మంచానపడ్డ పీహెచ్‌సీలు | Lab Technician bhartikani posts | Sakshi
Sakshi News home page

మంచానపడ్డ పీహెచ్‌సీలు

Published Wed, Dec 18 2013 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

మంచానపడ్డ పీహెచ్‌సీలు

మంచానపడ్డ పీహెచ్‌సీలు

= మందుల కొరత
 =భర్తీకాని ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
 =సిబ్బందికి క్వార్టర్‌‌స కరువు
 =వైద్యులుగా మారుతున్న నర్సులు

 
 జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే(పీహెచ్‌సీలు) జబ్బు చేసింది. చాలాచోట్ల మందులు లేవు. వైద్య పరికరాలు అందుబాటులో లేవు. ల్యాబ్ టెక్నీషియన్ల కొరత ఉంది. క్లినికల్ పరీక్షలు నిర్వహించే సౌకర్యం లేదు. క్వార్టర్‌‌స లేకపోవడంతో సిబ్బంది బయటి ప్రాంతాల నుంచి వస్తున్నారు. పీహెచ్‌సీలకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు.
 
సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి నియోజకవర్గం పీలేరు మినహా మరే పీహెచ్‌సీల్లోనూ తగిన సౌకర్యాలు లేవు. జిల్లా వ్యాప్తంగా 94 పీహెచ్‌సీలు ఉన్నాయి. కొత్తగా ప్రారంభించిన కమ్యూనిటీహెల్త్ సెంటర్లు 7, అర్బన్ హెల్త్‌సెంటర్లు 11, వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులు 16 ఉన్నా యి. పీహెచ్‌సీలకు ప్రభుత్వం మూడు నెలల కోసారి రూ.1.25 లక్షలు కేటాయిస్తోంది. ఈ మొత్తం మందుల కొనుగోలుకే సరిపోవడం లేదు. చాలాచోట్ల ల్యాబ్ టెక్నీషియన్లు లేరు. పరికరాలు లేవు. కొన్ని చోట్ల వైద్యులు సక్రమంగా విధులకు హాజరుకావడం లేదు. కొన్ని పీహెచ్‌సీల్లో నర్సులే వైద్యుల అవతారం ఎత్తుతున్నారు. అత్యధిక పీహెచ్‌సీల్లో సరఫరా చేస్తున్న మందులు రోగుల సంఖ్యకు తగినట్లు లేవు. వైద్య పరీక్షలు చేసుకోవాలంటే బయట వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏ పీహెచ్‌సీలోనూ తాగేందుకు మంచినీటి సౌకర్యం లేదు. ఏరియా ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి.
     
సత్యవేడులోని దాసుకుప్పం పీహెచ్‌సీలో మంగళవారం డాక్టర్ అందుబాటులో లేరు. నర్సే వైద్య పరీక్షలు నిర్వహించారు. ల్యాబ్ టెక్నీషియన్ గురు, శుక్రవారాల్లో మాత్రమే పని చేస్తున్నారు. గర్భిణులకు బుధవారం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో ఉండడం లేదు. ఇక్కడ ప్రసవాలు జరగడం లేదు. తిరుపతి సెంట్రల్ డ్రగ్‌స్టోర్ నుంచి ప్రతి మూడునెలలకోసారి మందులు తెస్తున్నారు. నీటి వసతి లేదు.

హస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు పీహెచ్‌సీలో వైద్యుల కొరత నెలకొంది. ఎంపేడు ఆస్పత్రిలో మందులు లేవు. అన్ని రకాల జబ్బులకు జ్వరం మాత్రలే దిక్కవుతున్నాయి. తొట్టంబేడు పీహెచ్‌సీలో వైద్యులు సరిగ్గా విధులు నిర్వర్తించడం లేదు.
     
తంబళ్లపల్లె నియోజకవర్గంలో 6 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇక్కడ బడ్జెట్ కొరత వేధిస్తోంది. ఒక్కో పీహెచ్‌సీకి రూ.1.25 లక్షలు చాలడం లేదు. పారాసిటమాల్ మాత్రలూ దొరకడం లేదు. రక్త పరీక్ష సౌకర్యాలు లేవు. కోసవారిపల్లె పీహెచ్‌సీలో ఒక డాక్టర్, ఫార్మసిస్టు ఉన్నారు. ప్రభుత్వం ఇస్తున్న బడ్జెట్ చాలడం లేదు.
     
సదుంలో బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టారు. ఇక్కడ సిబ్బంది, మందుల కొరతలేదు. క్వార్టర్‌‌స లేకపోవడంతో సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. పులిచెర్ల మండలంలోనూ వైద్య సిబ్బందికి క్వార్టర్స్ లేవు.
     
నగరి నియోజకవర్గంలోని నిండ్ర పీహెచ్‌సీలో జ్వరానికి సంబంధించిన మందులూ లేవు. రక్తపరీక్షకు అవసరమైన పరికరాలు, రసాయనాలు లేవు. అధికారులకు నివేదించాం, మందులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. నగరి ఏరియా ఆస్పత్రిని వంద పడకలకు మార్చారు. అయితే బెడ్లు లేవు. అలాగే వైద్య పరికరాలు లేవు. సిబ్బంది ఉన్నా పరికరాలు లేకపోవడంతో పరీక్షలు చేసుకోలేని పరిస్థితి. పుత్తురు సీహెచ్‌సీలో గదులు కొరత నెలకొంది. కొత్తగా నిర్మించిన గదులు ప్రారంభానికి నోచుకోలేదు.
     
మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో తాగునీటి వసతి లేదు. ప్యూరిఫైడ్ వాట ర్‌ప్లాంట్ నిరుపయోగంగా ఉంది. కుటుంబ నియంత్రణ వార్డులో వేసెక్టమీ ఆపరేషన్ చేసుకునేవారికి వేడినీరు సరఫరా చేయాలి. ప్రస్తుతం సరఫరా లేదు. ప్రజలు బయట కొనుక్కొంటున్నారు. ఇక్కడ పరిశుభ్రత మాటే లేదు. రక్త పరీక్షలకు డబ్బులు ఖర్చు పెట్టి కిట్స్ తెప్పించుకుంటున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ల కొరత వేధిస్తోంది.
     
పలమనేరు నియోజకవర్గంలో 8 పీహెచ్‌సీలు, వంద పడకల ఆస్పత్రి ఉన్నాయి. బెరైడ్డిపల్లె పీహెచ్‌సీలో వైద్యులులేరు. నర్సులే వైద్యం చేస్తున్నారు. వి.కోట ఆస్పత్రిలో పారాసిటమాల్ మాత్రలూ లేవు. పెద్దపంజాణి ఆస్పత్రిలో పెయిన్‌కిల్లర్స్ లేవు. పలమనేరు వంద పడకల ఆస్పత్రిలో వైద్యులు సకాలంలో రావడం లేదు.
     
కుప్పం నియోజకవర్గంలో తొమ్మిది పీహెచ్‌సీలు, ఒక వంద పడకల ఆస్పత్రి ఉన్నాయి. అన్ని ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత వల్ల వైద్యం అంతంతమాత్రంగానే అందుతోంది. శాంతిపురం పీహెచ్‌సీలో మందుల కొరత రోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. కుప్పం వంద పడకల ఆస్పత్రి వైద్యులు సమయపాలన పాటించడం లేదు.
     
పీలేరు నియోజకవర్గంలో వైద్యులు సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో జనానికి ఎదురుచూపులు తప్పడం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement