’గాంధీ’లో లైంగిక వేధింపులు
’గాంధీ’లో లైంగిక వేధింపులు
Published Wed, Aug 2 2017 7:46 AM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM
♦ జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్ విద్యార్థినుల ఫిర్యాదు
♦ ముగ్గురు మహిళా ప్రొఫెసర్లతో షీ టీం ఏర్పాటు
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్లుగా పని చేస్తున్న విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఈ మేరకు మంగళవారం సుమారు 20మంది విద్యార్థినులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన ముగ్గురు మహిళా ప్రొఫెసర్లతో షీ టీంను ఏర్పాటు చేసి మూడు రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు.
నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. ప్రైవేటు కళాశాలల్లో ఎంఎల్‌టీ, డీఎంఎల్‌టీ, బీఎస్‌సీ–ఎంఎల్‌టీ తదితర ఓకేషనల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సుల విద్యార్థులు టెక్నికల్ ట్రైనింగ్ నిమిత్తం తప్పనిసరిగా ఆరునెలల పాటు గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వంద మందికి పైగా విద్యార్థులు గాంధీ ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్లుగా విధులు నిర్వహిస్తున్నారు.
వీరిలో విద్యార్థినుల సంఖ్యే ఎక్కువగా ఉంది. అయితే ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్లు వారిని లైంగికంగా వేధిస్తున్నారు. బాధితులు మంగళవారం సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సూపరింటెండెంట్ ఆస్పత్రికి చెందిన ముగ్గురు మహిళా ప్రొఫెసర్లతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి మూడు రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Advertisement
Advertisement