ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో ఎప్పుడే ఏదో ఒక సమస్య రోగులను ఇబ్బంది పెడుతూనే ఉంటోంది. శుక్రవారం కూడా రోగులు సిబ్బంది లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆస్పత్రిలోని ఔట్‌సోర్సింగ్ సిబ్బంది హైదరాబాద్‌లో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి తరలివెళ్లారు. దీంతో ఆయా విభాగాల్లో ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది లేక రోగులకు సేవలు అందలేదు. ప్రతి రోజులాగే ఓపీ విభాగంలో వైద్య పరీక్షలు చేసిన వైద్యులు రోగులకు రక్త పరీక్షలు రాసిచ్చారు.
తీరా వైద్యుడు రాసిచ్చిన చిట్టీని తీసుకొని రక్త పరీక్ష కేంద్రానికి వెళ్లిన రోగులకు నిరాశే ఎదురైంది. సరిపడా టెక్నీషియన్లు లేరని, రక్త పరీక్షలు చేయడం వీలుకాదని సోమవారం రావాలని చెప్పడంతో రోగులు వెనుదిరిగారు. కాగా ఎంతో దూరం నుంచి వచ్చిన తమకు కేవలం వైద్య పరీక్షలు నిర్వహించి ఇంటికి వెళ్లిపోమ్మనడం సరైంది కాదన్నారు.
కనీసం వైద్యుడు రాసిన రక్త పరీక్షలు చేసి రిపోర్టులు ఇవ్వడం ద్వారా రక్త పరీక్షల్లో వచ్చిన సమస్యకు అనుగుణంగా వైద్యులు మందులు రాసి ఇచ్చేవారు. కానీ ఆయా విభాగాల్లో చాలా మట్టుకు రక్త పరీక్షలు నిర్వహించకపోవడంతో రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది ఎటువంటి మందులు తీసుకోకుండానే వెళ్లిపోయారు. వైద్యులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని రోగులు వాపోయారు.
ఎప్పుడూ ఇంతే...
ప్రతి రోజు కనీసం ప్రతి విభాగంలో ఐదుగురు టెక్నీషియన్లు ఉంటారు. ఇందులో ముగ్గురు ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులే. కాగా తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నాకు వెళ్లడంతో ఆయా విభాగాల్లో కేవలం ఒకే రెగ్యులర్ టెక్నీషియన్ అందుబాటులో ఉంచారు. సాధారణంగా ప్రతి రోజు 200 మంది నుంచి 300 వరకు రోగులు రక్త పరీక్షలు, ఎక్స్‌రే, ఇతర పరీక్షల కోసం వస్తుంటారు.
ఇంత మందికి కనీసం ఐదుగురు ఉండాలి. కానీ ప్రతి విభాగానికి ఒకే ఒక్క టెక్నీషియన్ ఉండడంతో రోగులు నానా అవస్థలు పడ్డారు. కొంత మంది మందులు మాత్రమే తీసుకొని వెళ్లిపోయారు. ఓపీ విభాగంతో పాటు, ఎమ్మర్జెన్సీ వార్డు, ఎక్స్‌రే, ల్యాబ్స్, రిమ్స్ కళాశాల అడ్మినిస్ట్రేషన్ విభాగాలు సిబ్బంది లేక వెలవెలబోయాయి. ప్రత్యమ్నయంగా కూడా ఎలాంటి టెక్నీషియన్లు పెట్టకపోవడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ విషయంపై రిమ్స్ డెరైక్టర్ శశిధర్‌ను ఁన్యూస్‌లైన్ వివరణ కోరగా ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ టెక్నీషియన్లు రక్త, ఇతర పరీక్షలు చేస్తున్నారని, పరీక్షలు చేయకుండా ఏ రోగిని బయటకు పంపించలేదని తెలిపారు.
రిమ్స్‌లో రోగుల అవస్థలు
Published Sat, Jan 25 2014 2:10 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement
Advertisement