భవిష్యత్‌ అంధకారం..!  | Students Pursuing Vocational Courses Are Having A Lot Of Trouble Getting Jobs | Sakshi
Sakshi News home page

ఉపాధి చూపని వృత్తివిద్య 

Published Sun, Aug 25 2019 6:42 AM | Last Updated on Sun, Aug 25 2019 6:42 AM

Students Pursuing Vocational Courses Are Having A Lot Of Trouble Getting Jobs - Sakshi

కళ్యాణదుర్గం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌), ఎంఎల్‌టీ కోర్సులు చేసినా పారామెడికల్‌ బోర్డులో రిజిస్ట్రేషన్లు చేసుకోలేక.. ఉద్యోగాలకు అనర్హులైన వారు జిల్లాలో చాలామంది ఉన్నారు. వాస్తవానికి కోర్సు పూర్తికాగానే వీరంతా ఆరు నెలల పాటు అప్రెంటిషిప్‌ పూర్తి చేయాల్సి ఉండగా.. జిల్లాలో అప్రెంట్‌షిప్‌ చేసే అవకాశం లేకపోవడంతో విద్యార్థులకు దీని గురించి ఎవరూ చెప్పడం లేదు. ఫలితంగా వారంతా ఉద్యోగాలకు అనర్హులవుతున్నారు. 

సాక్షి, కళ్యాణదుర్గం: వృత్తి విద్యా కోర్సులు చదివితే వెంటనే ఉపాధి అవకాశాలు దక్కడంతో పాటు ఉద్యోగాలకు అర్హత ఉంటుందని చాలా మంది ఈ కోర్సుల్లో చేరుతున్నారు. అక్కడి అధ్యాపకులు కూడా భవిష్యత్‌ బాగుంటుందని చెబుతుండటంతో ఎక్కువ మంది ఈ కోర్సుల్లో చేరారు. ఇలా అధ్యాపకులు, ఇతరుల మాటలు నమ్మి మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌(ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌), మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌(ఎంఎల్‌టీ) చేసిన విద్యార్థుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. 

పారామెడికల్‌ బోర్డులో రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేక.. 
ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌), ఎంఎల్‌టీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఆరు నెలల పాటు అప్రెంట్‌షిప్‌ పూర్తి చేస్తేనే పారా మెడికల్‌ బోర్డులో రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే వీరు తప్పనిసరిగా పారామెడికల్‌ బోర్డు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఈ కోర్సులు పూర్తి చేసిన చాలా మంది విద్యార్థులు అప్రెంట్‌షిప్‌ పూర్తి చేయలేదు. అలా చేయాలని ఇంతవరకూ వీరిలో చాలామందికి తెలియదు. తెలిసినా జిల్లాలో అలాంటి అవకాశం లేదు. దీంతో చాలా మంది బోర్డులో రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకోలేకపోయారు.  

అప్రెంట్‌షిప్‌ పూర్తి చేస్తేనే రిజిస్ట్రేషన్‌ 
జిల్లాలో 29 ఒకేషనల్‌ గ్రూపులున్న కళాశాలలుండగా ప్రత్యేకించి ఆరు కళాశాలల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌), ఎంఎల్‌టీ గ్రూపులు ఉన్నాయి. పదేళ్లుగా ఈ కళాశాలల్లో ఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌) పూర్తి చేసిన వారు 550 మంది ఉంటారు. వీరిలో కేవలం 50 మంది మాత్రమే అప్రెంట్‌షిప్‌ చేశారు. ఏ ఒక్కరూ పారా మెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ కాలేదు. ఇక మిగిలిన ఆరు కళాశాలల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌), ఎంఎల్‌టీ చదివిన వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ ఇలాగే ఉంది. వాస్తవానికి ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌), ఎంఎల్‌టీ కోర్సులు పూర్తి చేసిన వారు రూ.1000 చెల్లించి ఆంధ్ర వైద్య విధాన పరిషత్‌ ట్రైనింగ్‌ అప్రెంట్‌షిప్‌ పూర్తి చేసుకోవాలి. అనంతరం పారా మెడికల్‌ బోర్డులో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.  

అప్రెంట్‌షిప్‌కు అవకాశం అంతంతే.. 
కళ్యాణదుర్గం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదివిన ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌), ఎంఎల్‌టీ విద్యార్థులు అప్రెంట్‌షిప్‌ చేయడానికి అంతం త మాత్రమే అవకాశాలున్నాయి. 2014 వరకు చెన్నైకి చెందిన బోర్డు అప్రెంట్‌షిప్‌ ట్రైనింగ్‌ సంస్థతో కళాశాల ఒప్పందం కుదుర్చుకుని అప్రెంట్‌షిప్‌ చేయించేవారు. ప్రస్తుతం ఆ సంస్థతో ఒప్పందాలు లేవు. అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే కొంతవరకు అవకాశం ఉంది. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో అప్రెంట్‌షిప్‌ చేస్తున్న వారికీ పారా మెడికల్‌ బోర్డులో రిజిస్ట్రేషన్‌ చేయకపోవడంతో విద్యార్థులకు నష్టం జరుగుతోంది.  

ఇంటర్‌ బోర్డు, పారా మెడికల్‌ బోర్డు సమన్వయ లోపం     
ఇంటర్మీడియట్‌ బోర్డు, పారా మెడికల్‌ బోర్డు అధికారుల సమన్వయ లోపంతో ఒకేషనల్‌ కోర్సులు చదివిన విద్యార్థులు సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. కోర్సు పూర్తయిన అనంతరం అప్రెంట్‌షిప్‌ చేసి పారా మెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ చేసుకోవాలి. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు విజయవాడలోని పారా మెడికల్‌ బోర్డుకు వెళ్లి రిజిస్టర్‌ చేయాలని అభ్యర్థించగా ఇది తమకు సంబంధం లేదని.. కళాశాలల వారే చూసుకుంటారని చెబుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. దీంతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉద్యోగావకాశాలను కూడా కోల్పోతున్నారు. 

సచివాలయ ఉద్యోగాలకు అనర్హులు 
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌) కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు అనర్హలుగా మిగిలిపోయారు. అప్రెంటిషిప్‌ లేక పారా మెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ కాక... దరఖాస్తు చేయడానికి వెళ్లిన అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పాలకులు దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని బాధిత విద్యార్థులు కోరుతున్నారు. 

సమస్య వాస్తవమే.. 
ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌), ఎంఎల్‌టీ చదివిన విద్యార్థులు అప్రెంట్‌షిప్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పారా మెడికల్‌ బోర్డులో రిజిస్ట్రేషన్‌ విషయ మై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. ఈ సమస్య పరిష్కారమైతే విద్యార్థులకు అన్ని విధాలా న్యాయం జరుగుతుంది. ఒకేషనల్‌ గ్రూపులు చదివే విద్యార్థులకు ఈ విషయమై అవగాహన కల్పిస్తున్నాం. 
– రాజారాం, వృత్తి విద్యా కోర్సుల జిల్లా అధికారి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement