Lab technicians
-
వెటర్నరీ ల్యాబ్‌ల ఏర్పాటు ఘనత సీఎం జగన్‌దే
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): మూగజీవాలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో వెటర్నరీ ల్యాబ్‌లు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని పశు సంవర్ధక శాఖ ల్యాబ్ టెక్నీషియన్ల అసోసియేషన్ అధ్యక్షుడు డి.అశోక్‌కుమార్ అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ల ఆత్మీయ సదస్సు విజయవాడలో ఆదివారం జరిగింది. అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. నియోజకవర్గానికో వెటర్నరీ ల్యాబ్ ఏర్పాటు చేసి డీఎంఎల్టీ అర్హత కలిగిన తమలాంటి వారికి ల్యాబ్ టెక్నీషియన్లుగా నియమించారన్నారు. ఈ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు తామంతా రుణపడి ఉంటామన్నారు. పశు సంవర్ధక శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ల కాంట్రాక్ట్‌ను మరో రెండు సంవత్సరాలు పొడిగించిన సీఎం వైఎస్ జగన్, మంత్రి సీదిరి అప్పలరాజు, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సదస్సులో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పి.రవీంద్రనాథ్, కార్యదర్శి కె.రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ రంగస్వామి, సంయుక్త కార్యదర్శి ఇజ్రాయేల్ పాల్గొన్నారు. -
26 ఏళ్ల తర్వాత ఉద్యోగం నుంచి తొలగింపు
సాక్షి, నిర్మల్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 26 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు వచ్చింది. ఇన్నేళ్లపాటు చేసిన సేవలకు, తమలోని ఆశలకు శరాఘాతంలా ఉద్యోగాల నుంచి తప్పుకోవాలంటూ వచ్చిన ఆ తీర్పుతో వారంతా ఆందోళనకు గురయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 20 మంది ల్యాబ్ టెక్నీషియన్లను సర్వీస్ నుంచి తొలగించాలంటూ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈనెల 17న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నోడల్ అధికారి, ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ పేరిట వారికి సర్వీస్ రిమూవల్ ఉత్తర్వులు ఇచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. 1994లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 1995లో చేపట్టిన పారామెడికల్ రిక్రూట్మెంట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 20మంది ల్యాబ్ టెక్నీషియన్లుగా ఎంపికయ్యారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత వీరందరూ బోగస్ డీఎంఎల్టీ సర్టిఫికెట్లు ఇచ్చారని, వీరికి సర్టిఫికెట్లు ఇచ్చిన రామి ఇనిస్టిట్యూట్, హైదరాబాద్‌కు అప్పుడు గుర్తింపు లేదని కొంతమంది హైకోర్టులో కేసు వేశారు. అప్పటి నుంచి కేసు నడుస్తూనే ఉంది. చివరకు ఆ 20మందిని ఉద్యోగాల నుంచి తొలగించాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. చదవండి: (బండికున్న హెల్మెట్ ధరిస్తే బతికేవాడేమో..) బేసిక్‌పే పైనే విధులు.. హైకోర్టు తీర్పు మేరకు ఉమ్మడి జిల్లాలోని 20మంది ల్యాబ్టెక్నీషియన్లకు ఉత్తర్వులు పంపించారు. ఇందులో ఇప్పటికే ఇద్దరు చనిపోగా, మిగిలిన 18 మందికి జిల్లాల అధికారులు వీటిని అందించారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఏడుగురు, నిర్మల్ జిల్లా నుంచి ఐదుగురు, మంచిర్యాల జిల్లా నుంచి ఇద్దరు, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి నలుగురు ఉన్నారు. రిక్రూట్మెంట్ అయిన మరుసటి నెల నుంచే కోర్టులో కేసు నడుస్తుండటంతో వీరు రెగ్యులర్ ఎంప్లాయీస్ అయినా.. కేవలం బేసిక్ పే మాత్రమే చెల్లిస్తున్నారు. 1995లో రూ.1,875 బేసిక్‌పేతో జాయిన్ అయ్యారు. పీఆర్సీలు వచ్చినప్పుడల్లా కేవలం వీరి బేసిక్‌పే పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రూ.35వేల వరకు వస్తున్నట్లు సమాచారం. వీరికి ఎలాంటి ఫైనాన్సియల్ బెనిఫిట్స్ లేవు. తాము చేసిన కోర్సు వాస్తవమేనని, సంస్థ తప్పిదానికి తమను బలిచేయడం దారుణమని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై త్వరలోనే సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు చెబుతున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు, నోడల్ అధికారి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నిర్మల్ జిల్లాలోని ఐదుగురు ల్యాబ్టెక్నీషియన్లకు సర్వీస్ రిమూవల్ ఆర్డర్స్ పంపించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ధన్‌రాజ్ తెలిపారు. చదవండి: (స్వప్నతో నిషాంత్ వివాహం.. తల్లిదండ్రులకు తెలిసి..) -
తిరుపతి ఎస్వీవీయూలో ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ(ఎస్వీవీయూ).. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 15 ► జిల్లాల వారీగా ఖాళీలు: శ్రీకాకుళం–01, విజయనగరం–01, విశాఖపట్నం–01, తూర్పుగోదావరి–01, పశ్చిమగోదావరి–02, కృష్ణా–01, గుంటూరు–01, ప్రకాశం–01, నెల్లూరు–02, చిత్తూరు–01, కడప–01, కర్నూలు–01, అనంతపురం–01. ► అర్హత: మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా (డీఎంఎల్టీ) ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 18–42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.06.2021 ► వెబ్సైట్: www.svvu.edu.in మరిన్ని నోటిఫికేషన్లు: ఏపీలో గ్రామ/వార్డ్ సచివాలయ వలంటీర్ ఉద్యోగాలు వెస్టర్న్ రైల్వేలో 3591 అప్రెంటిస్ ఖాళీలు సీఎస్ఐఆర్–ఎస్ఈఆర్సీలో టెక్నీషియన్ల ఖాళీలు -
కర్నూలులో లక్ష దాటిన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు
సాక్షి, నంద్యాల: జిల్లాలో సోమవారం నాటికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు మొదలై 100 రోజులు పూర్తయాయి. దాంతోపాటు కర్నూలు వ్యాప్తంగా నేటి వరకు లక్షా ఐదు వేల కరోనా పరీక్షలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రఘు బాబు, సహాయ కార్యదర్శి మదన్ మోహన్, శ్రీనివాసులు, కర్నూల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు జీ.వి సతీష్, రజాక్, ఇతర ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ కట్టడిలో ట్రూనాట్ ల్యాబ్స్, వీర్‌డీఎల్ ల్యాబ్స్ అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్ల కృషిని ఈ సందర్బంగా పలువురు కొనియాడారు. అంతేకాకుండా కరోనా కట్టడిలో భాగంగా పెద్ద ఎత్తున ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి కర్నూల్ జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ తీసుకున్న నిర్ణయాలను జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ల తరుపున రఘు బాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏప్రిల్ 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 56 ట్రూ నాట్ ల్యాబ్‌లలో, మరో 20 వరకు వీర్‌ఆర్‌డీఎల్ ల్యాబ్‌లలో ల్యాబ్ టెక్నీషియన్లు నిర్విరామంగా కోవిడ్ నిర్థారణ పరీక్షల్లో భాగస్వాములై ఉన్నారు.ఇప్పటికి దాదాపు ప్రతి జిల్లాలో కొందరు ల్యాబ్ టెక్నీషియన్లు కరోనా బారిన పడినప్పటికి కోలుకున్న తరువాత తిరిగి విధులకు సిద్ధంగా ఉన్నారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ సునీతతో ల్యాబ్ టెక్నీషియన్లు -
భవిష్యత్ అంధకారం..!
ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), ఎంఎల్టీ కోర్సులు చేసినా పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్లు చేసుకోలేక.. ఉద్యోగాలకు అనర్హులైన వారు జిల్లాలో చాలామంది ఉన్నారు. వాస్తవానికి కోర్సు పూర్తికాగానే వీరంతా ఆరు నెలల పాటు అప్రెంటిషిప్ పూర్తి చేయాల్సి ఉండగా.. జిల్లాలో అప్రెంట్‌షిప్ చేసే అవకాశం లేకపోవడంతో విద్యార్థులకు దీని గురించి ఎవరూ చెప్పడం లేదు. ఫలితంగా వారంతా ఉద్యోగాలకు అనర్హులవుతున్నారు. సాక్షి, కళ్యాణదుర్గం: వృత్తి విద్యా కోర్సులు చదివితే వెంటనే ఉపాధి అవకాశాలు దక్కడంతో పాటు ఉద్యోగాలకు అర్హత ఉంటుందని చాలా మంది ఈ కోర్సుల్లో చేరుతున్నారు. అక్కడి అధ్యాపకులు కూడా భవిష్యత్ బాగుంటుందని చెబుతుండటంతో ఎక్కువ మంది ఈ కోర్సుల్లో చేరారు. ఇలా అధ్యాపకులు, ఇతరుల మాటలు నమ్మి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్(ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్(ఎంఎల్టీ) చేసిన విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకోలేక.. ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), ఎంఎల్టీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఆరు నెలల పాటు అప్రెంట్‌షిప్ పూర్తి చేస్తేనే పారా మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే వీరు తప్పనిసరిగా పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఈ కోర్సులు పూర్తి చేసిన చాలా మంది విద్యార్థులు అప్రెంట్‌షిప్ పూర్తి చేయలేదు. అలా చేయాలని ఇంతవరకూ వీరిలో చాలామందికి తెలియదు. తెలిసినా జిల్లాలో అలాంటి అవకాశం లేదు. దీంతో చాలా మంది బోర్డులో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేకపోయారు. అప్రెంట్‌షిప్ పూర్తి చేస్తేనే రిజిస్ట్రేషన్ జిల్లాలో 29 ఒకేషనల్ గ్రూపులున్న కళాశాలలుండగా ప్రత్యేకించి ఆరు కళాశాలల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), ఎంఎల్టీ గ్రూపులు ఉన్నాయి. పదేళ్లుగా ఈ కళాశాలల్లో ఎంఎల్టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్) పూర్తి చేసిన వారు 550 మంది ఉంటారు. వీరిలో కేవలం 50 మంది మాత్రమే అప్రెంట్‌షిప్ చేశారు. ఏ ఒక్కరూ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ కాలేదు. ఇక మిగిలిన ఆరు కళాశాలల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), ఎంఎల్టీ చదివిన వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ ఇలాగే ఉంది. వాస్తవానికి ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), ఎంఎల్టీ కోర్సులు పూర్తి చేసిన వారు రూ.1000 చెల్లించి ఆంధ్ర వైద్య విధాన పరిషత్ ట్రైనింగ్ అప్రెంట్‌షిప్ పూర్తి చేసుకోవాలి. అనంతరం పారా మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అప్రెంట్షిప్కు అవకాశం అంతంతే.. కళ్యాణదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), ఎంఎల్టీ విద్యార్థులు అప్రెంట్‌షిప్ చేయడానికి అంతం త మాత్రమే అవకాశాలున్నాయి. 2014 వరకు చెన్నైకి చెందిన బోర్డు అప్రెంట్‌షిప్ ట్రైనింగ్ సంస్థతో కళాశాల ఒప్పందం కుదుర్చుకుని అప్రెంట్‌షిప్ చేయించేవారు. ప్రస్తుతం ఆ సంస్థతో ఒప్పందాలు లేవు. అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే కొంతవరకు అవకాశం ఉంది. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో అప్రెంట్‌షిప్ చేస్తున్న వారికీ పారా మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో విద్యార్థులకు నష్టం జరుగుతోంది. ఇంటర్ బోర్డు, పారా మెడికల్ బోర్డు సమన్వయ లోపం ఇంటర్మీడియట్ బోర్డు, పారా మెడికల్ బోర్డు అధికారుల సమన్వయ లోపంతో ఒకేషనల్ కోర్సులు చదివిన విద్యార్థులు సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. కోర్సు పూర్తయిన అనంతరం అప్రెంట్‌షిప్ చేసి పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకోవాలి. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు విజయవాడలోని పారా మెడికల్ బోర్డుకు వెళ్లి రిజిస్టర్ చేయాలని అభ్యర్థించగా ఇది తమకు సంబంధం లేదని.. కళాశాలల వారే చూసుకుంటారని చెబుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. దీంతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉద్యోగావకాశాలను కూడా కోల్పోతున్నారు. సచివాలయ ఉద్యోగాలకు అనర్హులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంఎల్టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్) కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు అనర్హలుగా మిగిలిపోయారు. అప్రెంటిషిప్ లేక పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ కాక... దరఖాస్తు చేయడానికి వెళ్లిన అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పాలకులు దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని బాధిత విద్యార్థులు కోరుతున్నారు. సమస్య వాస్తవమే.. ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), ఎంఎల్టీ చదివిన విద్యార్థులు అప్రెంట్‌షిప్ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పారా మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ విషయ మై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. ఈ సమస్య పరిష్కారమైతే విద్యార్థులకు అన్ని విధాలా న్యాయం జరుగుతుంది. ఒకేషనల్ గ్రూపులు చదివే విద్యార్థులకు ఈ విషయమై అవగాహన కల్పిస్తున్నాం. – రాజారాం, వృత్తి విద్యా కోర్సుల జిల్లా అధికారి -
రోగాలొస్తే వారికి పండగే!
సమాజంలో అంతా ఆరోగ్యంగా ఉండాలనీ... ఎవరికీ ఏ అనారోగ్యం కలగకూడదని అంతా ప్రార్థిస్తారు. కానీ రోగాలు ఎక్కువగా ప్రబలితేనే తమకు భుక్తి అని భావిస్తారు వారు. చిన్నపాటి సమస్యతో వచ్చినా... లెక్కలేనన్ని పరీక్షలు చేసి రూ. వేలల్లో దోచుకోవడమే వారి పని. ఇదీ జిల్లాలో వెలసిన డయాగ్నస్టిక్ సెంటర్ల తీరు. నిర్థిష్టమైన ధరలు నిర్ణయించకపోవడంతో ఇష్టానుసారం రోగులనుంచి వారు గుంజుకుని ఏదో మొక్కుబడిగా నివేదికలు అందించేస్తున్నారు. కొన్ని చోట్ల పేథాలజిస్టులు సైతం లేకుండానే లేబొరేటరీలు నిర్వహించేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. విజయనగరం ఫోర్ట్: ప్రస్తుతం జిల్లాలో జ్వరాలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా వీరి సంఖ్య అధికంగానే కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ప్లేట్లెట్ల కౌంట్ తగ్గడంతో మృత్యువాత చెందుతుండటంతో రోగులు తొలుత డాక్టర్‌ను ఆశ్రయిస్తున్నారు. వారు చెప్పిందే తడవుగా ప్రైవేటుగా ఏర్పాటైన లేబొరేటరీలను ఆశ్రయిస్తున్నారు. అలా అనారోగ్యంతో వచ్చే రోగులనుంచి డబ్బులు గుంజుకోవడానికే వాటి నిర్వాహకులు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. వైద్యులు కొన్ని టెస్టులకోసం సిఫారసు చేస్తే అవసరం లేని పరీక్షలు కూడా కొందరు చేస్తున్నట్టు వి మర్శలు వినిపిస్తున్నాయి. విచిత్రమేంటం టే ఒక లేబొ రేటరీ రిపోర్టుకు మరోచోట రిపోర్టుకు వ్యత్యాసం ఉండటమే. దీనివల్ల ఏ రిపోర్టును నమ్మాలో తెలీక రోగులు సతమతం అవుతున్నారు. ఇలాంటి కచ్చితత్వం లేని నివేదికల పుణ్యమాని రోగులు ఒక్కోసారి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాజరగడానికి కారణాలను మాత్రం ఏ అధికారీ అన్వేషించడం లేదు. రిజిస్ట్రేషన్ లేకుండానే లేబ్‌ల నిర్వహణ జిల్లాలో 45 లేబొరేటరీలు మాత్రమే వైద్య ఆరోగ్యశాఖ వద్ద రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇంకా రిజిస్ట్రేషన్ లేకుండా మరో వంద వరకూ జిల్లాలో లేబొరేటరీలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా వైరల్ జ్వరాలు, డెంగీ జ్వరాలు వ్యాప్తి అధికంగా ఉండటం వీరికి కలసివస్తోంది. జ్వరం రాగానే తమకు ఏమైందోనని భయంతో రోగులు లేబొరేటరీలకు పరుగులు తీస్తుండటం అక్కడ పరీక్షలు చేయించుకోవడానికి చొరవ చూపిస్తున్నారు. ఇదే అదునుగా వారు దోచేసుకుంటున్నారు. కనిపించని ఫీజులు బోర్డులు ఏ లేబొరేటరీలోనూ ఏ వైద్య పరీక్షకు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో తెలిపే బోర్డు ఉండడం లేదు. దీనివల్ల వారు ఎంత అడిగితే అంత ఇవ్వవలసి వస్తోంది. ఇక జిల్లాలో ఉన్న కొన్ని లేబొరేటరీల్లో పెథాలజిస్టులు కూడా కానరావడం లేదు. నిబంధన ప్రకారం యూరిన్ కల్చర్, బ్లడ్ కల్చర్, ప్లేట్ లెట్ కౌంట్ వంటి పరీక్షలు పెథాలజిస్టుల పర్యవేక్షణలోనే జరగాలి. కాని అధికశాతం లేబొరేటరీల్లో పెథాలజిస్టులు లేరు. ఒకటి, రెండు ల్యాబ్‌రేటరీల్లో మాత్రమే వారున్నట్టు తెలుస్తోంది. వీటిపై పర్యవేక్షించాల్సిన అధికారులు ఎందుకో నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. -
‘ల్యాబ్టెక్నీషియన్ల సమస్యలు పరిష్కరించండి’
సాక్షి, హైదరాబాద్ : వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న ల్యాబ్టెక్నీషియన్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ల్యాబోరేటరీ టెక్నీషియన్స్ అసోసియేషన్ కోరింది. ల్యాబ్‌టెక్నీషియన్ గ్రేడ్–1 పోస్టుల పదోన్నతుల కోసం వెంటనే సీనియారిటీ జాబితాను ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హరినాథ్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌లు ప్రజారోగ్య విభాగం డైరెక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్లతో సమావేశమయ్యారు. పదోన్నతులు లేకపోవడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ల్యాబ్టెక్నీషియన్లు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 50 జూనియర్ అనలిస్టు పోస్టులను అర్హత కలిగి ఉన్న ల్యాబ్టెక్నీషియన్లకు పదోన్నతి ద్వారా ఇవ్వాలని కోరారు. -
’గాంధీ’లో లైంగిక వేధింపులు
♦ జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్ విద్యార్థినుల ఫిర్యాదు ♦ ముగ్గురు మహిళా ప్రొఫెసర్లతో షీ టీం ఏర్పాటు గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్లుగా పని చేస్తున్న విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఈ మేరకు మంగళవారం సుమారు 20మంది విద్యార్థినులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన ముగ్గురు మహిళా ప్రొఫెసర్లతో షీ టీంను ఏర్పాటు చేసి మూడు రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. ప్రైవేటు కళాశాలల్లో ఎంఎల్టీ, డీఎంఎల్టీ, బీఎస్సీ–ఎంఎల్టీ తదితర ఓకేషనల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సుల విద్యార్థులు టెక్నికల్ ట్రైనింగ్ నిమిత్తం తప్పనిసరిగా ఆరునెలల పాటు గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వంద మందికి పైగా విద్యార్థులు గాంధీ ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో విద్యార్థినుల సంఖ్యే ఎక్కువగా ఉంది. అయితే ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్లు వారిని లైంగికంగా వేధిస్తున్నారు. బాధితులు మంగళవారం సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సూపరింటెండెంట్ ఆస్పత్రికి చెందిన ముగ్గురు మహిళా ప్రొఫెసర్లతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి మూడు రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
రిమ్స్‌లో రోగుల అవస్థలు
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో ఎప్పుడే ఏదో ఒక సమస్య రోగులను ఇబ్బంది పెడుతూనే ఉంటోంది. శుక్రవారం కూడా రోగులు సిబ్బంది లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆస్పత్రిలోని ఔట్సోర్సింగ్ సిబ్బంది హైదరాబాద్‌లో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి తరలివెళ్లారు. దీంతో ఆయా విభాగాల్లో ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది లేక రోగులకు సేవలు అందలేదు. ప్రతి రోజులాగే ఓపీ విభాగంలో వైద్య పరీక్షలు చేసిన వైద్యులు రోగులకు రక్త పరీక్షలు రాసిచ్చారు. తీరా వైద్యుడు రాసిచ్చిన చిట్టీని తీసుకొని రక్త పరీక్ష కేంద్రానికి వెళ్లిన రోగులకు నిరాశే ఎదురైంది. సరిపడా టెక్నీషియన్లు లేరని, రక్త పరీక్షలు చేయడం వీలుకాదని సోమవారం రావాలని చెప్పడంతో రోగులు వెనుదిరిగారు. కాగా ఎంతో దూరం నుంచి వచ్చిన తమకు కేవలం వైద్య పరీక్షలు నిర్వహించి ఇంటికి వెళ్లిపోమ్మనడం సరైంది కాదన్నారు. కనీసం వైద్యుడు రాసిన రక్త పరీక్షలు చేసి రిపోర్టులు ఇవ్వడం ద్వారా రక్త పరీక్షల్లో వచ్చిన సమస్యకు అనుగుణంగా వైద్యులు మందులు రాసి ఇచ్చేవారు. కానీ ఆయా విభాగాల్లో చాలా మట్టుకు రక్త పరీక్షలు నిర్వహించకపోవడంతో రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది ఎటువంటి మందులు తీసుకోకుండానే వెళ్లిపోయారు. వైద్యులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని రోగులు వాపోయారు. ఎప్పుడూ ఇంతే... ప్రతి రోజు కనీసం ప్రతి విభాగంలో ఐదుగురు టెక్నీషియన్లు ఉంటారు. ఇందులో ముగ్గురు ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులే. కాగా తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నాకు వెళ్లడంతో ఆయా విభాగాల్లో కేవలం ఒకే రెగ్యులర్ టెక్నీషియన్ అందుబాటులో ఉంచారు. సాధారణంగా ప్రతి రోజు 200 మంది నుంచి 300 వరకు రోగులు రక్త పరీక్షలు, ఎక్స్‌రే, ఇతర పరీక్షల కోసం వస్తుంటారు. ఇంత మందికి కనీసం ఐదుగురు ఉండాలి. కానీ ప్రతి విభాగానికి ఒకే ఒక్క టెక్నీషియన్ ఉండడంతో రోగులు నానా అవస్థలు పడ్డారు. కొంత మంది మందులు మాత్రమే తీసుకొని వెళ్లిపోయారు. ఓపీ విభాగంతో పాటు, ఎమ్మర్జెన్సీ వార్డు, ఎక్స్‌రే, ల్యాబ్స్, రిమ్స్ కళాశాల అడ్మినిస్ట్రేషన్ విభాగాలు సిబ్బంది లేక వెలవెలబోయాయి. ప్రత్యమ్నయంగా కూడా ఎలాంటి టెక్నీషియన్లు పెట్టకపోవడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ విషయంపై రిమ్స్ డెరైక్టర్ శశిధర్‌ను ఁన్యూస్లైన్ వివరణ కోరగా ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ టెక్నీషియన్లు రక్త, ఇతర పరీక్షలు చేస్తున్నారని, పరీక్షలు చేయకుండా ఏ రోగిని బయటకు పంపించలేదని తెలిపారు. -
‘నాడి’ పట్టేదెవరు?
నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యసేవలు అందించడంలో కీలకమైన ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నా క్షేత్రస్థాయిలో వైద్యసేవలు గగనమవుతున్నాయి. ఉన్నతాధికారులు కేవలం పరిశీలనలకే పరిమితమవుతుండటంతో రోగికి నాడిపట్టే వారు కరువవుతున్నారు. మరోవైపు వైద్యాధికారులు, ల్యాబ్టెక్నీషియన్ల సిబ్బంది కూడా తీవ్రంగా ఉంది. జిల్లాలో 14 సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ), 74 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ) ఉన్నాయి. వీటిలోని 28 పీహెచ్‌సీల్లో నిరంతరం వైద్యసేవలు అందాల్సి ఉండగా కనీసం 8 గంటలు కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. కలెక్టర్ శ్రీకాంత్ ఇటీవల వింజమూరు, వెంకటాచలం ప్రాంతాల్లో పీహెచ్‌సీలను తనిఖీ చేసిన సమయంలో ఈ విషయం వెలుగుజూసింది. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం తప్ప ఆయన ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో అధికారుల్లో మార్పు కరువైంది. జిల్లాలోని చాలా ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు తమకు తీరిక ఉన్న సమయంలో చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నారు. ఈ క్రమంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో పేదలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అరకొరగా వైద్యసేవలు వైద్యాధికారులు, సిబ్బంది నియామకంపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సేవలు అరకొరగా అందుతున్నాయి. జిల్లాలో 170 మంది వైద్యాధికారులు అవసరం కాగా 126 మంది ఉన్నారు. వీరిలో కొందరికి డిప్యూటేషన్‌పై మరోచోట అదనపు బాధ్యతలు అప్పగిస్తుండటంతో ఎక్కడా న్యాయం చేయలేకపోతున్నారు. మరోవైపు వ్యాధినిర్ధారణలో కీలకమైన ల్యాబ్ టెక్నీషియన్ల కొరత తీవ్రంగా ఉంది. 87 మంది ల్యాబ్ టెక్నీషియన్లు అవసరం కాగా 18 మంది మాత్రమే ఉన్నారు. టెక్నీషియన్లు ఉన్న చోట్ల అవసరమైన పరికరాలు లేకపోవడంతో ప్రైవేటు ల్యాబ్‌లే దిక్కవుతున్నాయి. పరికరాలు ఉన్నచోట సిబ్బంది కరువవుతున్నారు. దీంతో ప్రజలు విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలవుతున్నారు. నిరుపయోగంగా వైద్యపరికరాలు జిల్లాలోని పలు ఆరోగ్య కేంద్రాల్లో లక్షలాది రూపాయల విలువజేసే వైద్యపరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. మొదట్లో కొద్ది కాలం వినియోగించినా, తర్వాత వాటిని మూలనపడేశారు. అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. రాపూరు ఆరోగ్య కేంద్రంలోని ఎక్స్‌రే ప్లాంటు మరమ్మతులకు నోచుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది. కో వూరు ఆస్పత్రిలోని డెంటల్ చెయిర్ నిరుపయోగంగానే ఉంది. అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. ముణ్ణాళ్ల ముచ్చటగా ఉన్నతాధికారుల ప్రయత్నాలు ప్రభుత్వ వైద్యసేవలపై ప్రజలకు నమ్మకం క లిగించేందుకు గతంలో పనిచేసిన కలెక్టర్ రావమ్మ మహాలక్ష్మి పేరుతో ఓ కార్యక్రమం రూపొందించారు. ప్రజలను ఆరోగ్య కేంద్రాలకు ఆహ్వానించి అక్కడ అందుతున్న సేవలపై అవగాహన కల్పించారు. అది కొద్ది రోజులకే పరిమితమైంది. ప్రస్తుత కలెక్టర్ శ్రీకాంత్ మరో కోణంలో దృష్టిసారించారు. జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలకు వైద్యులు, సిబ్బంది, పరికరాల అవసరంపై వివరాలు సేకరిస్తున్నారు. వాటిని ప్రభుత్వానికి పంపి వసతులు పెంచే యోచనలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వీడకుండా ఇవన్నీ ఏ మేరకు ఫలితం ఇస్తాయనేది సందేహంగా మారింది. సమస్యలు వాస్తవమే: డాక్టర్ కోటేశ్వరి, ఇన్చార్జి డీఎంహెచ్ఓ పలు ఆరోగ్యకేంద్రాల్లో తగినంతమంది వైద్యులు, ల్యాబ్టెక్నీషియన్లు లేరు. త్వరలోనే వీరి నియామకం జరిగే అవకాశం ఉంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వైద్య సేవలందేలా చూస్తాం. మూలనపడిన పరికరాలను ఉపయోగంలోకి తెస్తాం. సక్రమంగా సేవలందడంలేదు: ప్రకాష్, రాపూరు ఆరోగ్య కేంద్రంలో సక్రమంగా వైద్య సేవలు అందడంలేదు. డాక్టర్లు ఎప్పుడు ఉంటారో కూడా తెలీదు. ఇక్కడ ఎక్స్‌రే ఉన్నా పని చేయదు. విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బు ఖర్చు చేసుకుంటున్నాం. -
మంచానపడ్డ పీహెచ్‌సీలు
= మందుల కొరత =భర్తీకాని ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు =సిబ్బందికి క్వార్టర్స కరువు =వైద్యులుగా మారుతున్న నర్సులు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే(పీహెచ్‌సీలు) జబ్బు చేసింది. చాలాచోట్ల మందులు లేవు. వైద్య పరికరాలు అందుబాటులో లేవు. ల్యాబ్ టెక్నీషియన్ల కొరత ఉంది. క్లినికల్ పరీక్షలు నిర్వహించే సౌకర్యం లేదు. క్వార్టర్స లేకపోవడంతో సిబ్బంది బయటి ప్రాంతాల నుంచి వస్తున్నారు. పీహెచ్‌సీలకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి నియోజకవర్గం పీలేరు మినహా మరే పీహెచ్‌సీల్లోనూ తగిన సౌకర్యాలు లేవు. జిల్లా వ్యాప్తంగా 94 పీహెచ్‌సీలు ఉన్నాయి. కొత్తగా ప్రారంభించిన కమ్యూనిటీహెల్త్ సెంటర్లు 7, అర్బన్ హెల్త్సెంటర్లు 11, వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులు 16 ఉన్నా యి. పీహెచ్‌సీలకు ప్రభుత్వం మూడు నెలల కోసారి రూ.1.25 లక్షలు కేటాయిస్తోంది. ఈ మొత్తం మందుల కొనుగోలుకే సరిపోవడం లేదు. చాలాచోట్ల ల్యాబ్ టెక్నీషియన్లు లేరు. పరికరాలు లేవు. కొన్ని చోట్ల వైద్యులు సక్రమంగా విధులకు హాజరుకావడం లేదు. కొన్ని పీహెచ్‌సీల్లో నర్సులే వైద్యుల అవతారం ఎత్తుతున్నారు. అత్యధిక పీహెచ్‌సీల్లో సరఫరా చేస్తున్న మందులు రోగుల సంఖ్యకు తగినట్లు లేవు. వైద్య పరీక్షలు చేసుకోవాలంటే బయట వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏ పీహెచ్‌సీలోనూ తాగేందుకు మంచినీటి సౌకర్యం లేదు. ఏరియా ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి. సత్యవేడులోని దాసుకుప్పం పీహెచ్సీలో మంగళవారం డాక్టర్ అందుబాటులో లేరు. నర్సే వైద్య పరీక్షలు నిర్వహించారు. ల్యాబ్ టెక్నీషియన్ గురు, శుక్రవారాల్లో మాత్రమే పని చేస్తున్నారు. గర్భిణులకు బుధవారం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో ఉండడం లేదు. ఇక్కడ ప్రసవాలు జరగడం లేదు. తిరుపతి సెంట్రల్ డ్రగ్‌స్టోర్ నుంచి ప్రతి మూడునెలలకోసారి మందులు తెస్తున్నారు. నీటి వసతి లేదు. హస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు పీహెచ్సీలో వైద్యుల కొరత నెలకొంది. ఎంపేడు ఆస్పత్రిలో మందులు లేవు. అన్ని రకాల జబ్బులకు జ్వరం మాత్రలే దిక్కవుతున్నాయి. తొట్టంబేడు పీహెచ్సీలో వైద్యులు సరిగ్గా విధులు నిర్వర్తించడం లేదు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో 6 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇక్కడ బడ్జెట్ కొరత వేధిస్తోంది. ఒక్కో పీహెచ్‌సీకి రూ.1.25 లక్షలు చాలడం లేదు. పారాసిటమాల్ మాత్రలూ దొరకడం లేదు. రక్త పరీక్ష సౌకర్యాలు లేవు. కోసవారిపల్లె పీహెచ్సీలో ఒక డాక్టర్, ఫార్మసిస్టు ఉన్నారు. ప్రభుత్వం ఇస్తున్న బడ్జెట్ చాలడం లేదు. సదుంలో బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టారు. ఇక్కడ సిబ్బంది, మందుల కొరతలేదు. క్వార్టర్స లేకపోవడంతో సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. పులిచెర్ల మండలంలోనూ వైద్య సిబ్బందికి క్వార్టర్స్ లేవు. నగరి నియోజకవర్గంలోని నిండ్ర పీహెచ్సీలో జ్వరానికి సంబంధించిన మందులూ లేవు. రక్తపరీక్షకు అవసరమైన పరికరాలు, రసాయనాలు లేవు. అధికారులకు నివేదించాం, మందులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. నగరి ఏరియా ఆస్పత్రిని వంద పడకలకు మార్చారు. అయితే బెడ్లు లేవు. అలాగే వైద్య పరికరాలు లేవు. సిబ్బంది ఉన్నా పరికరాలు లేకపోవడంతో పరీక్షలు చేసుకోలేని పరిస్థితి. పుత్తురు సీహెచ్‌సీలో గదులు కొరత నెలకొంది. కొత్తగా నిర్మించిన గదులు ప్రారంభానికి నోచుకోలేదు. మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో తాగునీటి వసతి లేదు. ప్యూరిఫైడ్ వాట ర్ప్లాంట్ నిరుపయోగంగా ఉంది. కుటుంబ నియంత్రణ వార్డులో వేసెక్టమీ ఆపరేషన్ చేసుకునేవారికి వేడినీరు సరఫరా చేయాలి. ప్రస్తుతం సరఫరా లేదు. ప్రజలు బయట కొనుక్కొంటున్నారు. ఇక్కడ పరిశుభ్రత మాటే లేదు. రక్త పరీక్షలకు డబ్బులు ఖర్చు పెట్టి కిట్స్ తెప్పించుకుంటున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ల కొరత వేధిస్తోంది. పలమనేరు నియోజకవర్గంలో 8 పీహెచ్‌సీలు, వంద పడకల ఆస్పత్రి ఉన్నాయి. బెరైడ్డిపల్లె పీహెచ్సీలో వైద్యులులేరు. నర్సులే వైద్యం చేస్తున్నారు. వి.కోట ఆస్పత్రిలో పారాసిటమాల్ మాత్రలూ లేవు. పెద్దపంజాణి ఆస్పత్రిలో పెయిన్‌కిల్లర్స్ లేవు. పలమనేరు వంద పడకల ఆస్పత్రిలో వైద్యులు సకాలంలో రావడం లేదు. కుప్పం నియోజకవర్గంలో తొమ్మిది పీహెచ్‌సీలు, ఒక వంద పడకల ఆస్పత్రి ఉన్నాయి. అన్ని ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత వల్ల వైద్యం అంతంతమాత్రంగానే అందుతోంది. శాంతిపురం పీహెచ్సీలో మందుల కొరత రోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. కుప్పం వంద పడకల ఆస్పత్రి వైద్యులు సమయపాలన పాటించడం లేదు. పీలేరు నియోజకవర్గంలో వైద్యులు సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో జనానికి ఎదురుచూపులు తప్పడం లేదు.