
కోవిడ్ టైమ్‌లో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా నిలబడ్డ నర్స్‌లు, డాక్టర్లు, పోలీసులు అందించిన సేవలు, చేసిన సాయం గురించి మపం గుర్తు చేసుకుంటున్నాం... అందులో భాగంగా నేడు కోవిడ్ ఫస్ట్ వేవ్‌లో తెలంగాణలోనే ఏకైన కోవిడ్ వైద్యశాలగా సేవలందించిన గాంధీ ఆస్పత్రి వద్ద విధులు నిర్వర్తించిన మహిళ కానిస్టేబుల్ వేలుపుల ప్రమీల అప్పటి వాతావరణాన్ని తలుచుకుంటూ చెప్పిన విషయాలు..
ఉదయం మాట్లాడి వెళ్లిన పేషేంట్ చికిత్స పొందుతూ చనిపోయాడని సాయంత్రానికి వినాల్సి వచ్చేది. అప్పటివరకు గేటు దగ్గర పేషెంట్ కోసం ఎదురు చూస్తూ మాతో మాట్లాడిన కుటుంబీకులు, సంబంధీకులు ఆ వార్త విని ఏడుస్తుంటే గుండె తరుక్కుపోయేది. – వేలుపుల ప్రమీల
నేను పుట్టి, పెరిగిందంతా సికిందరాబాద్‌లోనే! మొదటి నుంచీ యూనిఫామ్ అంటే రెస్పెక్ట్. అందుకే పోలీస్ జాబ్‌లోకి వచ్చాను. 2003లో సిటీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యా. ప్రస్తుతం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుస్టేషన్ లో పని చేస్తున్నా. కరోనా టైమ్‌లో బేగంపేట ఠాణాలో పని చేసేదాన్ని.
అప్పుడు గాంధీ హాస్పిటల్‌కి తెలంగాణ వివిధప్రాంతాల నుంచి రోగులు వచ్చేవారు. ఇందుకోసం పోలీసు విభాగం అక్కడ పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసింది. దానికోసం ప్రతి స్టేషన్ నుంచి సిబ్బందిని తీసుకున్నారు. అలా బేగంపేట పోలీసుస్టేషన్ నుంచి నేనూ గాంధీ హాస్పిటల్ మెయిన్ గేట్ దగ్గర ఐదు వారాలకు పైగా డ్యూటీలో ఉన్నా. అక్కడ పని చేయడానికి ఎస్సై నేతృత్వంలో పని చేసిన ఐదుగురు సభ్యుల్లో భాగమయ్యా.
వాళ్లూ మన లాంటి మనుషులే కదా అనుకున్నా..
ఓపక్క విజృంభిస్తున్న కరోనా.. మరోపక్క గాంధీ హాస్పిటల్‌కి రోజూ రోగుల తాకిడి. అలాంటి సమయంలో అక్కడ డ్యూటీ ఓ అరుదైన అవకాశంగానే భావించా. ఎంత కరోనా బారినపడితే మాత్రం వాళ్లూ మనలాంటి మనుషులే కదా! వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి విషయంలోనూ వారికి సహాయం చేయాలనుకున్నా. నడుస్తూ కొందరు, నడవలేని స్థితిలో మరికొందరు, అసలు స్పృహలోనే లేకుండా ఇంకొందరు.. చూస్తే బాధనిపించేది. కుటుంబ సభ్యుల సాయంతో వచ్చేవాళ్లు. అయితే గేట్ లోపలికి పేషెంట్స్‌కి తప్ప మిగిలిన వారికి ప్రవేశం ఉండేది కాదు. పేషంట్స్‌ని గేట్ దగ్గరే వదిలేయాల్సి వచ్చేది. దాంతో కొందరు వాదనకు దిగేవాళ్లు. వారిని సముదాయించి, పరిస్థితి వివరించి పంపడం పెద్ద సవాల్‌గా ఉండేది.
రోజూ విషాద వార్త వినాల్సి వచ్చేది..
గాంధీ హాస్పిటల్ మెయిన్‌గేట్ దగ్గర రోజూ ఎనిమిది గంటల డ్యూటీ. చికిత్స కోసం వచ్చే రోగులు అనేక మంది తారసడేవాళ్లు. అప్పుడు లాక్‌డౌన్ అమలులో ఉండటంతో వారితో పాటు సహాయకులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేవాళ్లం. ఇలా చాలామందితో మాట్లాడాల్సి వచ్చేది. ఉదయం మాట్లాడి వెళ్లిన పేషేంట్ చికిత్స పొందుతూ చనిపోయాడని సాయంత్రానికి వినాల్సి వచ్చేది. ఒకోసారి అప్పటివరకు గేటు దగ్గర పేషెంట్ కోసం ఎదురు చూస్తూ మాతో మాట్లాడిన కుటుంబీకులు, సంబంధీకులు ఆ వార్త విని ఏడుస్తుంటే గుండె తరుక్కుపోయేది. ఆ పేషంట్‌తో తమకున్న జ్ఞాపకాలను వాళ్లు మాతో పంచుకుంటుంటే మనసు భారమయ్యేది. ఓదార్చడం తప్ప ఏమీ చేయలేని నిన్సహాయ స్థితి మాది. ప్రతి పేషెంట్ క్షేమంగా తిరిగి రావాలని మొక్కుకునేదాన్ని.
నాకూ కరోనా..
గాంధీ హాస్పిటల్ దగ్గర ఐదు వారాల డ్యూటీ అయిపోయిన తర్వాత తిరిగి బేగంపేట పోలీసు స్టేషన్‌కు వెళ్లిపోయా. అప్పుడు ఇతర రాష్ట్రాలు,ప్రాంతాల వారిని తరలించే ప్రక్రియ మొదలైంది. ప్రతిరోజూ ఏరియాల వారీగా బయటి వారిని గుర్తించడం, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ్రపాధాన్య క్రమంలో అక్కడ నుంచి బస్సుల్లో రైల్వే స్టేషన్ కు తరలించడం మా డ్యూటీగా మారింది. దీనికోసం వారితో సంప్రదింపులు జరపాల్సి వచ్చేది. ఆ సందర్భంలో నాకూ కరోనా సోకింది.
నా నుంచి నా హజ్బెండ్‌కీ వచ్చింది. ముగ్గురు పిల్లల్ని బంధువుల ఇంటికి పంపించినప్పటికీ మా అత్తగారిని మాత్రం మేమే చూసుకోవాల్సి వచ్చింది. ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా, ఆ మహమ్మారి ఆమెకు సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నా. పీపీఈ కిట్, మాస్క్, గ్లోవ్స్ వేసుకుని వంట చేసేదాన్ని. వైద్యుల సలహాలు, సూచనలు పాటించడంతో పదిహేను రోజులకు నాకు, నా హజ్బెండ్‌కి నెగటివ్ వచ్చింది. అప్పటివరకు పిల్లల్ని కంటితో కూడా చూడలేదు. ఆ రోజులు, ఆ అనుభవాలు గుర్తొస్తే ఇప్పటికీ భయమేస్తుంది. కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. – శ్రీరంగం కామేష్, క్రైమ్ బ్యూరో, సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment