సాక్షి, నిర్మల్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 26 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు వచ్చింది. ఇన్నేళ్లపాటు చేసిన సేవలకు, తమలోని ఆశలకు శరాఘాతంలా ఉద్యోగాల నుంచి తప్పుకోవాలంటూ వచ్చిన ఆ తీర్పుతో వారంతా ఆందోళనకు గురయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 20 మంది ల్యాబ్ టెక్నీషియన్లను సర్వీస్ నుంచి తొలగించాలంటూ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈనెల 17న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నోడల్ అధికారి, ఆదిలాబాద్ డీఎంహెచ్‌ఓ పేరిట వారికి సర్వీస్ రిమూవల్ ఉత్తర్వులు ఇచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. 1994లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 1995లో చేపట్టిన పారామెడికల్ రిక్రూట్‌మెంట్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 20మంది ల్యాబ్ టెక్నీషియన్లుగా ఎంపికయ్యారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత వీరందరూ బోగస్ డీఎంఎల్‌టీ సర్టిఫికెట్లు ఇచ్చారని, వీరికి సర్టిఫికెట్లు ఇచ్చిన రామి ఇనిస్టిట్యూట్, హైదరాబాద్‌కు అప్పుడు గుర్తింపు లేదని కొంతమంది హైకోర్టులో కేసు వేశారు. అప్పటి నుంచి కేసు నడుస్తూనే ఉంది. చివరకు ఆ 20మందిని ఉద్యోగాల నుంచి తొలగించాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది.
చదవండి: (బండికున్న హెల్మెట్ ధరిస్తే బతికేవాడేమో..)
బేసిక్‌పే పైనే విధులు..
హైకోర్టు తీర్పు మేరకు ఉమ్మడి జిల్లాలోని 20మంది ల్యాబ్‌టెక్నీషియన్లకు ఉత్తర్వులు పంపించారు. ఇందులో ఇప్పటికే ఇద్దరు చనిపోగా, మిగిలిన 18 మందికి జిల్లాల అధికారులు వీటిని అందించారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఏడుగురు, నిర్మల్ జిల్లా నుంచి ఐదుగురు, మంచిర్యాల జిల్లా నుంచి ఇద్దరు, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి నలుగురు ఉన్నారు. రిక్రూట్‌మెంట్ అయిన మరుసటి నెల నుంచే కోర్టులో కేసు నడుస్తుండటంతో వీరు రెగ్యులర్ ఎంప్లాయీస్ అయినా.. కేవలం బేసిక్ పే మాత్రమే చెల్లిస్తున్నారు. 1995లో రూ.1,875 బేసిక్‌పేతో జాయిన్ అయ్యారు. పీఆర్సీలు వచ్చినప్పుడల్లా కేవలం వీరి బేసిక్‌పే పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రూ.35వేల వరకు వస్తున్నట్లు సమాచారం. వీరికి ఎలాంటి ఫైనాన్సియల్ బెనిఫిట్స్ లేవు. తాము చేసిన కోర్సు వాస్తవమేనని, సంస్థ తప్పిదానికి తమను బలిచేయడం దారుణమని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై త్వరలోనే సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు చెబుతున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు, నోడల్ అధికారి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నిర్మల్ జిల్లాలోని ఐదుగురు ల్యాబ్‌టెక్నీషియన్లకు సర్వీస్ రిమూవల్ ఆర్డర్స్ పంపించినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధన్‌రాజ్ తెలిపారు.
చదవండి: (స్వప్నతో నిషాంత్ వివాహం.. తల్లిదండ్రులకు తెలిసి..)
Comments
Please login to add a commentAdd a comment