వైద్య పరీక్షలు చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్
సమాజంలో అంతా ఆరోగ్యంగా ఉండాలనీ... ఎవరికీ ఏ అనారోగ్యం కలగకూడదని అంతా ప్రార్థిస్తారు. కానీ రోగాలు ఎక్కువగా ప్రబలితేనే తమకు భుక్తి అని భావిస్తారు వారు. చిన్నపాటి సమస్యతో వచ్చినా... లెక్కలేనన్ని పరీక్షలు చేసి రూ. వేలల్లో దోచుకోవడమే వారి పని. ఇదీ జిల్లాలో వెలసిన డయాగ్నస్టిక్ సెంటర్ల తీరు. నిర్థిష్టమైన ధరలు నిర్ణయించకపోవడంతో ఇష్టానుసారం రోగులనుంచి వారు గుంజుకుని ఏదో మొక్కుబడిగా నివేదికలు అందించేస్తున్నారు. కొన్ని చోట్ల పేథాలజిస్టులు సైతం లేకుండానే లేబొరేటరీలు నిర్వహించేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.
విజయనగరం ఫోర్ట్: ప్రస్తుతం జిల్లాలో జ్వరాలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా వీరి సంఖ్య అధికంగానే కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ప్లేట్‌లెట్ల కౌంట్ తగ్గడంతో మృత్యువాత చెందుతుండటంతో రోగులు తొలుత డాక్టర్‌ను ఆశ్రయిస్తున్నారు. వారు చెప్పిందే తడవుగా ప్రైవేటుగా ఏర్పాటైన లేబొరేటరీలను ఆశ్రయిస్తున్నారు. అలా అనారోగ్యంతో వచ్చే రోగులనుంచి డబ్బులు గుంజుకోవడానికే వాటి నిర్వాహకులు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. వైద్యులు కొన్ని టెస్టులకోసం సిఫారసు చేస్తే అవసరం లేని పరీక్షలు కూడా కొందరు చేస్తున్నట్టు వి మర్శలు వినిపిస్తున్నాయి. విచిత్రమేంటం టే ఒక లేబొ రేటరీ రిపోర్టుకు మరోచోట రిపోర్టుకు వ్యత్యాసం ఉండటమే. దీనివల్ల ఏ రిపోర్టును నమ్మాలో తెలీక రోగులు సతమతం అవుతున్నారు. ఇలాంటి కచ్చితత్వం లేని నివేదికల పుణ్యమాని రోగులు ఒక్కోసారి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాజరగడానికి కారణాలను మాత్రం ఏ అధికారీ అన్వేషించడం లేదు.
రిజిస్ట్రేషన్ లేకుండానే లేబ్‌ల నిర్వహణ
జిల్లాలో 45 లేబొరేటరీలు మాత్రమే వైద్య ఆరోగ్యశాఖ వద్ద రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇంకా రిజిస్ట్రేషన్ లేకుండా మరో వంద వరకూ జిల్లాలో లేబొరేటరీలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా వైరల్ జ్వరాలు, డెంగీ జ్వరాలు వ్యాప్తి అధికంగా ఉండటం వీరికి కలసివస్తోంది. జ్వరం రాగానే తమకు ఏమైందోనని భయంతో రోగులు లేబొరేటరీలకు పరుగులు తీస్తుండటం అక్కడ పరీక్షలు చేయించుకోవడానికి చొరవ చూపిస్తున్నారు. ఇదే అదునుగా వారు దోచేసుకుంటున్నారు.
కనిపించని ఫీజులు బోర్డులు
ఏ లేబొరేటరీలోనూ ఏ వైద్య పరీక్షకు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో తెలిపే బోర్డు ఉండడం లేదు. దీనివల్ల వారు ఎంత అడిగితే అంత ఇవ్వవలసి వస్తోంది. ఇక జిల్లాలో ఉన్న కొన్ని లేబొరేటరీల్లో పెథాలజిస్టులు కూడా కానరావడం లేదు. నిబంధన ప్రకారం యూరిన్ కల్చర్, బ్లడ్ కల్చర్, ప్లేట్ లెట్ కౌంట్ వంటి పరీక్షలు పెథాలజిస్టుల పర్యవేక్షణలోనే జరగాలి. కాని అధికశాతం లేబొరేటరీల్లో పెథాలజిస్టులు లేరు. ఒకటి, రెండు ల్యాబ్‌రేటరీల్లో మాత్రమే వారున్నట్టు తెలుస్తోంది. వీటిపై పర్యవేక్షించాల్సిన అధికారులు ఎందుకో నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment