాది మంది విద్యార్థినులు చదువుతున్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వాష్ రూమ్‌లలో రహస్య కెమెరాలు అమర్చిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. గుడ్లవల్లేరు కాలేజీ యాజమాన్యం దాష్టీకానికి దిగింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై భౌతిక దాడికి పాల్పడింది. మీడియా సిబ్బందిపైనా కాలేజీ యాజమాన్యం దాడి చేసింది. సాక్షి ప్రతినిధి సురేంద్రపై కాలేజీ యాజమాన్యం దాడికి దిగింది. విద్యార్థినులకు అండగా నిలబడుతున్నారనే అక్కసుతో దాడి చేసింది.
వాష్ రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చి వీడియోలను చిత్రీకరించారంటూ విద్యార్థినులు గురువారం రాత్రి నుంచి నిద్రాహారాలు లేకుండా తల్లడిల్లుతుండగా.. అర్ధరాత్రి హాస్టల్‌లో విద్యుత్తు సరఫరా నిలిపివేసి పోలీసులు గుట్టుగా తనిఖీలు నిర్వహించడం.. స్నానాల గదిలో షవర్లు ఊడదీసి తరలించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది.
సీక్రెట్ కెమెరాలపై ఓ విద్యార్థిని వారం క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం... ఎదురు కేసులు పెడతామని బెదిరించడం.. సాహసించి మీరు ఫిర్యాదు చేసినా ఉదయానికల్లా ఆ వార్త ఫేక్ న్యూస్ అవుతుందని విద్యార్థులను వార్డెన్ హెచ్చరించడం.. మర్నాడు ఉదయం అధికారులు కూడా అది ఫేక్ న్యూస్ అని తొలుత బుకాయించడం గమనార్హం. ఇంత దారుణంజరిగితే సమస్యను చిన్నదిగా చూపేందుకు ప్రభుత్వ పెద్దలు యత్నించడం నివ్వెరపరుస్తోంది. దాదాపు 1,500 మంది విద్యార్థినులు ఉంటున్న చోట జరిగిన ఈ దారుణం వెనుక అధికార పార్టీకి చెందిన ముఖ్యులు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment